వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అందుబాటులో సరిపడా ఉల్లి నిల్వలు


సీజనల్ ధరల ఒత్తిళ్ల నియంత్రణ లక్ష్యంగా అవసరానికి అనుగుణంగా, నియంత్రిత విధానంలో బఫర్ నిల్వలు విడుదల చేస్తోన్న ప్రభుత్వం

ఉల్లిపాయలతో నాసిక్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన మొదటి కందా ఎక్స్‌ప్రెస్

రైల్వే ర్యాకులు, రోడ్డు రవాణా ద్వారా హైబ్రిడ్ రవాణా విధానంలో ప్రధాన వినియోగ కేంద్రాలకు సరఫరా

ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఇతర రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా కిలో రూ.35 చొప్పున ఉల్లి విక్రయాలు

నాడు పోస్టు చేయడమైనది: 26 AUG 2026 8:49PM by PIB Hyderabad

రాబోయే నెలల్లో తగినంత లభ్యతను నిర్ధారించడం, సీజనల్ ధరల ఒత్తిళ్లను నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయలను అవసరాలకు అనుగుణంగా, అత్యంత నియంత్రిత విధానంలో విడుదల చేయడం ప్రారంభించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ధరల పోకడల ఆధారంగా... రైల్వే ర్యాక్‌లు, రోడ్డు రవాణాతో కూడిన హైబ్రిడ్ రవాణా నమూనా ద్వారా ప్రధాన వినియోగ కేంద్రాలకు ఉల్లిపాయలు సరఫరా చేస్తోంది.

అందుబాటులో సరిపడా ఉల్లి నిల్వలు, పటిష్ఠంగా ఉత్పత్తి  

2025-26లో ఉల్లిపాయల ఉత్పత్తి అంచనా 307.37 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది గత ఏడాది ఉత్పత్తి 307.67 లక్షల మెట్రిక్ టన్నులకు ఇది దాదాపు సమానం. దీనివల్ల రాబోయే నెలల్లో దేశీయ అవసరాలకు సరిపడా ఉల్లిపాయల లభ్యత ఉంటుందని భావిస్తున్నారు. మెరుగైన ఉత్పత్తి, బఫర్ స్టాక్‌ల లభ్యత, మార్కెట్‌లో ముందస్తు చర్యల కారణంగా... రాబోయే నెలల్లో తగినంత సరఫరా ఉంటుందనీ, సీజనల్ ధరల ఒత్తిడి నియంత్రణలో ఉంటుందనీ అంచనా. ఉత్పత్తికి సంబంధించిన ఈ సానుకూల పరిస్థితుల దృష్ట్యా... 2026-27 సంవత్సరానికి గానూ 'ధరల స్థిరీకరణ నిధి' బఫర్ కోసం రబీ సీజన్ ద్వారా 2.00 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను సేకరించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ సేకరణ ప్రక్రియ నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ ద్వారా 2026 మే 15న ప్రారంభమైంది. ఇప్పటివరకు బఫర్ కోసం సుమారు 1.21 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు సేకరించారు.

నిల్వల నిర్వహణను, కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా 2026-27 సంవత్సరానికి గానూ పీఎస్ఎఫ్ ఉల్లిపాయల బఫర్ నిల్వల ఏజెన్సీగా సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ)ని మొదటిసారిగా నియమించారు. ఓనం, గణేశ చతుర్థి, దుర్గా పూజ, దసరా, దీపావళి వంటి పండగలతో పాటు వివాహాల సీజన్ కావడంతో... అధిక డిమాండ్, సరఫరా వ్యవస్థ సంబంధిత అంశాల కారణంగా ఉల్లి ధరలు సాధారణంగా ఈ సమయంలో పెరుగుతుంటాయి.

అవసరానికి అనుగుణంగా, అత్యంత నియంత్రిత విధానంలో బఫర్ ఉల్లి నిల్వల విడుదల

తగినంత లభ్యతను నిర్ధారించడం, ధరల హెచ్చుతగ్గులను నివారించడం లక్ష్యంగా ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి అవసరానికి అనుగుణంగా, అత్యంత నియంత్రిత విధానంలో ఉల్లి నిల్వలను విడుదల చేయడం ప్రారంభించింది. ప్రధాన వినియోగ కేంద్రాలకు ఉల్లిపాయల రవాణాను సులభతరం చేస్తూ... రైల్వే ర్యాక్‌లు, రోడ్డు రవాణాతో కూడిన హైబ్రిడ్ రవాణా నమూనా ద్వారా ఈ సరఫరా కొనసాగుతోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ధరల పోకడల ఆధారంగా ఉల్లిపాయల విడుదల పరిమాణం, పరిధి, మార్గాలను మరింత విస్తృతం చేయనున్నారు.

కిలో రూ.35 చొప్పున ఉల్లిపాయల విక్రయం

మొబైల్ వ్యాన్‌ల ద్వారా... ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా... సఫల్, కేంద్రీయ భండార్ అవుట్‌లెట్‌ల ద్వారా కిలో ఉల్లిపాయలు రూ.35 చొప్పున విక్రయించడం ప్రారంభించనున్నారు. కింది మార్గాల ద్వారా ఈ అమ్మకాలు జరుగుతాయి:

  • ఎన్‌సీసీఎఫ్: 9 అవుట్‌లెట్‌లు, 40 మొబైల్ వ్యాన్లు

  • నాఫెడ్: 13 అవుట్‌లెట్‌లు, 50 మొబైల్ వ్యాన్లు

  • కేంద్రీయ భండార్: సుమారు 100 అవుట్‌లెట్‌లు

వినియోగదారులకు సరసమైన ధరకే ఉల్లిపాయలు అందుబాటులో ఉంచడం దీని లక్ష్యం.

బఫర్ ఉల్లిపాయల సరఫరాను బలోపేతం చేస్తున్న కందా ఎక్స్‌ప్రెస్

ఉత్పత్తి ప్రాంతాల నుంచి వినియోగ కేంద్రాలకు బఫర్ ఉల్లిపాయలను తరలించడానికి 'కందా ఎక్స్‌ప్రెస్' కార్యక్రమం ఒక సమర్థమైన రవాణా మార్గంగా ఆవిర్భవించింది. 2024-25 సంవత్సరంలో, దాదాపు 12,000 మెట్రిక్ టన్నుల బఫర్ ఉల్లి నిల్వలను 14 రైల్వే ర్యాకుల ద్వారా ఐదు నగరాలకు రవాణా చేశారు. 2025-26 సంవత్సరంలో ఈ కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తూ, దేశవ్యాప్తంగా 16 నగరాలకు 86 రైల్వే ర్యాకుల ద్వారా సుమారు 88,000 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రవాణా చేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, నాసిక్ నుంచి న్యూఢిల్లీకి కందా ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉల్లిపాయల రవాణా ప్రారంభమైంది. మొదటి కందా ఎక్స్‌ప్రెస్ నాసిక్ నుంచి ఇప్పటికే బయలుదేరింది. ఇది త్వరలోనే ఢిల్లీ ఎన్‌సీఆర్‌కు చేరుకోనుంది. చెన్నై, కోల్‌కతా, ఎర్నాకులం, గౌహతి, వారణాసి, లక్నో, పాట్నా, చండీగఢ్, జమ్మూ, అమృత్‌సర్ వంటి ఇతర ప్రధాన వినియోగ కేంద్రాలకు రోడ్డు రవాణా ద్వారా సరఫరా కొనసాగుతోంది. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినియోగ కేంద్రాలకు బఫర్ ఉల్లిపాయలను సకాలంలో తరలించడానికి ఈ హైబ్రిడ్ రవాణా నమూనా వీలు కల్పిస్తుంది.

సమర్థంగా కొనసాగుతున్న ఉల్లి ఎగుమతులు

ఉల్లిపాయల ఎగుమతులు సమర్థంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్-జూన్ 2026 కాలంలో, సుమారుగా 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులు నమోదయ్యాయి. మలేషియా, శ్రీలంక, యూఏఈ, నేపాల్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు ఎగుమతులు జరిగాయి. ఇది దేశీయంగా ఉల్లి లభ్యత సౌకర్యవంతంగా ఉందని స్పష్టం చేస్తోంది.

579 కేంద్రాల్లో రోజువారీ పర్యవేక్షణ

వినియోగదారుల వ్యవహారాల శాఖ దేశవ్యాప్తంగా 579 కేంద్రాల్లో ఉల్లిపాయలు సహా 41 నిత్యావసర సరుకుల రోజువారీ ధరలను పర్యవేక్షిస్తోంది. డిమాండ్-సరఫరాలతో పాటు ఈ మార్కెట్ పోకడలు... విడుదల చేయాల్సిన బఫర్ స్టాక్ పరిమాణం, గమ్యస్థానాలపై నిర్ణయాలకు కీలక సమాచారంగా ఉపయోగపడతాయి. ప్రభుత్వం రాష్ట్రాలవ్యాప్తంగా ఉల్లి ధరలు, సరుకుల సరఫరా-లభ్యతను నిశితంగా పర్యవేక్షిస్తోంది. తగినంత సరఫరాను నిర్ధారించడానికి, అనవసరమైన ధరల పెరుగుదలను నివారించడానికి అవసరమైన చోట మరిన్ని చర్యలు చేపడుతోంది.

స్థిరంగా, పరిమిత స్థాయిలో కొనసాగుతున్న కీలక నిత్యావసర సరుకుల ధరలు

కందులు, శనగ, మసూర్, మినుములు, పెసలు వంటి కీలక పప్పుధాన్యాలతో పాటు టమాటా, బంగాళదుంప వంటి నిత్యావసర కూరగాయల ధరలు ప్రస్తుతం స్థిరంగా, పరిమిత పరిధిలో కొనసాగుతున్నాయి.

26.08.2026 నాటికి అఖిల భారత సగటు చిల్లర ధరలు కింది విధంగా ఉన్నాయి:

సరుకులు

అఖిల భారత సగటు చిల్లర ధర

టమాట

₹38.33/kg

బంగాళాదుంప

₹22.63/kg

శనగ పప్పు

₹86.71/kg

గోధుమ పిండి

₹40.48/kg

కంది పప్పు

₹123.30/kg

పాలు

₹60.82/litre

ఉల్లిపాయలు

₹37.87/kg

 

గమనించదగ్గ విషయం ఏమిటంటే... టమాటా, బంగాళాదుంప, శనగ పప్పు ధరలు ఏడాది కిందటి కంటే తక్కువగా ఉన్నాయి.

వినియోగదారుల ప్రయోజనాల పరరక్షణ లక్ష్యంగా నిరంతర పర్యవేక్షణ

సమతుల్యమైన, రుజువు-ఆధారిత ధరల స్థిరీకరణ విధానం ద్వారా రైతులకు లాభదాయకమైన రాబడిని అందిస్తూనే, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉల్లి ధరలు, సరఫరా, లభ్యత, డిమాండ్ పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోంది. తగినంత సరఫరాను నిర్ధారించడం, సీజనల్ ధరల ఒత్తిళ్లను నియంత్రించడం కోసం ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా బఫర్ స్టాక్ విడుదలల పరిమాణం, పరిధి, మార్గాలను సర్దుబాటు చేస్తున్నారు.

****


(రిలీజ్ ఐడి: 2303662) సందర్శకుల సూచీ సంఖ్య : : 46
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Odia , Kannada , Malayalam