సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక రంగానికి అంతర్జాతీయ వేదికగా బ్రిక్స్ వేవ్స్ బజార్


ముంబైలో ఒకే వేదికపైకి బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల నుంచి 500 మంది పైగా ప్రతినిధులు

ప్రపంచ ఆవిష్కరణల ఆధారితఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దే ఉన్నత స్థాయి, విశిష్ట సమ్మేళనం బ్రిక్స్ వేవ్స్ బజార్: మహారాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఏఐ, సాంస్కృతిక శాఖ మంత్రి అడ్వకేట్ ఆశిష్ షెలార్

సృజనాత్మక ఆర్థిక రంగంలో బలమైన సంస్థాగత, వాణిజ్య అనుసంధానాలను ఏర్పరచేందుకు బ్రిక్స్ భాగస్వామ్య

దేశాలతో అనుభవాలు పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధం: సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్

ఐఎఫ్ఎఫ్ఐ–2026లో పాల్గొనాలని బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల ప్రతినిధులకు ఐఎఫ్ఎఫ్ఐ ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్ ఆహ్వానం: సృజనాత్మక ఆలోచనలు ఒకచోటకు చేరితే ప్రదర్శించగలిగే శక్తి ఏపాటిదో
చాటిచెప్పాలని భాగస్వాములకు విజ్ఞప్తి

प्रविष्टि तिथि: 06 AUG 2026 1:54PM by PIB Hyderabad

ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక రంగానికి అంతర్జాతీయ వేదికగా నిలిచిన బ్రిక్స్ వేవ్స్ బజార్ ముంబైలో గురువారం ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల నుంచి 500 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రెండు రోజులపాటు జరిగే బ్రిక్స్ వేవ్స్ బజార్ ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య సంభాషణ, వ్యాపార భాగస్వామ్యం, విజ్ఞాన మార్పిడి, సరిహద్దుల వెలుపల భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ద్వారా ఆడియో విజువల్, సృజనాత్మక పరిశ్రమల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్రిక్స్ వేవ్స్ బజార్‌లో ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమల సంఘాలు, సృజనకారులు, నిర్మాతలు, పెట్టుబడిదారులు, ప్రసార సంస్థలు, ఓటీటీ వేదికలు, సాంకేతిక సంస్థలు, స్టార్టప్‌లు, సాంస్కృతిక సంస్థలు, సృజనాత్మక రంగానికి చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ), సాంస్కృతిక శాఖల మంత్రి అడ్వొకేట్ ఆశిష్ షేలార్ ప్రధానోపన్యాసం చేస్తూ, భారత సృజనాత్మక వ్యవస్థకు కేంద్రబిందువైన ముంబై నగరానికి ప్రపంచ సృజనాత్మక రంగ ప్రతినిధులకు స్వాగతం పలికారు. కళ, సాంకేతికత మధ్య ఉన్న సరిహద్దులు వేగంగా చెరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. బ్రిక్స్ వేవ్స్ బజార్ కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, ప్రపంచ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును రూపుదిద్దేలా రూపొందించిన ఉన్నతస్థాయి, విలక్షణమైన అంతర్జాతీయ సమ్మేళనమని ఆయన వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రపంచ గురువుగా, ప్రపంచానికి సాంస్కృతిక, మేధో మార్గదర్శిగా తన సముచిత స్థానాన్ని భారత్ క్రమంగా తిరిగి పొందుతోందని శ్రీ ఆశిష్ షేలార్ పేర్కొన్నారు. ఈ మహత్తర దార్శనికతకు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ (ఆరెంజ్ ఎకానమీ) ఒక కీలక స్తంభమని,  భారత ప్రాచీన వారసత్వం, అపారమైన సృజనాత్మకత, ఆధునిక వాణిజ్యం పరస్పరం కలిసే శక్తిమంతమైన రంగమని ఆయన అన్నారు. 

 

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ మాట్లాడుతూ దేశాలనూ, సమాజాలనూ అనుసంధానించడంలో సంస్కృతీ,  సృజనాత్మకతల శక్తిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ప్రముఖంగా చెబుతారని, ఆ దార్శనికతతోనే సినీ రంగంలో బ్రిక్స్ దేశాలతో భారత సహకారం మరింత విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. ముంబైలో నిర్వహిస్తున్న బ్రిక్స్ వేవ్స్ బజార్ తో పాటు, 2026 నవంబర్‌లో భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) సందర్భంగా నిర్వహించనున్న బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పరస్పర సమన్వయ వేదికలుగా నిలుస్తాయని శ్రీ చంచల్ కుమార్ తెలిపారు. వీటిలో బ్రిక్స్ వేవ్స్ బజార్ వ్యాపారం, భాగస్వామ్యాలు, మార్కెట్ అవకాశాలకు వేదికగా ఉంటే, బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సినిమాలు, సినీ దర్శకులు, చిత్రనిర్మాతలు, ప్రేక్షకులను అనుసంధానించే వేదికగా నిలుస్తుందని ఆయన వివరించారు.

బ్రిక్స్ దేశాల వద్ద కథలు, ప్రతిభ, ప్రేక్షకులు, సాంకేతికత, వ్యాపార ఆలోచనల అపారమైన సామర్ధ్యం ఉందని, ఈ బలాలను మరింత వ్యవస్థీకృతంగా అనుసంధానించడమే ఇప్పుడు ఉన్న ప్రధాన అవకాశమని శ్రీ చంచల్ కుమార్ పేర్కొన్నారు. వేవ్స్ బజార్ ప్రపంచ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు ఒక కీలక వేదికగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఈ వేదిక ద్వారా కొత్త ప్రాజెక్టులు గుర్తింపు,  భాగస్వామ్యాలు ప్రారంభం, సహ నిర్మాణాలపై చర్చలు, కొత్త మార్కెట్లకు మార్గాలు ఏర్పడతాయని ఆయన వివరించారు.  21 దేశాలకు చెందిన బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాలను ఒకే లక్ష్యం కోసం ఈ వేదికపైకి తీసుకువచ్చామని తెలిపారు. చలనచిత్రం, టెలివిజన్, యానిమేషన్, విజీఎఫ్ఎక్స్, గేమింగ్, సంగీతం, డిజిటల్ మీడియా, నూతన కంటెంట్ రూపాల వంటి సృజనాత్మక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఆ ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. కాలక్రమేణా బ్రిక్స్ దేశాల సృజనాత్మక రంగ సంస్థలు ఒకేచోట కలుసుకుని, వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుని, భాగస్వామ్యాలు ఏర్పరుచుకుని, కలిసి అభివృద్ధి చెందే అంతర్జాతీయ గుర్తింపు పొందిన వేదికగా వేవ్స్ బజార్ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

బ్రిక్స్ దేశాల కంటెంట్ ఆయా బ్రిక్స్ మార్కెట్లలో మరింత విస్తృతంగా చేరేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శ్రీ చంచల్ కుమార్ అన్నారు. “మన ప్రేక్షకులకు పరస్పర దేశాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు, యానిమేషన్, సంగీతం, డిజిటల్ కంటెంట్‌ను మరింతగా వీక్షించే అవకాశం కల్పించాలి” అని ఆయన పేర్కొన్నారు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో బలమైన సంస్థాగత, వాణిజ్య అనుసంధానాలను ఏర్పరచేందుకు తన అనుభవాన్ని బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

వేవ్స్, వేవ్స్ బజార్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్, ఇండియా సినీ హబ్ వంటి వేదికల ద్వారా,  ఆవిష్కర్తల నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా ఈ విస్తృత బ్రిక్స్ భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడానికి భారత్ ప్రయత్నిస్తోందని శ్రీ చంచల్ కుమార్ స్పష్టం చేశారు. వీటి ద్వారా భారతీయ సామర్థ్యాలను అంతర్జాతీయ భాగస్వాములతో అనుసంధానించడం, ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ప్రతిభా వికాసం,  మార్కెట్ లభ్యతను సుసాధ్యం చేయడం దీని ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

2027లో ముంబైలో జరగనున్న తదుపరి వేవ్స్ సదస్సులో బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాలన్నీ చురుకుగా పాల్గొనాలని శ్రీ చంచల్ కుమార్ ఆహ్వానించారు.

 

ప్రఖ్యాత సినీ దర్శకుడు, భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్ మాట్లాడుతూ, ఐఎఫ్ఎఫ్ఐ - 2026లో పాల్గొనాలని బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ ఉత్సవంలో ఎంపిక చేసిన 8 విభాగాల్లో సుమారు 250 చిత్రాలను ప్రదర్శించనున్నట్టు ఆయన తెలిపారు. సినిమా, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ సామర్ధ్యం గురించి మాట్లాడుతూ, ఒక దేశాన్ని ప్రత్యక్షంగా సందర్శించకముందే లేదా సందర్శించకుండానే ఆ దేశపు సినిమాలు, కథలు, సంస్కృతి ద్వారా దాని గురించి మనం తెలుసుకుంటామని, భావోద్వేగాలకు సరిహద్దులు ఉండవని, అవి విశ్వవ్యాప్తమైనవని ఆయన పేర్కొన్నారు.

బ్రిక్స్ వేవ్స్ బజార్ వంటి వేదికల ద్వారా కథలు సినిమాలుగా రూపుదిద్దుకుంటాయని, సినీ దర్శకులు, నిర్మాతలు, ఇతర సృజనకారులు కొత్త భాగస్వాములను కనుగొనే అవకాశాలు లభిస్తాయని అన్నారు. సృజనాత్మక స్వరాలు ఒక్కటైనప్పుడు ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ప్రపంచానికి చాటిచెప్పేందుకు బ్రిక్స్ భాగస్వామ్య దేశాలన్నీ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

విదేశాంగ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి (ఎంఈఆర్–III) శ్రీ రాజీవ్ బోద్వాడే మాట్లాడుతూ, భారత బ్రిక్స్ అధ్యక్షతా ఇతివృత్తం - సుస్థిరత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం -  కింద బ్రిక్స్ వేవ్స్ బజార్ - 2026ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థికాభివృద్ధికి కీలక చోదకశక్తిగా నిలుస్తోందని, ఇది ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.1 శాతం వాటాను అందించడమే కాకుండా, అంతర్జాతీయ సేవల ఎగుమతుల ద్వారా 1.4 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల శక్తివంతమైన డిజిటల్ మార్కెట్లు, సంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని సమన్వయం చేయడం ద్వారా ఈ అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే ప్రత్యేక సామర్థ్యం బ్రిక్స్‌కు ఉందని ఆయన అన్నారు.

నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాశ్ మగ్దూమ్ మాట్లాడుతూ, రెండు రోజులపాటు జరిగే బ్రిక్స్ వేవ్స్ బజార్లో ఉన్నతస్థాయి సదస్సులు, ముఖ్యోపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యాపార నెట్‌వర్కింగ్ సమావేశాలు, ప్రత్యేకంగా రూపొందించిన బిజినెస్-టు-బిజినెస్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ చర్చలు అంతర్జాతీయ స్థాయిలో సహ నిర్మాణాలు, కంటెంట్ ఫైనాన్సింగ్, డిజిటల్ మార్పు, మేధోసంపత్తి హక్కులు (ఐపీ), మహిళల నేతృత్వంలో వ్యాపారాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ప్రజా విధానాలు, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారం వంటి సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును నిర్దేశించే కీలక అంశాలపై కేంద్రీకృతమై ఉంటాయని ఆయన వివరించారు.

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సెంథిల్ రాజన్ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధికి సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను కీలక చోదకశక్తిగా తీర్చిదిద్దాలన్న భారత నిబద్ధతకు బ్రిక్స్ వేవ్స్ బజార్ నిదర్శనమని పేర్కొన్నారు.

విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఊతమివ్వడం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక సహకారంలో కొత్త అవకాశాలను సృష్టించడమే బ్రిక్స్ వేవ్స్ బజార్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2295529) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam