ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ-సంజీవని ద్వారా 50 కోట్లు దాటిన టెలికన్సల్టేషన్లు... దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలు మరింత బలోపేతం

ఈ-సంజీవని వినియోగదారుల్లో57.14 శాతం మహిళలే.. 46 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి వాటా 40.15 శాతం.. టెలిమెడిసిన్ విస్తృత వ్యాప్తికి నిదర్శనం



డిజిటల్ ఆరోగ్య సేవల బలోపేతానికి ఈ-సంజీవనిలో కృత్రిమ మేధ ఆధారిత క్లినికల్ నిర్ణయ సహాయ వ్యవస్థ, ఈఆర్ఎస్ఎస్-112 అనుసంధానం



ప్రాథమిక ఆరోగ్య సేవలకు మించి ఈ-సంజీవని విస్తరణ.. ప్రముఖ ప్రభుత్వ సంస్థల ద్వారా నిపుణుల వైద్య సంప్రదింపులకు అవకాశం

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2026 9:53AM by PIB Hyderabad

భారత్‌ జాతీయ టెలిమెడిసిన్‌ సేవ ఈ-సంజీవని ద్వారా 50 కోట్ల (500 మిలియన్‌) టెలికన్సల్టేషన్లు (ఆన్‌లైన్ వైద్య సంప్రదింపులు) పూర్తయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత అందుబాటులోకి, తక్కువ ఖర్చుతో, సమానంగా అందించేందుకు డిజిటల్‌ సాంకేతికతను వినియోగించుకోవడంలో ప్రభుత్వ ప్రయత్నాల్లో చారిత్రాత్మక విజయంగా నిలిచింది.

 

 

 

2026 సెప్టెంబర్‌ 15న ఈ-సంజీవని 50 కోట్ల మార్కును దాటింది. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 50,00,92,730 టెలికన్సల్టేషన్లు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటికే ఉన్న వైద్య సేవలకు టెలిమెడిసిన్‌ మరింతగా తోడ్పడుతున్న తీరును ఈ విజయం ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల, తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నివసించే ప్రజలకు దూరం, భౌగోళిక పరిస్థితులు వంటి సమస్యలను అధిగమించడంలో ఇది ఉపయోగపడుతోంది.

 

 

 

ప్రాథమిక వైద్య సేవల్లో ప్రపంచంలోనే అతిపెద్ద టెలిమెడిసిన్‌ అమలుగా ఈ-సంజీవని భారత్‌ డిజిటల్‌ ఆరోగ్య వ్యవస్థలో కీలక భాగంగా మారింది. ప్రజలు ఇంటి నుంచే వైద్య నిపుణులను సంప్రదించే అవకాశం కల్పించడం ద్వారా, సాధారణంగా ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల వరకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వ వైద్య సేవలను మరింత విస్తరించింది. ప్రజలు నివసించే ప్రాంతాలకు వైద్య సంప్రదింపులను చేరువ చేసింది.

 

 

 

ఈ సేవ ప్రారంభమైనప్పటి నుంచి వేగంగా, స్థిరంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ-సంజీవని ద్వారా 1.42 లక్షలకు పైగా ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ కేంద్రాలు, 19,473 మెడికల్‌ కేంద్రాలు, 901 ఆన్‌లైన్‌ ఓపీడీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలో 2,41,923 మంది వైద్య సేవలందించేందుకు నమోదు చేసుకున్నారు. ఇంగ్లిషుతో పాటు 14 భారతీయ భాషలు కలిపి మొత్తం 15 భాషల్లో ఈ-సంజీవని సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 2.5 నుంచి 3 లక్షల టెలికన్సల్టేషన్లు జరుగుతున్నాయి. ఒక రోజు అత్యధికంగా 6,30,315 టెలికన్సల్టేషన్లు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా టెలిమెడిసిన్‌ సేవలకు ప్రజల ఆదరణ, వినియోగం పెరుగుతున్న తీరును ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఆసుపత్రలు లేదా ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడం, ఎక్కువ సమయం కేటాయించడం లేదా ఇతర ఇబ్బందులు ఎదుర్కునే ప్రజలకు ఈ సేవల మరింత ఉపయోగకరంగా మారుతున్నట్లు ఈ సంజీవని వినియో వివరాలను పరిశీలిస్తే తెలుస్తోంది. మొత్తం వినియోగదారుల్లో మహిళల వాటా 57.14 శాతంగా ఉంది. 46 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పౌరులు 40.15 శాతం ఆన్‌లైన్‌ వైద్య సంప్రదింపులను పొందుతున్నారు. ఇందులో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధుల వాటా 16.25 శాతంగా ఉంది. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఈ సేవను వినియోగిస్తుండటం వల్ల టెలిమెడిసిన్‌ ద్వారా వైద్య సేవలను మరింత సులభంగా, అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలకు ఇది తోడ్పడే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. 

 

 

 

టెలిమెడిసిన్‌ సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు కొత్త సాంకేతికతలను అనుసంధానిస్తూ ఈ-సంజీవని నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కృత్రిమ మేధ ఆధారిత క్లినికల్‌ నిర్ణయ సహాయక వ్యవస్థను (ఏఐ-సీడీఎస్ఎస్) అనుసంధానించారు. వైద్య సంప్రదింపుల సమయంలో ఆరోగ్య సేవలందించే సిబ్బందికి ఈ వ్యవస్థ సహాయపడుతుంది. వైద్యపరమైన నిర్ణయాలను మరింత నాణ్యంగా, ఒకే విధంగా, సమర్థవంతంగా తీసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ సాంకేతికతకు 2026 జాతీయ ఈ-గవర్నెన్స్‌ అవార్డుల్లో గోల్డ్‌ అవార్డు లభించింది.

 

 

 

సమగ్ర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేలా మరో కీలక చర్యగా.. ఈ-సంజీవనిని అత్యవసర స్పందన సహాయ వ్యవస్థ (ఈఆర్ఎస్ఎస్)-112తో కూడా అనుసంధానించారు. దీంతో అత్యవసర స్పందన సేవలు, దూర వైద్య నిపుణుల సహాయాన్ని మరింత సమర్థవంతంగా అనుసంధానించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయాన్ని మరింత సమన్వయంతో అందించడంతో పాటు, అత్యవసర ఆరోగ్య సేవల్లో డిజిటల్‌ సాంకేతికత వినియోగాన్ని మరింత బలోపేతం చేయడం ఈ అనుసంధానం లక్ష్యం.

 

 

 

విస్తృతమైన ప్రాథమిక ఆరోగ్య సేవల వ్యవస్థను ఆధారంగా చేసుకుని ఈ-సంజీవని ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మించి నిపుణుల వైద్య సంప్రదింపులను అందించే దిశగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థల ద్వారా ప్రత్యేక వైద్య విభాగాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎయిమ్స్ జోధ్‌పూర్‌, ఎయిమ్స్ జమ్మూ, ఎయిమ్స్ పాట్నాలో ఎంపిక చేసిన వైద్య విభాగాల్లో రోగులు, వైద్యుల మధ్య ఆన్‌లైన్‌ వైద్య సంప్రదింపుల సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో రోగులు తమ ఇళ్ల నుంచే నిపుణుల వైద్య సలహాలను పొందవచ్చు.

ఈ సేవల వల్ల రోగులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణించి తృతీయ స్థాయి ఆసుపత్రుల్లో వైద్యుల కోసం ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. అదే విధంగా నిపుణులైన వైద్యుల సేవలు మరింత మందికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. . ఈ సదుపాయాన్ని భవిష్యత్తులో ఎయిమ్స్ జిప్‌మెర్ (జేఐపీఎంఈఆర్), పీజీఐఎంఈఆర్ చండీగఢ్‌ వంటి ఇతర ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థలకు కూడా క్రమంగా విస్తరించనున్నారు. దీనివల్ల ఆసుపత్రుల్లో నేరుగా అందించే సాధారణ ఓపీ సేవలకు ఇది అదనపు సహాయంగా నిలవడంతో పాటు, రోగులకు నిరంతర వైద్య సేవలు అందేలా చేయడంలో దోహదపడుతుంది.

 

 

 

నిపుణుల ఆన్‌లైన్‌ వైద్య సంప్రదింపుల విస్తరణ ఈ-సంజీవని ప్రయాణంలో మరో కీలక ముందడుగు. తొలుత ప్రాథమిక ఆరోగ్య స్థాయిలో వైద్య సంప్రదింపులను అందించిన ఈ-సంజీవని, ఇప్పుడు వివిధ స్థాయిల ఆరోగ్య సేవలను అనుసంధానించే దిశగా విస్తరిస్తోంది. దీని ద్వారా రోగులను వారికి అవసరమైన వైద్య నిపుణులతో అనుసంధానించడంతో పాటు, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో అందుబాటులో ఉన్న నిపుణుల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది.

 

 

 

ఈ-సంజీవని భారత్‌లోనే అభివృద్ధి చేసిన డిజిటల్‌ ఆరోగ్య సేవ. దీనిని అధునాతన కంప్యూటింగ్‌ అభివృద్ధి కేంద్రం (సీ-డీఏసీ) అభివృద్ధి చేసింది. ఈ-సంజీవని ప్రారంభమైనప్పటి నుంచి సీ-డీఏసీ మొహాలీ సంస్థ సాంకేతిక అభివృద్ధి, ఇంజినీరింగ్‌ సహా అన్ని దశల్లో సహకారం అందిస్తోంది. భారత ఆరోగ్య వ్యవస్థలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ-సంజీవనిని నిరంతరం అభివృద్ధి చేయడంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది.

 

 

 

మంత్రిత్వ శాఖ, సాంకేతిక భాగస్వామ్య సంస్థల మధ్య కొనసాగుతున్న సహకారంతో పాటు నిరంతర సాంకేతిక ఆవిష్కరణల ఫలితంగా ఈ-సంజీవని తొలుత ఉన్న హబ్‌-అండ్‌-స్పోక్‌ టెలిమెడిసిన్‌ విధానం నుంచి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు సేవలందించే డిజిటల్‌ ఆరోగ్య వేదికగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ వేదిక ద్వారా 50 కోట్ల ఆన్‌లైన్‌ వైద్య సంప్రదింపులు పూర్తయ్యాయి. భారీ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను అందించేందుకు దేశీయంగా డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలను రూపొందించడంలో, అమలు చేయడంలో పెరుగుతున్న భారత్ సామర్థ్యాన్ని ఈ-సంజీవని అభివృద్ధి, విస్తరణ ప్రతిబింబిస్తుంది. ఇది ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తికి, వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి అనుగుణంగా ఉంది.

ఈ-సంజీవని ద్వారా 50 కోట్ల ఆన్‌లైన్‌ వైద్య సంప్రదింపులు పూర్తవడం భారత్‌ డిజిటల్‌ ఆరోగ్య ప్రయాణంలో కీలక ప్రస్థానంగా నిలిచింది. దేశ ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత పాత్ర పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. ప్రాథమిక వైద్య సేవలతో పాటు నిపుణుల వైద్య సేవలను కూడా అందించేలా ఈ-సంజీవని విస్తరిస్తోంది. కృత్రిమ మేధ, అత్యవసర స్పందన సేవలతో అనుసంధానం చేయడంతో పాటు ప్రముఖ తృతీయ స్థాయి ప్రభుత్వ వైద్య సంస్థలకు కూడా సేవలను విస్తరిస్తోంది. దీంతో అందరికీ సులభంగా, సమానంగా వైద్య సేవలు అందేలా చేయడంలో ఈ-సంజీవని కీలకంగా మారుతోంది.

 

 

 

ఈ-సంజీవనిని నిరంతరం అభివృద్ధి చేయడం ద్వారా డిజిటల్‌ ప్రజా మౌలిక వసతులు, దేశీయ సాంకేతిక సామర్థ్యాలను వినియోగించుకోవడంలో ప్రభుత్వ నిబద్ధత స్పష్టమవుతోంది. భౌగోళిక అడ్డంకులను తగ్గించడం, రోగులకు వివిధ స్థాయిల్లో నిరంతర వైద్య సేవలు అందేలా చూడటం, ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందుబాటులో ఉండే సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడం ఈ వేదిక ఉద్దేశం. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో ఈ-సంజీవని కీలక పాత్ర పోషిస్తోంది.

****


(రిలీజ్ ఐడి: 2319884) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Telugu , Malayalam