ప్రధాన మంత్రి కార్యాలయం
ఆస్ట్రేలియాలోని భారతీయులతో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
09 JUL 2026 6:40PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మెల్బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో ఆస్ట్రేలియాలోగల భారతీయులతో నిర్వహించిన భారీ సభలో వారినుద్దేశించి ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గౌరవనీయ ఆంథోనీ అల్బనీస్ కూడా గౌరవపూర్వకంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తనకు ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులందరికీ ప్రధానమంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బనీస్ ఈ సభకు హాజరు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయుల సంక్షేమం సహా రెండు దేశాల సంబంధాలపై ఆయన నిబద్ధతను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ద్వైపాక్షిక భాగస్వామ్యంలో గత దశాబ్ద కాలంలో సాధించిన అద్భుత ప్రగతిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థల మధ్య పరస్పర పూరక, సురక్షిత-సుసంపన్న, పటిష్ట బంధానికి రూపుదిద్దడంలో రెండు దేశాల సహజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ద్వైపాక్షిక సంబంధాలు మరింత దృఢతరం కావడంలో ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయుల కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధానికి వారొక వారధిగా నిలిచారని అభివర్ణించారు. ఆస్ట్రేలియా సామాజిక వ్యవస్థలో భారతీయ సమాజం ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ తమ సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ వస్తున్నాదని గుర్తుచేశారు. సంప్రదాయానుగత ఆప్యాయతలు, ఆదరాభిమానాలను, ఉత్సాహాన్ని స్థానికులతో పంచుకుంటున్నారని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో ఉన్నారని, మరోవైపు భారత్‌లో ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు తమ శాఖల సంఖ్యను పెంచుతున్నాయని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల రీత్యా విద్య అత్యంత బలమైన మూలస్తంభాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు.
సుస్థిర అధిక వృద్ధి, విధాన సంస్కరణలు, డిజిటల్ విప్లవం, అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన ప్రాతిపదికగా భారత్ వేగంగా పురోగమిస్తుండటాన్ని ప్రధానమంత్రి వివరించారు. కమ్యూనికేషన్ సాంకేతికతలు, సెమీకండక్టర్లు, స్మార్ట్‌ఫోన్ల తయారీ, ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా రక్షణ ఉత్పత్తుల ఎగుమతి తదితరాల్లో దేశం కొత్త పుంతలు తొక్కుతున్నదని ఆయన వివరించారు. ప్రజాస్వామ్య బలం, ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణల సమ్మేళనంతో భారత్ తన ప్రపంచ భాగస్వాములకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నదని పేర్కొన్నారు. భారత్ విధానాలు కేవలం స్వీయ ప్రగతిపై మాత్రమే దృష్టి సారించడం లేదని, మిత్రదేశాలు సహా భాగస్వాములతో భుజం కలిపి నడవడాన్ని నిర్దేశిస్తాయని తెలిపారు. దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా రూపుదిద్దాలనే లక్ష్య సాధన దిశగా ఆలోచనలతోనే కాకుండా నైపుణ్యంతోనూ సహకరించాలని ప్రవాస భారతీయులకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి విద్యార్థులు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, సామాజిక వేత్తలు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు వివిధ రంగాల ప్రవాస భారతీయులు హాజరయ్యారు. రెండు దేశాల ప్రజల మధ్యగల ప్రగాఢ బంధమే ద్వైపాక్షిక బంధంలోని విశిష్టత కాగా, ఆస్ట్రేలియాలో ప్రస్తుతం 10 లక్షల మందికిపైగా భారతీయులు నివసిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2283089)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam