ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

80వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: వికసిత్ భారత్ దిశగా తదుపరి దశ కోసం ప్రధాని పిలుపు

प्रविष्टि तिथि: 15 AUG 2026 12:51PM by PIB Hyderabad

2047 నాటికి వికసిత్ భాతర్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. దేశ పనితీరు, ఆలోచన విధానం, ఆశయాల పరిధిలో మార్పు రావాలని కోరుతూ.. ప్రజలు, ప్రభుత్వాలు, పరిశ్రమలు, రైతులు, యువత, సమాజంలోని ఇతర వర్గాలు కలసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి వివరించారు.

ప్రధానమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

1.      నూతన సంస్కరణలు: సంస్కరణల వేగాన్ని పెంచాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ సంస్కరణలు భారతదేశానికి నిర్భందమైనవిగా లేదా ప్రచార ఆర్భాటంగా ఉండకూడదని, అవి దృఢమైన నిబద్ధతకు సంబంధించినవని స్పష్టం చేశారు. ప్రభుత్వం, సమాజం, పరిశ్రమలు, ఉత్పత్తిదారులు, రైతులు అందరూ తమ సంప్రదాయ వ్యవస్థలను, ఆలోచనలను, లక్ష్యాలను సంస్కరించుకోవాలని చెప్పారు. 2047 ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థలు, విధానాలు, నిబంధనలను రూపొందిస్తూ కేంద్రం, రాష్ట్రాలు, పరిశ్రమలు ఉమ్మడిగా సంస్కరణలను నిరంతరం ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు.

2.      వికసిత్ భారత్ కోసం ‘సప్త ధార’:  వచ్చే అయిదు నుంచి ఏడు సంవత్సరాల్లో భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు, దేశ వృద్ధికి కొత్త వేగాన్ని అందించేందుకు  ఎర్రకోట నుంచి ‘‘సప్త ధార’’ అనే పిలుపును ప్రధాని ఇచ్చారు. ఆ సప్త ధారలు:

·         తయారీ శక్తి:  విడిభాగాలు, డిజైన్ మొదలుకొని మొత్తం ఉత్పత్తుల తయారీ వరకు సమగ్రమైన విలువ ఆధారిత వ్యవస్థను భారత్ అభివృద్ధి చేసుకోవాలి. ప్రపంచ సరఫరా వ్యవస్థలో ఒక నమ్మకమైన కేంద్రంగా ఎదగాలి. వ్యయం, నాణ్యత, ఉత్పత్తి పరిమాణంతో పాటు పోటీతత్వంతో కూడిన కర్మాగారాలు, వినియోగదారులకు అనుకూలమైన ఉత్పత్తులు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, లోపాలు లేని ఖచ్చితమైన తయారీ విధానాల గురించి ప్రధానమంత్రి వివరించారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేస్తూ... భారతీయ తయారీ రంగానికి ‘‘నాణ్యత, నాణ్యత, నాణ్యత’’ అనేదే మూలమంత్రం కావాలని పిలుపునిచ్చారు.

·         వ్యవసాయం, ఆహార ఉత్పత్తి:  వ్యవసాయ క్షేత్రాల స్థాయి నుంచి ఎగుమతుల దిశగా సాగాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. భారతీయ సంప్రదాయ ఆహారాలు, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలను అంతర్జాతీయ బ్రాండ్‌లుగా తీర్చిదిద్దాలన్నారు. రసాయనాలు లేని ప్రకృతి సేద్యం గురించి, ప్రపంచ ప్రమాణాలకు తగిన వ్యవసాయ ఉత్పత్తులను అందించడం గురించి వివరించారు.

·         సాంకేతికత, ఆవిష్కరణ: ఏఐ, క్వాటం, అంతరిక్షం, రోబోటిక్స్, డేటా సెంటర్లు లాంటి అభివృద్ధి చెందుతున్న రంగాల గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచానికి మార్కెట్‌గా మాత్రమే భారత్ మిగిలిపోకూడదని, ఆవిష్కరణల కేంద్రంగా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. మేడిన్ ఇండియా 6జీ సేవలు ప్రతి మూలకూ చేరడమే దేశ లక్ష్యం కావాలని ఆయన స్పష్టం చేశారు.

·         గతిశక్తి: నగరాలను కలిపే హైస్పీడ్ రైళ్లు, ఆధునిక జాతీయ రహదారులు, అంతర్గత జలమార్గాలు, విమానాశ్రయాలు, బహుళ రవాణా వ్యవస్థల ద్వారా ఎలాంటి ఆటంకాలు లేని, వేగవంతమైన అనుసంధానానికి ప్రధాని పిలుపునిచ్చారు. ఎగుమతులు, దిగుమతులకు మాత్రమే పరిమితం కాకుండా.. ఓడరేవుల ఆధారిత అభివృద్ధికి, వృద్ధికి చోదకశక్తిగా నౌకాశ్రయాలు మారాలన్నారు.

·         రక్షణ శక్తి: రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అలాగే అత్యాధునిక రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా అంతర్జాతీయ సరఫరదారుగా భారత్ ఎదగాలన్నారు. డ్రోన్లు, కౌంటర్-డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని, హైపర్‌సోనిక్ రక్షణ సాంకేతికతల్లో భారత్ ముందుండాలని చెప్పారు. సైబర్ భద్రతా రంగంలో భారతీయ యువత నైపుణ్యాలు దేశంతో పాటు, ప్రపంచానికి ఉపయోగపడతాయని తెలియజేశారు.

·         హరిత ఆర్థిక వ్యవస్థ, సముద్ర ఆర్థిక వ్యవస్థ: గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఇంధన నిల్వ, పర్యావరణహిత రవాణా, పర్యావరణహిత తయారీ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి సామర్థ్యాన్ని సాధించాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. మత్స్య సంపద, తీరప్రాంత పర్యాటకం, సముద్ర సాంకేతికతతో పాటు సముద్ర ఆర్థిక వ్యవస్థలోని ఇతర విభాగాల్లో భారతదేశానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం కల్పిస్తున్న అవకాశాలను కూడా ఆయన వివరించారు.

·         భారతదేశ సాంస్కృతిక పరపతి: యోగా, ఆయుర్వేదం, సమగ్ర ఆరోగ్య సంరక్షణతో పాటు హీల్ ఇన్ ఇండియా రంగాల్లో భారతదేశ విశిష్టతలను ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. చేతివృత్తులు, సంస్కృతి, సినిమాలు, వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ రంగాల్లో కూడా భారత్ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటవచ్చని ఆయన పేర్కొన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి, ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లు, సంగీత కచేరీలను భారత్‌లో నిర్వహించేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలన్నారు.

3.      భారతదేశ ఆకాంక్షల పరిధిని విస్తరించడం: దేశ ఆలోచనలు మరింత ఉన్నతంగా ఉండాలని పిలుపునిస్తూ... వచ్చే దశాబ్దంలో ఫార్చూన్ 500 జాబితాలో 50 భారత సంస్థలు ఎందుకు ఉండకూడదని ప్రధాని ప్రశ్నించారు. ప్రపంచంలోని అయిదు అగ్రశ్రేణి బ్యాంకుల్లో ఒక భారతీయ బ్యాంకు నిలవాలని, ప్రపంచంలోని అయిదు అతి పెద్ద ఫార్మా సంస్థల్లో ఒకటి లేదా రెండు భారతీయ కంపెనీలు ఉండాలని అన్నారు. భారతీయ న్యాయ సేవా సంస్థలు, రేటింగ్ సంస్థలు, కన్సల్టింగ్ సంస్థలు, అకౌటింగ్ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే భారత సాంకేతిక సంస్థలు అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా వృద్ధి చెందాలని, ప్రపంచాన్ని ఆకర్షించేలా భారతీయ బ్రాండులు దేశ గుర్తింపుగా మారాలని పిలుపునిచ్చారు.

4.      అంతర్జాతీయ గుర్తింపుగా మేక్ ఇన్ ఇండియా నాణ్యతఅంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు విశ్వసనీయత, నాణ్యతే అసలైన గుర్తింపుగా మారాలని తయారీదారులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈ రంగానికి ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వ్యయం, నాణ్యత, ఉత్పత్తి పరిమాణంలో భారత్ అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలని, ప్రపంచ మార్కెట్లలో విజయవంతంగా పోటీపడే ఉత్పత్తులను అందించాలన్నారు. భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు అందిపుచ్చుకోవాలని, నాణ్యతతో పాటు పోటీతత్వానికి సంబంధించిన ప్రపంచ నిబంధనలకు అనుగుణంగా భారతీయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు చేర్చాలని ఆయన కోరారు.

5.      పనితీరును మార్చుకోవడం, భారతదేశ లక్ష్యాల స్థాయిని అందుకోవడం: ఈ శతాబ్దంలో వచ్చే పాతికేళ్లు భారత్‌కు అత్యంత కీలకమైనవని చెబుతూ దేశం ఎక్కడా ఆగిపోకూడదని లేదా వేగాన్ని తగ్గించుకోకూడదని ప్రధాని సూచించారు. దేశ పని సంస్కృతి, ఆలోచనా విధానం, పని వేగాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. గడచిన అయిదు నుంచి ఏడు దశాబ్దాలుగా పూర్తి చేయలేని వాటిని వచ్చే అయిదారు ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

6.      నషా ముక్త భారత్ – ప్రతి కుటుంబానికీ భాగస్వామ్యం:  భారతదేశ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు మాదకద్రవ్యాల వినియోగం అని ప్రధానమంత్రి చెప్పారు. మాదకద్రవ్య రహిత భారత్‌ను నిర్మించడం అందరి ఉమ్మడి లక్ష్యం కావాలని తెలియజేశారు. మై భారత్ వాలంటీర్లు, ఎన్జీవోలు, సామాజిక-సాంస్కృతిక సంస్థలు, ఆధ్యాత్మిక నాయకులతో చేపడుతున్న 100 వారాల నషా ముక్త భారత్ ప్రచారం గురించి ప్రస్తావించారు. నషా ముక్త భారత్‌ కలను సాకారం చేసేలా ప్రతి కుటుంబం ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

7.      మహిళా రిజర్వేషన్ల అమలు: మహిళా రిజర్వేషన్ల అమలుకు అన్ని రాజకీయ పక్షాలూకలసి రావాలని ప్రధానమంత్రి అభ్యర్థించారు. నారీ శక్తి వందన్ అధీనియంను ఉటంకిస్తూ... లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం దక్కేలా, భారత విధానాల రూపకల్పనలో వారు భాగస్వాములయ్యేలా రాజకీయ పార్టీలు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

8.      జనగణనకు యువత నాయకత్వం: విధానాలు, పథకాలు, దేశ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు ఖచ్చితమైన సమాచారం ఎంతో కీలకమని స్పష్టం చేస్తూ... ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో కుటుంబాలు సరిగ్గా పాల్గొనేలా యువత చొరవ తీసుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. యువత తమ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని, దరఖాస్తు ఫారాలను అర్థం చేసుకుని, నమోదు చేసిన సమాచారం సరైనదేనని నిర్ధారించుకుంటూ ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు.

9.      దేశమే ప్రధానం, కర్తవ్యమే గుర్తింపు: బానిస మనస్తత్వాన్ని పూర్తిగా తొలగించే పనిని కొనసాగించాలని ప్రజలకు ప్రధాని పిలుపునిస్తూ.. పంచ్ ప్రాణ్‌ను గుర్తు చేశారు. స్వార్థం కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలని, కర్తవ్యమే మన గుర్తింపు కావాలనే సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

10. ఆకాంక్షలను సంకల్పంగా, సంకల్పాన్ని విజయంగా మలుచుకోవాలి: వికసిత్ భారత్ సాధన కోసం దేశమంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు. సమయం, అవకాశం, సంకల్పం అన్నీ భారతదేశానికి ఉన్నాయన్నారు. కలలను సంకల్పంగా, సంకల్పాన్ని శక్తిగా, శక్తిని విజయంగా మలచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి అడుగునూ అభివృద్ధి దిశగా వేస్తూ, అందరూ కలిసికట్టుగా ముందడుగు వేసి వికసిత్ భారత్ నిర్మాణాన్ని సాకారం చేయాలన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2299840) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Bengali , Odia , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Gujarati , Tamil