యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ప్రచారంలో భాగంగా జిల్లా స్థాయి పోటీలకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన మై భారత్


మూడు దశల్లో పోటీల నిర్వహణ

న్యూఢిల్లీలో జరిగే జాతీయ యువ సదస్సుతో పోటీలకు ముగింపు

నాడు పోస్టు చేయడమైనది: 12 JUL 2026 8:29PM by PIB Hyderabad

వికసిత్ భారత్ – 2047 లక్ష్యం దిశగా భారత్ ముందుకెళుతున్న తరుణంలో.. సామాజిక పరివర్తన రూపశిల్పులుగా యువతను తీర్చిదిద్దడం ముఖ్యం. మత్తుపదార్థాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలన్న ప్రధానమంత్రి పిలుపుతో.. మేరా యువ భారత్ (మై భారత్) ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (ఎంవైఏఎస్) దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం తదుపరి దశను ప్రారంభించింది. దీనిలో భాగంగా 2026 జూలై 13 నుంచి దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమవుతాయి. సృజనాత్మక, సంస్కృతీ, సామాజిక నాయకత్వ శక్తితో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యసాధనకు దోహదపడుతూనే, నషా ముక్త్ భారత్ ఉద్యమానికి నాయకత్వం వహించేలా యువతను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

వ్యవస్థీకృత జాతీయ వేదిక ద్వారా ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేలా.. ఈ పోటీలను మూడు దశల్లో నిర్వహిస్తారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో- మూడు దశలుగా నిర్వహించే ఈ పోటీలకు రిజిస్ట్రేషన్లు 2026 జులై 13న ప్రారంభమవుతాయి. 2026 జులై 24 నుంచి 27 వరకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. ప్రతి విభాగంలోనూ తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారిని ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచినవారు 2026 జులై 30 నుంచి ఆగస్టు 6 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అనంతరం, రాష్ట్ర ఛాంపియన్‌లను 2026 ఆగస్టు 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయిలో జరిగే ఫైనల్స్‌కు ఆహ్వానిస్తారు. అక్కడ దేశవ్యాప్తంగా ఎంపికైన అత్యుత్తమ యువ ప్రతిభావంతులు జాతీయ యువజన సదస్సులో తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. 

యువత నేతృత్వంలోని సృజనాత్మక వ్యక్తీకరణ శక్తే ఈ ప్రచారానికి ప్రధాన కేంద్రంగా ఉంది. నృత్యం, సంగీతం, రీల్-షార్ట్ ఫిల్మ్, నుక్కడ్ నాటక్, స్లామ్ పొయెట్రీ అనే అయిదు సృజనాత్మక విభాగాలలో జిల్లా స్థాయి పోటీలను మై భారత్ నిర్వహిస్తుంది. సంస్కృతి, కథనం, సంగీతం, డిజిటల్ సృజనాత్మకతను మేళవించడం ద్వారా ఈ పోటీలు... సమాజంలో స్ఫూర్తి నింపడానికీ, తమ తోటివారిని ప్రభావితం చేయడానికీ, మాదకద్రవ్య రహిత భారతదేశ సందేశాన్ని విస్తృతం చేయడానికీ అవసరమైన ఒక ప్రత్యేకమైన వేదికను యువతకు అందిస్తాయి. 

విస్తృతమైన, సమ్మిళితమైన భాగస్వామ్యాన్ని ఈ పోటీల్లో ప్రోత్సహిస్తున్నారు. 15  నుంచి 29 ఏళ్ల వయసు వరకు ఉన్న యువత ఈ పోటీల్లో వ్యక్తిగత, బృంద విభాగాల్లో పాల్గొనవచ్చు. తమ సృజనాత్మక ఆలోచనలను హిందీ, ఇంగ్లీష్ లేదా ఏదైనా ప్రాంతీయ భాషలో సమర్పించవచ్చు. తద్వారా ప్రాంతీయ లేదా భాషాపరమైన భేదం లేకుండా ప్రతి యువ గళానికి ఈ జాతీయ ఉద్యమంలో భాగమయ్యే అవకాశం లభిస్తుంది. 

జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే ప్రక్రియను సులభతరం చేస్తూ.. 2026 జులై 13 నుంచి మై భారత్ పోర్టల్ (mybharat.gov.in )లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈ పోర్టల్ ద్వారా యువత నమోదు చేసుకొని, తమ సృజనాత్మక ఎంట్రీలను సమర్పించవచ్చు. ఈ ప్రక్రియను పోటీలకు తొలి దశగా పరిగణిస్తారు.

అమృత కాలంలో సామాజిక మార్పు కోసం సృజనాత్మకతను ఓ శక్తిగా ఉపయోగించుకోవడానికి, నషా ముక్త్ భారత్ లక్ష్యానికి దోహదపడటానికి, వికసిత్ భారత్ దార్శనికతతో తమ శక్తినీ, ఆకాంక్షలను అనుసంధానించుకోవడానికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువ భారత్ పోర్టల్ ద్వారా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ యువతను కోరింది.

 

***


(రిలీజ్ ఐడి: 2284136) సందర్శకుల సూచీ సంఖ్య : : 95
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Khasi , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam