వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వేగాన్ని పుంజుకుంటున్న భారత్-జపాన్ పెట్టుబడుల భాగస్వామ్యం... జపాన్ నుంచి మరిన్ని సంస్థాగత పెట్టుబడులను ఆహ్వానించిన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
భారత పటిష్ఠమైన పురోగతి అంశాలు, సెమీకండక్టర్లు, ఏఐ, స్వచ్ఛ ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లోని అవకాశాలను ప్రస్తావించిన శ్రీ పీయూష్ గోయల్
భారత్‌పై విశ్వాసాన్ని వ్యక్తం చేసిన జపాన్ ఆర్థిక సంస్థలు... పెట్టుబడి విధానాలు, లాభాలను స్వదేశానికి తరలించటంలో మరింత సౌలభ్యాన్ని కోరుకున్న కంపెనీలు
నాడు పోస్టు చేయడమైనది:
25 AUG 2026 10:44AM by PIB Hyderabad
దీర్ఘకాలిక పెట్టుబడులను బలోపేతం చేయటం, పెట్టుబడి భాగస్వామ్యాన్ని పెంపొందించటం, భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ భాగస్వామ్య విస్తరణపై ఆ దేశంలోని ప్రముఖ ఆర్థిక, పెట్టుబడి సంస్థల సీనియర్ నేతలతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ టోక్యోలో చర్చలు జరిపారు.
ఎంయూఎఫ్‌జీ, డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ జపాన్ (డీబీజే), మిజుహో, మోర్గాన్ స్టాన్లీ, నోమురా, నిప్పన్ లైఫ్ సంస్థల సీనియర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారతదేశ ఆర్థిక దృక్పథం, నూతన పెట్టుబడి అవకాశాలు, భారత్‌లో జపాన్ సంస్థాగత పెట్టుబడులను మరింత సులభతరం చేసే చర్యలపై ఈ చర్చలు దృష్టి సారించాయి.
భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, స్థిరత్వాన్ని శ్రీ పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచ అనిశ్చితుల మధ్య గతేడాది భారత్ 7.7 శాతం వృద్ధి రేటును సాధించిందని, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు కృషి చేస్తోందని తెలిపారు. బలమైన భారత బ్యాంకింగ్ రంగం, పటిష్ఠమైన పెట్టుబడుల సామర్థ్యం, తగ్గిన మొండి బకాయిలు, పెరుగుతున్న మధ్యతరగతి వర్గం, పెరుగుతున్న వ్యక్తిగత ఆదాయాలు, నిలకడైన ఆర్థిక వృద్ధికి కీలక శక్తి అని తెలిపారు.
సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, అధునాతన తయారీ, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లోని గణనీయమైన అవకాశాలను జపాన్ పెట్టుబడిదారులకు మంత్రి వివరించారు. ఇంధన వినియోగం ఎక్కువగా ఉండే డిజిటల్ పరిశ్రమల అభివృద్ధికి భారతదేశంలో పెరుగుతున్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, జాతీయ విద్యుత్ గ్రిడ్ కీలక ఆధారంగా నిలుస్తున్నాయని... తయారీ, సాంకేతిక రంగాల్లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ నూతన అవకాశాలను సృష్టిస్తోందని తెలిపారు.
భారత్-జపాన్ సంబంధాల వ్యూహాత్మక, సమగ్ర స్వభావాన్ని తెలియజేస్తూ... తయారీ, సాంకేతికత, పెట్టుబడి రంగాల్లో ప్రపంచ కేంద్రంగా మారే ప్రయాణంలో జపాన్‌ను విశ్వసనీయ భాగస్వామిగా భారత్ భావిస్తోందని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ, అత్యుత్తమ ప్రతిభావంతులను కలిగి ఉండటం, విధానపరమైన సంస్కరణలు, మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించేందుకు భారత్ కట్టుబడి ఉందని వెల్లడించారు.
భారత్‌తో పెరుగుతున్న భాగస్వామ్యాన్ని పంచుకుంటూ... దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై జపాన్ ఆర్థిక సంస్థలు బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి. శ్రీరామ్ ఫైనాన్స్‌లో సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడితో పాటు పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నట్లు ఎంయూఎఫ్‌జీ పేర్కొంది. భారత వ్యూహాత్మకత, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, వెంచర్ క్యాపిటల్, ఇతర దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలపై పెరుగుతున్న ఆసక్తిని డీబీజే వివరించింది.
భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జపనీస్ కంపెనీల లాభం పెరుగుతోందని, పుణేలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌తో సహా భారత్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు మిజుహో వెల్లడించింది. తమ కంపెనీకి అత్యంత కీలకమైన ప్రపంచ కేంద్రాల్లో భారత్ ఒకటని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ఇక్కడ 19,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని, భారత్‌లోని కంపెనీ కార్యకలాపాలు అధిక విలువ గల మూలధన మార్కెట్లు, ఆర్థిక సేవల కార్యకలాపాల దిశగా ఎదుగుతున్నట్లు స్పష్టం చేసింది.
భారతదేశంలో దీర్ఘకాలిక ఉనికిని, జపాన్ కంపెనీలను, గ్లోబల్ పరిశ్రమలను భారతీయ అవకాశాలతో అనుసంధానించటంలో కీలక పాత్ర పోషించినట్లు నోమురా సంస్థ స్పష్టం చేసింది. కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతిక సామర్థ్యాల ద్వారా కూడా ఇది సాధ్యమవుతోందని వెల్లడించింది. "దీర్ఘకాలిక పెట్టుబడి" ప్రాముఖ్యతను నిప్పన్ లైఫ్ స్పష్టం చేసింది. భారత్‌లో తమ సంస్థ కార్యకలాపాల ద్వారా అత్యధిక రాబడులు పొందుతున్నట్లు తెలిపింది.
భారతదేశంలోకి జపనీస్ సంస్థాగత పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ చర్చలు దృష్టి సారించాయి. లాభాలను స్వదేశానికి తరలించే ప్రక్రియను సరళతరం చేయటం, భారత పెట్టుబడుల మార్కెట్లలోకి ప్రవేశాన్ని సులభతరం చేయటం, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మరింత నియంత్రణపరమైన నిలకడను కల్పించటం వంటి అంశాల ప్రాముఖ్యతను చర్చలో పాల్గొన్నవారు తెలియజేశారు.
భారత్‌పై దీర్ఘకాలిక వ్యూహాత్మక దృక్పథం సానుకూలంగానే ఉందని జపనీస్ సంస్థలు స్పష్టం చేశాయి. కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు, కొన్ని నియంత్రణ, విధానపరమైన అంశాలు... స్వల్పకాలిక పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ అభిప్రాయాన్ని శ్రీ పీయూష్ గోయెల్ స్వాగతించారు. సులభతర వాణిజ్యాన్ని నిరంతరం మెరుగుపరిచేందుకు, అనువైన పెట్టుబడి వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.
జపాన్, భారత్ మధ్య పెట్టుబడులను పెంపొందించటానికి వేదికగా, భారత్‌లోని అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ద్వారంగా గిఫ్ట్ సిటీని వినియోగించుకునే అవకాశాలను ఈ సమావేశం పరిశీలించింది.
పెట్టుబడులు మాత్రమే కాక సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, తయారీ సామర్థ్యాలు, ఉపాధి, ప్రపంచ విలువ శ్రేణులతో అనుసంధానాన్ని పెంచే దీర్ఘకాలిక భాగస్వామ్యాలను భారత్ కోరుకుంటోందని శ్రీ పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతన, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో... ఆధునీకరణ, సాంకేతిక నవీకరణకు అవసరమైన నిలకడైన వ్యాపార అవకాశాలను తెలియజేశారు.
రాబోయే దశాబ్ద కాలంలో జపాన్ నుంచి భారత్‌లోకి 10 ట్రిలియన్ యెన్ల ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పించాలనే భారత్-జపాన్ సంయుక్త లక్ష్యానికి ఈ చర్చలు ఎంతో ప్రాధాన్యతనిచ్చాయి. భారత వృద్ధి అవకాశాలపై ప్రముఖ జపాన్ ఆర్థిక సంస్థలకున్న ప్రగాఢ విశ్వాసాన్ని ఈ సమావేశం స్పష్టం చేసింది. ద్వైపాక్షిక పెట్టుబడులు, సాంకేతికత, వాణిజ్య సంబంధాల విస్తరణకున్న భారీ అవకాశాలను వెల్లడించింది.
భారత్-జపాన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటానికి, భారత్ తదుపరి దశ వృద్ధిలోకి జపాన్ సంస్థాగత పెట్టుబడులను దీర్ఘకాలికంగా పెంచేందుకు ఈ సమావేశం మరో కీలక ముందడుగా నిలిచింది.
***
(రిలీజ్ ఐడి: 2303090)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam