గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026 అక్టోబర్ నుంచి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో డీడీయూ-జీకేవై


2.0 పరిధిలో 70,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా డీడీయూ-జీకేవై 2.0 అమలును వేగవంతం చేసిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2026 9:31AM by PIB Hyderabad

పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ దయాల్ ఉపాధ్యాయ-గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై)-2.0 శిక్షణ బ్యాచులను 2026 అక్టోబర్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రారంభిస్తుంది.

డీడీయూ-జీకేవై 2.0 పోర్టల్ (https://kaushal.rural.gov.in) ప్రకారం, 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 1,200కు పైగా ప్రాజెక్టులకోసం ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ (పీఐఏ)లకు 5.6 లక్షల లక్ష్యాలను నిర్దేశించాయి. మిగిలిన రాష్ట్రాలు లక్ష్యాల కేటాయింపులో తదుపరి దశలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,015 బ్యాచులకు 2026 అక్టోబరు నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని అంచనా. ఈ బ్యాచుల్లో సుమారుగా 70,000 మంది గ్రామీణ యువత శిక్షణ పొందుతారు.

కేంద్ర ప్రాయోజిత పథకమైన డీడీయూ-జీకేవై నిరుపేద గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించడంతో పాటు ఉపాధిని కల్పిస్తుంది. శిక్షణ కాల వ్యవధి 3 నెలల నుంచి 12 నెలల వరకు ఉంటుంది. 2026-28 వరకు, అంటే రెండేళ్ల కాలవ్యవధికి గాను డీడీయూ-జీకేవై-2.0 పరిధిలో మొత్తం 31 భాగస్వామ్య రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 9 లక్షలకు పైగా లక్ష్యాలను నిర్దేశించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గ్రామీణ యువతను సమీకరించి, డిమాండ్‌కు అనుగుణంగా పీపీపీ విధానంలో ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి. ఇవి లబ్ధిదారులకు దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు కల్పించేలా జాతీయ నైపుణ్య అర్హతా నియమావళి (ఎన్ఎస్‌క్యూఎఫ్)కి అనుగుణంగా ఉండాలి. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇది అత్యంత కీలకమైన దశ అని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ అమలు సంస్థ (పీఐఏ)లకు లక్ష్యాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా శిక్షణ బ్యాచ్‌లను ప్రారంభించాలని కూడా ఆదేశించింది. శిక్షణ తరగతులు సకాలంలో ప్రారంభమయ్యేలా 2026 అక్టోబర్ 31 నాటికి సంబంధిత సంస్థలకు లక్ష్యాలను కేటాయించే ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

శిక్షణ బ్యాచ్‌లను ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో విడతల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2314737) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Kannada