పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
పంచాయతీరాజ్ వ్యవస్థల బలోపేతానికి కేంద్రం చర్యలు
ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం, సమర్థ్ వేదిక ప్రారంభంతోపాటు మోడల్ ఓఎస్‌ఆర్ నిబంధనలను విడుదల చేసిన కేంద్రమంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్
వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనకు స్వయంసమృద్ధి పంచాయతీలే కీలకం: శ్రీ రాజీవ్ రంజన్ సింగ్
స్థానిక ఆస్తులను స్థిరమైన ఆదాయ వనరులుగా మార్చనున్న ఆత్మనిర్భర్ పంచాయత్ కార్యక్రమం
పంచాయతీ ఆదాయ వసూళ్ల సామర్థ్యాన్ని బలోపేతం చేయనున్న సమర్థ్ వేదిక
పంచాయతీల ఆదాయాలను పెంచేందుకు రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనున్న మోడల్ ఓఎస్‌ఆర్ నిబంధనలు
प्रविष्टि तिथि:
27 JUL 2026 5:46PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్).. ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం, సమర్థ్ పంచాయతీ వేదికను ప్రారంభించడంతో పాటు పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓఎస్‌ఆర్ (సొంత ఆదాయ వనరుల) నిబంధనలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ కోసం డేటా ఆధారిత పాలన-పంచాయతీ పురోగతి సూచిక (పీఏఐ) విభాగంలో ఈ- గవర్నెన్స్ జాతీయ అవార్డులు 2026 కింద కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు లభించిన స్వర్ణ పురస్కార ట్రోఫీ, ప్రశంసా పత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్ పీ సింగ్ బఘేల్, మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ... వికసిత్ భారత్ 2047 దార్శనికత నెరవేరడానికి ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం, సమర్థ్ వేదిక, మోడల్ ఓఎస్‌ఆర్ నియమాలు కీలక పరిణామంగా పేర్కొన్నారు. ఇవి గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసి, సాంకేతికతతో కూడిన స్వయంసమృద్ధిని అందిస్తాయని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య, అభివృద్ధి ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలే అత్యంత కీలకమైనవని అన్నారు. డిజిటల్ సాధనాలు, స్థిరమైన ఆదాయ మార్గాల ద్వారా పంచాయతీలను బలోపేతం చేయడం వల్ల గ్రామీణ స్థాయి పాలన మెరుగుపడటంతో పాటు సమగ్ర గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలు తమ పరిధిలోని స్థానిక ఆస్తులను, అవకాశాలను గురించి, వాటిని నిరంతరం ఆదాయాన్నిచ్చే ప్రాజెక్టులుగా మారుస్తారని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక సమర్థ్ పంచాయతీ వేదిక పన్నుల విధింపు, చెల్లింపులు, పంచాయతీ రాబడుల పర్యవేక్షణను చాలా సులభంగా, పారదర్శకంగా మారుస్తుందని తెలిపారు. సొంత ఆదాయ వనరులను (ఓఎస్‌ఆర్) బలోపేతం చేయడంపై పదహారవ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగానే ఈ నిర్ణయాలు ఉన్నాయని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో పారదర్శకతను పెంచడానికి, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలనను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పంచాయతీరాజ్ సంస్థలు, ప్రాంతీయ స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రతినిధులను, కార్యకర్తలను శ్రీ సింగ్ కోరారు.
ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం
గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు తమ పరిధిలోని స్థానిక ఆస్తులను, అవకాశాలను గుర్తించి... వాటిని ఆదాయం తెచ్చిపెట్టే ప్రాజెక్టులుగా మార్చుకోవడానికి కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆత్మనిర్భర్ పంచాయత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టుల తయారీకి మంత్రిత్వ శాఖ సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. తద్వారా అవి స్థిరమైన రాష్ట్ర సామాజిక బాధ్యత (ఓఎస్‌ఆర్)ను నిర్మించే, బ్యాంకుల నుంచి రుణాలు పొందగల, ఆదాయాన్ని సృష్టించే ప్రాజెక్టులుగా మారతాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, ఇతర ప్రభుత్వ పథకాల అనుసంధానం, బ్యాంకుల రుణాల ద్వారా ఆర్థిక తోడ్పాటు లభిస్తుంది. నాబార్డ్, హడ్కోలు ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. నాలుగేళ్ల కాలంలో మొత్తం 350 ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మొదటి ఏడాది 50 ప్రాజెక్టులు, మిగిలిన మూడేళ్లలో ప్రతి సంవత్సరం 100 ప్రాజెక్టులు ఉంటాయి. కనీసం రూ. 50 లక్షల సొంత ఆదాయం (ఓఎస్‌ఆర్) ఉన్న గ్రామ పంచాయతీలు, రూ. 1 కోటి సొంత ఆదాయం ఉన్న బ్లాక్ పంచాయతీలు దరఖాస్తు చేసుకోవచ్చు. పాలకవర్గానికి కనీసం మూడేళ్ల పదవీకాలం మిగిలి ఉండాలి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఈ ఆదాయ నిబంధనలలో సడలింపు ఉంటుంది. ఇప్పటివరకు 10 రాష్ట్రాల పంచాయతీ ప్రతినిధులకు ఈ కార్యక్రమంపై అవగాహన వర్క్‌షాప్‌లు నిర్వహించారు. మరిన్ని వివరాలకు https://egramswaraj.gov.in/atmanibharguidelines.do సందర్శించండి.
సమర్థ్ పంచాయత్ వేదిక
సాంకేతికత ఆధారంగా పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన మొట్టమొదటి డిజిటల్ కార్యక్రమమే సమర్థ్ పంచాయతీ వేదిక. గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులను (ఓఎస్‌ఆర్) సమర్థవంతంగా నిర్వహించి, వాటి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ జాతీయ వేదిక ముఖ్య ఉద్దేశం. పన్ను చెల్లింపుదారుల నమోదు, పన్ను నోటీసుల జారీ, ఆన్‌లైన్ చెల్లింపులు, వసూళ్లు, పర్యవేక్షణ వరకు ఓఎస్‌ఆర్ ప్రక్రియ మొత్తాన్ని డిజిటల్ పద్ధతిలో నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది. పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక స్వయం సమృద్ధికి సొంత రాబడిని పెంచాలని పదహారవ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు ఈ నూతన వేదిక బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇందులో భాగమవ్వగా, 51 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు నమోదయ్యారు. ఇప్పటివరకు రూ. 95 కోట్ల విలువైన పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేసి, రూ. 27 కోట్లకు పైగా వసూలు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మిజోరం, అస్సాం, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కూడా ఈ వేదికలోకి తీసుకునే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది మరిన్ని వివరాలకు www.samarthpanchayat.gov.in సందర్శించవచ్చు.
పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓఎస్‌ఆర్ నియమాలు
పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మోడల్ ఓఎస్‌ఆర్ (సొంత ఆదాయ వనరులు) నిబంధనలను రూపొందించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకంగా ఇవి ఉపయోగపడతాయి. పదహారవ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా రూపొందించిన ఈ నియమాలు.. ఆస్తి పన్ను, వినియోగ రుసుములు, ఇతర రుసుములు, పన్నుయేతర ఆదాయాల వంటి పంచాయతీ ఆదాయాల మదింపు, వసూలు, నిర్వహణ ప్రక్రియలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో రాష్ట్రాలకు మద్దతివ్వడమే ఈ ఓఎస్‌ఆర్ నియమాల లక్ష్యం. ఈ మోడల్ నియమాలు కేవలం సలహా పూర్వకమైనవి మాత్రమే. రాష్ట్రాలు తమ స్థానిక అవసరాలు, ప్రస్తుత చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా వీటిని ఆమోదించుకోవచ్చు లేదా మార్పులు చేసుకోవచ్చు.మెరుగైన ఆదాయ సేకరణను ప్రోత్సహించడం, స్థానిక పాలనను బలోపేతం చేయడం, గ్రామీణ పౌరులకు మెరుగైన సేవలు అందిస్తూనే, పంచాయతీలు ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించేలా ఇవి తోడ్పడతాయి.
జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డులు 2026లో గుర్తింపు
2026 జూలై 1, 2 తేదీల్లో జైపూర్‌లో జరిగిన 29వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో పంచాయతీరాజ్ రంగానికి విశేష గుర్తింపు లభించింది. పంచాయతీ పురోగతి సూచికతో (పీఏఐ) సహా పంచాయతీరాజ్ శాఖకు చెందిన నాలుగు ప్రాజెక్టులు ప్రతిష్ఠాత్మక జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డులు 2026ను గెలుచుకున్నాయి. వీటిలో మూడు స్వర్ణ, ఒక రజత అవార్డులు ఉన్నాయి. డేటా ఆధారిత, క్షేత్రస్థాయి డిజిటల్ పాలనలో పంచాయతీరాజ్ రంగం సాధిస్తున్న విస్తృత పురోగతికి ఈ పురస్కారాలు నిదర్శనంగా నిలిచాయి.



***
(रिलीज़ आईडी: 2290200)
आगंतुक पटल : 6