ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల పరిధిలో 3 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం.. దాదాపు మరో 656 కి.మీ విస్తరించనున్న భారతీయ రైల్వే నెట్‌వర్క్
ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 10,783 కోట్లు
2029-30 నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 3:25PM by PIB Hyderabad
రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన రూ. 10,783 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాజెక్టులు:
-
ఖరగ్‌పూర్ - ఝార్సుగూడ (బాగ్దేహి) నాలుగో లైన్
-
కాట్ని - పెండ్రా రోడ్ నాలుగో లైన్
-
బిలాస్‌పూర్ (ఉస్లాపూర్) - పెండ్రా రోడ్ మూడో లైన్
రైల్వే లైన్ల సామర్థ్యం పెరగడం వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. దాంతో భారతీయ రైల్వేల సామర్థ్యం, సేవల విశ్వసనీయత గణనీయంగా పెరుగుతాయి. ఈ మల్టీట్రాకింగ్ ప్రతిపాదనలు.. కార్యకలాపాలను సులభతరం చేయడమే కాకుండా, రైళ్ల రద్దీని తగ్గించడానికి తోడ్పడతాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘నవభారత్’ సంకల్పానికి అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టులు.. ఈ ప్రాంతంలో సమగ్ర వికాసాన్ని సాధించి, ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా స్థానికులను ‘ఆత్మనిర్భరత’ దిశగా నడిపిస్తాయి.
సమీకృత ప్రణాళిక, భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపుల ద్వారా మల్టీ మోడల్ అనుసంధానాన్నీ, వస్తు రవాణా సామర్థ్యాన్నీ పెంపొందించే లక్ష్యంతో.. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళిక ఆధారంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ప్రజల రాకపోకలకు, సరుకులు, సేవల రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, నిరంతర అనుసంధాన సదుపాయాన్ని ఈ ప్రాజెక్టులు అందిస్తాయి.
పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన 14 జిల్లాల పరిధిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు.. భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రస్తుత సామర్థ్యాన్ని 656 కి.మీ మేర విస్తరించనున్నాయి. ఈ ప్రతిపాదిత మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుల ద్వారా.. దాదాపు 56 లక్షల జనాభా ఉన్న 4,790 గ్రామాలకు రవాణా సదుపాయం మెరుగుపడనుంది.
తారాతారిణి ఆలయం, శ్రీ ఖేత్రా జగన్నాథాలయం (ఝార్సుగూడ సమీపంలోని పురాతన ఆలయం), బాంధవ్‌గఢ్ పులుల సంరక్షణ కేంద్రం, విరాటేశ్వరాలయం, అమర కంటక్ ఆలయం, జ్వాలేశ్వర్ ధామ్, అచనక్మార్ పులుల సంరక్షణ కేంద్రం, ఖుతాఘాట్ డ్యామ్, మల్హర్ పురావస్తు ప్రదేశం, రతన్‌పూర్ మహామాయ ఆలయం సహా.. దేశవ్యాప్తంగా ప్రముఖ పర్యాటక గమ్యస్థానాలకు రైల్వే ప్రయాణాన్ని ఈ ప్రతిపాదిత అభివృద్ధి కార్యక్రమాలు మరింత మెరుగుపరుస్తాయి.
బొగ్గు, సిమెంటు, ఇనుము, ఉక్కు వంటి ముఖ్యమైన ఉత్పత్తుల రవాణాకు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులు అత్యంత కీలకమైన మార్గాలు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పెంచేలా రూపొందించిన ఈ ప్రాజెక్టుల వల్ల.. ఏటా అదనంగా 27 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సరుకుల రవాణా సాధ్యమవుతుంది. రైల్వే రవాణా వ్యవస్థ పర్యావరణ అనుకూలమైనదీ, తక్కువ ఇంధన వినియోగం కలిగినదీ కావడంతో.. ఇది దేశ వాతావరణ లక్ష్యాలను సాధించడంలోనూ, వస్తు రవాణా వ్యయాన్ని తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. అంతేకాకుండా దాదాపు 12 కోట్ల లీటర్ల మేర ముడిచమురు దిగుమతులను తగ్గించడంతోపాటు.. దాదాపు 62 కోట్ల కేజీల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇది 2.48 కోట్ల మొక్కలను నాటడంతో సమానం.
***
(రిలీజ్ ఐడి: 2308318)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam