ప్రధాన మంత్రి కార్యాలయం
‘యూపీఎస్‌సీ’ శతాబ్ది వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 1:51PM by PIB Hyderabad
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ సహా శ్రీ పి.కె.మిశ్రా, శ్రీ టి.వి.సోమనాథన్, శ్రీ అజయ్ కుమార్, యూపీఎస్‌సీ గౌరవ సభ్యులు, వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్లు, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!
నేటి చర్చను ప్రారంభించడానికి ముందుగా, నిన్నటి ఒక ఉదంతాన్ని నేనిప్పుడు ప్రస్తావిస్తున్నాను. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ ఇవాళ ఉటంకించిన మేరకు- ‘9/11’ మారణకాండ పునరావృతం కాకుండా భారత పైలట్ కెప్టెన్ స్మిత్ తన వివేచన, సాహసం, సమయస్ఫూర్తితో అడ్డుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి, ఆయన చూపిన ధైర్యం యావద్భారత ప్రజానీకానికీ గర్వకారణం. నేనివాళ ఆయన తండ్రి భూపేంద్ర భాయ్, తల్లి గీత బెన్, భార్య సోనాల్‌లతో కూడా మాట్లాడాను. స్మిత్ ప్రస్తుతం ఆస్పత్రికలో కోలుకుంటున్నారు. భారత్ మాత్రమే కాదు.. ప్రపంచమంతా ఆయన వీరోచిత చర్యను వేనోళ్ల ప్రశంసిస్తోంది. స్మిత్ త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, ఆయన కోసం ప్రార్థించాలని అభ్యర్థిస్తోంది. భారత కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసి మన సోదరుడు స్మిత్‌కు శిరసాభివందనం చేయాల్సిందిగా దేశ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి.
మిత్రులారా!
ఇక ఈ రోజు మనం నిర్వహించుకుంటున్నది కేవలం యూపీసీ శతాబ్ది వేడుక మాత్రమే కాదు… ఓ గొప్ప వారసత్వ సంబంధిత ఉత్సవం కూడా. ఏటా ఆశయ సాధన దిశగా సదా కలలు కంటూ, విజయం కోసం ఉవ్విళ్లూరే లక్షలాది యువతకు సంబంధించిన వేడుక ఇది. ఈ ఉత్సవం సంస్థపై భారతీయులందరి ప్రగాఢ విశ్వాసానికి ప్రతీక. గడచిన శతాబ్దపు ప్రస్థానంలో ఎన్నో తరాలు, ప్రభుత్వాలు మారిపోయాయి. సాంకేతిక పరిజ్ఞానం ఊహించని స్థాయిలో పురోగమించింది. పాఠ్యప్రణాళికలు ఆమూలాగ్రం రూపాంతరం చెందాయి. కానీ, మారనిదల్లా ఒకేఒక్కటి… అదే- ‘యూపీఎస్‌సీ’పై చెక్కుచెదరని నమ్మకం. మీరు సముపార్జించిన అత్యంత గొప్ప సంపదన్నిటిలో అగ్రస్థానం దీనిదే. ఈ వందేళ్ల విజయవంతమైన పయనాన్ని గుర్తుచేస్తూ ఒక స్మారక తపాలా బిళ్ల, నాణెం ఇప్పుడే ఆవిష్కృతమయ్యాయి. అలాగే, 100 కీలక తీర్పుల (కేస్ లాస్) సంకలనం కూడా ప్రచురితమైంది. ఈ శతాబ్ద కాలంతో ముడిపడిన విశిష్ట వ్యక్తులందరికీ నా సగౌరవ వందనం… హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంతకుముందే ఇక్కడి గ్యాలరీని సందర్శించిన నేపథ్యంలో మీరు కూడా కనీసం 10-15 నిమిషాలనపాటు దాన్ని తిలకించాలని కోరుతున్నాను. నా సందర్శన సందర్భంగా సంస్థ 75వ వార్షికోత్సవ చిత్రాల్లోని ఒకదానిలో లెఫ్టినెంట్ జనరల్ సురేంద్ర నాథ్‌ను గమనించాను. ఇవాళ ఆయన 90 ఏళ్ల వయసులో మన మధ్య ఉన్నారు.. ఈ నేపథ్యంలో ఆయన జన్మశతాబ్ది వేడుకలు నిర్వహించుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
మిత్రులారా!
ఈ ప్రయాణాన్ని విశ్వసనీయత సహిత అద్భుత వారసత్వంగా మార్చిన, కాలానుగుణ మార్పులెన్నో తెచ్చి, సంస్థను సమున్నత శిఖరాలకు చేర్చిన వ్యక్తులెందరో ఉన్నారు. వారందరూ నిస్సందేహంగా తగిన గుర్తింపుతోపాటు మనందరి ప్రశంసలకూ అర్హులు. నేను గ్యాలరీని పరిశీలిస్తున్న సమయాన 1920లో సుభాష్ చంద్ర బోస్ కూడా సరిగ్గా ఇదే ప్రక్రియతో ఎంపికయ్యారన్న సమాచారం అక్కడ నా దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. అదేమిటంటే- బ్రిటిష్ పాలన కాలం నాటి ఈ పరీక్షలో సంస్కృతంలోనూ ప్రశ్నపత్రం ఉండటం. సుభాష్ బాబు ఆనాడు సంస్కృతంలోనే పరీక్ష రాశారు.
మిత్రులారా!
ఈ చారిత్రక సందర్భంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కూ నివాళి అర్పిస్తున్నాను. స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని అలా కొనసాగించడం ఒక్కటే కాకుండా దేశ పరిపాలన, దానికి విస్పష్ట రూపురేఖలు దిద్దడం ఆయన ముందున్న సవాళ్లు. దేశ పునర్నిర్మాణానికి తగిన ‘ఉక్కు చట్రం’ (బలమైన పాలన వ్యవస్థ)కు సర్దార్ రూపుదిద్దారు. తద్వారా ఈ సంస్థను స్వతంత్ర భారత కీలక మూల స్తంభాలలో ఒకటిగా నిలిపి, బలోపేతం చేశారు.
మిత్రులారా!
ఈ సంస్థకు 1926లో పునాది వేసిన రోజుల్లో నాటి ప్రాథమ్యాలు భిన్నంగా ఉండేవి. ముఖ్యంగా వ్యవస్థ దృష్టి, నిబద్ధత.. రెండూ బ్రిటిష్ పాలన తరహాలోనే సాగేవి. అయితే, స్వాతంత్ర్యం వచ్చాక మన కర్తవ్యంపై కన్న కలలు, దేశ పాలనావసరాలు కేంద్రకంగా మారాయి. తదనుగుణంగా కొన్ని దశాబ్దాల నుంచీ యూపీఎస్‌సీ తన బాధ్యతలను ఆదర్శప్రాయ రీతిలో నిర్వర్తిస్తూ వస్తోంది. దీని కృషి, సాధించిన విజయాలపై ఇప్పటికే చాలా అంశాలు ప్రస్తావనకొచ్చాయి. కాబట్టి, నేను పునరావృతం చేయడానికి లేదా విశదీకరించడానికి ప్రయత్నించను. చరిత్రకు అతీతంగా పరికిస్తే, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే కర్తవ్యం ఇప్పుడు మన ముందుంది. ఈ 21వ శతాబ్దంలో ఇప్పటికే నాలుగో వంతు గడిచిపోయింది. కాబట్టి, ఇక రాబోయే పాతికేళ్లు మన దేశానికి, ప్రతి పౌరుడికి ప్రతి సంస్థకు అత్యంత కీలకమనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అందుకే, ఇవాళ నా ప్రసంగాన్ని ఆవైపు మళ్లించాలని నిశ్చయించుకున్నాను.
మిత్రులారా!
వికసిత భారత్ దిశగా దేశానికి అవసరమైన పాలన విధానం ఇక యూపీఎస్‌సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరుపై గణనీయంగా ఆధారపడి ఉంటుంది. మీరివాళ ఎంపిక చేసే యువత వికసిత భారత్ సాకారంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాగే అలాంటి ప్రగతిశీల దేశంలో అత్యధిక ప్రయోజనం పొందేవారిలోనూ అదే యువతరానిది సింహభాగం. ఈ కీలకాంశాన్ని దృష్టిపథంలో ఉంచుకుని, మనం సదా రెండు ముఖ్యమైన సూత్రాలను గుర్తుంచుకోవాలి. మొదటిది… ‘దేశమే ప్రధానం. రెండోది… ‘పౌరులే ప్రధానం.’ ప్రతి ఎంపిక ప్రక్రియలోనూ ఈ రెండు ప్రమాణాలనే ప్రాతిపదికగా తీసుకుని అంచనా వేయాలి. ఈ స్ఫూర్తితో అభ్యర్థులను పరీక్షించి, తదనుగుణంగా ఎంపిక చేస్తే జాతీయ లక్ష్యాల సాధన సహజంగానే అత్యంత సులభమవుతుంది.
మిత్రులారా!
నేటి భారతంకన్నా వికసిత భారత్-2047 ఎంతో భిన్నంగా ఉంటుంది. దేశం పట్టణీకరణ మరింతగా విస్తరిస్తుంది. గ్రామాలు-నగరాల మధ్య అంతరం తగ్గడమే కాకుండా మన పౌరుల… ముఖ్యంగా యువతరం ఆశలు-ఆకాంక్షలు గణనీయంగా పెరుగుతాయి. ఈ మార్పు దిశగా సంకేతాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి, నేడు మన ముందున్న ప్రశ్న- సేవా ప్రదానానికి మాత్రమే పరిమితం కాబోదు. ఇవాళ్టి ‘తక్షణ సేవల’ ప్రపంచ వేగానికి తగినట్లు ప్రభుత్వ సేవల లభ్యత అత్యంత ప్రధానాంశం అవుతుంది. ఆ వేగాన్ని అప్పుడు మనం అందుకోగలమా? ఇప్పుడు ఒక సేవ కోసం వారాలు లేదా నెలల తరబడి వేచి ఉండటానికి ప్రజలు ఇచ్చగించడం లలదు. కృత్రిమ మేధ (ఏఐ) క్షణాల్లో వేలకొద్దీ పత్రాలను పరిశీలించగలిగినప్పుడు, ప్రభుత్వాలకు ‘తక్షణ సమాచారం’ లభిస్తుండగా, పౌరులు సత్వర పరిష్కారం ఆశించడంలో ఆశ్చర్యమేమీ ఉండదు.
ఆలోచనా విధానంలో ఈ కాలనుగుణ మార్పు మన సివిల్ సర్వీసులలోనూ కొత్త మార్పులను అనివార్యం చేస్తోంది. అందువల్ల మన ఎంపిక ప్రమాణాలను, నియామక ప్రక్రియలను భవిష్యత్తు అవసరాలకు తగినట్లు మార్చుకోక తప్పదు. ప్రభుత్వ ఉన్నతోద్యోగంపై ఆకర్షణతో కాకుండా ప్రజా సేవాభిలాష గల యువతను మనం ప్రభుత్వ సేవలలోకి తేవాలి. కాబట్టి, అభ్యర్థి విజ్ఞానం, విచక్షణల మూల్యాంకనానికి మాత్రమే ఈ నియామక పరీక్షలు పరిమితం కారాదు. సివిల్ సర్వీసెస్‌లో చేరాలని వారెందుకు ఆసక్తి చూపుతున్నారో కూడా అంచనా వేయగలగాలి. ఎందుకంటే- సరైన స్ఫూర్తి ఉన్నపుడే ప్రజల ఆశలు-ఆకాంక్షలకు తగినట్లు నడుచుకోవడం మారడం సులభమవుతుంది.
మిత్రులారా!
శిక్షణలో ఉన్న అధికారులను కలిసినప్పుడల్లా- సివిల్ సర్వీస్‌లో చేరాలనే ఆసక్తికి కారణమేమిటో ముందుగానే ‘రాసి ఉంచుకోమని’ లోగడ నేనొక సందర్భంలో సూచించిన సంగతి మీకు తెలిసిందే. ఎందుకంటే- కాలక్రమంలో బాధ్యతల భారం పెరుగుతుంది.. కొత్త సవాళ్లు ఎదురవుతాయి. అలాంటి సందర్భాల్లో ఆత్మపరిశీలన చేసుకోవడానికి వారు ముందుగా రాసి ఉంచుకున్న అంశాలు అసలు లక్ష్యాన్ని గుర్తుచేస్తాయి. ఈ పద్ధతి కచ్చితంగా వారికొక స్వీయ మూల్యాంకన ఉపకరణం కాగలదు. యూపీఎస్‌సీ, రాష్ట్ర కమిషన్లు కూడా ఇలాంటి విధానం రూపలక్పనపై యోచించాలని నా సూచన.
మిత్రులారా!
లోగడ ‘అన్నీ ప్రభుత్వ బాధ్యతలే… ప్రజా సంక్షేమం ప్రభుత్వ కర్తవ్యమే’ అనే భావన ఉండేది. అలాంటి కాలం నుంచి నేడు మనం ‘పౌర దేవోభవ’ (పౌరుడే దైవం) తారకమంత్రంగా ముందడుగు వేశాం. మరో మాటలో- ఈ దేశ పౌరులే మనకు దైవంతో సమానం.. వారి సేవే మన అగ్ర ప్రాథమ్యం.
అందువల్ల.. మిత్రులారా!
భారత్ ప్రస్తుత 21వ శతాబ్దంలో సరికొత్త పని సంస్కృతితో పురోగమిస్తోంది. ప్రజాహితం, తక్షణ స్పందనాత్మకంగానే కాకుండా సుపరిపాలన సాగించడమే దీని ప్రధాన స్ఫూర్తి! ప్రజా హితమంటే ప్రభుత్వ సౌలభ్యానికి తగినట్లు కాకుండా, పౌర ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యంతో పనిచేయడం. అలాగే తక్షణ స్పందనాత్మక అంటే- సమస్య తలెత్తిన తర్వాత చర్య తీసుకోవడం కాకుండా, ముందే వాటిని పసిగట్టి, పరిష్కారం అన్వేషించడం. సుపరిపాలన అంటే- ప్రభుత్వ ఉనికి ఒక్కటే కాకుండా, అనవసర ఒత్తిడి లేదా జోక్యం కూడా కనిపించకుండా చూసుకోవడం. ఈ స్ఫూర్తి మేరకు జాతీయ-రాష్ట్ర స్థాయులలో మన ఎంపిక ప్రక్రియలను రూపొందించాలి. అవి పేదల బాధలను అర్థం చేసుకునే, సున్నితత్వం గల, స్వచ్ఛందంగా ముందుకొచ్చే, క్లిష్టమైన సవాళ్లకు వినూత్న పరిష్కారాలను కనుగొనే యువశక్తిని దేశం కోసం ఎంపిక చేయగలగాలి. అలాగే, వారంతా దేశ అవసరాలను అర్థం చేసుకోగల, చట్టాల అమలుకు భరోసా ఇచ్చే, చట్టం జనజీవన సౌలభ్యం కల్పిస్తోందా లేక అవరోధంగా మారుతోందా అని అంచనా వేయగల నిపుణులై ఉండాలి.
మిత్రులారా!
కాలం, సాంకేతికత ఎంత వేగంగా రూపాంతరం చెందుతున్నాయో మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో అనే కొత్త సవాళ్లు సమాజం ముందుకు రానున్నాయి. ముఖ్యంగా ఇవాళ కృత్రిమ మేధ (ఏఐ) గురించి ప్రపంచవ్యాప్త చర్చ మనందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి భిన్నమైన పరిస్థితులలో పని చేయాల్సి వస్తుంది. సమాచార యుద్ధం, డీప్‌ఫేక్ సవాలు, అల్గారిథమిక్ వివక్ష, సంబంధిత సమస్యలు, వాతావరణ న్యాయం వంటి సంక్లిష్ట సవాళ్లు ఎదురవుతాయి. కాబట్టి, మన ఎంపిక ప్రక్రియలలో సంక్లిష్ట సమస్యల పరిష్కార సామర్థ్యం, దీర్ఘకాలిక దృక్పథం అంచనాలకు ప్రాధాన్యంతో ప్రత్యేకంగా కృషి చేయాలి.
మిత్రులారా!
దేశం నేడు సంస్కరణల పథంలో శరవేగంగా పురోగమించడం మనకు తెలిసిందే. ఈ సమయంలో, పరీక్షల నిర్వహణ సంస్థలు కూడా ప్రస్తుత అవసరాల మేరకు సంస్కరణలను వేగిరపరచాలి. ఈ దిశగా కీలకాంశాలలో పరీక్షల నిర్వహణకు పట్టే సమయం ఒకటి. పరీక్షను ఓ కార్యక్రమంగా చూడకుండా, యువతరం భవిష్యత్తు, వారి జీవితాలతో ముడిపడినదనే వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాలి. పరీక్షలలో కొన్ని నెలల జాప్యం వారికి తీవ్ర సవాలుగా పరిణమిస్తుంది. శిక్షణ రుసుములు, గదుల అద్దె, రవాణా ఖర్చులు- వగైరాలన్నీ వారి కుటుంబాలపై భారీ ఆర్థిక భారం మోపుతాయి. కాబట్టి, మన పరీక్షా విధానం ‘వ్యవధి నిర్దేశితం’గా ఉండటం అత్యంత కీలకం. ప్రమాణాలతో రాజీపడకుండా పరీక్ష ప్రక్రియ వ్యవధిని తగ్గించే మార్గాన్వేషణ దిశగా యూపీఎస్‌సీ సహా దేశంలోని అన్ని ఎంపిక సంస్థలూ చర్యలు చేపట్టాలి. వాస్తవానికి, నేను గ్యాలరీని సందర్శించిన సందర్భంగా, ఇప్పటికే దాదాపు వంద రోజుల సమయం ఆదా అయిందని గమనించాను. ఇది నిస్సందేహంగా ఎంతో ప్రశంసనీయం, మీకందరికీ నా అభినందనలు.
అయితే, మిత్రులారా!
ఇది కేవలం పరిపాలనపరమైన సంస్కరణ మాత్రమే కాదని, సమానత్వాన్ని కూడా ప్రోత్సహించేదిగా ఉండాలని స్పష్టం చేస్తున్నాను.
మిత్రులారా!
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీల సమావేశాలు, సదస్సుల గురించి మీకు తెలిసిందే. గడచిన దశాబ్దంలో ఇవి ప్రధాన సంస్థాగత వేదికలుగా రూపాంతరం చెందాయి. ఈ వేదికల ద్వారా దేశంలోని ప్రధాన కార్యదర్శులందరూ మూడు రోజుల పాటు నిరంతర చర్చలతో తమ ఆలోచనలను పంచుకుంటారు. అదేవిధంగా- డీజీపీల సదస్సులో పోలీస్ డైరెక్టర్ జనరళ్లందరూ మూడు రోజులు వివిధ అంశాలపై చర్చించి అనుభవాలను కలబోసుకుంటారు. ఒక రాష్ట్రం మరో రాష్ట్రం ఉత్తమాచరణలను తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, అవసరమైతే అనుసరించడానికీ తోడ్పడటమే ఈ సదస్సులు, సమావేశాల ప్రధానోద్దేశం. యూపీఎస్‌సీ ఏటా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల భాగస్వామ్యంతో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నదని నాకు సమాచారం అందింది. ఈ సదస్సును మరింత విస్తృతం, ఫలవంతం చేయడం సహా కొత్త ఆలోచనలతో సుసంపన్నం చేయడంతోపాటు దానికొక కొత్త రూపాన్ని, కొత్త కోణాన్ని జోడించడంపై మీరు ఆలోచిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఇటువంటి కృషి వల్ల ఆయా సంస్థలు తమ ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోగలుతాయి. అలాగే, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను కూడా ఈ సదస్సు అధ్యయనం చేయాలి. మన ప్రక్రియలు, విధానాల సామర్థ్యం మెరుగుదలలో సాంకేతికత సద్వినియోగంపైనా ప్రత్యేకంగా చర్చించాలి. ఇలాంటి పరస్పర అభ్యసన ప్రయత్నాలు యూపీఎస్‌సీ సహా ప్రతి రాష్ట్ర కమిషన్‌కూ ప్రయోజనకరం. విధానపరమైన నిబంధనలు-ప్రక్రియల ప్రామాణీకరణను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా యువతరానికి గణనీయ చేయూత లభిస్తుంది.
మిత్రులారా!
యూపీఎస్‌సీ, రాష్ట్ర కమిషన్ల సామర్థ్య వికాసం మరొక ముఖ్యాంశం. ఈ దిశగా నిరంతర కృషి కొనసాగాలి. ఈ దిశగా ‘మిషన్ కర్మయోగి’ కింద ఏర్పాటు చేసిన ‘ఐగాట్’ వేదికను మన అంతర్గత వ్యవస్థల కోసం, మన బృందాల సామర్థ్య బలోపేతానికి, వివిధ వేదికల ద్వారా మన సంస్థల పనితీరు సామర్థ్యం మెరుగుదలకూ ఉపయోగించుకోవచ్చు.
మిత్రులారా!
మీ విధులు దేశ యువత భవిష్యత్తుతో ప్రత్యక్షంగా ముడిపడి ఉంటాయని సదా గుర్తుంచుకోవాలి. మరో మాటలో- యువతరాన్ని జాతీయ శక్తిగా మార్చే ఈ మహత్తర లక్ష్యంలో మీరొక కీలక స్తంభం. కొన్నేళ్లుగా ఈ లక్ష్యం వైపు పయనంలో మీరంతా కీలక పాత్ర పోషించారు. యూపీఎస్‌సీ ఏర్పాటైన తొలినాళ్లలో పెద్ద నగరాలు, సంపన్న వర్గాలు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల యువతకు మాత్రమే అవకాశాలు ఎక్కువగా లభించేవి. కానీ, ఇవాళ గ్రామాలు, చిన్న పట్టణాల యువత కూడా సివిల్ సర్వీసులలో ప్రవేశిస్తున్నారు. ఈ క్రమంలో కుమార్తెల భాగస్వామ్యం కూడా పెరుగుతోంది… 1952లో మహిళల వాటా కేవలం 3 శాతం కాగా, నేడు 30 శాతం దాటింది. యూపీఎస్‌సీ చరిత్రలో ఇప్పటిదాకా నలుగురు మహిళలు చైర్‌పర్సన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు కరతాళ ధ్వనులు చేయండి… ఎందుకంటే- ఆ నలుగురిలో ముగ్గురు 2014 తర్వాత నియమితులైన వారే! ఇది గణాంకాలకు పరిమితం కాదు.. దేశంలో అవకాశాల పరిధి ఎంతగా విస్తరించిందో ఈ మార్పులు స్పష్టం చేస్తాయి.
మిత్రులారా!
యూపీఎస్‌సీ 1976లో స్వర్ణోత్సవం (50 ఏళ్లు) నిర్వహించుకునే నాటికి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య స్వల్పం. నాటితో పోలిస్తే నేడు, ఆశావహుల సంఖ్య 45 రెట్లకు పైగా పెరిగింది. మరో మాటలో- నేడు మన ముందు భారీ ప్రతిభావంతుల సమూహం ఉండటం దేశానికెంతో గర్వకారణం. అదే సమయంలో మన బాధ్యత కూడా పెరిగింది.. ప్రపంచమే అసూయపడే అపార ప్రతిభావంతులు ఉన్నా, మీరు ఒక అభ్యర్థి ఎంపికకు పరిమితం కావడం లేదు. భవిష్యత్తులో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించగల సమర్థులను ఎంచుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఆ వ్యక్తిని ప్రభుత్వానికి ప్రతీకగానే పరిగణిస్తారు. అందువల్ల, సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన గురుతర బాధ్యత మీ అందరిపైనా ఉంది.
మిత్రులారా!
యూపీఎస్‌సీ తన తొలి శతాబ్దంలో తన విశ్వసనీయతను సదా బలోపేతం చేసుకుంటూ దేశ ప్రజల నమ్మకాన్ని సముపార్జించుకుంది. ఇవాళ రెండో శతాబ్దంలో ప్రవేశిస్తున్న వేళ కొత్త అవకాశాలు-సవాళ్లకు తగినట్లు ఆ విశ్వసనీయతను మరింత సుసంపన్నం చేసుకోవాలి. మన బలమైన విలువలను కాపాడుకుంటూనే, భవిష్యత్తు అవసరాలు తీర్చగలిగేలా మనను మనం ఉన్నతీకరించుకోవాలి. యూపీఎస్‌సీ అనుసరించే నిష్పాక్షికత, ప్రతిభపై గల నిబద్ధత, గోప్యత తదితర విధానాలు సంస్థ ప్రత్యేక గుర్తింపును నిర్వచిస్తాయి. కాబట్టి, ఈ విలువలను మనం సదా పరిరక్షించుకోవాలి. ఈ విజ్ఞప్తితో మీకందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ నా ప్రసంగం ముగిస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు..
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
***
(రిలీజ్ ఐడి: 2318324)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13