కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెలికాం మోసాలను వ్యతిరేకిస్తూ సైబర్ వారియర్స్ గా మారుతున్న పౌరులు… సంచార్ సాథీ పోర్టల్‌కు 30 కోట్ల సందర్శనలు

14 లక్షలకు పైగా పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్స్ రికవరీ

తమ పేరుపై ఉన్న మొబైల్ కనెక్షన్ల గురించి తెలుసుకునేందుకు పౌరులు చేసిన 4 కోట్లకు పైగా అభ్యర్థనల పరిష్కారం

ఆర్థిక మోసాల రిస్క్ సూచీని పటిష్టం చేసేందుకు తోడ్పడుతున్న సంచార్ సాథీ పోర్టల్‌లో వచ్చే పౌరుల ఫిర్యాదులు… రూ.5000 కోట్లకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాల నివారణ

నాడు పోస్టు చేయడమైనది: 05 OCT 2026 2:27PM by PIB Hyderabad

మే 2023లో సంచార్ సాథీ పోర్టల్ (www.sancharsaathi.gov.in ) ప్రారంభమైనప్పటి నుంచి 30 కోట్ల కన్నా ఎక్కువసార్లు దేశవ్యాప్తంగా పౌరులు దీన్ని సందర్శించారు. దీని ద్వారా టెలికాం రంగానికి సంబంధించిన మోసాల నుంచి రక్షించుకునేందుకు పౌరులు ఈ పోర్టల్ పై విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది. టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) అభివృద్ధి చేసిన ఈ పోర్టల్… సులభంగా ఉపయోగించగల సాధనాలను మొబైల్ వినియోగదారుడి చేతిలో ఉంచుతుంది. అనుమానాస్పద కాల్, మెసేజ్‌ల గురించి నివేదించేందుకు, ఒకరి పేరుపై ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకునేందుకు, పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్లను బ్లాక్ చేసేందుకు, కొనుగోలుకు ముందుకు మొబైల్ అసలైనదో లేదో తనిఖీ చేసేందుకు ఈ పోర్టల్ సహాయపడుతుంది.

పోర్టల్ ను సందర్శించే పౌరులకు రక్షణ లభిస్తుంది. వారు నివేదించే ప్రతి అనుమానాస్పద సమాచారంతో మరికొందరిని కాపాడవచ్చు. సంచార్ సాథీ ద్వారా పౌరులు పంచుకునే సమాచారం ప్రయోజనకరమైన నిఘా సమాచారంగా మారుతుంది. మోసగాళ్లు తదుపరి లక్ష్యాన్ని చేరుకోకముందుగానే బ్యాంకులు, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు సమాచారం అందించి, వారిని అడ్డుకునేందుకు డీఓటీ సహకరిస్తుంది. ఈ విధంగా సంచార్ సాథీని వినియోగించే ప్రతీ పౌరుడు సైబర్ వారియర్ గా, సైబర్ మోసాలకు వ్యతిరేకంగా రక్షణ కవచంలా మారుతాడు.

ప్రతీ పౌరుడికి అందుబాటులో సేవలు

పలు పౌర కేంద్రీకృత సేవలను ఒక వేదిక ద్వారా అందించే సంచార్ సాథీ పోర్టల్.

  • చక్షు - మోసపూరిత సమాచారాలు, స్పామ్ ని నివేదించవచ్చు: నకిలీ కేవైసీ, బిల్లు చెల్లింపు హెచ్చరికలు, ప్రభుత్వ, పోలీసు, బ్యాంకు అధికారులలాగా మాట్లాడటం… మోసపూరిత పెట్టుబడి, ఉద్యోగ, రుణాలిస్తామంటూ ఆఫర్లు ఇచ్చే అనుమానాస్పద కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలను ఇక్కడ నివేదించవచ్చు.

  • మీ పేరుపై ఉన్న మొబైల్ కనెక్షన్లను తెలుసుకోవచ్చు: మీ గుర్తింపుపై జారీ చేసిన అన్ని మొబైల్ కనెక్షన్లను తనిఖీ చేయవచ్చు. మీరు తీసుకోనివి, ఇకపై అవసరం లేని వాటిపై ఫిర్యాదు చేయటం వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఉండదు.

  • పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయటం: భారతదేశంలో ఎక్కడైనా మీ ఫోన్ ను ఉపయోగించకుండా ఉండేందుకు అన్ని టెలికాం ఆపరేటర్ల వ్యవస్థ ద్వారా మీ మొబైల్ ను బ్లాక్ చేయవచ్చు. దాన్ని ట్రేస్ చేసి, ఫోన్ దొరికిన తర్వాత అన్‌బ్లాక్ చేయవచ్చు.

  • ఫోన్ కొనుగోలుకు ముందు తనిఖీ చేయవచ్చు: కొత్త, సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేముందు ఐఎంఈఐ నంబర్ ద్వారా మొబైల్ అసలైనదేనా అని ధ్రువీకరించుకోవచ్చు.

  • భారతదేశ నంబర్లతో వచ్చే అంతర్జాతీయ కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని నివేదించవచ్చు: చట్టవిరుద్ధమైన టెలికాం సెటప్ లపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు భారతదేశ నంబర్లతో (+91) వచ్చే అంతర్జాతీయ కాల్స్‌పై రిపోర్టు చేయవచ్చు.

  • విశ్వసనీయమైన సంప్రదింపుల వివరాలు: ఏదైనా సమాచారాన్ని పంచుకునే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థల అసలైన కస్టమర్ కేర్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, వెబ్‌సైట్ లింకులను ధ్రువీకరించుకోవచ్చు.

  • జాగ్రత్తగా ఉండండి: నకిలీ లోన్ యాప్‌లు, పెట్టుబడులకు సంబంధించిన మోసాలు, నకిలీ ట్రాఫిక్ చలాన్లు వంటి మోసాల ధోరణిపై అవగాహనను పొందవచ్చు.

సంచార్ సాథీ ద్వారా పౌరులు సాధించింది ఏమిటి?

పౌరులు, డీఓటీ సాధించిన విజయాల స్థాయిని సంచార్ సాథీ డాష్‌బోర్డు ప్రతిబింబిస్తుంది.

  • సంచార్ సాథీ పోర్టల్‌కు 30 కోట్లకు పైగా సందర్శనలు వచ్చాయి.

  • పోగొట్టుకున్న, చోరీకి గురైన 60.96 లక్షల మొబైల్ ఫోన్లు బ్లాక్ అయ్యాయి. 37.85 లక్షల ఫోన్లను గుర్తించగా, 14 లక్షలకు పైగా ఫోన్లను రికవరీ చేశారు.

  • తమ పేరు మీదున్న మొబైల్ కనెక్షన్లను తనిఖీ చేసి, సమాచారం ఇవ్వాలని కోరుతూ పౌరుల నుంచి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కారమయ్యాయి.

  • చక్షు ద్వారా అనుమానాస్పద మోసపూరిత కమ్యూనికేషన్లపై 12.80 లక్షల ఫిర్యాదులు అందాయి. ఫలితంగా 59.82 లక్షల కేసులపై చర్యలు తీసుకున్నారు. ఇందులో 50 లక్షలకుపైగా మొబైల్ కనెక్షన్లను డిస్‌కనెక్ట్ చేశారు.

  • ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ) ద్వారా రూ.5000 కోట్లకుపైగా సైబర్ నేరాలను అధికారులు అడ్డుకున్నారు.

జన్ భాగీదారీ: ప్రతీ పౌరుడు సైబర్ వారియర్

చక్షు పోర్టల్‌లో ఎవరైనా పౌరుడు అనుమానాస్పద కాల్, సందేశాన్ని రిపోర్ట్ చేసినా, తన పేరు మీద లేని మొబైల్ కనెక్షన్‌ను గుర్తించి ఫిర్యాదు చేసినా, దాని ప్రయోజనం ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. ఇటువంటి ప్రతి ఫిర్యాదు ద్వారా మొబైల్ నంబర్, పరికరం, ప్రజలను మోసగించే పద్ధతిని డీఓటీకి తెలియజేస్తుంది. తద్వారా మరికొందరు మోసపోకముందే ఆ నంబర్లను బ్లాక్ చేయటం, పునః పరిశీలించటం వంటివి సకాలంలో తీసుకునేందుకు వీలవుతుంది. ఇలా పౌరుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఇప్పటివరకు 50 లక్షలకుపైగా మొబైల్ కనెక్షన్లను తొలగించారు. సంచార్ సాథీ పోర్టల్‌ను వాడుతున్న పౌరులు కేవలం లబ్ధిదారులు మాత్రమే కాదు... తమ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని కాపాడే సైబర్ వారియర్స్.

ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్, డిజిటల్ ఇంటెలిజెన్స్ వేదికకు పౌర నివేదికలే శక్తి

డీఓటీ మోసాల నిరోధక వ్యవస్థలో పౌరులు అందించే సమాచారం కీలక భాగం. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ)కి ప్రధాన ఆధారం. ఈ ఇండికేటర్ ఆర్థిక మోసాలకు గురయ్యే అవకాశమున్న మొబైల్ నంబర్ల గురించి రిస్క్ ఆధారిత సమాచారాన్ని అందిస్తుంది. ఈ సమాచారాన్ని డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ (డీఐపీ) ద్వారా బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం కంపెనీలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సురక్షితంగా పంచుకుంటారు. దీనివల్ల ఫ్రాడ్ డిటెక్షన్ వ్యవస్థలో టెలికాం రిస్క్ సిగ్నల్స్‌ను జోడించి, అనుమానాస్పద లావాదేవీని గుర్తించి, పౌరుడి ఖాతా నుంచి డబ్బు పోకముందే అడ్డుకునేందుకు, అప్రమత్తం చేసేందుకు వీలవుతుంది. ఇప్పటివరకు ఈ ఎఫ్ఆర్ఐ ద్వారా సుమారు రూ.5,000 కోట్లకు పైగా సైబర్ మోసాల నష్టాలను నివారించగలిగారు. సంచార్ సాథీ వేదిక ద్వారా 1,600లకు పైగా సంస్థలకు ఈ సమాచారం అందుతోంది. దీనివల్ల అందరూ కలిసి సమన్వయంతో పనిచేసే 'సమగ్ర ప్రభుత్వ విధానం' సాధ్యమవుతోంది. కాబట్టి అప్రమత్తమైన పౌరుడు ఇచ్చే ఫిర్యాదు కూడా టెలికాం, ఆర్థిక, చట్ట అమలు వ్యవస్థల ద్వారా ఎంతో మందిని రక్షిస్తుంది.

పోగొట్టుకున్న, చోరీకి గురైన 14 లక్షలకు పైగా మొబైల్ ఫోన్లు స్వాధీనం

మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు సంసార్ సాథీ పోర్టల్‌లో ఫిర్యాదు చేసి, దేశంలోని అన్ని టెలికాం వ్యవస్థల్లో దాన్ని బ్లాక్ చేయవచ్చు. బ్లాక్ చేసిన ఆ ఫోన్‌ను ఎవరైనా వాడటానికి ప్రయత్నిస్తే, దాన్ని గుర్తించి ఆ వివరాలను పోలీసులకు పంపుతారు. డీఓటీ, టెలికాం ఆపరేటర్లు, రాష్ట్ర, యూటీల పోలీసుల మధ్య నిరంతర సాంకేతిక అభివృద్ధి, ఆటోమేటెడ్ వర్క్‌ఫ్లోలు, సమన్వయం కారణంగా ఇప్పటివరకు 60.96 లక్షల ఫోన్లను బ్లాక్ చేశారు. 37.85 లక్షల ఫోన్లను గుర్తించారు. 14 లక్షలకుపైగా ఫోన్లను రికవరీ చేశారు.

సరళమైన, బహుభాషా, అందుబాటులో ఉండే

సంచార్ సాథీ పోర్టల్‌ను సరళమైన, వినియోగదారునికి సులభంగా అర్థమయ్యే సేవలతో రూపొందించారు. దీనికి తోడు పబ్లిక్ డాష్‌బోర్డులు, టెలికాం భద్రతపై విస్తృతమైన అవగాహనా సమాచారం, మోసాల నివారణ, బాధ్యతాయుతమైన డిజిటల్ పద్ధతుల గురించి సమాచారం తెలుసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు 21 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్న సంచార్ సాథీ మొబైల్ యాప్ ద్వారా పౌరులు సొంత భాషలోనే, తమ మొబైల్ ద్వారానే సేవలను సులభంగా పొందవచ్చు.

పౌరులకు డీఓటీ విజ్ఞప్తి

మొబైల్ వినియోగదారుల పేరిట ఎన్ని కనెక్షన్లున్నాయో తెలుసుకునేందుకు... అనుమానాస్పద కాల్స్, ఎస్‌ఎంఎస్‌‌లు, వాట్సాప్ సందేశాలపై ఫిర్యాదు చేసేందుకు సంచార్ సాథీ (www.sancharsaathi.gov.in ) వెబ్‌సైట్‌ను సందర్శించాలని, సంచార్ సాథీ యాప్‌ను ఉపయోగించాలని డీఓటీ కోరుతోంది. ఈ పోర్టల్‌, యాప్‌ ను సందర్శించటం ద్వారా పౌరులు తమను, ఇతరులను మోసాల నుంచి కాపాడుకోవచ్చు. సైబర్ నేరాల ద్వారా డబ్బులు కోల్పోయిన వారు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు, https://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల నుంచి టెలికాం వనరులను కాపాడటానికి పౌరుల భద్రత కోసం చర్యలు తీసుకునేందుకు డీఓటీ పూర్తిగా కట్టుబడి ఉంది. సంచార్ సాథీ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 2.8 కోట్లను దాటింది. సంచార్ సాథీ మొబైల్ యాప్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

ఆండ్రాయిడ్ కోసం: https://play.google.com/store/apps/details?id=com.dot.app.sancharsaathi

ఐఓఎస్: https://apps.apple.com/in/app/sanchar-saathi/id6739700695

***


(రిలీజ్ ఐడి: 2319313) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam