రక్షణ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర భారత్: వ్యూహాత్మకంగా ప్రధానమైన 405 పరికరాలతో దేశీయ పరికరాల ఆరో ప్రోత్సాహక జాబితాను ప్రచురించిన డీడీపీ
प्रविष्टि तिथि:
18 AUG 2026 11:15AM by PIB Hyderabad
రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని రక్షణ ఉత్పత్తుల విభాగం (డీడీపీ)... దేశీయ పరికరాల ఆరో ప్రోత్సాహక జాబితాను ప్రచురించింది. రూ. 3,070 కోట్ల వ్యాపార సామర్థ్య అంచనా కలిగిన ఈ జాబితాలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన 405 వస్తువులున్నాయి. లైన్ రీప్లేస్‌బుల్ యూనిట్లు (ఎల్ఆర్‌యూలు), సబ్ సిస్టమ్‌లు, సబ్ అసెంబ్లీలు, విడిభాగాలు, ముడిపదార్థాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత తీర రక్షక దళానికి (ఐసీజీ) చెందిన 16 పరికరాలు, ప్రభుత్వ రంగంలో ఉన్న రక్షణ రంగ సంస్థల (డీపీసీయూలు)కు చెందిన 389 పరికరాలు వీటిలో ఉన్నాయి. ఈ పరికరాలు వివిధ రకాల రక్షణ వేదికలు, వ్యవస్థలకు సంబంధించినవి. అవి:
- ఆధునిక తేలికపాటి హెలికాప్టర్, లైట్ యుటిలిటీ హెలికాప్టర్, సు-30 ఎంకేఐ, తేలికపాటి యుద్ధ విమానం, ఏఎల్-31 ఎఫ్‌పీ ఇంజిన్ వంటి విమానాలు, వైమానిక పరికరాలు
- టీ-72, టీ-90, బీఎంపీ-II సహా సాయుధ వేదికలు
- యుద్ధనౌకలు
- కోన్‌కుర్స్-ఎమ్, ఇన్వార్, ఎమ్ఆర్‌శామ్ వంటి క్షిపణి వ్యవస్థలు
- రాడార్లు, సోనార్లు, కాల్పుల నియంత్రణ వ్యవస్థలు, ఉపగ్రహ సమాచార వ్యవస్థలతో కూడిన రక్షణ ఎలక్ట్రానిక్స్ పరికరాలు
- శక్తిమంతమైన సాయుధ శకట విధ్వంసక మందుగుండు, ఇతర కీలక రక్షణ పరికరాలు
405 పరికరాలతో దేశీ పరికరాల ఆరో ప్రోత్సాహక జాబితా
ఈ పరికరాల వివరణాత్మక జాబితా సృజన్ పోర్టల్ (srijandefence.gov.in)లో కూడా అందుబాటులో ఉంది. ప్రతి పరికరాన్ని దేశీయంగా తయారు చేయడం కోసం ఒక సూచనాత్మక కాల పరిమితిని నిర్ణయించారు. దేశీయ పరిజ్ఞానంతో వీటిని విజయవంతంగా తయారు చేసిన తర్వాత.. ఈ పరికరాలను భారతీయ పరిశ్రమల నుంచే కొనుగోలు చేస్తారు. పరిశ్రమల భాగస్వామ్యంతో, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల సహకారంతో.. డీపీఎస్‌యూలు, ఐసీజీ దేశీయంగా తయారీని చేపడతాయి. ఇందు కోసం తమ ‘మేక్’ విధానాలు, స్వీయ అభివృద్ధి ప్రక్రియల వంటి మార్గాలను ఉపయోగిస్తాయి.
ఆత్మనిర్భర భారత్ పరిధిలో రక్షణ రంగ తయారీలో స్వావలంబనను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ చర్యల్లో మరొక కీలక ముందడుగు.. ఈ దేశీయ పరికరాల ఆరో ప్రోత్సాహక జాబితా. ఇది భారతీయ పరిశ్రమలకు అవకాశాలను విస్తరిస్తుందని, దేశీయ రక్షణ రంగ తయారీ వ్యవస్థను బలోపేతం చేస్తుందని, పెట్టుబడులనూ ఆవిష్కరణలనూ ప్రోత్సహిస్తుందని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
దేశీయ పరిజ్ఞానంతో ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ కోసం డీపీఎస్‌యూలు, సర్వీస్ హెడ్‌క్వార్టర్లు... ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, వివిధ పరిశ్రమలకు రక్షణ పరికరాలను అందించే ప్రత్యేక వేదికగా 2020 ఆగస్టులో సృజన్ పోర్టల్‌ను డీడీపీ ప్రారంభించింది. ప్రారంభించిన నాటి నుంచి 2026 జూన్ నాటికి.. డీపీఎస్‌యూలు, సర్వీస్ హెడ్‌క్వార్టర్లు ఈ పోర్టల్ ద్వారా దేశీయీకరణ కోసం 33,000కు పైగా రక్షణ పరికరాలను పరిశ్రమల ముందుకు తెచ్చాయి. మొదటి అయిదు దేశీయ పరికరాల ప్రోత్సాహక జాబితాల కింద ప్రకటించిన 5,012 పరికరాలు కూడా వీటిలో ఉన్నాయి.
గత అయిదేళ్లలో 15,700కు పైగా రక్షణ పరికరాలను విజయవంతంగా దేశీయంగా రూపొందించారు. దీంతో దాదాపు రూ. 9,000 కోట్ల దిగుమతుల ప్రత్యామ్నాయం సాధ్యమైందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 2026 మార్చి నాటికి రూ. 10,000 కోట్ల విలువైన కొనుగోలు ఆర్డర్లను దేశీయ తయారీదారులకు డీపీఎస్‌యూలు అందించాయి. వీటిలో ఆయా సంస్థల సొంత ఉత్పత్తులు కూడా ఉన్నాయి.
***
(रिलीज़ आईडी: 2300905)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam