యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
‘వికసిత్ భారత్ కోసం వ్యసన రహిత యవత’ ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ యువ కనెక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మై భారత్
నెల రోజుల పాటు సాగే ఈ ప్రచారంలో భాగంగా అవగాహన సదస్సులకు నాయకత్వం వహిస్తూ.. మత్తు రహిత, వికసిత్ భారత్‌ను నిర్మించేలా యువతను ఉత్సాహపరచనున్న యూత్ ఐకాన్లు
प्रविष्टि तिथि:
15 JUL 2026 4:01PM by PIB Hyderabad
వికసిత్ భారత్ 2047, మత్తు రహిత భారత్‌ను నిర్మించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ. మై భారత్ ద్వారా దేశవ్యాప్త విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ‘వికసిత్ భారత్ యువ కనెక్ట్ కార్యక్రమం’ నిర్వహించనుంది. ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ (వికసిత్ భారత్ కోసం వ్యసన రహిత యువత) అనే ప్రత్యేక ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జూలై 16 నుంచి ఆగస్టు 15, 2026 వరకు ఈ కార్యక్రమం సాగనుంది.
నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం.. యువతీ యువకులను దేశ అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించడమే కాకుండా, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పిస్తుంది. పౌర భాగస్వామ్యాన్ని, మాదక ద్రవ్య వ్యతిరేక ప్రచారాన్ని మేళవించడం ద్వారా యువతను ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన, వ్యసన రహిత భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం కృషి చేస్తుంది.
ఈ కార్యక్రమం మై భారత్ వేదికపై ముఖాముఖి చర్చలు, అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ భాగస్వామ్యం వంటి అంశాలపై విద్యార్థులలో చైతన్యం తీసుకురానుంది. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి మాదకద్రవ్య రహిత సమాజమే అత్యంత ఆవశ్యకమని గ్రహించేలా చేయడం, దేశ నిర్మాణంలో యువత చురుగ్గా పాలుపంచుకునేలా ఉత్తేజపరచడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్‌డీ) రాష్ట్ర ఛాంపియన్లు, వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ విజేతలు, ఎన్ఎస్ఎస్ అవార్డు గ్రహీతలు, జాతీయ యువజన పురస్కార గ్రహీతలు, ఇతర ప్రతిభావంతులైన యువ నాయకులు ప్రత్యేక యూత్ ఐకాన్స్ రూపంలో వివిధ విద్యాసంస్థలను సందర్శిస్తారు. విద్యార్థులతో నేరుగా సంభాషిస్తూ దేశ అభివృద్ధి ప్రస్థానంపై వారు తమ అనుభవాలను పంచుకుంటారు. మాదకద్రవ్యాల అలవాటు అనేది ఒక వ్యక్తి ఆశయాలకు, సామాజిక శ్రేయస్సుకు, దేశ పురోగతికి ఎలా ఒక పెద్ద సవాలుగా మారుతుందో యువతకు వివరిస్తారు.
ఈ సదస్సులలో పాల్గొనే విద్యార్థుల కోసం మాదకద్రవ్యాల బారిన పడి కోలుకున్న వ్యక్తులు, వారి కుటుంబాలు అనుభవించిన బాధాకరమైన నిజ జీవిత అనుభవాలను తెలియజేసేలా ప్రత్యేకంగా రూపొందించిన ఒక అవగాహన చిత్రాన్ని ప్రదర్శిస్తారు. అనంతరం విద్యార్థులందరితో నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తారు. తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతామని, దేశాభివృద్ధికి తోడ్పడతామని యువత మరోసారి ప్రమాణం చేస్తుంది. వీలైన చోట్ల స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో... వ్యసనం నుంచి విజయవంతంగా బయటపడిన రికవరీ వారియర్స్ తమ నిజ జీవిత అనుభవాలను నేరుగా పంచుకునేలా ఏర్పాట్లు చేసి ఈ ప్రచార ప్రభావాన్ని మరింత పెంచుతారు.
విద్యార్థుల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి కార్యక్రమ వేదికల వద్ద ప్రత్యేక మై భారత్ ఫెసిలిటేషన్ డెస్కులను ఏర్పాటు చేస్తారు. ఇవి విద్యార్థులు అక్కడికక్కడే మై భారత్ వేదికలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి, ఈ సంస్థ ద్వారా అందుబాటులో ఉన్న వివిధ యువజన అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవడానికి సహాయపడతాయి. దేశవ్యాప్తంగా బ్యానర్లు, స్టాండీలు, డిజిటల్ ప్రచారం ద్వారా ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తారు.
ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ, పట్టణ, గిరిజన వర్గాలకు చెందిన 15 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతను భాగస్వాములను చేస్తుంది. పాల్గొనే సంస్థలు భవిష్యత్తులో నిరంతర యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, రాబోయే మై భారత్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా మై భారత్ చాప్టర్లను ఏర్పాటు చేయవచ్చు. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు, కార్యక్రమానికి సంబంధించిన కార్యకలాపాలు మై భారత్ వేదిక ద్వారా నిర్వహిస్తారు.
‘వికసిత్ భారత్ యువ కనెక్ట్ ప్రోగ్రామ్’ అనేది సమాజం పట్ల అవగాహన, బాధ్యత, సామాజిక స్పృహ కలిగిన యువ పౌరులను తీర్చిదిద్దడంలో మై భారత్ నిరంతర కృషికి నిదర్శనంగా నిలుస్తుంది. మాదకద్రవ్య రహిత సమాజ స్థాపన కోసం పోరాడుతూనే.. 2047 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయాణంలో ఈ యువతే ముందుండి నడిపిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2285208)
आगंतुक पटल : 16