పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో పర్యావరణ కార్యాచరణ బృందం, వాతావరణ మార్పులు


సుస్థిరాభివృద్ధిపై సంప్రదింపుల బృందం ప్రాధాన్యాలపై బ్రిక్స్ సభ్యదేశాల ఉన్నతాధికారుల చర్చలు

प्रविष्टि तिथि: 17 AUG 2026 11:40AM by PIB Hyderabad

భారత్ అధ్యక్షతన నిర్వహిస్తున్న బ్రిక్స్–2026లో భాగంగా పర్యావరణ కార్యాచరణ బృందం, వాతావరణ మార్పులు, సుస్థిరాభివృద్ధిపై సంప్రదింపుల బృందం ఉన్నతాధికారుల సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2026, ఆగస్టు 17న జరిగింది. ఈ సమావేశానికి భారత పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌సీసీ) కార్యదర్శి శ్రీ తన్మయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ చర్చల్లో ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్  చైనా, అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్, ఫెడరల్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా, రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, రష్యన్ ఫెడరేషన్, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా బ్రిక్స్ సభ్యదేశాలు పాల్గొన్నాయి.

గత రెండు దశాబ్దాల్లో ఆర్థిక చర్చల స్థాయి నుంచి పెరుగుతున్న కాలుష్యం, జీవవైవిధ్య నష్టం, గ్లోబల్ వార్మింగ్ లాంటి ప్రపంచ సమస్యలతో సహా పర్యావరణం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్ల పట్ల తన వైఖరిని నిర్వచించుకొనే ప్రభావవంతమైన వేదికగా బ్రిక్స్ కూటమి తన పరిధిని విస్తరించిందని ప్రధానోపన్యాసంలో సభాధ్యక్షులు చెప్పారు. ‘‘సుస్థిరాభివృద్ధి, వాతావరణ స్థిరత్వం, స్వీకరణ, వనరుల సామర్థ్యం, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ పాలన లాంటి అంశాల పరంగా మన భాగస్వామ్యం విస్తరించింది’’ అని ఆయన అన్నారు.

మానవత్వమే ప్రధానం అనే విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రజలే కేంద్రంగా అంతర్జాతీయ సహకారం ఉండాలన్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో బ్రిక్స్–2026 నిర్వహిస్తున్నామని అధ్యక్షులు తెలియజేశారు. ‘‘స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’’ అనే బ్రిక్స్–2026 ఇతివృత్తంలో ఈ దార్శనికత వ్యక్తమవుతోంది. పర్యావరణ సుస్థిరతను అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలను ముందుకు తీసుకెళ్లేందుకు భారతదేశం ప్రయత్నిస్తోందని ఇది చెబుతోంది.

భారత్ అధ్యక్షత వహిస్తున్న సమయంలో పర్యావరణ కార్యాచరణ బృందం, వాతావరణ మార్పులు, సుస్థిరాభివృద్ధిపై సంప్రదింపుల బృందం కలసి నాలుగు పరస్పర ప్రాధాన్య రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయి. అవి సుస్థిరమైన జీవనశైలులు, అటవీకరణ – అటవీ అగ్ని ప్రమాదాల నిర్వహణ – విపత్తులను తట్టుకొనే సామర్థ్యం, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ, స్వీకరణ.

ఈ ప్రాధాన్యాలు బ్రిక్స్ దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి పర్యావరణ సవాళ్లను, అలాగే వాటిని పరిష్కరించగల సామూహిక వివేకాన్ని, బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అధ్యక్షులు తెలియజేశారు. వాతావరణ స్థిరత్వం, జీవావరణ వ్యవస్థ పునరుద్ధరణ, వనరుల సామర్థ్యం, సుస్థిరాభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న సవాళ్లని, వీటికి విడివిడిగా కాకుండా సమగ్రమైన, సంపూర్ణ ప్రతిస్పందనలు అవసరమని ఏకగ్రీవంగా గుర్తించడాన్ని కూడా ప్రతిబింబిస్తాయి.

భారత్ అధ్యక్షత మొదలైనప్పటి నుంచి వర్చువల్ విధానంలో 21 ఇతివృత్త ఆధారిత, సంప్రదింపుల సమావేశాలు, 10 ద్వైపాక్షిక సంప్రదింపులు, 2 నేపథ్య చర్చలు, 2 సాంకేతిక వెబినార్లు జరిగాయని వెల్లడించారు. ఇవి ఉమ్మడి అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో అసాధారణ స్థాయి నిబద్ధతను ప్రతిబింబించాయి. ఈ రోజు జరుగుతున్న ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో ప్రాధాన్యాంశాలపై ఏకాభిప్రాయం సాధించడం ద్వారా ఈ మారథాన్ చర్చలు ముగుస్తాయి.

ఇప్పటి వరకు జరిగిన ఉమ్మడి చర్చలు, సమావేశాలకు మార్గదర్శకంగా నిలిచిన సహకార స్ఫూర్తి, పరస్పర గౌరవం... ఈ రోజు జరుగుతున్న చర్చలకు కూడా దిశానిర్దేశం చేస్తాయనే విశ్వాసం వ్యక్తం చేస్తూ... అధ్యక్షులు తన ప్రసంగాన్ని ముగించారు. రేపు న్యూఢిల్లీలో బ్రిక్స్ వాతావరణ మంత్రుల స్థాయి పన్నెండో సమావేశం జరుగుతుంది.

బ్రిక్స్‌కు అధ్యక్షత వహించి, విజయవంతమైన నాయకత్వాన్ని అందించినందుకు సభ్యదేశాల ప్రతినిధి బృందాలు భారత్‌ను అభినందించాయి. పరస్పర గౌరవం, విశ్వాసం, ఏకాభిప్రాయంతో కూడిన నిర్ణయాలు తీసుకొనే వాతావరణంలో ప్రాధాన్య రంగాలపై ఉత్పాదక చర్చల ద్వారా అన్ని పక్షాలనూ ఏకతాటిపై తీసుకువచ్చినందుకు ప్రశంసించాయి.

 

***


(रिलीज़ आईडी: 2300401) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam