హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలపై కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన కోల్‌కతాలో సమీక్ష


రాష్ట్ర భద్రత యంత్రాంగం.. న్యాయ వ్యవస్థ.. పోలీసు సామర్థ్య బలోపేతంపై పలు కీలక ఆదేశాలు జారీ

“గ్రామీణ ప్రాంతాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ‘మహిళా అవగాహన కార్యక్రమం’ నిర్వహించాలి”

“గ్రామీణ మహిళలతో నిరంతర సంప్రదింపుల ద్వారా వారిలో అవగాహన పెంచి సాధికారత కల్పనకు కృషి చేయాలి”

“ఎన్‌ఐఏ తరహా ‘ప్రత్యేక దర్యాప్తు సంస్థ’ (ఎస్‌ఐఏ) సహా ఏఎన్‌టీఎఫ్.. ఏటీఎస్.. ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి”

“సరిహద్దు ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించాలి”

“వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో లోగడ ఏర్పాటు చేసిన భద్రత శిబిరాల్లో మూడింట ఒక వంతును ప్రభుత్వ సేవా ప్రదాన కేంద్రాలుగా మార్చాలి”

“సైబర్ భద్రత రంగ సామర్థ్య బలోపేతం సహా క్రమం తప్పకుండా ‘ఎన్‌కార్డ్‌’ సమావేశాలు నిర్వహించాలి”

“కోల్‌కతా నగరం కోసం సమగ్ర వరద నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలి”

రాష్ట్ర పరిధిలోని అన్ని ఉగ్రవాద.. యూఏపీఏ కేసులపై ఎన్‌ఐఏ ద్వారా సమగ్ర సమీక్షకు నిర్ణయం

రాష్ట్ర పోలీసు విభాగం ఆధునికీకరణ.. సేవా వ్యవస్థల మెరుగుదలకు తగిన బడ్జెట్ మద్దతుపై హామీ

प्रविष्टि तिथि: 19 JUL 2026 7:02PM by PIB Hyderabad

   పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలపై ఈ రోజు కోల్‌కతాలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా కేంద్ర హోం శాఖ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల తాజా పరిస్థితిపై సమీక్షలో భాగంగా భద్రత యంత్రాంగం, న్యాయ వ్యవస్థ సహా పోలీసు విభాగంలో సామర్థ్య బలోపేతంపై శ్రీ అమిత్‌ షా అనేక కీలక ఆదేశాలు జారీచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ‘మహిళా అవగాహన కార్యక్రమం’ నిర్వహించాలని సూచించారు. అలాగే, అధికారులు గ్రామీణ మహిళలతో నిరంతర సంప్రదింపుల ద్వారా వారిలో అవగాహన పెంచి సాధికారత కల్పనకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏదైనా అవసరం ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేంద్ర హోం శాఖను సంప్రదించవచ్చునని సూచించారు.

రాష్ట్ర అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా చేపట్టాల్సిన పలు చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ‘యాంటీ-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్’ (ఏఎన్‌టీఎఫ్), ‘యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్’ (ఏటీఎస్‌) సహా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తరహాలో ‘రాష్ట్ర దర్యాప్తు సంస్థ' (ఎస్‌ఐఏ)ను ప్రత్యేకంగా ఏర్పరచాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ఉగ్రవాదం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) సంబంధిత కేసులన్నింటిపై ‘ఎన్‌ఐఏ’ ద్వారా సమగ్ర సమీక్షకు నిర్ణయించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల ఆక్రమణలను తక్షణం తొలగించాలని స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్ పోలీసుల సామర్థ్య వికాసం, మౌలిక సదుపాయాల బలోపేతం, అత్యాధునిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్ర పోలీసు విభాగం ఆధునికీకరణ, సేవా ప్రదానం మెరుగుదలకు కేంద్రం నుంచి తగిన బడ్జెట్ మద్దతు లభిస్తుందని శ్రీ అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగా జాతీయ సగటుకు తగినట్లు పోలీసు బలగాల సంఖ్యను పెంచే దిశగా సమగ్ర సమీక్ష ద్వారా పోలీసు జిల్లాల సంఖ్యను హేతుబద్ధీకరిస్తామని తెలిపారు. అలాగే, ఖాళీలన్నింటినీ నిర్దిష్ట వ్యవధిలో భర్తీ చేయడం, శిక్షణ సామర్థ్యాలపై సమీక్ష సహా పౌర కార్యకర్తలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఆదేశించారు. కానిస్టేబుళ్ల నియామకానికి ప్రాధాన్యంపై దృష్టి సారించాలని చెప్పారు.

రాష్ట్రంలో ఇంతకుముందు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భద్రత శిబిరాల్లో మూడింట ఒక వంతును ‘ప్రభుత్వ సేవా ప్రదాన కేంద్రాలు’గా మార్చడంపై సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాకుండా సైబర్ భద్రత రంగంలో సామర్థ్యం పెంపు, మాదకద్రవ్యాల దొంగ రవాణా నిరోధంపై ‘ఎన్‌కార్డ్‌’ సమావేశాలను క్రమబద్ధంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. కోల్‌కతా నగరం కోసం ఒక సమగ్ర వరద నిర్వహణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశాలిచ్చారు. చివరగా- తక్షణ చర్యలు చేపట్టాల్సిన ప్రాధాన్యాంశాలను గుర్తించి, నిర్దేశిత వ్యవధిలోగా అవి అమలయ్యేలా చూడాలని సంబంధిత అధికార సంస్థలను శ్రీ అమిత్‌ షా ఆదేశించారు.

***


(रिलीज़ आईडी: 2286429) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada