వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడుల సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తొలి సంయుక్త వాణిజ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించిన భారత్ - రువాండా
ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణతో పాటు , వ్యాపార సంస్థల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయం
కీలక ఖనిజాలు, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ సాంకేతికతలలో సహకారం కోసం ప్రాధాన్యతా రంగాల గుర్తింపు
प्रविष्टि तिथि:
01 AUG 2026 12:19PM by PIB Hyderabad
భారత్ - రువాండా సంయుక్త వాణిజ్య కమిటీ (జేటీసీ) తొలి సమావేశం 2026 జూలై 30, 31 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. భారత ప్రతినిధి బృందానికి వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అమిత్ కుమార్ నాయకత్వం వహించగా, రువాండా తరఫున ఆ దేశ విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖలో ఆసియా, పసిఫిక్, మధ్యప్రాచ్య వ్యవహారాల డైరెక్టర్ జనరల్ శ్రీ వర్జిల్ ర్వాన్యగతారే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు
వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీ యశ్వీర్ సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తూ, ఈ తొలి సమావేశం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమీక్షించడం, వాణిజ్య ఉత్పత్తుల పరిధిని విస్తరించడం, పరస్పర పెట్టుబడులను పెంపొందించడం, రవాణా అంశాలకు సంబంధించిన అడ్డంకులను పరిష్కరించడం కోసం శాశ్వత, వ్యవస్థీకృత, నిర్దిష్ట వ్యవధిలో సమావేశమయ్యే అత్యున్నత స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.
వస్తువులు, సేవల రంగాల్లో ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్య స్థితిని ఇరు దేశాల ప్రతినిధులు సమీక్షించారు. భారత్ నుంచి రువాండాకు ప్రధానంగా ఔషధ తయారీ ఉత్పత్తులు, జీవసంబంధిత ఉత్పత్తులు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, పారిశ్రామిక, విద్యుత్ యంత్రాలు, ఆయిల్ మీల్స్, ఇనుము - ఉక్కు ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా, రువాండా నుంచి భారత్‌కు సీసం, సుగంధ ద్రవ్యాలు, ముఖ్యమైన సుగంధ నూనెలు, రాగి, విలువైన, పాక్షిక విలువైన రత్నాలు, ప్రాసెసింగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలు దిగుమతి అవుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఉత్పత్తుల పరిధిని విస్తరించడం, వ్యాపార సంస్థల మధ్య ప్రత్యక్ష సహకారాన్ని ప్రోత్సహించడం, మార్కెట్ లభ్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
భారీ ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, వస్త్రాలు, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్ వస్తువులు, క్రీడా సామగ్రి, బొమ్మలు, రత్నాలు - ఆభరణాలు, శాస్త్రీయ పరికరాల ఎగుమతులను మరింత విస్తరించే అవకాశాలను భారత్ ప్రస్తావించింది. రువాండా ఔషధ దిగుమతుల్లో సుమారు 24.5 శాతం వాటాతో భారత్ ఆ దేశానికి అతిపెద్ద ఔషధ సరఫరాదారుగా కొనసాగుతోందని సమావేశంలో పేర్కొన్నారు. భారత్‌కు చేసే ప్రాధాన్యత ఎగుమతులుగా మిరపకాయలు, మకాడమియా, ఫ్రెంచ్ బీన్స్, ఆవకాడో, అవసరమైన ఆయిల్స్, టీ, కాఫీ, ఇతర ఉద్యానవన ఉత్పత్తులు, ఖనిజాలు, విలువైన రాళ్లను రువాండా గుర్తించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్),, రువాండా స్టాండర్డ్స్ బోర్డ్ (ఆర్ ఎస్బీ) మధ్య సామర్థ్య పెంపుతో సహా, ప్రమాణాల ఏకీకరణపై పరస్పర సహకారం గురించి కూడా ఇరుపక్షాలు చర్చించాయి.
పెట్టుబడుల విషయంలో 2025 నాటికి భారత్ తమ దేశంలో రెండో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా నిలిచిందని రువాండా గుర్తించింది. గనుల రంగం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, తక్కువ వ్యయంతో గృహ నిర్మాణం, సమాచార–సంబంధిత సాంకేతికత, తయారీ, ఆరోగ్య సేవలు, పర్యాటకం, ఆర్థిక సేవల రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. సంయుక్త వాణిజ్య కమిటీ (జేటీసీ) పరిధిలో పెట్టుబడుల సమన్వయ కేంద్రాలుగా ఇన్వెస్ట్ ఇండియా, రువాండా డెవలప్‌మెంట్ బోర్డును నియమించాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. వాణిజ్య ప్రదర్శనలు, వ్యాపార వేదికలు, కొనుగోలుదారులు - విక్రేతల సమావేశాల క్యాలెండర్లను పరస్పరం మార్పిడి చేసుకోవాలని అంగీకరించాయి. తూర్పు ఆఫ్రికా సమాజం (ఈఏసీ), తూర్పు, దక్షిణ ఆఫ్రికా ఉమ్మడి మార్కెట్ (కోమెసా), ఆఫ్రికన్ ఖండ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం (ఏఎఫ్‌సీఎఫ్‌టీఏ)లకు ప్రవేశ ద్వారంగా తమ దేశానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని రువాండా ప్రస్తావించింది. దీని ద్వారా భారత వ్యాపార సంస్థలకు విస్తృత ప్రాంతీయ మార్కెట్లలోకి ప్రవేశించే అవకాశాలు లభిస్తాయని పేర్కొంది.
ఇరుపక్షాలు రంగాలు వారీగా సహకారం కోసం అనేక ప్రాధాన్యత ప్రాంతాలను గుర్తించాయి. కీలక ఖనిజాల రంగంలో రువాండాకు చెందిన టిన్, టంగ్‌స్టన్, టాంటాలమ్ వనరులపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్ ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇందులో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రువాండా మైన్స్, పెట్రోలియం అండ్ గ్యాస్ బోర్డ్ మధ్య సంస్థాగత సహకారం కూడా ఉంది. ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఇరుదేశాల ఆరోగ్య శాఖల మధ్య అవగాహన ఒప్పందం ఆమోద ముద్ర పొందేందుకు చివరి దశలో ఉందని ఇరుపక్షాలు పేర్కొన్నాయి. ఇండియన్ ఫార్మాకోపియాకు గుర్తింపు ఇవ్వాలని, సాంప్రదాయ వైద్యంలో సహకారాన్ని విస్తరించాలని కూడా భారత్ ప్రతిపాదించింది.
వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, అవకాడోలకు మార్కెట్ లభ్యత, వస్త్రాలు, తోలు పరిశ్రమ, హరిత రవాణా, డిజిటల్ మౌలిక వసతులు, ఫిన్‌టెక్, సైబర్ భద్రత, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారంపై కూడా ఇరు పక్షాలు చర్చించాయి. భారత సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం (ఐటీఈసీ), స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం, స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సామర్థ్యాభివృద్ధికి మద్దతును కొనసాగిస్తుందని భారత్ తెలిపింది. రువాండాలో సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణ (టీవీఈటీ) వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కూడా సహకారం అందించనున్నట్లు పేర్కొంది.
చర్చలు స్నేహపూర్వక, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సాధించిన పురోగతిని వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ అభినందించారు. ఉమ్మడి అంగీకార సమావేశ మినిట్స్ లో నమోదు చేసిన నిర్ణయాలను నిరంతర పర్యవేక్షణతో, నిర్దిష్ట గడువులో అమలు చేయాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.
ఇరు పక్షాలు అంగీకరించిన మినిట్స్ పై 2026 జూలై 31న న్యూఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సంతకాలు చేశాయి. ఏడాది అనంతరం దౌత్య మార్గాల ద్వారా పరస్పర అంగీకారంతో నిర్ణయించే తేదీన రువాండాలో భారత్ , రువాండా సంయుక్త వాణిజ్య కమిటీ రెండో సమావేశాన్ని నిర్వహించాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
***
(रिलीज़ आईडी: 2293128)
आगंतुक पटल : 4