ఆయుష్
భారత్‌లోను, ప్రపంచవ్యాప్తంగాను 11వ ఆయుర్వేద దినోత్సవం... నాగ్‌పూర్‌లో ఘనంగా జాతీయ వేడుకలు
· రుజువులే ప్రాతిపదికగా పరిశోధన, ఆవిష్కరణ, ఆరోగ్యకరమైన జీవనం ప్రాధాన్యాన్ని చాటేలా ఆయుర్వేద దినోత్సవం
· సంప్రదాయం స్థాయి నుంచి ప్రామాణికత, ఆవిష్కరణల దిశగా ఆయుర్వేద ప్రస్థానం... భావి తరాల ఆరోగ్యానికి ఆయుర్వేదం భరోసా: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
· ఆరోగ్యకరమైన జీవనశైలి, ముందస్తు ఆరోగ్య సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలని కేంద్ర మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ పిలుపు
· విజ్ఞానం, రుజువులు, ఆవిష్కరణలు ఆయుర్వేద భవితను తీర్చిదిద్దుతాయి: ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేశ్ కోటెచా
· 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా.. భద్రతా పత్రాలు, ప్రామాణిక చికిత్సా మార్గదర్శకాలు, ఆయుష్ సేవల రంగ నివేదిక, ఆయుష్ విజన్ 2030 విడుదల: సీసీఆర్ఏఎస్ - అగ్ని పోర్టల్ ప్రారంభం
· భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, అసాంక్రామిక వ్యాధుల భారాన్ని పరిష్కరించడంలో ఆయుర్వేదం పాత్రను చాటేలా వైజ్ఞానిక సదస్సులు
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2026 3:48PM by PIB Hyderabad
‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం’ ప్రధాన ఇతివృత్తంగా.. 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహంగా నిర్వహించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జాతీయ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయుష్ సేవల రంగానికి సంబంధించిన నివేదిక, ‘ఆయుష్ విజన్ – 2030’ సహా పలు కీలక నివేదికలు, పత్రాలను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. సీసీఆర్ఏఎస్ – అగ్ని వెబ్ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యంలో ఆయుర్వేదం పాత్రతోపాటు 2047 దిశగా ప్రణాళికపై వైజ్ఞానిక సదస్సులను కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించారు.
గౌరవ ప్రధానమంత్రి సందేశాన్ని కార్యక్రమంలో చదివి వినిపించారు. సంప్రదాయంగా ఉన్న ఆయుర్వేదం నేడు విజ్ఞానం, ప్రామాణికత, ఆవిష్కరణల స్థాయికి చేరిందని, భవిష్యత్ తరాల ఆరోగ్యం, శ్రేయస్సులను కాపాడడంలో దోహదపడుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త గుర్తింపును ఆయుర్వేదం సొంతం చేసుకుందన్నారు. ఆయుష్ వీసాతో విదేశీ పౌరులు భారత్‌లో ఆయుష్ విధానాల కింద చికిత్స పొందవచ్చన్నారు. ‘శక్తి సాధన’ సంకల్పాన్ని ప్రస్తావిస్తూ... వికసిత భారత్ దిశగా దేశం స్థిరంగా పయనిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయుర్వేదంతో అనుబంధమున్న సంస్థలు, నిపుణులు, యువత ఈ సుసంపన్నమైన సంప్రదాయాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి, ఆరోగ్యకరమైన, సమర్థమైన, బలమైన భారత్ నిర్మాణానికి దోహదపడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర ఆయుష్ శాఖ సహాయ (స్వతంత్ర హోదా), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ వర్చువల్‌గా ఈ వేడుకలను ప్రారంభించారు. ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి (వైద్య) రాజేశ్ కొటేచా, కేంద్ర ఆయుర్వేద శాస్త్రాల పరిశోధన మండలి (సీసీఆర్ఏఎస్) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ (వైద్య) రబీనారాయణ్ ఆచార్య, ఇతర విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. దేశ ఆరోగ్య దార్శనికతలో అత్యంత కీలకమైన అంశంగా ఆయుర్వేదాన్ని కేంద్ర మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ అభివర్ణించారు. ‘‘హాస్పిటల్ కాదు.. మన ఇల్లే ఆరోగ్యానికి ప్రధాన కేంద్రం. ఔషధాలు కాదు.. మన జీవనశైలే ఆరోగ్యానికి ఆధారం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘స్వస్థస్య స్వస్థ రక్షణం, ఆతురస్య వికార ప్రశమనమ్’’ అన్న సూత్రాన్ని ఉదాహరిస్తూ.. చికిత్సతోపాటు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికీ ఆయుర్వేదం ప్రాధాన్యమిస్తుందన్నారు. పెరుగుతున్న జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యల నేపథ్యంలో.. ఈ విధానం మరింత ప్రాసంగికంగా మారుతోందన్నారు.
సంప్రదాయ వైద్య రంగాన్ని అంతర్జాతీయీకరించడంలో భాగంగా... జామ్‌నగర్‌లోని డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రం, ఐటీఆర్ఏ జామ్‌నగర్‌కు జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థగా గుర్తింపు లభించడం, డబ్ల్యూహెచ్‌ఓ ఐసీడీ-11 వర్గీకరణలో ఆయుర్వేదం, సిద్ధ, యునానీలను చేర్చడం వంటివి కీలకమైన చర్యలుగా శ్రీ ప్రతాపరావు జాదవ్ పేర్కొన్నారు. విజ్ఞానంతో, ప్రమాణాలతో, ఆవిష్కరణలతో సంప్రదాయాన్ని అనుసంధానించాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం వార్షిక కార్యక్రమంగానే కాకుండా.. ఆరోగ్యకరమైన జీవనంపై ప్రజల్లో విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఆయుర్వేద దినోత్సవాన్ని విస్తరించాలని ఆయన సూచించారు.
ఆయుర్వేద విజ్ఞానాన్ని వైజ్ఞానిక ఆధారాలతో, ప్రమాణాలతో, ఆవిష్కరణలతో, ప్రజారోగ్య ప్రయోజనాలతో అనుసంధానించడంపైనే ఆయుర్వేదం భవిత ఆధారపడి ఉంటుందని ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేశ్ కోటేచా స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తూ... పరిశోధన, నాణ్యత, భద్రత, ప్రామాణీకరణను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జామ్‌నగర్‌లోని డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రం, ఆయుష్ రీసెర్చ్ పోర్టల్‌లో 43,000కు పైగా పరిశోధన ప్రచురణలు, 200కు పైగా బీఐఎస్ ప్రమాణాలు, ఆయుష్ క్వాలిటీ మార్క్ వంటి కీలక పరిణామాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ... ఆయుష్ వ్యవస్థలను మరింత శాస్త్రీయంగా, ప్రామాణికంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రాసంగికంగా మార్చడమేనని ఈ ప్రయత్నాల లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
గోక్షుర (ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్), చంద్రసుర (లెపిడియం సాతీవం)కు సంబంధించిన భద్రతా నివేదికలు, చర్మ వ్యాధుల చికిత్సకు సంబంధించి ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలు, అలాగే ఆయుష్ సేవల రంగాన్ని అంచనా వేస్తూ ఆయుష్ సేవల రంగంపై ‘అభివృద్ధి చెందిన దేశాల పరిశోధన, సమాచార సంస్థ (ఆర్ఐఎస్)’ రూపొందించిన మొదటి నివేదికలను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.
భారత్‌లో ఆయుష్ సంబంధిత కార్యక్రమాల స్థితిగతులపై ‘సంప్రదాయ దార్శనికత నుంచి అంతర్జాతీయ నేతృత్వం వరకు: ఆయుష్ విజన్ 2030’ పేరుతో నివేదికను కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. సీసీఆర్ఏఎస్- అగ్ని అంచనా మాపన వెబ్ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. పరిశోధన, ప్రామాణీకరణ, ఆవిష్కరణలు, చికిత్సాపరమైన మార్గదర్శకాలు, ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చేలా వ్యవస్థాగత పరివర్తనపై ఈ కార్యక్రమాలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన నాలుగు పరిశ్రమలకు ఆయుష్ నాణ్యతా మార్కు ధ్రువీకరణలను ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి అందించారు. ఆయుష్ రంగంలో నాణ్యత, ప్రామాణీకరణలకు గల ప్రాధాన్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
ఆరోగ్య రక్షణ, ప్రజారోగ్యంలో పెరుగుతున్న ఆయుర్వేదం పాత్రపై రెండు వైజ్ఞానిక సదస్సులను ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. ‘శాశ్వతం నుంచి విశ్వాసం దిశగా - ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం, 2047కు ప్రణాళిక’ పేరిట నిర్వహించిన మొదటి సదస్సులో డబ్ల్యూహెచ్‌వో జామ్‌నగర్ అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రం యూనిట్ అధిపతి డాక్టర్ జి. గీతాకృష్ణన్ పిళ్లై పాల్గొన్నారు. ఆయుర్వేద రంగం భవిష్యత్తు గమనం, ప్రామాణీకరణ, 2047 నాటికి విస్తృత ఆరోగ్య లక్ష్యాల సాధనలో దాని పాత్రపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ‘2027 నాటికి అసాంక్రామిక వ్యాధుల భారాన్ని తగ్గించడంలో సమీకృత చికిత్సల ఆవశ్యకత’ పేరుతో నిర్వహించిన రెండో సదస్సులో కాలేయ, బైలరీ విజ్ఞాన సంస్థ (ఐఎల్‌బీఎస్) డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ సరీన్ పాల్గొన్నారు. పెరుగుతున్న అసాంక్రామిక వ్యాధుల భారాన్ని తగ్గించడంలో సమీకృత చికిత్సా విధానాల సామర్థ్యంపై ఈ సదస్సులో చర్చించారు.
వైజ్ఞానిక చర్చల అనంతరం.. జైపూర్‌లోని జాతీయ ఆయుర్వేద సంస్థ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సంజీవ్ వర్మ చర్చల సారాంశాన్ని వివరించారు. డిజైన్లు, ట్రేడ్ మార్కుల పేటెంట్ల కంట్రోలర్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ ఉన్నత్ పి. పండిట్ కూడా ‘దేశంలో ఆయుష్ సంబంధిత కార్యక్రమాలపై నివేదిక’పై ప్రసంగించారు. ప్రామాణిక చికిత్సా మార్గదర్శకాలపై ఆయుష్ మంత్రిత్వశాఖ సలహాదారు (ఆయుర్వేద) డాక్టర్ ఎ. రఘు మాట్లాడారు.
ఆయుష్ మంత్రిత్వశాఖ సీనియర్ గణాంక సలహాదారు శ్రీ సత్యజిత్ పాల్, అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం పరిశోధన, సమాచార వ్యవస్థల (ఆర్ఐఎస్) డైరెక్టర్ జనరల్ సచిన్ కుమార్ శర్మ, మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు, ఆయుష్ కౌన్సిళ్లు, సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ ఔషధ మొక్కల ప్రదర్శనను కూడా వేదిక వద్ద ఏర్పాటు చేశారు. ఆయుష్ మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ సంస్థల స్టాళ్లు ఈ ప్రదర్శనలో భాగంగా ఉన్నాయి. ఇది వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఈ జాతీయ వేడుకలో... దేశవ్యాప్తంగా ఉన్న అభ్యాసకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, సంస్థలు, సంబంధిత భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చారు. ఆయుర్వేద పురోగతిలో ప్రామాణికత, పరిశోధన, ఆవిష్కరణ, నాణ్యత, సంపూర్ణ ఆరోగ్య రక్షణలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని చాటేలా కార్యక్రమం సాగింది.
***
(రిలీజ్ ఐడి: 2314331)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12