57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం(ఐఎఫ్ఎఫ్ఐ)- 2026 మీడియా అక్రిడిటేషన్దరఖాస్తు సమర్పించేందుకు 2026 అక్టోబర్ 15 చివరి తేదీ. ఈ చలనచిత్రోత్సవానికి హాజరవ్వాలనుకునే మీడియా ప్రతినిధులు గడువు ముగిసేలోపు అధికారిక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) అక్రిడిటేషన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాం.
ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలోని పనాజీలో జరగనుంది. ఈ వేడుక భారత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నిర్మాతలు, చలనచిత్ర రంగానికి చెందిన నిపుణులు, సినిమా ప్రియులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.
మీడియా ప్రతినిధులు అధికారిక అక్రిడిటేషన్ పోర్టల్ ద్వారా 'మీడియా డెలిగేట్లు'గా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు:
రిజిస్ట్రేషన్ లింక్: https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx
అభ్యర్థులు అక్రిడిటేషన్ మార్గదర్శకాలను జాగ్రత్తగా చదివి తమ దరఖాస్తులతో పాటు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలి.
అవసరమైన పత్రాలు:
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
ప్రభుత్వం జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు
పీఐబీ లేదా రాష్ట్ర ప్రభుత్వ అక్రిడిటేషన్ కార్డు లేదా ఎడిటర్ సిఫార్సు లేఖతో పాటు సంస్థ గుర్తింపు కార్డు
సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవానికి సంబంధించిన ఆధారాలు
వివరణాత్మక అర్హతా ప్రమాణాలు, మీడియా అక్రిడిటేషన్ విధానం వివరాలను ఇక్కడ పొందొచ్చు.
గత ఐఎఫ్ఎఫ్ఐ సందర్భంగా పోర్టల్‌లో నమోదు చేసుకున్న మీడియా నిపుణులు తమ పాత వివరాలను ఉపయోగించి లాగిన్ అయి అవసరమైన పత్రాలను సమర్పించొచ్చు.
మీడియా అక్రిడిటేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు లేదా సందేహాల కోసం అభ్యర్థులు iffi.mediadesk@pib.gov.in ని సంప్రదించొచ్చు.
మీడియా ప్రతినిధులు కాని చలనచిత్ర ప్రేమికులు కూడా https://www.iffigoa.org/delegate-registration ద్వారా 'డెలిగేట్లు'గా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. తద్వారా 57వ ఐఎఫ్ఎఫ్ఐ- 2026లో అందుబాటులో ఉండే వైవిధ్యభరితమైన చలనచిత్రాలు, ఇతర కార్యక్రమాలను వీక్షించొచ్చు.
ఐఎఫ్ఎఫ్ఐ:
1952లో ఏర్పాటైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) దక్షిణ ఆసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద చలనచిత్ర కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ) సంయుక్తంగా నిర్వహించే ఐఎఫ్ఎఫ్ఐ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ నిర్మాతలు, దిగ్గజాలు, వర్ధమాన నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, దిగ్గజాల సంస్మరణ కార్యక్రమాలతో ఈ ఉత్సవం గోవాలోని రమణీయ వాతావరణంలో వివిధ రకాల కథలు, భాషలు, చలనచిత్ర సంప్రదాయాలను ఘనంగా వేడుక చేస్తుంది. 57వ ఐఎఫ్ఎఫ్ఐ- 2026కి సంబంధించిన మరిన్ని వివరాలు, తాజా సమాచారం కోసం దయచేసి https://www.iffigoa.org/ వెబ్‌సైట్‌ను చూడండి.
***