రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

‘2026 టెరియర్ సైబర్ క్వెస్ట్’ను ప్రారంభించిన భారత సైన్య టెరిటోరియల్ ఆర్మీ

प्रविष्टि तिथि: 21 AUG 2026 11:13AM by PIB Hyderabad

‘2026 టెరియర్ సైబర్ క్వెస్ట్’ (టీసీక్యూ 3.0)ను సైబర్‌పీస్ (CyberPeace) సహకారంతో టెరిటోరియల్ ఆర్మీ ప్రారంభించింది.  రక్షణ, సైబర్ భద్రత, సమాచార రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాలను కనుగొనాలన్న ధ్యేయంతో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి హ్యాకథానే ఈ ‘2026 టెరియర్ సైబర్ క్వెస్ట్’.
విద్యారంగం, పారిశ్రామిక రంగం, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, సాయుధ దళాలకు చెందిన సాంకేతిక ప్రతిభావంతులతో ఈ పోటీకి సంబంధించిన మూడో సంచికలో భాగంగా ఓ సమావేశాన్ని నిర్వహించాలని భారతీయ సైన్యం సంకల్పించింది. కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ భద్రత, ముప్పును తగ్గించడం, డిజిటల్ మాధ్యమం పట్ల చైతన్యాన్ని పెంపొందించడం వంటి సరికొత్త రంగాలపై ఈ కార్యక్రమంలో దృష్టిని కేంద్రీకరిస్తారు. జాతీయ భద్రతకు సంబంధించిన స్వదేశీ పరిష్కారాలను అభివృద్ధిపరిచే ప్రయత్నాలను కూడా ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రోత్సహిస్తారు.
ఇప్పటి వరకు నిర్వహించిన పోటీల నుంచి స్ఫూర్తిని పొంది, ఈ కింద ప్రస్తావించిన మూడు పోటీ విభాగాల్లో ‘టీసీక్యూ 3.0’ను  నిర్వహించనున్నారు:
‘బగ్ హంటింగ్’: ఇది సైబర్ భద్రతతో ముడిపడిన ఒక సవాలు. దీనిని ఆన్‌లైన్ క్యాప్చర్-ది-ఫ్లాగ్ (సీఎఫ్‌టీ) క్వాలిఫయర్‌తో మొదలుపెడతారు. లైవ్ శాండ్‌బాక్స్ ఫైనల్‌తో ముగిస్తారు. దీనిలో పాల్గొనే వారు కీలక మౌలిక సదుపాయాలతో కూడిన కల్పిత వాతావరణం (సిమ్యులేటెడ్ ఎన్విరాన్‌మెంట్స్)లో సంభావిత బలహీనతలను గుర్తించి వాటి వివరాలను దస్తావేజుల రూపంలో పొందుపరచాల్సి ఉంటుంది.
‘ఏఐ కవచ్’: ఇది కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్‌లపై ఆధారపడిన సవాలు.  దీనిలో.. రాబోయే కాలంలో తలెత్తే ముప్పులను అంచనా వేసి ఆటోమేటెడ్ రక్షణ యంత్రాంగాలు, వ్యత్యాసాల గుర్తింపునకు సంబంధించిన పరిష్కారాలను కనుగొనవలసి ఉంటుంది.
‘క్రియేటర్స్ చాలెంజ్’: ఇది కంటెంటును రూపొందించే వారిని, కమ్యూనికేటర్లని, ఇన్‌ఫ్లుయెన్సర్లని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన డిజిటల్ మీడియా ఆధారిత, స్టోరీ టెల్లింగ్ పోటీ. దీనిలో డీప్‌ఫేక్, ఫిషింగ్, ఆన్‌లైన్ స్కాములు, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయడం వంటి డిజిటల్ మాధ్యమ ప్రధాన ముప్పుల పట్ల చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రభావశీల ప్రచార ఉద్యమాల్ని రూపొందించాల్సి ఉంటుంది.
ఈ పోటీలో పాల్గొనడానికి నమోదు కార్యక్రమాన్ని 2026 ఆగస్టు 31 వరకూ చేపడతారు. ఆన్‌లైన్ మాధ్యమంలో ఎంపిక ప్రక్రియను 2026 సెప్టెంబరు 1 మొదలు 10 వరకూ, గ్రాండ్ ఫినాలేను 2026 అక్టోబరు 6 నుంచి 8 వరకూ న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. పురస్కారాల కార్యక్రమాన్ని 2026 ఆగస్టు 9న నిర్వహిస్తారు.

 

***


(रिलीज़ आईडी: 2301906) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Malayalam