రాష్ట్రపతి సచివాలయం
2024, 2025 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి
భారతీయ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళుతున్న కళాకారులు మన ఉమ్మడి జ్ఞాపకాలకు సంరక్షకులు, మన భవిష్యత్తు దార్శనికతకు రూపకర్తలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
13 AUG 2026 3:23PM by PIB Hyderabad
ప్రముఖ కళాకారులకు 2024, 2025 సంవత్సరాలకుగాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు, సంగీత నాటక అకాడమీ పురస్కారాలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు (2026, ఆగస్టు 13) న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ నేలకు చెందిన కథలు, పాటలతో భారత దేశ సాంస్కృతిక చిత్రాన్ని ఈ రోజు సత్కారం అందుకున్న కళాకారులు సమష్టిగా ఆవిష్కరిస్తున్నారని రాష్ట్రపతి అన్నారు. ‘వైవిధ్యంతో నిండిన ఈ దేశానికి చెందిన నృత్యాలను, పండుగలను ఈ చిత్రం తనలో ఇముడ్చుకుంది. శతాబ్దాలుగా రూపుదిద్దుకున్న దాని భాషలు, మాండలీకాల జ్ఞాపకాలను తనలో దాచుకుంది. మనకు అనేక సంగీత సంప్రదాయాలు, నృత్య శైలులు, అనేక జానపద నాటక రూపాలు ఉన్నాయి’ అని రాష్ట్రపతి చెప్పారు. భారతీయ సంస్కృతి ఈ నేలలో బలంగా వేళ్లూనుకుందన్నారు. ‘వివిధ రకాల ఆహారాలు, సంప్రదాయాలు, వస్త్రధారణ, నృత్యరీతులు, సంగీతం అన్నీ ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందినవే. కళాకారులు తమ నృత్యాన్ని, సంగీతాన్ని ప్రదర్శించడంలో పక్షుల కిలకిలారావాలు, గలగల పారే సెలయేళ్లు, చెట్లు, ఆకులు, మేఘాలు, నదుల నుంచి స్ఫూర్తి పొందుతారు. మన కళలకున్న గొప్ప సామర్థ్యాల్లో భిన్నత్వంలో ఏకత్వం కూడా ఒకటి’ అన్నారు.
భారతదేశంలోని విభిన్న కళారూపాల్లో గురు–శిష్య పరంపర కీలకపాత్ర పోషించిందని రాష్ట్రపతి అన్నారు. ‘మన కళలకు అత్యంత ముఖ్యమైన గ్రంథం గురువే. వేగంగా మారుతున్న నేటి కాలంలో మన జానపద కళారూపాల్లో చాలా వరకు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి కళారూపాలను గ్రంథస్థం చేయడంతో పాటు వాటిని సజీవంగా ఉంచడానికి ప్రత్యేక కృషి చేయాల్సిన అవసరం ఉంది’ అని చెబుతూ,. ఇదే లక్ష్యంతో ‘కళా–దీక్ష’ కార్యక్రమాన్ని సంగీత నాటక అకాడమీ నిర్వహిస్తుండటం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. తర్వాతి తరాన్ని తీర్చిదిద్దేందుకు సీనియర్ కళాకారులు వ్యవస్థీకృత ప్రయత్నాలు చేయాలని ఆమె కోరారు.
కళలకున్న విలువలు, సున్నితత్వం ద్వారా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి అత్యంత సహజమైన శిక్షణ కేంద్రంగా ప్రకృతిని పరిగణిస్తారని రాష్ట్రపతి అన్నారు. ‘జీవితం పట్ల సహజమైన ఉత్సాహాన్ని, ప్రకృతితో గాఢమైన అనుబంధాన్ని జానపద, గిరిజన కళలు ప్రతిబింబిస్తాయి. ఈ కళారూపాల్లో సామూహిక జ్ఞాపకాలు, సామాజిక చైతన్యం సహజసిద్ధంగా వ్యక్తమవుతాయి. అందుకే భారతీయ సాంస్కృతిక గుర్తింపునకు పునాదిగా జానపద కళలు నిలుస్తాయి’ అన్నారు.
సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు స్వీకరించిన వారిని రాష్ట్రపతి అభినందించారు. వారు భారతీయ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళతారని, మన ఉమ్మడి జ్ఞాపకాలకు సంరక్షకులని, భవిష్యత్తుకోసం దార్శనికతను రూపొందించేవారని రాష్ట్రపతి చెప్పారు.
భారతీయ సాంస్కృతిక పరపతికి ముఖ్యమైన కేంద్రంగా సంగీత నాటక అకాడమీని పరిగణిస్తారని రాష్ట్రపతి చెప్పారు. భవిష్యత్తులో భారతదేశ సాంస్కృతిక శక్తితో ప్రపంచాన్ని ఈ సంస్థ సుసంపన్నం చేస్తూనే ఉంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి పూర్తి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
***
(रिलीज़ आईडी: 2299090)
आगंतुक पटल : 20