యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
2026 కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ పతక విజేతలను నగదు బహుమతులతో సత్కరించిన
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి నవతరానికి స్ఫూర్తిని అందించాలని క్రీడాకారులకు సూచన
प्रविष्टि तिथि:
03 AUG 2026 2:14PM by PIB Hyderabad
‘2026 కామన్వెల్త్ - వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పతకాలను గెలిచిన క్రీడాకారులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఈ రోజు సత్కరించారు. గ్లాస్గోలో చరిత్రను సృష్టించిన వారి ప్రదర్శనను ఆయన ప్రశంసించారు. భారతీయ వెయిట్‌లిఫ్టర్లు 11 కేటగిరీలలో పోటీపడి, 8 పతకాలు సాధించారు. వాటిలో ఒక స్వర్ణపతకం, ఆరు రజత పతకాలతో పాటు ఒక కాంస్య పతకం కూడా ఉంది. భారతీయ క్రీడాకారుల బృందం అనేక కామన్వెల్త్ క్రీడల రికార్డులను నమోదు చేసింది. పలువురు అథ్లెట్లు కెరియర్లోనే వ్యక్తిగత అత్యుత్తమ స్థాయి ప్రదర్శననిచ్చారు.

కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగా స్వర్ణ పతక విజేతలకు రూ.30 లక్షలు, రజత పతక విజేతలకు రూ.20 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.10 లక్షల నగదు పురస్కారాలను మంత్రి అందజేశారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున ఇంతవరకు అత్యంత ఉత్తమ స్థాయి ఫలితాలను భారతీయ వెయిట్‌లిఫ్టర్లు నమోదు చేశారు.
వెయిట్‌లిఫ్టర్ల విజయాలను చూసి దేశ ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారని డాక్టర్ మాండవీయ చెప్తూ, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులను అభినందించారు. ‘‘మీరు పతకాలను గెలిచినప్పుడల్లా, ఆ విషయాన్ని పార్లమెంటులో కూడా ప్రకటించారు. ఆ క్షణాలు భారత్‌లో ప్రతి ఒక్కరూ సంతోషించేటట్లు చేశాయి’’ అని ఆయన అన్నారు.

కోచ్‌లపై మంత్రి ప్రశంసలు కురిపించారు. ద్రోణాచార్య పురస్కార గ్రహీత శ్రీ విజయ్ శర్మ కూడా సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. విజేతలను తీర్చిదిద్దడంలో కోచ్‌ల పాత్ర ఎంత ముఖ్యమో మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఒక అథ్లెట్ పయనంలో గురువు పోషించే పాత్ర అతి కీలకం. చాంపియన్లను తీర్చిదిద్దడంలో కోచ్ సేవలను మించింది మరేదీ లేదు’’ అని ఆయన అన్నారు.
ఒలింపిక్స్‌లో రజత పతక విజేత అయిన మీరాబాయి చాను.. కామన్వెల్త క్రీడల్లో వరుసగా మూడు స్వర్ణ పతకాలు గెలిచిన మొదటి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచారు. రుషికాంత సింగ్, వల్లూరి అజయ్ బాబు కామన్వెల్త్ క్రీడల్లో ‘స్నాచ్’ కేటగిరీలో నూతన రికార్డులను నెలకొల్పారు. జ్ఞానేశ్వరి యాదవ్, హర్జిందర్ కౌర్ సహా అనేక మంది వెయిట్‌లిఫ్టర్లు వ్యక్తిగతంగా అత్యుత్తమ స్థాయిలో రాణించారు.
పోటీకి దిగిన 11 మంది వెయిట్‌లిఫ్టర్లలో ఖేలో ఇండియా అథ్లెట్లు (కేఐఏలు) ఆరుగురు ఉన్నారు. పతకాలను గెలుచుకున్న వారిలో జ్ఞానేశ్వరి ఖేలో ఇండియా క్రీడాకారిణి. బింద్యారాణి దేవి, హర్జిందర్ తదితరులు పాటియాలాలో భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ)కి చెందిన జాతీయ ప్రావీణ్య కేంద్రం (ఎన్‌సీఓఈ)లో శిక్షణ తీసుకున్నారు. భారత్‌లో క్షేత్ర స్థాయి క్రీడాకారులను, విశిష్ట క్రీడాకారులను తీర్చిదిద్దే విస్తారిత అనుబంధ వ్యవస్థ చక్కని ఫలితాలను రాబట్టడంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది ఈ సంస్థే.
P4AE.jpeg)
క్రీడలకు రాయబారులుగా మారాల్సిందిగా క్రీడాకారులకు మంత్రి పిలుపునిచ్చారు. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి యువజనులు క్రీడల వైపు దృష్టి పెట్టేలా వారిలో స్ఫూర్తిని కలిగించాలని వెయిట్‌లిఫ్టర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ‘‘వేలాది బాలలు పెద్ద పెద్ద కలలను కనేలా మీ కథలు వారికి స్ఫూర్తిని ఇవ్వగలుగుతాయి. క్రీడలను ఎంతో ప్రేమించే దేశాన్ని ఆవిష్కరించే దిశగా మనం అందరం కలిసి అడుగులు వేద్దాం’’ అని మంత్రి అన్నారు.
వెయిట్‌లిఫ్టర్లతో డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ వారి సంఘర్షణలను, విజయ వేదిక వరకూ వారి ప్రయాణాన్నీ, రాబోయే కాలంలో పోటీలకు సంబంధించి, ముఖ్యంగా 20267 ఆసియా క్రీడల విషయంలో వారి ఆకాంక్షలు ఏమిటన్నది అడిగి తెలుసుకున్నారు. కష్టాలకు ఎదురీదడం, జాతీయ శిక్షణ శిబిరాల్లో తోడ్పాటును అందుకోవడం, అంతర్జాతీయ స్థాయిలో అనుభవం సంపాదించడం, శాస్త్రీయంగా శిక్షణ పొందడంతో పాటు దేశానికి వరుస విజయాలను అందించాలన్న తమ దృఢసంకల్పాన్ని గురించి క్రీడాకారులు మంత్రికి వివరించారు.
1BJU.jpeg)
కొద్దిలో పతకాన్ని దక్కించుకోలేకపోయిన వారిని ఉద్దేశించి డాక్టర్ మాండవీయ ప్రసంగిస్తూ... ధైర్యాన్ని వీడొద్దని సూచించారు. ‘‘క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి నిజానికి ఎప్పుడూ ఓడిపోరు. కావలసింది నిరంతరం మెరుగులు దిద్దుకొంటూ ఉండటమే. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులతో పాటు 140 కోట్ల మంది భారతీయుల మద్దతు మీకు ఎప్పటికీ ఉంటుందని నేను నమ్ముతున్నాను’’ అని మంత్రి అన్నారు.
భారతీయ క్రీడల పట్ల ప్రభుత్వ దీర్ఘకాల దృష్టికోణాన్ని గురించి డాక్టర్ మాండవీయ స్పష్టం చేస్తూ, అనేక మంది పతక విజేతలు ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల సాయంతోనే ఎదిగారన్నారు. ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు ప్రపంచ స్థాయి శిక్షణనీ, శాస్త్రీయ మద్దతునీ, పోటీపడే అనుభవాన్నీ యువ క్రీడాకారులకు అందిస్తున్నాయని ఆయన తెలిపారు. ‘‘మీ శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఉన్నందువల్ల దేశం మిమ్మల్ని తీర్చిదిద్దుతోంది. భారతీయ అథ్లెట్లు ప్రపంచంలో ఉత్తమ క్రీడాకారులతో పోటీకి నిలిచేలా సాధ్యమైన అన్ని సదుపాయాలనూ సమకూరుస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
***
(रिलीज़ आईडी: 2293996)
आगंतुक पटल : 9