పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాస్త్రీయ ధ్రువీకరణ, నిపుణులతో విస్తృత సంప్రదింపుల ఆధారంగానే ఈ20 అమలు

प्रविष्टि तिथि: 30 JUL 2026 3:04PM by PIB Hyderabad

నీతి ఆయోగ్, ఆటోమొబైల్ తయారీదారులు, ఆయిల్ మార్కెటింగ్ సంస్థ (ఓఎంసీ)లు, ఆటోమోటివ్ రీసెర్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్ (ఎస్ఐఏఎం), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ) ఇతర సాంకేతిక సంస్థలతో శాస్త్రీయ ధ్రువీకరణ, సంప్రదింపుల అనంతరం దశల వారీగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం అమల్లోకి వచ్చింది.

ఆటోమొబైల్ తయారీదారులు, ఎస్ఐఏఎం, ఏఆర్ఏఐ, విడిభాగాల తయారీదారులు, టెస్టింగ్ ఏజెన్సీలు, ఆయిల్ మార్కెటింగ్ సంస్థ (ఓఎంసీ)లతో విస్తృత సంప్రదింపులు చేపట్టిన తర్వాతే అధిక ఇథనాల్ మిశ్రమాల విడుదల ప్రారంభమైంది.

ఇంజిన్ మన్నిక, వాహన పనితీరు సామర్థ్యం, స్టార్ట్ అయ్యే సామర్థ్యం, తుప్పు నిరోధకత, మెటీరియల్ అనుకూలత, ఉద్గారాలు, ఇంధన సామర్థ్యం లాంటి పరిమితులపై విస్తృత ప్రయోగశాల అధ్యయనాలను, క్షేత్రస్థాయి పరీక్షలను ఏఆర్ఏఐ, ఎస్ఐఏఎం, ఐవోసీఎల్, ఐఐపీ, ఆటోమొబైల్ తయారీదారులు చేపట్టారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఈ20 వినియోగించడానికి సురక్షితమైనదని ఈ అధ్యయనాలు నిర్ధారించాయి.

ఈ20 కారణంగా పాత వాహనాల పనితీరులో ఎలాంటి గణనీయమైన మార్పు, అసాధారణ రీతిలో అరుగుదల కనిపించలేదని కూడా ఈ అధ్యయనాలు నిరూపించాయి. ఈ విస్తృతమైన ప్రయోగశాల అధ్యయనాలు, క్షేత్రస్థాయి ధ్రువీకరణ, వాస్తవ వినియోగ అనుభవం ద్వారా ఈ20 ఇంధనం వల్ల వాహన పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉన్నట్టు నిరూపణ కాలేదు.

కేవలం ప్రయోగశాల పరిశోధనపై మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో అమల్లోకి తీసుకువచ్చిన అనంతరం విస్తృత స్థాయిలో ఎదురైన అనుభవం పైన కూడా ప్రభుత్వ అంచనా ఆధారపడింది. భారత్‌లో ప్రతి రోజూ సుమారు 8 కోట్ల వాహనాలు రీటైల్ అవుట్‌లెట్లకు వెళుతున్నాయి (వీటిలో 80 శాతం పెట్రోల్ వాహనాలున్నాయి).

ఈ15+ మిశ్రమ పెట్రోల్ మూడున్నరేళ్లకు పైగా, ఈ19-ఈ20 ఇంధనం రెండున్నరేళ్లకు పైగా విస్తృత వినియోగంలో ఉండటమే దీనికి నిదర్శనం. 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, మూడు కోట్లకు పైగా పెట్రోలు కార్లు ఈ మిశ్రమాలతోనే నడుస్తున్నాయి. ఇథనాల్ మిశ్రమం కారణంగా ఇంజిన్ వైఫల్యాలు లేదా బ్రేక్‌డౌన్లు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ20 ఇంధనం వల్ల అసాధారణ తుప్పు, అరుగుదల లేదా వాహన జీవిత కాలం తగ్గిపోవడం లాంటివి జరగలేదని తయారీదారుల సర్వీస్ డేటా స్పష్టం చేస్తోంది. ఈ20 వాహనాలకు వారంటీలను తయారీదారులు అందిస్తున్నారు. ఇది ఈ20 ఇంధనం అందిచే భద్రత, విశ్వసనీయతపై నమ్మకాన్ని మరింత పెంచుతోంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రముఖ ఓఈఎం సంస్థ 2.84 కోట్లకు పైగా వాహనాలకు సర్వీసింగ్ చేసింది. వాటిలో ఈ20కి అనుకూలమైనవి అని ధ్రువీకరించని వాహనాలు సుమారుగా 1.5 కోట్లు ఉన్నాయి. వీటిలో ఈ20 కారణంగా తుప్పు, అసాధారణ రీతిలో అరుగుదల లేదా విడిభాగాల జీవితకాలం తగ్గడం లాంటివి ఏమీ కనిపించలేదని ఆ సంస్థ నివేదించింది. మరో ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కూడా ఇదే తరహా క్షేత్ర స్థాయి అనుభవాన్ని తెలియజేసింది. నిర్దేశిత కాలం పాటు 1.4 కోట్ల ఈ20 ఆధారిత వాహనాలను ఒక ఓఈఎం పర్యవేక్షించింది. ఈ సంస్థ ఇథనాల్ వల్ల తుప్పు ఏర్పడుతుందనే దానికి ఎలాంటి ఆధారాలు కనిపించలేదని పేర్కొంది. వినియోగదారుల వద్దకు చేరుకొనే ముందే వాహనాలు కఠినమైన అంతర్జాతీయ ప్రమాణాల ధ్రువీకరణను పొందుతాయని ఏఆర్ఏఐ తెలియజేసింది.

ప్రతి దశలోనూ శాస్త్రీయ మూల్యాంకనం, దశల వారీగా ప్రవేశ పెట్టడంలో ఆటోమొబైల్ తయారీదారులు, విడిభాగాల సరఫరాదారులు, ఎస్ఐఏఎం, ఏఆర్ఏఐ, టెస్టింగ్ ఏజెన్సీలు, చమురు మార్కెటింగ్ సంస్థలు పాల్గొన్నాయి. ఇంధన వ్యవస్థలు, ఇంజిన్ మన్నిక, వాహన పనితీరు సామర్థ్యం, మెటీరియల్ అనుకూలత, ఉద్గారాల పనితీరును విజయవంతంగా ధ్రువీకరించిన తర్వాతే ఈ20ను ప్రవేశపెట్టారు. నిర్దేశిత నిర్వహణ ప్రమాణాల ప్రకారం పాత వాహనాల పనితీరు, మన్నిక లేదా మెటీరియల్ అనుకూలతపై తీవ్రమైన ప్రభావాన్ని ఈ అధ్యయనాలు వెల్లడించలేదు. ఆటోమొబైల్ తయారీదారులు ఈ ఫలితాల పట్ల అసంతృప్తితో ఉంటే.. పాత వాహనాలకు ఈ20 ఇంధనాన్ని ధ్రువీకరించి ఉండేవారు కాదు. అలాగే వారంటీలను ఇచ్చి ఉండేవారు కాదు.

ఎస్ఐఏఎం, ఏఆర్ఏఐ ప్రకారం... కర్బన ఉద్గారాలను తగ్గిస్తూనే... యాక్సిలరేషన్‌ను, ప్రయాణ నాణ్యతను ఈ20 మెరుగుపరుస్తుంది. ఇథనాల్‌కున్న అధిక ఆక్టేన్ సంఖ్య ఆధునిక హై-కంప్రెషన్ ఇంజిన్లకు అనుగుణంగా ఉంది. అలాగే దానికున్న అధిక భాష్పీభవన సామర్థ్యం ఉష్ణ దహన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాచారాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి లిఖితపూర్వక సమాధానంగా అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2291973) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Gujarati , Tamil , Kannada