హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంత మాదకద్రవ్య నిరోధక టాస్క్ ఫోర్స్ (ఏఎన్‌టీఎఫ్) అధినేతల 3వ జాతీయ సదస్సుకు శ్రీకారం చుట్టిన కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
“వికసిత భారత్-2047 సాకారంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు మాదకద్రవ్య రహిత భారత్ దిశగా భవిష్యత్ ప్రణాళిక కీలకం”
“దేశానికి.. ప్రపంచానికి తీవ్ర ముప్పుగా మారిన మాదక ద్రవ్యాలపై పటిష్ట.. నిర్ణయాత్మక చర్యలకు తరుణమిదే”
“ప్రపంచవ్యాప్త యువత సంక్షేమం మెరుగు లక్ష్యంగా 2029 భవిష్యత్ ప్రణాళికను మేం సిద్ధం చేశాం”
“దీని ప్రకారం భారత్ నుంచి 2029 నాటికి మాదకద్రవ్య విక్రయాల సమూల నిర్మూలనలో మనం సమష్టిగా విజయం సాధిస్తాం”
“దేశంలోకి ఒక్క గ్రాము మాదక ద్రవ్యమైనా రాకుండా చూడటమేగాక భారత్ నుంచి వాటి రవాణను కూడా అనుమతించరాదన్నదే మన లక్ష్యం కావాలి”
“మాదక ద్రవ్య నిరోధక పోరాటానికి అగ్ర ప్రాథమ్యంతోపాటు సహానుభూతితో మనం సమష్టి పోరాటం సాగించాలి”
“ఈ పోరులో మన లక్ష్యం.. జవాబుదారీతనం.. కాలపరిమితి నిర్దేశం ద్వారా సంపూర్ణ విజయం వైపు మనం పయనిస్తున్నాం”
“మనం సమావేశం నుంచి లక్ష్యం.. నివేదన నుంచి ఫలితం.. స్వాధీనం నుంచి నెట్‌వర్క్ అంతం.. కేసు నుంచి శిక్ష వైపు సాగాలి”
“ఏఎన్‌టీఎఫ్’ను మాదకద్రవ్య నిరోధక మిషన్ కమాండ్‌గా మార్చడమే మన కర్తవ్యం కావాలి”
“స్వాధీన కేంద్రక విధానం బదులు నెట్‌వర్క్ నిర్మూలన లక్ష్యంతో ముందడుగు వేద్దాం”
“మాదకద్రవ్య నిరోధక పోరాటంలో జిల్లాను ప్రాథమిక యూనిట్‌గా పరిగణించాలి”
“యువతలో అవగాహన కల్పన.. క్యాంపస్ డైరెక్టర్లలో చైతన్యం దిశగా మాదకద్రవ్య విముక్త మిత్రులు దేశంలోని 10 లక్షల పాఠశాలలు.. కళాశాలలు.. సంస్థలను సందర్శిస్తారు”
“ముందు-వెనుకల దర్యాప్తు సహా ఆర్థికపరమైన విచారణ.. డిజిటల్ లింకుల అన్వేషణ మన ప్రాధాన్యంగా ఉండాలి”
“ఈ ముఠాలపై మూడు స్థాయిలలో- ప్రవేశ స్థానం.. అంతర్రాష్ట్ర పంపిణీ వ్యవస్థ.. జిల్లాల్లో స్థానిక సెల్ నెట్‌వర్కులపై దాడులు చేయాలి”
“ఈ క్రమంలో మాదకద్రవ్య తయారీ లేదా ప్రవేశ జిల్లాలు.. రవాణా కారిడార్ జిల్లాలు.. వినియోగ జిల్లాల వారీగా విభజించుకుని పనిచేయాలి”
“భారత్‌లోని విదేశీ నిందితులను వెళ్లగొట్టి వారు మళ్లీ భారత్ రాకుండా బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాలి”
“విదేశాలకు పరారై భారత్‌కు మాదకద్రవ్య సరఫరా చేస్తున్న నిందితులను పట్టుకుని భారత న్యాయస్థానాల ముందు హాజరుపరచాలి”
“ఏఎన్‌టీఎఫ్’కు అందే ప్రతి వివరాన్నీ కార్యాచరణ యోగ్య నిఘా సమాచారంగా మార్చే ప్రక్రియ మొత్తాన్నీ మీ రాష్ట్ర పోలీసుల బాధ్యతల్
నాడు పోస్టు చేయడమైనది:
22 SEP 2026 5:54PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ‘యాంటీ-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్’ (ఏఎన్‌టీఎఫ్) అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్య నిరోధంపై అవగాహన దిశగా రూపొందించిన టీవీ ప్రకటనలను (టీవీసీ) ఆయన ఆవిష్కరించారు. దీంతోపాటు లక్నో, డెహ్రాడూన్ నగరాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కొత్త జోనల్ ప్రాంగణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఎన్‌సీబీ’ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించడం సహా అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ‘ఏఎన్టీఎఫ్’ బృందాలను కూడా సత్కరించారు. ‘ఎన్‌సీబీ’ నిర్వహించిన ఈ రెండు రోజుల సదస్సులో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ‘ఏఎన్‌టీఎఫ్’ అధిపతులు, సంబంధిత ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, ఇతర భాగస్వాములు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘మాదకద్రవ్య రహిత భారత్’ అనే సంక్లిష్ట లక్ష్యం సాధించే దిశగా ఐదేళ్ల నుంచీ తాము వరుసగా పటిష్ట చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. దేశానికి, ప్రపంచానికి అత్యంత తీవ్ర ముప్పుగా మారిన మాదకద్రవ్యాలపై నిర్ణయాత్మక పోరాటం, సమష్టి కృషితో విజయం సాధించాల్సిన తరుణమిదేనని ఆయన అన్నారు. ఈ మేరకు 2029 డిసెంబరు 31 నాటికి భారత్ నుంచి మాదకద్రవ్య విక్రయం సమూల నిర్మూలనలో సమష్టి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గడచిన ఐదేళ్లలో కాశ్మీర్‌లో ఉగ్రవాదం, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు, నక్సలిజం వంటి అనేక సవాళ్ల పరిష్కారంలో తిరుగులేని విజయం సాధించామని ఆయన చెప్పారు. దశాబ్దాలుగా దేశాన్ని వేధిస్తున్న ఈ ప్రధాన సమస్యలను అన్ని రాష్ట్రాల సహకారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిష్కరించిందని ఆయన పేర్కొన్నారు. మాదకద్రవ్యాలపై పోరు అన్నిటికన్నా కష్టతరమైనప్పటికీ ఈ పోరాటాన్ని ఆపేది లేదని ఆయన అన్నారు. వికసిత భారత్-2047 లక్ష్యం దిశగా భావితరాల రక్షణకు, దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యానికి మన ముందున్న ఏకైక మార్గం భారత్‌ను మాదకద్రవ్య రహితం చేయడమేనని శ్రీ అమిత్ షా ఉద్ఘాటించారు. ఆ మేరకు ఈ బెడదపై సమైక్యంగా, దృఢ సంకల్పంతో పోరాడి, విజయం సాధించాలని సూచించారు.
ఈ పోరాటంలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికీ ‘విజన్ డాక్యుమెంట్ 2026-2029’ ఒక పవిత్ర గ్రంథం వంటిదని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. మొత్తం 35కు పైగా శాఖలతో చర్చలతోపాటు అవిరళ కృషితో ఈ దార్శనిక పత్రం రూపొందిందని తెలిపారు. సంబంధిత వర్గాలన్నింటి నుంచీ సూచనలు స్వీకరించి, సంపూర్ణ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, నిర్దిష్ట లక్ష్యాలతో అందరికీ అందజేశామని ఆయన అన్నారు. ఇందులో లక్ష్యాలు, కాలవ్యవధులను కూడా నిర్ణయించినట్లు తెలిపారు. దీని అమలు ప్రారంభమైన కొంతకాలం తర్వాత సమీక్ష చేపడతామని హోం మంత్రి తెలిపారు. అయితే, ఈ కార్యాచరణ యావత్తూ తమ శాఖ లేదా ‘ఎన్‌సీబీ’ మాత్రమే చేయలేవని శ్రీ అమిత్ షా అన్నారు. కాబట్టి, అత్యంత ప్రాధాన్యంతోనే కాకుండా పూర్తి అంకితభావంతో పోరాడి, గెలవాలని ఉద్బోధించారు.
భవిష్యత్తరాలను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాల పీడను అంతం చేయడంలో సమష్టి బాధ్యత, సంకల్పం అవశ్యమని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రపంచంలో ఏ మూల నుంచీ ఒక్క గ్రాము మాదకద్రవ్యమైనా దేశంలోకి రాకుండా చూడాలన్నారు. అలాగే దేశం నుంచి ఒక్క గ్రాము కూడా విక్రయించే వీల్లేకుండా చేయడానికి సంకల్పం పూనాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్త యువత సంక్షేమంపై నిబద్ధతతోనే ఈ భవిష్యత్ కార్యాచరణను రూపొందించామని ఆయన చెప్పారు. మాదకద్రవ్య రహిత భారత్ దిశగా అత్యంత శ్రద్ధతో దీని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుని, సున్నిత దృక్పథంతో కృషి చేయాలన్నారు. ఈ మేరకు “మాదకద్రవ్యాల బారిన పడిన ఎవరైనా ఓ యువకుడి తల్లిదండ్రులు లేదా తోబుట్టువులను ఒక్కసారైనా కలవండి. అప్పుడుగానీ దాని తీవ్రత తెలియకపోవచ్చు.. ఈ మహమ్మారిపై పోరాటం దిశగా పట్టుదల మీలో కలగకపోవచ్చు. రోదిస్తున్న అతడి తల్లి, చెల్లెలు, నిస్సహాయులైన తల్లిదండ్రుల కళ్ల ముందే పదో తరగతి పరీక్షల్లో తొలి 10 స్థానాల్లో నిలిచిన ఓ కుర్రాడు నెమ్మదిగా మరణం వైపు అడుగులు వేస్తుండటాన్ని మించిన దుఃఖం మరొకటి ఉండదు. ఇది వారికే కాదు… ఒక జాతిగా మనందరికీ కోలుకోలేని నష్టంగా పరిణమిస్తుంది. భవిష్యత్ భారత్ కోసం తన వంతు కృషి చేయాల్సిన ప్రతిభావంతుడైన బిడ్డ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతే మనను మనమే క్షమించుకోలేం” అని ఆయన స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాలపై పోరు విస్పష్ట అవగాహనతో సాగాలని కేంద్ర హోం మంత్రి నిర్దేశించారు. ఈ దిశగా ఇప్పటికే అనేక కీలకాంశాలను గుర్తించామని చెప్పారు. అలాగే నిఘా, దర్యాప్తు, ఆర్థికపరమైన చర్యలు, ప్రాసిక్యూషన్ తదితరాలను ఒకే దిశలో పటిష్టంగా కొనసాగించేందుకు రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. తొలి ‘ఏఎన్‌టీఎఫ్’ సదస్సులో తామొక సంస్థాగత యంత్రాంగాన్ని సృష్టించి, బలోపేతం చేశామని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. అటుపైన రెండో సదస్సులో దాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు అవసరమైన సామర్థ్యం, చర్యలు, అమలు విధానాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఇక నేటి మూడో సదస్సు ఈ ప్రణాళికను నిర్ణయాత్మక పోరాటంగా మారుస్తుందని చెప్పారు.
అయితే, ఇప్పటిదాకా చేసిన కృషి సరిపోదని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి గ్రామ పట్వారీ, పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ, రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి దాకా ప్రతి ఒక్కరూ ఏకోన్ముఖంగా కృషి చేస్తే తప్ప విజయం సాధించలేమన్నారు. లక్ష్యం, కాలపరిమితి, జవాబుదారీతనాన్ని నిర్దేశించుకుంటేనే ఈసారి సంపూర్ణ విజయం దిశగా ముందడుగు వేయగలమన్నారు. కాబట్టే, నేటి సదస్సు అత్యంత కీలకమైనదని ఆయన వివరించారు.
ఇప్పుడీ సదస్సు నుంచి కార్యాచరణకు.. నివేదన నుంచి ఫలితానికి.. స్వాధీనం నుంచి నెట్‌వర్కుల నిర్మూలనకు.. కేసుల నుంచి శిక్షకు మళ్లాల్సి ఉందని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని శాఖలు ఈ కృషిలో పాలుపంచుకుంటేనే తప్ప ముందడుగు వేయలేమని ఆయన చెప్పారు.
దేశాన్ని 2047 ఆగస్టు 15 నాటికి ‘వికసిత భారత్’గా రూపొందించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 140 కోట్ల మంది పౌరులకు లక్ష్యనిర్దేశం చేశారని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. తదనుగుణంగా ఆ సమయానికి భారత్ ప్రతి రంగంలోనూ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. వ్యసనాలతో బలహీనపడిన యువత, భవిష్యత్తరాలతో ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమని ఆయన అన్నారు. ప్రపంచంలోనే భారత్ అత్యంత అధిక యువ జనాభాగల దేశమని ఆయన పేర్కొన్నారు. అందుకే, అంతర్జాతీయ స్థాయిలో మనకు ముప్పు కూడా అత్యధికంగా ఉందన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. “ఇది మనకు అత్యావశ్యకం... ఎందుకంటే- యువత ఆరోగ్యం, నైపుణ్యం, శ్రమ, ఆలోచనా సామర్థ్యం మాత్రమే దేశాన్ని నిర్దేశిత లక్ష్యం వైపు నడిపించగలవు. కానీ, మాదకద్రవ్యాలు ఈ నాలుగు సామర్థ్యాలనూ దెబ్బతీస్తాయి” అని స్పష్టం చేశారు.
సింథటిక్ డ్రగ్స్, వాటి తయారీకి వాడే రసాయనాల మళ్లింపు, కొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డార్క్-నెట్, డ్రగ్ మార్కెట్లు, క్రిప్టో, డెడ్-డ్రాప్ డెలివరీ వ్యవస్థలు, అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్ వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవాలని శ్రీ అమిత్ షా చెప్పారు. అందుకే, ప్రతి రాష్ట్రంలోనూ ‘విభిన్నం’గా ఆలోచించగల అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని, కార్యాచరణను విభజించుకుని దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా విజయం సాధించాలని కేంద్ర హోం మంత్రి సూచించారు.
విజన్ డాక్యుమెంట్ 2026–2029 నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉందని శ్రీ అమిత్ షా చెప్పారు. ఈ మేరకు “అమలు-నిఘా కార్యకలాపాలు, ప్రికర్సర్-సింథటిక్ డ్రగ్స్ నియంత్రణ, డిమాండ్-హాని తగ్గింపు, సామర్థ్య వికాసం-సమన్వయం”గా వీటిని విభజించినట్లు తెలిపారు. ఈ పత్రంలో నిర్దేశించిన మేరకు లక్షమంది మాదకద్రవ్య విముక్త మిత్ర కార్యకర్తలను నమోదు చేసే లక్ష్యం కింద వివిధ మంత్రిత్వ శాఖలు ఇప్పటిదాక 46,780 మందిని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. వారంతా తమ కార్యకలాపాలను ప్రారంభించారని, ఈ ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. ఇందులో భాగంగా దేశంలోని 10 లక్షల పాఠశాలలు, కళాశాలలు, సంస్థలను వీరు సందర్శించి, యువతను అప్రమత్తం చేయడం సహా ఆయా ప్రాంగణాల యాజమాన్యాల్లో అవగాహన కల్పిస్తారన్నారు.
భవిష్యత్ ప్రణాళికను ఫలితంగా మార్చడంపై నేడు చర్చిస్తున్న నేపథ్యంలో ఈ రెండు రోజుల మేధా మథనంలో అత్యంత కీలకమైది ‘కరుణ’ అని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘ఏఎన్‌టీఎఫ్’ను ‘యాంటీ-నార్కో మిషన్ కమాండ్’గా మార్చడమే లక్ష్యం కావాలని నిర్దేశించారు. ఈ దిశగా మానవ వనరులు, సాంకేతికత, బడ్జెట్, ఇతరత్రా వనరుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు భిన్నమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుందన్నారు. సామర్థ్య వికాసం దిశగా కేంద్ర ప్రభుత్వం సాంకేతికతకు, ఫోరెన్సిక్స్ పరిజ్ఞానం మెరుగుదలకు ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.
మాదకద్రవ్యాల స్వాధీన ప్రాధాన్యంతో కాకుండా యావత్ ముఠాల నిర్మూలన లక్ష్యంతో ముందడుగు వేయాలన్నారు. ముందు-వెనుక దర్యాప్తు పద్ధతి సహా ఆర్థికపరమైన దర్యాప్తు, డిజిటల్ లింకుల గుర్తింపు తదితరాలు కూడా ప్రాధాన్యాలో భాగం కావాలన్నారు. మాదకద్రవ్య వ్యాపారులు ఆర్జనపై దాడులు ముమ్మరం చేసి, మూడు స్థాయులలో ముఠాల నిర్మూలనను లక్ష్యం చేసుకోవాలని శ్రీ అమిత్ షా సూచించారు. ఈ మేరకు ప్రవేశ స్థానం, అంతర్రాష్ట్ర సరఫరా, జిల్లాల్లో స్థానిక అమ్మకాల నెట్‌వర్కుల పరంగా జిల్లాలను మూడుగా వర్గీకరిస్తారు. మాదకద్రవ్యాలు తయారయ్యే లేదా దేశంలోకి ప్రవేశించే ప్రాంతాలు, రవాణా కారిడార్లు, వినియోగ ప్రాంతాలను లక్ష్యం చేసుకోవాలని చెప్పారు.
దేశంలో ‘పీఐటీఎన్‌డీపీఎస్’ అవసరం ఎంతో ఉందని, ఆ చట్టం వినియోగాన్ని ముమ్మరం చేయాలని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య సమన్వయంతో దర్యాప్తు నుంచి శిక్ష విధింపు దాకా పూర్తి భవిష్యత్ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. దేశంలోని విదేశీ నిందితులను దేశం నుంచి బహిష్కరించడమే కాకుండా వారు మళ్లీ రాకుండా బ్లాక్‌లిస్ట్ చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్నారు. అంతేగాక విదేశాల నుంచి మాదకద్రవ్య సరఫరా చేస్తున్న పరారీ నిందితులను పట్టుకుని, కోర్టులలో హాజరుపరచాలని తెలిపారు. సరిహద్దులు, ఉత్పత్తి కేంద్రాలు లక్ష్యంగా అన్ని లోటుపాట్లను సరిదిద్దాలన్నారు. ప్రతి ‘ఏఎన్‌టీఎఫ్’ వివరాన్నీ కార్యాచరణ యోగ్య నిఘాగా మార్చే యావత్ ప్రక్రియను ఆయా రాష్ట్ర పోలీసు బలగాల పని సంస్కృతిలో భాగం చేయాలన్నారు. తద్వారా మాదకద్రవ్యాలపై ఈ పోరాటంలో విజయం సాధించగలమని హోం మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా మాదకద్రవ్య అక్రమ రవాణాను సమర్థంగా ఎదుర్కొనే దృఢ సంకల్పంతో రాష్ట్రాలు, శాఖలు, ఏజెన్సీలు ‘ఏకోన్ముఖ ప్రభుత్వం’ విధానంతో ముందడుగు వేయడానికి ఈ జాతీయ సదస్సులో వారి భాగస్వామ్యం తోడ్పడుతుందని తెలిపారు.
మాదకద్రవ్య నియంత్రణ చట్టాల అమలు బలోపేతంతోపాటు దేశ యువతకు ఈ వ్యసనం నుంచి రక్షణ దిశగా అనుసరించే వ్యూహాల ప్రభావం పెంచడానికి ఈ సదస్సులో చర్చలు దోహదం చేస్తాయి. మాదకద్రవ్య వినియోగాన్ని నిరోధించడానికి, ‘నషా ముక్త్ భారత్’ సంకల్ప సాకారానికి ‘ఎన్‌సీబీ’ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ‘ఎన్‌టీఎఫ్’ల మధ్య భవిష్యత్ సంసిద్ధ భాగస్వామ్య బలోపేతంలో ఈ జాతీయ సదస్సు ఒక ప్రభావశీల వేదికగా ఉపయోగపడింది.
***
(రిలీజ్ ఐడి: 2313709)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9