హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముంబయిలో నిర్వహించిన ‘హిందీ దివస్-2026.. అఖిల భారత 6వ అధికార భాషా సదస్సు’లో కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగం


· “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హయాంలో అధికార భాషా విభాగం అనేక కీలక విజయాలు సాధించింది”

· “హిందీ శబ్ద సింధు’లో స్థానిక భాషల నుంచి 50,000కు పైగా పదాలు చేరడంతో అధికార భాష హిందీ మరింత సరళం.. సార్వజనీనంగా మారింది”

· “ఇప్పుడు 8 లక్షల పదాలకు చేరిన ‘హిందీ శబ్ద సింధు’ 2029కల్లా ప్రపంచంలో అతిపెద్ద నిఘంటువుగా అవతరిస్తుంది”

· “బాలలు మాతృభాష ద్వారానే దేశాన్ని వాస్తవంగా అర్థం చేసుకోగలరు: భాషా వైషమ్యాలను సృష్టించాలని చూస్తున్న వారికి హోం మంత్రిగా ఇదే నా సందేశం”

· “పాలన.. విజ్ఞానం.. సాహిత్యం వగైరా రంగాల్లో భాషల పరస్పర సంధానం పెంపు ద్వారా భారతీయ భాషలను మోదీ ప్రభుత్వం సుసంపన్నం చేస్తోంది”

· “దేశ భాషలన్నిటితో హిందీ ముడిపడి ఉంది.. నా భాష గుజరాతీ అయినా హిందీ నేర్చుకోవడం వల్ల జాతీయ స్థాయి కార్యకలాపాల్లో ఇబ్బంది రాలేదు”

· “తల్లి అనురాగం… తోబుట్టువుల మధ్య ప్రేమను మాతృభాష మినహా మరే ఇతర భాష వాస్తవికంగా వ్యక్తం చేయజాలదు”

· “‘ఒకే భారత్-శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తితో ప్రజలు మమేకం కావడానికే మాతృభాషతో పాటు మరో భాష నేర్చుకోవడాన్ని మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది”

· “వ్యక్తి మాతృభాషలో ఆలోచించినా.. విశ్లేషించినా.. సృష్టించినా.. ఫలితం సదా అత్యుత్తమంగానే ఉంటుంది”

· “వీర్ సావర్కర్ సృష్టించిన అనేక పదాలను అధికార భాషా విభాగం ‘హిందీ శబ్ద సింధు’లో పొందుపరిచేందుకు కృషి చేస్తోంది”

· “అనేక భాషలు ఉండటంలో అభ్యంతరం లేదుగానీ, ఆ భావన భారతీయంగానే ఉండాలి.. అనేక మాండలికాలున్నా భారత్‌ గళం మాత్రం ఒక్కటిగానే ఉండాలి”

· “మోదీ హయాంలో 2019 నుంచి అధికార భాషా సంఘం నాలుగు సంపుటాల నివేదికలను గౌరవనీయ రాష్ట్రపతికి సమర్పించగా.. ఐదోది సిద్ధంగా ఉంది”

· “ఐదు కోట్లకు పైగా వాక్యాల డేటాబేస్‌ గల ఏఐ ఆధారిత ‘కంఠస్థ్ 2.0’ సేవలు ఇప్పుడు విదేశీ వినియోగదారులకూ అందుబాటులో ఉన్నాయి”

· ఈ కార్యక్రమంలో భాగంగా ‘రాజ్‌భాష కీర్తి’… ‘రాజ్‌భాష గౌరవ్’ పురస్కారాలను ప్రదానం చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి”

· ‘శివ్ అనాది హై.. అనంత్‌ హై’.. ‘భారతీయ జ్ఞాన్ తంత్ర-స్రోత్ ఔర్ స్వరూప్’.. 'అంధేరోం సే ఉజాలోం తక్’.. వందేమాతరం ఇతివృత్తంగా ‘రాజ్‌భాష భారతి’.. ‘150 చాప్ట

నాడు పోస్టు చేయడమైనది: 14 SEP 2026 5:19PM by PIB Hyderabad

   ముంబయిలో నిర్వహించిన ‘హిందీ దివస్-2026’, ‘అఖిల భారత 6వ అధికార భాషా సదస్సు’లో ఈ రోజు  కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీమతి సునేత్ర పవార్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు శ్రీ నిత్యానంద రాయ్, శ్రీ బండి సంజయ్ కుమార్ సహా అధికార భాషా విభాగం కార్యదర్శి శ్రీమతి అన్షులీ ఆర్య, ఇతర ప్రముఖులు పలువురు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ- తొలుత ‘గణేశ చతుర్థి, హిందీ దివస్’ నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండూ ఒకే రోజున నిర్వహించుకోవడం ఒక అరుదైన, శుభప్రదమైన కలయిక (మణికాంచన యోగం) అని ఆయన అభివర్ణించారు. విఘ్నహరుడైన వినాయకుడు భారతీయ భాషల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తాడని, అందుకుగల అడ్డంకులన్నిటినీ తొలగిస్తాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకమాన్య బాల గంగాధర తిలక్‌ను స్మరిస్తూ- మహారాష్ట్రలో బహిరంగ గణేశ ఉత్సవ సంప్రదాయానికి 1893లో ఆయన శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. నాటి దేశ నాడిని తిలక్ మహారాజ్ సవ్యంగా అర్థం చేసుకున్నారని చెప్పారు. సంస్కృతి, చరిత్ర ద్వారా మాత్రమే దేశంలో చైతన్యం, సాంస్కృతిక జాతీయవాదాన్ని పెంపొందించగలమని ఆయన ప్రగాఢంగా విశ్వసించారని తెలిపారు. ఆ దిశగా గణేశ ఉత్సవం, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల నిర్వహణను ప్రారంభించారు. అటుపైన అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ఈ రెండు వేడుకలు నిర్వహణ మొదలైందని చెప్పారు. ఈ పండుగల ద్వారా తిలక్ మహారాజ్ ప్రజలలో అపార దేశభక్తి భావనను రగిలించగా, బ్రిటిష్ పాలకులలో ఆందోళన తీవ్రమైందని గుర్తుచేశారు. వివిధ సంప్రదాయాలకు, విశాల దృక్పథానికి మహారాష్ట్ర పుట్టినిల్లని శ్రీ అమిత్‌ షా అన్నారు. భక్తి ఉద్యమ కాలంలో ఈ రాష్ట్ర సాధువులు అనేకమంది రచించిన భజనలు దేశవ్యాప్తంగా ఆ ఉద్యమ వ్యాప్తికి దోహదం చేశాయని పేర్కొన్నారు. అలాగే, ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మభూమి అయిన మహారాష్ట్ర గడ్డపై ‘స్వరాజ్యం, స్వధర్మం, స్వభాష’ను స్వరాజ్యానికి మూలస్తంభాలుగా నిలిపారని తెలిపారు. పాలనలో మరాఠీ భాషకు ప్రాధాన్యం ద్వారా  తన మాతృభాషలో గొప్ప పరిభాషా సంపదను సృష్టించారని చెప్పారు. శివాజీ మహారాజ్ సహా హైందవీ స్వరాజ్య కాలంలో ఈ వ్యవస్థ పరిపాలనకు పునాదిగా నిలిచిందన్నారు.

హిందీ వర్డ్ ప్రాసెసింగ్, టైపింగ్, షార్ట్‌ హ్యాండ్‌లో శిక్షణ కార్యక్రమాలను నేటినుంచి ప్రారంభించామని శ్రీ అమిత్ షా ప్రకటించారు. ఈ సందర్భంగా ‘రాజ్‌భాష కీర్తి’, ‘రాజ్‌భాష గౌరవ్’ పురస్కారాలను విజేతలకు ప్రదానం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు. అటుపైన వివిధ ప్రత్యేక స్మారక సంచికలను కేంద్ర హోం మంత్రి ఆవిష్కరించారు. ఈ జాబితాలో- ‘శివ్ అనాది హై.. అనంత్ హై’.. ‘భారతీయ జ్ఞాన్ తంత్ర-స్రోత్ ఔర్ స్వరూప్’.. 'అంధేరోం సే ఉజాలోం తక్’.. వందేమాతరం ఇతివృత్తంగా ‘రాజ్‌భాష భారతి’.. ‘150 చాప్టర్స్ ఆఫ్ వందేమాతరం’ తదితరాలున్నాయి.

‘వందేమాతరం’ సాదాసీదా గీతం కాదని, దేశం వలస పాలనలో మగ్గుతున్న వేళ ప్రజానీకంలో చైతన్యం రగిల్చేందుకు బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ చేసిన గొప్ప కృషికి అది నిదర్శనమని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. తన కవిత్వంతో దేశంలో నిద్రాణంగా ఉండిపోయిన చైతన్యాన్ని తట్టిలేపడానికి ఆయన ప్రయత్నించారని విశదీకరించారు. ఆనాడు “ఆనంద్‌మఠ్‌” నవలలో ఆయన రాసిన ‘వందేమాతరం’ గీతం అతి త్వరలోనే దేశమంతటా స్వాతంత్ర్య సాధన నినాదంగా మారిందని చెప్పారు. తద్వరా స్వాతంత్ర్యంపై ప్రజల్లో ప్రగాఢ ఆశలు, ఆకాంక్షలకు బంకిమ్ చంద్ర రెక్కలు తొడిగారని తెలిపారు. అంతేకాకుండా భారత సాంస్కృతిక జాతీయవాదానికి పునాది కూడా వేశారని చెప్పారు. దురదృష్టవశాత్తూ అనంతరం కాలంలో ‘వందేమాతరం’ గీతాన్ని ముక్కలు చేశారని శ్రీ అమిత్‌ షా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా దానిని పూర్తి రూపంలో ఆమోదించడానికి పార్లమెంటుకు దాదాపు 80 ఏళ్లు పట్టిందని గుర్తుచేశారు. అధికార కార్యక్రమాలలో ఆ గేయాన్ని పూర్తిగా, సంపూర్ణ వైభవంతో పాడేవిధంగా చొరవ తీసుకున్న నాయకుడుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు.

అటువంటి ‘వందేమాతరం’ గీతం 150వ వార్షికోత్సవ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గడ్డపై నేటి ‘హిందీ దివస్’ కార్యక్రమ నిర్వహణ హర్షణీయమన్నారు. అధికార భాష, ఇతర భారతీయ భాషల భావిష్యత్‌ పురోగమనానికి ఇది ఎంతగానో తోడ్పడగలదని శ్రీ అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర బహుభాషా సంస్కృతికి నివాళి అర్పిస్తూ- ఇక్కడ మాతృభాష మరాఠీకిగల గౌరవం ఇలాగే కొనసాగాలని అభిలషించారు. మరాఠీకి ‘ప్రాచీన భాష’ హోదా కల్పించింది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీయేనని ఆయన గుర్తుచేశారు. ఈ రాష్ట్రంలో కొంకణి, గుజరాతీ, సింధీ, హిందీ, కన్నడ, వార్లీ సహా ఇతర భాషలు అభివృద్ధి చెందడమే కాగా గౌరవం, గుర్తింపు పొందాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలున్నరాష్ట్రం ఇదేనని చెప్పారు. పరిపాలనలో సార్వజనీన విధానాన్ని అమలు చేస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా “నేను హిందీ నేర్చుకోకపోయి ఉంటే- కాశ్మీర్, అస్సాం, కేరళంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ప్రజలకు భూదాన్, గ్రామదాన్ వంటి విప్లవాత్మక సందేశాలను చేరవేయడం సాధ్యమయ్యేది కాదు. మరొక భాషపై ఆధారపడితే నా లక్ష్యం అసలు నేరవేరేది కాదు. గ్రామగ్రామాన ప్రజలతో సంభాషించడంలో అధికార భాష హిందీయే నాకెంతో తోడ్పడింది” అని ఆచార్య వినోబా భావే వ్యాఖ్యానిండాన్ని శ్రీ అమిత్‌ షా ఉటంకించారు. దేశంలోని అన్ని భాషలతో అధికార భాషకు బలమైన అనుబంధం ఉందని, ఇవన్నీ శతాబ్దాలుగా దేశ ప్రజల దైనందిన సంభాషణలో భాగమై, పరస్పర సంబంధాలుకు దోహదం చేస్తున్నాయని చెప్పారు. గుజరాత్ రాష్ట్ర వాస్తవ్యుడైన తన భాష గుజరాతీ అయినా, హిందీ తెలిసినందు వల్ల జాతీయ స్థాయి బాధ్యతల నిర్వహణ తనకెంతో సులువైందని చెప్పారు. దేశవ్యాప్తంగా పని చేయడంలో అధికార భాష తనకో గొప్ప అవకాశాన్నిచ్చిందని పేర్కొన్నారు.

మహారాష్ట్రను వీర సావర్కర్ గడ్డగా శ్రీ అమిత్ షా అభివర్ణించారు. ఆ కాలంలో అత్యంత విద్వత్తు గల భాషావేత్తలలో ఆయనొకరని, భారతీయ భాషలలో అనేక పదాలను ఆయన సృష్టించారని తెలిపారు. ఈ పదాలన్నిటికీ మరాఠీ (అధికారక భాష) సహా ఇతర భారతీయ భాషలలో తక్షణ ఆమోదం లభించిందని చెప్పారు. తిలక్ రచనలలోని భావాలను స్వీకరిస్తూ మరాఠీ భాషను మరింత పరిపుష్టం చేయడానికీ ఆయన కృషి చేశారన్నారు. సావర్కర్ సవరించిన, సృష్టించిన పదాలన్నింటినీ “హిందీ శబ్ద సింధు” ఆన్‌లైన్ నిఘంటువులో చేర్చడం ద్వారా అధికార భాషా విభాగం ఆయనను సముచితంగా గౌరవించిందని తెలిపారు. ఈ క్రమంలో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగ నిర్మాతలు హిందీని అధికార భాషగా స్వీకరించాలని ఆలోచనాత్మకంగా నిర్ణయించారని పేర్కొన్నారు. ఇక ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికార భాషా విభాగం అనేక విజయాలను సాధించిందని చెప్పారు. మరోవైపు జాతీయ విద్యా విధానం ద్వారా అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటి అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు. మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ప్రధానమంత్రి మోదీ తప్పనిసరి చేశారని పేర్కొన్నారు. మాతృభాషను నేర్వని బాలలు పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగలేరని చెప్పారు. తల్లి అనురాగాన్ని లేదా సోదరీసోదరుల ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోవడం మాతృభాషలోనే సాధ్యమన్నారు. అలాగే, తమ ప్రాంతం సహా భాష, విశ్వాసం, సంప్రదాయాలు, సంస్కృతి, విలువలతో అనుబంధం ఏర్పడుతుందని చెప్పారు. ఆలోచన ప్రక్రియ మాతృభాషలోనే మొదలవుతుందని తెలిపారు. విశ్లేషణ, నిర్ణయాత్మక ప్రక్రియలు మరింత మెరుగ్గా ఉంటాయన్నారు. మాతృభాషతోపాటు ఏదైనా మరొక భారతీయ భాష నేర్చుకోవడాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ తప్పనిసరి చేశారని చెప్పారు. భారతీయ భాషలు నేర్చుకోవడాన్ని వ్యతిరేకించడం ద్వారా తామెంత పెద్ద తప్పు చేస్తున్నారో కొందరు గ్రహించడం లేదని విమర్శించారు. బాలలు భారతీయ భాషలను నేర్చుకోవాలి… రెండో భాషను నేర్చుకోవడమంటే- స్వయంచాలకంగా “ఒకే భారత్-శ్రేష్ఠ భారత్” లక్ష్యంతో మమేకం కావడమేనని చెప్పారు. ఆ మేరకు భారతీయ అస్తిత్వంతో పిల్లలు అనుసంధానితమై, సంకుచిత ధోరణుల నుంచి విముక్తులై దేశంపై అంకితభావం గల నిజమైన పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. దేశంలో ప్రతి భాషనూ సుసంపన్నం చేయడంపై ప్రభుత్వం లక్ష్యనిర్దేశం చేసుకున్నదని ఆయన అన్నారు.

‘అఖిల భారత అధికార భాషా సదస్సు’ను దేశ రాజధాని ఢిల్లీకి పరిమితం చేయకుండా, వివిధ రాష్ట్రాల్లో వంతులవారీగా నిర్వహించాలని 2019లో నిర్ణయించినట్లు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇది ఆరోది కాగా, ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో 2019 నుంచి అధికార భాషా సంఘం నాలుగు సంపుటాల నివేదికలను గౌరవనీయ రాష్ట్రపతికి సమర్పించిందని శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు. మొత్తం మీద 13 సంపుటాలు వెలువడగా, వాటిలో 4 మోదీ హయాంలోనే రూపొందినవని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ప్రతి అంతర్జాతీయ వేదిక లేదా విదేశాల్లో ప్రసంగించినా సదా అధికార భాష లేదా భారతీయ భాషల్లోనే మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. కీలక అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రధాని విదేశీ భాషకు బదులుగా సొంత భాషలో మాట్లాడటం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. అనేక దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లోనూ హిందీ బోధనను ప్రధానమంత్రి మోదీ ప్రోత్సహించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులకు హిందీ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కృత్రిమ మేధ ఆధారిత ‘కంఠస్థ్ 2.0’ వేదిక ఇప్పుడు విదేశీయులకూ అందుబాటులోకి వచ్చిందని, ఇందులో 5 కోట్లకు పైగా వాక్యాలున్నాయని చెప్పారు.

కృత్రిమ మేధ ద్వారా భారతీయ భాషలను నేర్చుకునేందుకు ఉద్దేశించిన ‘లీలా రాజభాష’, ‘లీలా ప్రవాహ్’ కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయని శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ నేపథ్యంలో 51,000 పదాలతో ప్రారంభమైన “హిందీ శబ్ద సింధు” నిఘంటువు నేడు 8,00,000 పదాలకు విస్తరించిందని చెప్పారు. స్థానిక భాషల నుంచి 50,000కు పైగా పదాలను ఇందులో చేర్చడం ద్వారా హిందీ భాష మరింత సరళం.. సార్వజనీనంగా మారిందని ఆయన అన్నారు. ఈ నిఘంటువు 2029కల్లా ప్రపంచంలోనే అతిపెద్దదిగా  మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. హిందీలో ఏదైనా భావనకు తగిన పదం లేనప్పుడు లేదా లోటున్నప్పుడు అధికార భాషను మరింత సరళంగా మార్చడం కోసం ఇతర భాషల నుంచి పదాలను స్వీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా భాషల నుంచి 50,000కు పైగా పదాలు నిఘంటువులో చేరాయని చెప్పారు. ఈ నేపథ్యంలో “భారతి-బహుభాషా అనువాద సారథి”ని అధికార భాషా విభాగం రూపొందించిందని, “భారతీయ భాషల విభాగం” కూడా  ప్రారంభమైందని తెలిపారు. పరిపాలన, విజ్ఞానశాస్త్ర రంగాల్లో భారతీయ భాషల వినియోగం, సాహిత్యాన్ని సుసంపన్నం చేయడం, విస్తృతమైన సామూహిక భాషా వనరును సృష్టించేలా వివిధ భారతీయ భాషల మధ్య అనుసంధానం పెంపు తదితరాలు తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో జేఈఈ, నీట్‌ లేదా అండర్ గ్రాడ్యుయేట్ సహా ప్రవేశ పరీక్షలన్నిటినీ ఇప్పుడు 13 భాషలలో నిర్వహిస్తున్నారని తెలిపారు.

భాషల మధ్య వివాదాల సృష్టికి ప్రయత్నించే వారికి తానొక వాస్తవం వివరించాలని భావిస్తున్నట్లు శ్రీ అమిత్ షా చెప్పారు. బాలలు దేశాన్ని వాస్తవంగా అర్థం చేసుకోగలిగేది మాతృభాష ద్వారా మాత్రమేనని చెప్పారు. ఒకవేళ విదేశీ భాష ద్వారా ఆ ప్రయత్నం చేస్తే పొరపడే అవకాశాలు ఉంటాయన్నారు. కాబట్టి, రాజకీయ విభేదాలకు అతీతంగా భారతీయ భాషలను ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎర్రకోట పైనుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు “పంచ ప్రాణ్” (ఐదు ప్రతిజ్ఞలు) పేరిట పిలుపునిచ్చారని గుర్తుచేశారు. భారత్‌ ప్రజానీకాన్ని బానిస మనస్తత్వం నుంచి విముక్తం చేయాలన్నది కూడా ఆయన సంకల్పాల్లో ఒకటని ఆయన చెప్పారు.

భాషల విషయంలో గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్‌ను మించిన మహనీయులు మరొకరు లేరని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఈ మేరకు ఆయనను ఉటంకిస్తూ-  “భారతీయ సంస్కృతి, సాహిత్యం సంపూర్ణంగా వికసించిన వంద రేకుల తామర పువ్వు వంటివి, వీటిలో ప్రతి ఒక్కటీ మన ప్రాంతీయ భాషలకు ప్రతీక. అందులో ఒక్కటి నశించినా తామర అందం దెబ్బతింటుంది. కాబట్టి, ప్రాంతీయ భాషలు తమతమ రాష్ట్రాల్లో వైభవంగా రాజిల్లాలి.. అదే సమయంలో హిందీ భాష ఆ పుష్పం మధ్యన రత్నంలా మెరుస్తూ తామర అందాన్ని మరింత ఇనుమడింపజేయాలి” అని ఠాగూర్ వ్యాఖ్యానించినట్లు గుర్తుచేశారు. భారత భాషలు వేర్వేరు స్వరాలు కావచ్చు.. కానీ, ఆలపించే దేశభక్తి గీతం ఒక్కటే.. మన సంస్కృతి గీతం కూడా ఒక్కటేనని ఆయన అన్నారు. అనేక భాషలు ఉండటంలో ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ, భావన మాత్రం భారతీయుడిగానే ఉండాలి. మాండలికాలు అనేకం ఉండవచ్చుగానీ, భారత్‌ గళం ఒక్కటిగా నినదించాలి.

 

***


(రిలీజ్ ఐడి: 2310244) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam