మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
వికసిత భారత్ దార్శనికతను ముందుకు నడిపిస్తున్న
ఆవిష్కరణల వృద్ధి - శ్రీ ప్రహ్లాద్ జోషి
ఆవిష్కరణ మానవీయ అవసరం నుంచి ప్రారంభమై ఆచరణాత్మక పరిష్కారానికి దారితీసినప్పుడు అది సేవగా మారుతుంది - శ్రీ ప్రహ్లాద్ జోషి
బెంగళూరులోని ఐఐఎస్‌సీలో సేవా ఆధారిత ఆవిష్కరణ పోటీని (సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్) ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 4:01PM by PIB Hyderabad
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ రోజు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) లో దక్షిణ ప్రాంత సేవా ఆధారిత ఆవిష్కరణ పోటీ (సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ - ఎస్ఎఫ్ఐసీ) ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలోని నిజమైన సమస్యలను గుర్తించి, వాటికి ఆచరణాత్మకమైన, సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనడానికి యువత సేవా భావాన్ని ఆవిష్కరణలతో జోడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది వికసిత భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత భాగస్వామ్యానికి, సహకారానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ వెబ్‌సైట్ నూ, రిజిస్ట్రేషన్ పోర్టల్ నూ కూడా మంత్రి ఆవిష్కరించారు.
మంత్రి మాట్లాడుతూ, "సేవ అనేది మాటల్లో కాకుండా చేతల్లో కనిపించాలి" అని అన్నారు. ఒక సమస్యను అర్థం చేసుకుని, దానికి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక వినూత్నమైన పరిష్కారాన్ని కనుగొనడమే సేవ ముఖ్యమైన రూపమని ఆయన స్పష్టం చేశారు. భారత్ కు జనాభా పరంగా ఉన్న సానుకూల అవకాశాలను ప్రస్తావిస్తూ, దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని శ్రీ జోషి తెలిపారు. ఉత్సుకతతో, ఆత్మవిశ్వాసంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభంగా వినియోగించగల యువతరం భారత్‌లో ఉందని ఆయన అన్నారు. యువతలోని ఆ ఉత్సాహాన్ని ప్రయోజనకరమైన కార్యాచరణగా మలచుకునేందుకు వారికి తగిన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పేర్కొన్నారు.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రాముఖ్యతను, పాత్రను ప్రస్తావిస్తూ, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, అనుభవపూర్వక అభ్యాసం, సమస్యల పరిష్కార విధానాలను ఎన్ఈపీ విద్యకు ప్రధాన సూత్రాలుగా మార్చిందని శ్రీ ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఈ ఆలోచన వల్ల విద్యార్థులు చిన్న వయస్సు నుంచే కొత్త విషయాలను పరిశోధించడానికి, సృష్టించడానికి, ఆవిష్కరించడానికి అనేక అవకాశాలు లభిస్తున్నాయని ఆయన వివరించారు. 10,000 పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు, దాదాపు 17,300 ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిళ్లు, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ వంటి కార్యక్రమాల ద్వారా ఒక బలమైన ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రస్తావించారు.
‘సేవ‘ స్ఫూర్తితో చేసే ఆవిష్కరణలు 'వికసిత భారత్ - 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో అర్థవంతమైన సహకారాన్ని అందిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఛాలెంజ్ ద్వారా వెలుగులోకి వచ్చే యువ ఆవిష్కర్తలతో కలిసి పనిచేయాలని ఆయన అంకుర పరిశ్రమలకు, పరిశ్రమల భాగస్వాములకు పిలుపునిచ్చారు. భావి మార్గదర్శకత్వం, పరిష్కారాల స్వీకరణ, విస్తరణకు మద్దతు ఇచ్చేలా ఎస్ఎఫ్ఐసీ వెబ్‌సైట్ ద్వారా ఒక జాతీయ భాండాగారాన్ని ప్రారంభించాలని ఆయన ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఐఐఎస్సీ బెంగళూరు, ఇతర విద్యాసంస్థలు, అధ్యాపకులు, అంకుర పరిశ్రమలు, ఇతర వాటాదారులందరినీ ఆయన అభినందించారు. డిసెంబర్ 2026లో న్యూఢిల్లీలో జరిగే జాతీయ ఫినాలేలో దేశం నలుమూలల నుంచి అత్యుత్తమ పరిష్కారాలు వస్తాయని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.
బెంగళూరులోని ఐఐఎస్‌సీ దక్షిణ ప్రాంత నోడల్ సంస్థగా వ్యవహరిస్తూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, అండమాన్–నికోబార్ దీవులు, లక్షద్వీప్ ప్రాంతాల్లో సాంకేతిక మూల్యాంకనం, మార్గదర్శకత్వానికి సహకారం అందిస్తుంది.
ఎస్ఎఫ్ఐసీ కార్యక్రమం పాఠశాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులను, యువ ఆవిష్కర్తలను ఐదు జాతీయ ఇతివృత్తాలు (1. స్వచ్ఛ, సుస్థిర భారత్ 2. సంపన్న రైతులు, సంపన్న భారత్ 3. ఆరోగ్య, సమ్మిళిత భారత్ 4. విద్య, నైపుణ్య భారత్ 5. సురక్షిత భారత్), రెండు పరిష్కార మార్గాలు (ట్రాక్ ఏ - ప్రొడక్ట్ లేదా టెక్నాలజీ సొల్యూషన్, ట్రాక్ బీ - బిజినెస్ మోడల్ లేదా గవర్నెన్స్ సొల్యూషన్) ఆధారంగా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. సృజనాత్మక ఆలోచనలను కేవలం దరఖాస్తు సమర్పణలకే పరిమితం చేయకుండా తగిన మార్గదర్శకత్వం, ఇంక్యుబేషన్, ఆచరణాత్మక అమలుకు మార్గాలను సుగమం చేయడం ఈ పోటీ ప్రధానోద్దేశం. ఈ పోటీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 24, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. గ్రాండ్ నేషనల్ ఫినాలే డిసెంబర్ 2026లో న్యూఢిల్లీలో జరుగుతుంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు డైరెక్టర్ ప్రొఫెసర్ గోవిందన్ రంగరాజన్, ఉన్నత విద్యా శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ఆనందరావు వి. పాటిల్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కార్యదర్శి ప్రొఫెసర్ శ్యామ రథ్‌లతో పాటు ఎన్ఐటీలు, ఇతర సంస్థల డైరెక్టర్లు, ప్రతినిధులు, అధ్యాపకులు, పరిశ్రమలు, స్టార్టప్ రంగ ప్రతినిధులు; విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://sevafirst.mic.gov.in/ ను సందర్శించండి:
***
(రిలీజ్ ఐడి: 2314958)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8