యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ అభియాన్ కోసం నషా ముక్త యువ కార్యక్రమంలో భాగంగా 1,469 ప్రాంతాల్లో నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్‌లు, యువ మేళాలను నిర్వహించిన మైభారత్
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2026 12:25PM by PIB Hyderabad
వికసిత్ భారత్ అభియాన్ కోసం చేపట్టిన నషా ముక్త యువలో భాగంగా నిర్వహిస్తున్న 100 వారాల ప్రచారంలో భాగంగా 2026 అక్టోబర్ 10న నైబర్‌హుడ్ యూత్ పార్లమెంటులు (ఎన్‌వైపీలు), యువ మేళాలను భాగస్వామ్య సంస్థలతో కలసి మై భారత్ నిర్వహించింది. మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించే దిశగా సామూహిక నిబద్ధతను బలోపేతం చేస్తూ దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాల్లోని 1,469 ప్రాంతాలలో వీటిని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో 3.65 లక్షలకు పైగా యువత, పౌరులు పాల్గొన్నారు.

క్షేత్ర స్థాయిలో యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలపై అవగాహన పెంచడం, మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించడంలో చురుకైన పాత్ర పోషించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. బ్లాకు స్థాయుల్లో నైబర్‌హుడ్ యూత్ పార్లమెంటును నిర్వహించారు. దీనిలో మాదకద్ర్యవాల దుర్వినియోగానికి సంబంధించిన సవాళ్లు, అవగాహనను కార్యాచరణగా మార్చే వ్యూహాలు, స్ఫూర్తిదాయకమైన మార్పు గాథలపై చర్చించారు. ఇవి ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతినిధులుగా మారేలా యువతను ప్రోత్సహించాయి.
ఈ కార్యక్రమాలలో నషా ముక్త యువ ప్రతిజ్ఞ, నినాదాల రచనా పోటీలు, సంతకాల సేకరణ, వక్తృత్వం, వీధి నాటకాలు, చర్చలు తదితర కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొనేలా ఇవి యువతను ప్రోత్సహించాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించాల్సిన ప్రాముఖ్యం గురించి అవగాహన కల్పించాయి. హార్ట్‌ఫుల్‌నెస్, ప్రాజెక్ట్ పాయింట్, సీఐపీయూ, అసోచాం, ఫిక్కీ, బ్రహ్మకుమారీస్ లాంటి ఆధ్యాత్మిక సంస్థలు, విశ్వవిద్యాలయాల సంఘాలు, పారిశ్రామిక సంఘాల సహకారంతో యువమేళాలను నిర్వహించారు. తద్వారా బహుళ సంస్థల భాగస్వామ్యం ద్వారా ఈ ప్రచార కార్యక్రమం పరిధిని, ప్రభావాన్ని బలోపేతం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడు, అయిదుగురు శాసనసభ్యులతో సహా మొత్తం ఆరుగురు ప్రజాప్రతినిధులు వీటిలో భాగస్వాములయ్యారు. మొత్తం 4,552 కార్యకలాపాలను నిర్వహించారు. 4,568 నినాదాలను సేకరించారు. ఇది నషా ముక్త భారత్ సందేశాన్ని ప్రచారం చేయడంలో యువత విస్తృత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో సమష్టి ప్రయత్నాలు, సమాజ భాగస్వామ్యం, యువత నాయకత్వ పాత్రను 100 వారాల ప్రచారం పరిధిలో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి కార్యక్రమం తెలియజేస్తోంది. నైబర్‌హుడ్ యూత్ పార్లమెంటులు, యువ మేళాల ద్వారా సామాజిక మార్పును తీసుకొచ్చేలా, వికసిత్ భారత్ కోసం నషా ముక్త యువ అనే దార్శనికతను సాకారం చేసేలా తోడ్పడాలని యువతను మై భారత్ ప్రోత్సహిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2322208)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10