రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత తొలి ‘హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్’ రైలు సిద్ధం

సుమారు 2,600 మంది ప్రయాణికులను మోసుకెళ్లగల సామర్థ్యంతో ఆమూలాగ్రం మారనున్న సుస్థిర రైలు రవాణా రూపురేఖలు

ఈ నవశకపు రైలును నడిపే అద్భుత హైడ్రోజన్ ఇంధనంతో కాలుష్య రహిత భారత రైల్వేల ప్రగతికి ఊతం

హైడ్రోజన్ లీకేజీ.. ఉష్ణోగ్రత.. మంటలు.. పొగను గుర్తించగల బహుళ అంచెల భద్రత వ్యవస్థలతో అత్యంత సురక్షిత రైలుగా ధ్రువీకరణ

प्रविष्टि तिथि: 16 JUL 2026 11:14AM by PIB Hyderabad

   భారత తొలి ‘హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్’ రైలు అత్యాధునిక సాంకేతిక హంగులతో పట్టాలపై పరుగు తీసేందుకు సిద్ధమవుతోంది. అత్యంత పరిశుభ్ర, పర్యావరణ హిత ఇంధనమైన హైడ్రోజన్‌ ద్వారా తనకు అవసరమైన విద్యుత్తును ఇది స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. తద్వారా రైలు దూసుకెళ్లే సమయంలోనూ ఉద్గారాల విడుదల నామమాత్రంగానే ఉంటుంది. బొగ్గు, ఆవిరి నుంచి పరిశుభ్ర, మరింత సుస్థిర ఇంధన వనరుల దిశగా భారతీయ రైల్వేల పరిణామ క్రమంలో విస్తృత ప్రస్థానాన్ని ప్రతిబింబించే ఈ మలుపు తాజా అధ్యాయానికి నాంది పలుకుతోంది.

దేశవ్యాప్తంగా గడచిన 12 ఏళ్ల నుంచీ రైల్వేల విద్యుదీకరణ వేగం పుంజుకుంది. దీంతో డీజిల్‌ దిగుమతి పరాధీనత గణనీయంగా తగ్గి, కాలుష్య రహిత రైలు రవాణాలో తదుపరి దశకు మార్గం సుగమమైంది. ఈ మేరకు 99 శాతానికి పైగా బ్రాడ్ గేజ్ మార్గాల  విద్యుదీకరణతో రైల్వేల ప్రస్థానం మరో అడుగు ముందుకేసింది. అయితే, తాజా పరిణామంతో ఇప్పుడిక ఎగువనున్న లైన్ల నుంచి విద్యుత్తును గ్రహించే సంప్రదాయక విద్యుత్‌ రైళ్ల నుంచి రైల్వేల భవిష్యత్తు మరో కొత్త మలుపు తీసుకుంటుంది. ఆ మేరకు హైడ్రోజన్-ఆక్సిజన్ మధ్య రసాయన చర్య ద్వారా ‘హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్’ రైలు తనకుతానే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ రసాయన చర్య ఫలితంగా వెలువడే ఏకైక ఉప-ఉత్పత్తి కేవలం నీటి ఆవిరి మాత్రమే కావడం గమనార్హం.

దేశంలో ఒకప్పుడు ఆవిరి, డీజిల్‌తో నడిచే రైళ్లు ప్రయాణికులతోపాటు తమ ఇంధన వనరును కూడా మోసుకెళ్లేవి. అయితే, ఈ ఆధునిక రైలు తద్భిన్నంగా సొంత హైడ్రోజన్‌ వనరుతో వాతావరణంలోని ఆక్సిజన్‌ను గ్రహించి, తన ఇంధనాన్ని తానే ఉత్పత్తి చేసుకుంటుంది. దీనివల్ల దహన ప్రక్రియ తప్పడమే కాకుండా వెలుపలి నుంచి విద్యుత్ సరఫరాపై ఆధారపడే అవసరం ఉండదు. పరిశుభ్ర హైడ్రోజన్ సాంకేతికతతో విద్యుదుత్పాదన సాగుతుంది కాబట్టి, ఈ రైలు అత్యంత పర్యావరణ హితంగా మారుతుంది. తద్వారా సుస్థిర రైలు రవాణా భవిష్యత్తును శక్తిమంతం చేస్తుంది. ఈ అధునాతన చోదక వ్యవస్థకు తోడు హైడ్రోజన్ లీకేజీ, ఉష్ణోగ్రత, మంటలు, పొగ తదితరాలను గుర్తించగల బహుళ అంచెల భద్రత వ్యవస్థలను ఈ రైలులో అమర్చారు. దీన్ని 89 కిలోమీటర్ల పొడవైన జింద్-సోనిపత్ మార్గంలో గంటకు 75 కిలోమీటర్ల ఆచరణాత్మక వేగంతోపాటు 110 కిలోమీటర్ల మూల వేగంతో ప్రయోగాత్మకంగా నడపడం ద్వారా రైలు భద్రతను, వేగాన్ని ధ్రువీకరించారు.

 

***


(रिलीज़ आईडी: 2285645) आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Bengali-TR , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam