సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
భౌగోళిక గుర్తింపు (జీఐ) కలిగిన భారతీయ ఉత్పాదనల వాణిజ్యీకరణ, అంతర్జాతీయ మార్కెట్ లభ్యత పెంపునకు ఎమ్ఎస్ఎమ్ఈ శాఖ, డీపీఐఐటీల అవగాహన ఒప్పందం
‘భారత్ జీఐ’ బ్యానర్ ప్రారంభం.. ప్రాంతీయ జీఐ ఉత్పాదనలను ఓఎన్‌డీసీ, జీఈఎమ్ వేదికల్లో చేర్చనున్న ఎమ్ఎస్ఎమ్ఈ శాఖ, డీపీఐఐటీ
నాడు పోస్టు చేయడమైనది:
11 AUG 2026 11:55AM by PIB Hyderabad
భౌగోళిక గుర్తింపు (జీఐ) కలిగిన ఉత్పాదనలు భారత్‌లో విరివిగా ఉన్న నేపథ్యంలో వాటి ఆర్థిక సామర్థ్యాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకొనే దిశగా ఒక ముఖ్య ఘట్టం చోటుచేసుకుంది. ఈ అంశంపై ఒక అవగాహన ఒప్పందాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈ) మంత్రిత్వశాఖ, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) 2026 ఆగస్టు 5న న్యూఢిల్లీ వాణిజ్య భవన్లో కుదుర్చుకున్నాయి. ఒప్పంద పత్రంపై ఎమ్ఎస్ఎమ్ఈ శాఖ డైరెక్టరు ఎండీ. సాలిక్ పర్‌వేజ్, డీపీఐఐటీ ఐపీఆర్ విభాగం డైరెక్టరు శ్రీ కరణ్ థాపర్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో రెండు సంస్థల సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సాంప్రదాయిక పరిశ్రమలతో పాటు చేతివృత్తుల వారి సమగ్ర అభివృద్ధి, ఆర్థిక సౌష్టవానికి సంబంధించిన అంశాలకు ఎమ్ఎస్ఎమ్ఈ శాఖ నోడల్ మంత్రిత్వశాఖగా ఉంది. కాగా భౌగోళిక గుర్తింపు కలిగిన వస్తువుల (నమోదు, పరిరక్షణ) చట్టం-1999ని అనుసరించి భారత్లో భౌగోళిక గుర్తింపులకు సంబంధించిన నమోదు, చట్టపరమైన పరిరక్షణ విషయాలకు డీపీఐఐటీ నోడల్ విభాగంగా పనిచేస్తోంది. జీఐలను చట్టపరంగా నమోదు చేయడం వల్ల ప్రాంతీయ అస్తిత్వాన్ని పరిరక్షించవచ్చని, అయితే ఆయా స్థానిక హస్తకళా ఉత్పాదనలను పెద్ద ఎత్తున తయారు చేసి, వాణిజ్యపరంగా లాభదాయకమైనవిగా ఉండేటట్లు చూస్తూ, ఎగుమతికి సిద్ధం చేసే వాణిజ్య సంస్థలుగా రూపొందిస్తే వాటి ఆర్థిక విలువను గణనీయంగా పెంచవచ్చనీ, అందుకు సమన్వయపూర్వక ప్రయత్నాలు ఎంతైనా అవసరమనీ ఎమ్ఎస్ఎమ్ఈ శాఖ, డీపీఐఐటీ గుర్తించాయి. ఈ భావనకు అనుగుణంగా ఒప్పంద పత్రం భారతీయ జీఐ ఉత్పాదనల వాణిజ్యీకరణ, నాణ్యత ప్రమాణీకరణ, మార్కెట్టు లభ్యతలను వేగవంతం చేయడానికి ఒక సహకారపూర్వక ప్రాథమిక ప్రణాళికను రూపొందిస్తుంది. దీంతో స్వదేశీ చేతివృత్తిదారులకు, నేతకారులకు, ఉత్పత్తిదారులకు జీవనోపాధి మెరుగుపడడమే కాకుండా దేశంలో ఒక జిల్లా ఒక ఉత్పాదన (ఓడీఓపీ) విస్తారిత అనుబంధ వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది.
ఈ రెండు సంస్థలూ తమ కార్యక్రమ డిజైను, అమలు ప్రక్రియల్లో ఓడీఓపీని ఏకీకరించే దిశగా కలిసి పనిచేయనున్నాయి. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) తో పాటు, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ప్లేస్ (జీఈఎమ్) వేదికల్లో జీఐ సంఘాలనూ, అధీకృత వినియోగదారులనూ కలుపుకొని పోవడానికి కూడా ‘‘భారత్ జీఐ’’ బ్యానరుతో మార్గాన్ని సుగమం చేస్తాయి. జీఐ ట్యాగ్ కలిగిన ఉత్పాదనలను దేశీయ, అంతర్జాతీయ స్థాయుల్లో విక్రయాలకు ఉద్దేశించిన వాణిజ్య ప్రదర్శనలు, కొనుగోలుదారు, అమ్మకందారు సంస్థల సమావేశాలు, ఎగ్జిబిషన్లలో ప్రత్యేక జీఐ పెవిలియన్లకు సహ స్పాన్సర్లుగానూ వ్యవహరిస్తాయి.
పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వశాఖకు అప్పగించిన బాధ్యతతో మేధాసంపత్తి పరిరక్షణ విషయంలో డీపీఐఐటీకి అప్పగించిన బాధ్యతను అనుసంధానించే దిశగా ప్రస్తుత అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఒక కీలక నిర్ణయం. ఈ సహకారం.. చేతివృత్తిదారులు, నేత కార్మికులు, ఉత్పాదక సంఘాల సామర్థ్యాల్ని పెంచడం, డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకొనేటట్లు చూడడం, మార్కెట్ లభ్యత పరిధిని పెంచడంలో సహకారాన్ని అందించి భారత భౌగోళిక గుర్తింపు (జీఐ) విస్తారిత అనుబంధ వ్యవస్థను పటిష్ఠపరుస్తుందని భావిస్తున్నారు. జీఐ ఉత్పాదనలను అధిక లాభాలకు ఆస్కారం ఉండే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు ఈ ఒప్పందం బాటలు వేయడమే కాకుండా ‘ఆత్మనిర్భర్ భారత్’, స్థానిక ఉత్పాదనలనే కొనుగోలు చేద్దామనే (‘వోకల్ ఫర్ లోకల్’) దార్శనికతను సాకారం చేయడంలో కూడా తన వంతు పాత్రను పోషిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2297535)
సందర్శకుల సూచీ సంఖ్య : : 54
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Gujarati
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam