యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
2026 ఆగస్టు 22, 23 తేదీల్లో విశాఖపట్నంలో బ్రిక్స్ యువజన వ్యవహారాలు - క్రీడా మంత్రుల సమావేశం
హాజరు కానున్న 11 బ్రిక్స్ సభ్యదేశాల యువజన వ్యవహారాలు - క్రీడా శాఖల మంత్రులు
సమావేశానికి అధ్యక్షత వహించనున్న డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ
క్రీడా సాంకేతికతల్లో సహకారం, క్రీడా పరికరాల తయారీ సదస్సుపై దృష్టి సారిస్తూ బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం
యువత అభివృద్ధి, సాధికారత దిశగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తూ.. బ్రిక్స్ దేశాల యువజన వ్యవహారాల మంత్రుల సమావేశం
प्रविष्टि तिथि:
21 AUG 2026 1:03PM by PIB Hyderabad
బ్రిక్స్- 2026 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్... 2026 ఆగస్టు 22న బ్రిక్స్ యువజన వ్యవహారాల మంత్రుల సమావేశం, 2026 ఆగస్టు 23న బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఆతిథ్యమివ్వబోతోంది. యువజన వ్యవహారాలు, క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా.. 11 బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన మంత్రులు, వివిధ ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.
ప్రజలే కేంద్రంగా, మానవతే ప్రాతిపదికగా.. ‘పటిష్ట, వినూత్న సహకారం - సుస్థిరతల సాధన’ ఇతివృత్తం మార్గదర్శక సూత్రంగా 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహిస్తోంది.
బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షత వహిస్తున్న సమయంలో జరిగిన సమావేశాలు, చర్చలు పునాదిగా ఈ మంత్రివర్గ స్థాయి భేటీలు కొనసాగుతాయి. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే వేదికలుగా ఈ సమావేశాలు నిలుస్తాయి.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ సునిల్ పాలివాల్, క్రీడా శాఖ కార్యదర్శి శ్రీ హరిరంజన్ రావుతోపాటు యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు కూడా ఈ మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొంటారు.
షెడ్యూలు ప్రకారం.. యువజన వ్యవహారాల మంత్రుల సమావేశంలో డాక్టర్ మాండవీయ దేశం తరఫున ప్రకటన చేస్తారు. శ్రీమతి రక్షా ఖడ్సే ముగింపు ప్రసంగం చేస్తారు.
ఆగస్టు 22న జరిగే బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో విద్య, నైపుణ్యాలు, వ్యవస్థాపకత, సంక్షేమం, సుస్థిరాభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తారు. వాటితోపాటు యువత అభివృద్ధి, సాధికారత అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశం, బ్రిక్స్ యువజన సదస్సుల నుంచి వచ్చిన కీలక సిఫార్సులను ఈ సమావేశంలో పరిశీలిస్తారు. అలాగే భవిష్యత్ బ్రిక్స్ అధ్యక్ష దేశాల ఆధ్వర్యంలో.. సభ్య దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన రంగాలను కూడా ఈ భేటీలో గుర్తిస్తారు.
బ్రిక్స్ యువజన శాఖ మంత్రుల ఉమ్మడి ప్రకటననూ, బ్రిక్స్ యువజన సహకార కార్యాచరణ విధానాన్నీ ఈ సమావేశం ముగింపు సందర్భంగా ఆమోదిస్తారు.
క్రీడా రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఉమ్మడిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ... ఆగస్టు 23న జరగనున్న బ్రిక్స్ క్రీడా శాఖా మంత్రుల సమావేశంలో 11 బ్రిక్స్ సభ్య దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు.
సంప్రదాయ, దేశీయ క్రీడలు, క్రీడా సాంకేతికత, క్రీడా పరికరాల తయారీతోపాటు ఉమ్మడి ప్రకటన ఆమోదానికి సంబంధించిన అంశాలపై.. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ క్రీడా విభాగం ప్రధానంగా దృష్టి సారించింది.
బ్రిక్స్ ఉమ్మడి క్రీడా ప్రకటన ఆమోదంతో ఈ సమావేశం ముగుస్తుంది.
బ్రిక్స్ మైత్రీ సైక్లింగ్‌పాటు 11 బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధుల అధికారిక ప్రసంగాలు, ద్వైపాక్షిక సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఈ కార్యక్రమంలో ఉంటాయి.
క్రీడా మంత్రుల సమావేశంలో.. బ్రెజిల్, చైనా, ఈజిప్టు, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధి బృందాల అధిపతులు అధికారిక ప్రసంగాలు చేస్తారు. అనంతరం ఉమ్మడి ప్రకటనను ఆమోదిస్తారు.
బ్రిక్స్-2026కు భారత్ అధ్యక్షత వహిస్తున్న వేళ.. సభ్య దేశాల మధ్య వ్యవస్థాగత సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికీ, అనుభవాలనూ ఉత్తమ విధానాలనూ పరస్పరం పంచుకోవడానికీ ఈ రెండు మంత్రుల స్థాయి సమావేశాలు కీలక వేదికలుగా నిలవనున్నాయి. అంతేకాకుండా యువజన వికాసం, క్రీడా రంగాల్లో ఉమ్మడి ప్రాధాన్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడతాయి.
***
(रिलीज़ आईडी: 2302074)
आगंतुक पटल : 17