రాష్ట్రపతి సచివాలయం
భారత్–నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
భారత్, నార్త్ మాసిడోనియా మధ్య ఉన్న ఆర్థిక, వాణిజ్య భాగస్వామం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
లాభదాయకమైన ప్రాజెక్టులను గుర్తించడానికి, దీర్ఘకాలిక వాణిజ్య సంబంధాల ఏర్పాటుకు ఉభయ పక్షాల వ్యాపార సంస్థలు ముందుకు రావాలి: శ్రీమతి ద్రౌపదీ ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
21 JUL 2026 10:16PM by PIB Hyderabad
స్కోప్యేలో ఈ రోజు (2026, జులై 21) జరిగిన భారత్–నార్త్ మాసిడోనియా వ్యాపార సదస్సులో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ప్రారంభోపన్యాసం చేశారు. నార్త్ మాసిడోనియా రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ గోర్డానా సిల్జానోవ్‌స్కా–దావ్కోవా, నార్త్ మాసిడినోయా ప్రభుత్వ సభ్యులు, రెండు దేశాలకు చెందిన పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నార్త్ మాసిడోనియాను భారత రాష్ట్రపతి సందర్శించడం ఇదే తొలిసారి అని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇది ఉమ్మడి ప్రయోజనాలను అందించే అన్ని రంగాల్లోనూ నార్త్ మాసిడోనియాతో సహకారాన్ని పెంపొందించుకోవడంపై భారత్‌కున్న ఆసక్తిని తెలియజేస్తోందని చెప్పారు. భారత్, నార్త్ మాసిడోనియా మధ్య ఉన్న ఆర్థిక, వాణిజ్య భాగస్వామం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. స్థిరమైన, సానుకూల మార్గంలో ద్వైపాక్షిక వాణిజ్యం ముందుకు సాగుతున్నప్పటికీ.. ఇది సాధించగలిగిన దానిలో చిన్న భాగాన్ని మాత్రమే సూచిస్తుందన్నారు.
వాణిజ్యం నుంచి నిజమైన ఆర్థిక భాగస్వామ్యం దిశగా చేసే ప్రయాణంలో పరస్పర పెట్టుబడులపై దృష్టి సారించాలని రాష్ట్రపతి సూచించారు. డిజిటల్ ఆవిష్కరణలు, కృత్రిమ మేధ, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సేవలు, ఆగ్రో ప్రాసెసింగ్, హరిత విద్యుత్ పరివర్తనతో సహా వివిధ రంగాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉందని ఆమె తెలియజేశారు. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సదస్సు (వేవ్స్)లో పాల్గొనాలని నార్త్ మాసిడోనియాను ఆమె ఆహ్వానించారు.
అంకుర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, సాంకేతిక సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని రాష్ట్రపతి వివరించారు. కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఆవిష్కరణ రంగాల్లోనూ సహకారాన్ని అన్వేషించాలని ఆమె అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2287562)
సందర్శకుల సూచీ సంఖ్య : : 49