మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘రాష్ట్రీయ పోషణ్ మాస్-2026’ను ప్రారంభించిన మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ

ఆహార వైవిధ్యం, తగినంత ప్రొటీన్, తాజాగా వండిన వేడి భోజనంపై దేశవ్యాప్త ప్రచారం

శక్తిమంతమైన సామాజిక సంస్థలుగా మారిన అంగన్వాడీ కేంద్రాలు: సీఎం యోగి ఆదిత్యనాథ్

14 లక్షలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 7.5 కోట్లకు పైగా పిల్లలు, 1.10 కోట్ల మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పోషకాహారం, ఆరోగ్యం, బాల్య సంరక్షణ సేవలు: శ్రీమతి అన్నపూర్ణా దేవి

సుపోషిత భారత్, వికసిత భారత్@2047 సాధనలో భాగంగా పోషకాహారాన్ని నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రజలకు పిలుపునిచ్చిన శ్రీమతి అన్నపూర్ణా దేవి

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 4:44PM by PIB Hyderabad

వారణాసిలోని రుద్రాక్ష అంతర్జాతీయ సహకార, సమావేశ కేంద్రం (ఆర్ఐసీసీసీ)లో 9వ ‘రాష్ట్రీయ పోషణ్ మాస్ - 2026’ను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఈ రోజు ప్రారంభించింది. ‘హమారీ అంగన్‌వాడీ, హమారీ జిమ్మదారీ’ అన్న ప్రధాన ఇతివృత్తంతో.. పోషణపై నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సాగే ప్రజా ఉద్యమంగా ఇది మొదలైంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి, సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ, పోషకాహార శాఖ మంత్రి శ్రీమతి బేబీరాణి మౌర్య ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వీరితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, భాగస్వామ్య అభివృద్ధి సంస్థల ప్రతినిధులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పోషణ్ అభియాన్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో, క్షేత్రస్థాయి పోషకాహార సేవలను బలోపేతం చేయడంలో అంగన్‌వాడీ కేంద్రాలు పోషిస్తున్న మార్గదర్శక పాత్రను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ తన ప్రత్యేక ప్రసంగంలో వివరించారు. వివిధ శాఖల మధ్య నిరంతర సమన్వయం, ప్రజల క్రియాశీల భాగస్వామ్యం, క్షేత్రస్థాయి కార్యకర్తల అంకితభావమే ‘పౌష్టికాహార లోప రహిత భారత్‌’ సాధనకు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. గడిచిన కొన్నేళ్లలో సాధించిన గణనీయమైన పురోగతిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆహ్లాదకరమైన అభ్యాస వాతావరణాన్ని కల్పిస్తూ.. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభావవంతమైన సామాజిక సంస్థలుగా నవీకరించినట్టు సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్‌ఫోన్లను అందించడం ద్వారా.. డిజిటల్ పర్యవేక్షణతో ఎప్పటికప్పుడు డేటాను నమోదు చేయడం, మెరుగైన సేవలందించడం సాధ్యమవుతోందన్నారు. అదనపు పోషకాహార సేవల బలోపేతాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా వేడివేడి పౌష్టికాహారాన్ని, రేషన్‌ సరుకులను అందిస్తున్నామని శ్రీ యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. పోషకాహారంపై చేసే పెట్టుబడి ఎన్నడూ వృథా కాదన్నారు. ఆరోగ్యకరమైన పిల్లలు, సాధికారత కలిగిన కుటుంబాలు, బలమైన దేశం రూపంలో అది జీవితకాల ప్రయోజనాన్ని అందిస్తుందని వ్యాఖ్యానించారు.

కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి కీలకోపన్యాసం చేశారు. మిషన్ సక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 ద్వారా పోషకాహార ఫలితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె పునరుద్ఘాటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 7.5 కోట్లకు పైగా పిల్లలు, 1.10 కోట్ల మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు, దాదాపు 16 లక్షల మంది కిషోర బాలికలకు పోషకాహారం, ఆరోగ్య, ప్రారంభ బాల్య సంరక్షణ సేవలు అందుతున్నాయని ఆమె తెలిపారు. జీవితంలో మొదటి 1,000 రోజుల ప్రాధాన్యాన్ని ఆమె వివరించారు. దేశవ్యాప్తంగా 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను ‘సక్షం అంగన్‌వాడీలు’గా ఆధునికీకరిస్తున్నామని, వీటిలో ఉత్తరప్రదేశ్‌లోనే దాదాపు 24,000 కేంద్రాలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి మాతృ వందన యోజన’ పథకానికి విజయవంతంగా పదేళ్లు పూర్తయ్యాయని గుర్తుచేస్తూ.. ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ (డీబీటీ) ద్వారా దేశవ్యాప్తంగా 4.65 కోట్లకు పైగా తల్లుల ఖాతాల్లో రూ. 21,000 కోట్లకు పైగా జమ చేసినట్లు వివరించారు. ఆహార వైవిధ్యం, తగినంత ప్రొటీన్ తీసుకోవడం, వేడివేడి తాజా పౌష్టికాహారం, పారిశుద్ధ్యం, ప్రారంభ బాల్య వికాసంలో సామాజిక భాగస్వామ్యం అత్యంత కీలకమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సుపోషిత భారత్, వికసిత్ భారత్@2047 లక్ష్యాల సాధనలో పోషకాహార చైతన్యాన్ని నిజమైన ప్రజా ఉద్యమంగా మలచాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.

వేడుకల్లో ప్రదర్శించిన లఘు చిత్రాల్లో చోటు దక్కిన ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి ఈ సందర్భంగా సంభాషించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాజా పౌష్టికాహారం, రేషన్ సరుకులు, గృహ సందర్శనలు, పూర్వ బాల్య సంరక్షణ - విద్య (ఈసీసీఈ) అంశాలపై లబ్ధిదారుల అనుభవాలతో ప్రత్యేకంగా వీడియోలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ ప్రసంగిస్తూ... పోషకాహార ఉద్యమంలో సమాజం, పంచాయతీ రాజ్ సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, కుటుంబాలు క్రియాశీలంగా పాల్గొనాలని, క్షేత్రస్థాయిలో పోషకాహార, శిశు సంరక్షణ సేవలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

స్వాగతోపన్యాసం చేసిన కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్ మాట్లాడుతూ.. ‘పోషణ్ అభియాన్’ ప్రభుత్వ కార్యక్రమం స్థాయి నుంచి దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారిందని, తదుపరి దశలో సామాజిక భాగస్వామ్యాన్ని, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవస్థాగత, సాంకేతిక బలాన్ని... ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలోనూ నాణ్యమైన సేవలుగా మలచాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు.

అధికారిక ప్రారంభోత్సవానికి ముందు.. సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘పోషణ్ మేళా’ను వారు సందర్శించారు. పోషకాహారానికి సంబంధించిన వినూత్న ఆవిష్కరణలు, స్థానిక పౌష్టికాహారం, అంగన్‌వాడీ కేంద్రాల అత్యుత్తమ పనితీరుకు సంబంధించిన ప్రదర్శనలను వీక్షించారు.

ఈ సందర్భంగా పోషణ్ మాస్-2026పై రూపొందించిన ఒక ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన అనంతరం.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి ఈ దేశవ్యాప్త కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’కు పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. దేశవ్యాప్తంగా తల్లుల ఆరోగ్యం, పోషకాహార ఫలితాలను మెరుగుపరచడంలో ఈ పథకం పాత్రను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.

2018లో పోషణ్ అభియాన్ ప్రారంభమైనప్పటి నుంచి.. పోషణ్ మాస్, పోషణ్ పఖ్వాడా, ఇతర సామాజిక కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా 150 కోట్లకు పైగా ప్రజా చైతన్య కార్యకలాపాలను నిర్వహించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 8 వరకు నెల రోజుల పాటు రాష్ట్రీయ పోషణ్ మాస్ – 2026ను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. కింద పేర్కొన్న ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు:

·         ఆహార వైవిధ్యం, తగినంత ప్రొటీన్ లభించేలా చూడటం.

·         అంగన్‌వాడీ కేంద్రాల్లో వేడివేడి తాజా పౌష్టికాహారం

·         అంగన్‌వాడీ నిర్వహణ కమిటీలు, ఎస్ఎన్‌పీ మెన్యూ బోర్డుల ద్వారా సామాజిక భాగస్వామ్యం

·         బాల్య వికాసం కోసం పోషకాహారం, ప్రారంభ ప్రోత్సాహం

·         పదేళ్ల ప్రధానమంత్రి మాతృ వందన యోజన

అంగన్‌వాడీ కేంద్రాలతో సామాజిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడం.. మెరుగైన పోషకాహారం, మాతృ ఆరోగ్యం, బాల్య వికాసం దిశగా సమష్టి కార్యాచరణను ప్రోత్సహించడం.. తద్వారా సుపోషిత భారత్ ఆశయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నెలరోజుల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2308563) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Gujarati , Kannada