రక్షణ మంత్రిత్వ శాఖ
150 ఏళ్ల వందేమాతరం, వికసిత భారత్ 2047 కోసం యువశక్తికి అంకితమిస్తూ 2026 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
చారిత్రక ఎర్రకోట ప్రాకారాల నుంచి తొలిసారిగా ‘వందే మాతరం’ ఆలాపన
జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు 5000మంది ప్రత్యేక అతిథులు
నాడు పోస్టు చేయడమైనది:
10 AUG 2026 5:48PM by PIB Hyderabad
భారతావని ఆగస్టు 15, 2026న 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 2026తో 'వందేమాతరం' 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన ఈ జాతీయ గేయాన్ని, దాని చిరస్మరణీయ వారసత్వానికి నివాళిగా మొదటిసారిగా ఎర్రకోట బురుజుల నుంచి ఆలపించనున్నట్లు తెలిపారు.
ప్రధానమంత్రి ఎర్రకోటకు చేరుకోగానే 'వందేమాతరం' ఆలపిస్తారు. అనంతరం, ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, సాంప్రదాయబద్ధంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2047 నాటికి 'వికసిత భారత్' నిర్మాణంలో యువ భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ, ఈ ఏడాది వేడుకలను 'యువశక్తి' కోసం కూడా ప్రత్యేకించినట్టు రక్షణ శాఖ కార్యదర్శి తెలిపారు.
150 ఏళ్ల వందేమాతరం
ఎర్రకోటకు ఎదురుగా ఉన్న జ్ఞాన్‌పథ్‌లో ‘వందే మాతరం’ ఇతివృత్తాన్ని ప్రతిబింబించేలా పుష్పాలంకరణతో ఎన్‌సీసీ, మై భారత్ వాలంటీర్లకు చెందిన మొత్తం 2,500 మంది బాలబాలికలతో కూడిన క్యాడెట్లు పాల్గొంటారు. భారత వాయుసేనకు చెందిన ఎంఐ -17 హెలికాప్టర్ 'వందేమాతరం' 150 ఏళ్ల బ్యానర్‌ను ప్రదర్శిస్తూ, ఎర్రకోట వద్ద ఉన్న ప్రజలపై పూలవాన కురిపిస్తుంది.
మిలిటరీ బ్యాండ్ ప్రదర్శన
స్వాతంత్య్ర పోరాటంలో తరతరాలను ఏకం చేసి, స్ఫూర్తిని నింపిన జాతీయ గేయానికి గౌరవ సూచకంగా 2026 ఆగస్టు 8 నుంచి దేశ వ్యాప్తంగా అనేక బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఎన్‌సీసీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమా బల్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్‌కు చెందిన బ్యాండ్‌లు 343 ప్రదేశాలలో ఇచ్చే ఈ ప్రదర్శనలు ఆగస్టు 15, 2026 వరకు కొనసాగుతాయి. ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఈ బ్యాండ్ ప్రదర్శనలకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.
యువశక్తి: 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా ప్రయాణానికి నాయకత్వం
వివిధ రంగాల్లో యువత సాధిస్తున్న విజయాలను 2026 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకంగా గుర్తించనున్నారు. విజ్ఞానశాస్త్ర రంగంలో యువశక్తి ప్రతిభకు నిదర్శనంగా 2026 అంతర్జాతీయ భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, గణిత ఒలింపియాడ్‌లలో పతకాలు సాధించిన 19 మంది విద్యార్థులను ప్రత్యేకంగా వేడుకలకు ఆహ్వానించి, ఎర్రకోట ప్రాకారంపై ఆసీనులను చేయనున్నారు.
నేపథ్యంలో అమర్చే చిత్రఫలకాలు అణు, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో భారతదేశ పురోగతిని ప్రదర్శిస్తాయి. గౌరవ వందనం ప్రాంతంలో చేసే పూల అలంకరణ వికసిత భారత్ - 2047 వైపు భారత్ సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది.
ప్రత్యేక అతిథులు
వివిధ రంగాలలో రాణించి, వికసిత భారత్ వైపు దేశాన్ని నడిపిస్తున్న సుమారు 5,000 మంది విజేతలను ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ఈ విభాగాలలో ఉన్నవారు:
-
జాతీయ ఆవిష్కరణ కార్యక్రమాల కింద యువ ఆవిష్కర్తలు
-
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇంటర్న్‌లు
-
వివిధ పథకాల కింద ప్రోత్సాహం పొందుతున్న అత్యుత్తమ పనితీరు కనబరిచిన స్టార్టప్‌లు
-
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద శిక్షణ పొంది ఉత్తమ ప్రతిభ కనబరిచిన యువత
-
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ కింద సహాయం పొంది అత్యుత్తమ పనితీరు కనబరిచిన స్టార్టప్‌లు
-
ఉత్తమ ప్రతిభ కనబరిచిన ‘మై భారత్’ వాలంటీర్లు
-
నమస్తే, ప్రధానమంత్రి అజయ్, సీడ్ లబ్ధిదారులు
-
వివిధ క్విజ్‌లు, పోటీలలో ఎంపికైన ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
వికసిత్ భారత్ - 2047 లక్ష్య సాధనలో పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు అందిస్తున్న సేవలను గౌరవిస్తూ, కింద విభాగాలకు చెందిన ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు:
-
అంతర్జాతీయ యోగా దినోత్సవ వాలంటీర్లు
-
ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ప్రోత్సాహం పొందిన మహిళా పారిశ్రామికవేత్తలు
-
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన లబ్ధిదారులు
-
వివిధ రంగాల్లోని ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు
-
ఢిల్లీలోని భారత్ ట్యాక్సీకి చెందిన సారథులు, క్యాబ్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు
-
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లబ్ధిదారులు
-
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ప్రయోజనం పొందుతున్న చేతివృత్తిదారులు
-
ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ (పీఎం-ఎస్‌వైఎం) యోజన కింద ఉత్తమ ప్రతిభ కనబరిచిన లబ్ధిదారులు
-
ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ్-యోజన (పీఎం-ఎంకేఎస్ఎస్‌వై) కింద ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులు
ప్రత్యేక అతిథుల్లో ఇతరుల లక్ష్యాల సాధనకు నిరంతరం శ్రమిస్తూ, నిత్యం సేవలందించే నిశ్శబ్ద యోధులు కూడా ఉన్నారు. వారి సేవలను గుర్తించి గౌరవించడం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఉద్దేశాల్లో ఒకటి. ఈ నేపథ్యంలో కింది విభాగాలకు చెందిన ప్రత్యేక అతిథులను కూడా ఆహ్వానించారు:
-
ప్రధానమంత్రి స్వనిధి (పీఎం స్వనిధి) పథకం కింద వీధి వ్యాపారులు
-
స్వచ్ఛ భారత్ మిషన్ కింద పట్టణ పారిశుధ్య కార్మికులు
-
ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఢిల్లీ మెట్రో సిబ్బంది
-
కర్తవ్యపథ్, సెంట్రల్ విస్టా పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులు
-
ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సింగ్ ఆర్డర్లీలు (వార్డు అటెండెంట్లు), ఇతర సిబ్బంది
ఢిల్లీలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 1,500మందికి పైగా ప్రజలను సంప్రదాయ వస్త్రధారణలో ఈ ఘన వేడుకలను తిలకించేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎర్రకోట వేదికగా వీరు భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతిరూపంగా నిలవనున్నారు.
పోటీల ద్వారా బాలల భాగస్వామ్యం
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా, రక్షణ మంత్రిత్వ శాఖ ‘మై గవ్’ సహకారంతో వివిధ క్విజ్‌లు, పోటీలను నిర్వహించింది. వీటిలో ‘2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో కృత్రిమ మేధ పాత్రపై వ్యాసరచన పోటీ, భారత్ 1947 - భారత్ 2047’ అంశంపై చిత్రలేఖన పోటీ నిర్వహించారు. ఇంకా భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు, విధులు, కీలక అధికరణాలు, రాజ్యాంగ నిర్మాతలు, భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళలు - రాణి లక్ష్మీబాయి నుంచి సరోజినీ నాయుడు వరకు, ఆధునిక భారతదేశ ప్రస్థానంలో కీలక మైలురాళ్లు - సాంకేతిక పురోగతి, అంతరిక్ష సాంకేతికతలో విజయాలు, అణు సాంకేతికతలో భారత విజయగాథ తదితర అంశాలపై ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన సుమారు 600 మంది కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వాములు కానున్నారు.
ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఢిల్లీ ఎన్‌సీటీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ కూడా పౌరులను ఈ జాతీయ పండుగ వేడుకల్లో భాగస్వాములను చేసేందుకు వివిధ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్విజ్‌లు, కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
ప్రజల సౌకర్యార్థం
-
క్లోక్ రూమ్‌ల ఏర్పాటు: గత గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సందర్శకులు క్లోక్ రూమ్‌ల సదుపాయాన్ని ఎంతగానో ప్రశంసించారు. ప్రజల సౌకర్యార్థం రానున్న వేడుకల సందర్భంగా ఆరు ప్రాంతాల్లో మొత్తం 25 క్లోక్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
-
సహాయ కేంద్రాల్లో వాలంటీర్లు: సందర్శకులు తమకు కేటాయించిన ప్రదేశాలకు చేరుకునేలా పోలీసు సిబ్బందితో కలిసి సహాయం చేసేందుకు మొత్తం 200 మంది వాలంటీర్లను నియమించారు. వీరిలో 100 మంది ‘మై భారత్’, మరో 100 మంది ఎన్‌సీసీకి చెందినవారు. ఎర్రకోటకు వెళ్లే మార్గంలో ఈ వాలంటీర్లను సులభంగా గుర్తించి సహాయం పొందవచ్చు.
-
వీల్‌చైర్ల సౌకర్యం: సహాయం అవసరమైన సందర్శకుల కోసం మెట్రో స్టేషన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు అందుబాటులో ఉంటారు. మొత్తం 20 వీల్‌చైర్లను ఏర్పాటు చేశారు.
-
మెట్రో సేవలు: ఆగస్టు 15న వేడుకల ప్రాంగణానికి ప్రజలు సులభంగా చేరుకునేందుకు మెట్రో సేవలు ఉదయం 4 గంటల నుంచే అందుబాటులో ఉంటాయి. ఆహ్వానితులందరికీ మెట్రో సేవలను ఉచితంగా అందించనున్నారు. ఈ-ఆహ్వాన పత్రంతో పాటు మెట్రో ప్రయాణానికి సంబంధించిన క్యూఆర్ కోడ్‌లను అందజేస్తారు.
-
పరేడ్ గ్రౌండ్‌లో పార్కింగ్ సదుపాయం: చెల్లుబాటు అయ్యే పార్కింగ్ పాస్‌లు/లేబుళ్లు కలిగిన సందర్శకులకు పరేడ్ గ్రౌండ్‌లో వాహనాల పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
-
పాదచారుల కోసం ర్యాంప్ సదుపాయం: ఎగువ సుభాష్ మార్గ్ నుంచి దిగువ సుభాష్ మార్గ్‌కు పాదచారులు సులభంగా రాకపోకలు సాగించేందుకు పటిష్ఠమైన ర్యాంపులు, మెట్లను ఏర్పాటు చేశారు.
-
గూగుల్, మ్యాపుల్స్ మ్యాప్‌ల వినియోగం: ప్రధాన కార్యక్రమం జరిగే రోజున ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన సమాచారం ప్రజలకు గూగుల్, మ్యాపుల్స్ మ్యాప్‌లలో అందుబాటులో ఉంటుంది.
-
వర్షం నుంచి రక్షణ ఏర్పాట్లు: వాతావరణ పరిస్థితులు మారే అవకాశం దృష్ట్యా, ఎర్రకోటపై ఉన్న ప్రముఖులతో పాటు మాధవ్ దాస్ పార్క్, ఆగస్టు 15 పార్క్‌లలోని ఆహ్వానితులందరికీ వర్షం నుంచి రక్షణ కల్పించేందుకు రెయిన్ పోంచోలు అందజేయనున్నారు.
ఆహ్వాన పత్రం: ప్రజాసేవ - విధి పట్ల నిబద్ధత
‘సేవా తీర్థ్’ను జాతికి అంకితం చేసిన సందర్భంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, ‘సేవా తీర్థ్’ ప్రజాసేవ, కరుణ, విధి పట్ల నిబద్ధతతో పాటు ‘దేశమే తొలి ప్రాధాన్యం ’ సూత్రానికి ప్రకాశవంతమైన, శక్తిమంతమైన ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది నిస్వార్థ సేవ, ప్రజల సంక్షేమం కోసం అలుపెరగని అంకితభావం కలిగిన మార్గంలో పయనించేందుకు భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. ఈ స్ఫూర్తితో, ఈ ఏడాది ప్రధాన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను ‘సేవా తీర్థ్’ను ప్రతిబింబించేలా రూపొందించారు. ప్రతి పౌరుడి సంక్షేమం కోసం అంకితభావంతో ముందుకు సాగేందుకు ప్రజలను ప్రేరేపించడమే ఈ ఆహ్వాన పత్రాల ఉద్దేశ్యం. ఆహ్వాన పత్రంపై ఉన్న ధర్మచక్రం ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నిరంతరం నిస్వార్థ సేవలో కొనసాగాలనే శాశ్వత సందేశానికి ప్రతీకగా నిలుస్తుంది.
స్వచ్ఛతా కార్యక్రమం
కర్తవ్య నిర్వహణ పట్ల నిబద్ధతతో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ఎర్రకోట వద్ద ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ఎన్‌సీసీ క్యాడెట్లు, ‘మై భారత్’ వాలంటీర్లు పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సందర్శకులు తిరిగి వెళ్లిన అనంతరం చెత్తను క్రమబద్ధంగా సేకరించి, ప్లాగింగ్ ద్వారా పరిసరాలను శుభ్రపరచడం, చెత్తను తక్షణమే తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. తద్వారా స్వచ్ఛ భారత్ అభియాన్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వేడుకల అనంతరం దేశం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు ఎర్రకోటను యధావిధిగా అందుబాటులో ఉంచేలా ఈ పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఎన్‌క్లోజర్ల పేర్లు
వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతూ, నీటి సంరక్షణ ప్రాధాన్యాన్ని చాటిచెప్పే ఉద్దేశంతో 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీటింగ్ ఎన్‌క్లోజర్లకు నదుల పేర్లను పెట్టారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీటింగ్ ఎన్‌క్లోజర్లకు దేశంలోని ప్రముఖ సరస్సుల పేర్లను పెట్టారు.
డ్రైనేజీ నిర్వహణ
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, నీరు పొంగిపొర్లకుండా పలు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎర్రకోటతో పాటు పరిసర ప్రాంతాల్లోని డ్రైనేజీ, మురుగునీటి వ్యవస్థలను పూర్తిస్థాయిలో శుభ్రపరుస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2297403)
సందర్శకుల సూచీ సంఖ్య : : 140
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Punjabi
,
Manipuri
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Tamil
,
Kannada
,
Malayalam