ప్రధాన మంత్రి కార్యాలయం
రక్షణ, భద్రతా రంగాల్లో సహకారంపై ఇండియా-ఆస్ట్రేలియా సంయుక్త ప్రకటన
प्रविष्टि तिथि:
09 JUL 2026 10:55AM by PIB Hyderabad
భారత్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులమైన మేం.. మా మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాల ద్వారా ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో ఏకమై.. ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛా, శాంతియుత, స్థిరమైన, సుసంపన్నమైన ప్రాంతంగా మార్చాలన్న ఉమ్మడి ఆశయంతో రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనకు కట్టబడి ఉంటామని తెలియజేస్తున్నాం.
ఇరుదేశాల మధ్య 2020లో ఏర్పాటైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (సీఎస్‌పీ) ప్రాముఖ్యతను గుర్తించాం. సీఎస్‌పీ ప్రారంభమైనప్పటి నుంచి రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత వేగవంతమై, ఆర్థిక బంధాలు బలోపేతమయ్యాయి. ఇరుదేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడ్డాయి. క్వాడ్, ఇతర సంస్థల వంటి ప్రాంతీయ వేదికల ద్వారా ఇతర భాగస్వాములతో సహా ద్వైపాక్షికంగా, పలు విధాలుగా సన్నిహిత సంబంధాలు ఇరుదేశాలకు ప్రయోజనం చేకూర్చి, మన ఉమ్మడి ప్రాంత భద్రత, అభివృద్ధికి దోహదపడతాయి.
2009 నాటి భారత్-ఆస్ట్రేలియా ఉమ్మడి రక్షణ సహకార ప్రకటన ద్వారా ఇరుదేశాల భాగస్వామ్యంలో సాధించిన గొప్ప పురోగతిని మేం గుర్తుచేసుకున్నాం. విదేశాంగ మంత్రుల వ్యవస్థీకృత చర్చలు (ఎఫ్ఎంఎఫ్‌డీ), 2+2 విదేశాంగ, రక్షణ మంత్రుల చర్చలు.. రక్షణ మంత్రుల చర్చల వంటి వివిధ ద్వైపాక్షిక విధానాల ద్వారా ఈ భాగస్వామ్యానికి సహకరించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం.
భౌగోళికంగా నెలకొన్న అనిశ్చితి, ప్రాంతీయ శాంతి, భద్రతలకు ఎదురవుతున్న ముప్పు పట్ల మేం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. సంబంధిత పక్షాలన్నీ శాంతియుతంగా పని చేయాలని కోరుతున్నాం. ఎలాంటి బెదిరింపులు, బలప్రయోగానికి పాల్పడకుండా అంతర్జాతీయ చట్టాలకు లోబడి వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తున్నాం.
అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండే వ్యవస్థ, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించటం, 1982 ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందానికి (యూఎన్‌సీఎల్ఓఎస్)కు కట్టుబడి ఉండటం ద్వారా సముద్ర ప్రయాణాలు, విమాన ప్రయాణాలు స్వేచ్ఛగా, సురక్షితంగా సాగటం.. సమర్థవంతమైన, సమ్మిళిత, పారదర్శకమైన సంస్థల మద్దతుతో ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛా, శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన ప్రాంతంగా మార్చేందుకు నిబద్ధతను తెలియజేస్తున్నాం.
ఆయా ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ), ఆసియాన్, ఆసియాన్ కేంద్రీకృత ప్రాంతీయ వ్యవస్థ, పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్ (పీఐఎఫ్)లకు మేం మద్దతిస్తున్నాం.
మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులకు అనుగుణంగా ఇరుదేశాల భాగస్వామ్యం మరింత వృద్ధి చెందాల్సిన అవసరాన్ని గుర్తించాం. ఇందులో భాగంగానే అత్యాధునిక, సమగ్ర, అగ్రశ్రేణి రక్షణ, భద్రతా రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని వేగవంతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. మన వ్యూహాత్మక ప్రయోజనాల పరస్పర ఆసక్తిని ప్రతిబింబించేలా వ్యూహాత్మక వినిమయాన్ని బలోపేతం చేయటానికి, క్రమం తప్పకుండా మంత్రిత్వ స్థాయి చర్చల నిర్వహణను మేం కొనసాగిస్తాం. ఉమ్మడి శక్తిని పెంపొందించుకునేందుకు రక్షణ, భద్రతా రంగాల సహకారంలో దీర్ఘకాలిక దృక్పథాన్ని మనం గుర్తిస్తున్నాం. ఈ పరస్పర సహకారం ఇరుదేశాల భద్రతకు దోహదపడటమే కాక ప్రాంతీయ శాంతి, భద్రతలకు కూడా తోడ్పడుతుంది.
సమగ్ర రక్షణ సహకారాన్ని బలోపేతం చేయటానికి, వ్యూహాత్మక చర్చలను మరింతగా పెంచేందుకు పలు అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవటానికి మేం కట్టుబడి ఉన్నాం. అవి:
a. ఉమ్మడి ప్రయోజనాలపై ప్రభావం చూపే ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని రక్షణ సంబంధిత పరిణామాలపై సంప్రదింపులు జరపటం.
b. భాగస్వామ్య దేశాలతో కలిసి నిర్వహించే రక్షణ విన్యాసాల స్థాయిని, నాణ్యతను పెంచటం.
c. రక్షణ దళాల మధ్య పరస్పర సామర్థ్యం, సమాచార మార్పిడిని పెంపొందించే ప్రయత్నాలను వేగవంతం చేయటం.
d. ఒకరి భూభాగాల నుంచి మరొకరి రక్షణ విమానాల వినియోగాన్ని విస్తరించటం.
e. పరస్పర బదిలీలు, విద్య, శిక్షణ, అనుసంధాన పాత్రల ద్వారా రక్షణ దళాల సిబ్బంది మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయటం.
f. నైపుణ్యం గల రక్షణ సిబ్బందిని భర్తీ చేయటంలో పరస్పర సహకార అవకాశాలను అన్వేషించటం.
రక్షణ, భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు సముద్ర రంగం కీలకమని మేం గుర్తిస్తున్నాం. సముద్ర భద్రతా సహకారాన్ని మరింత పటిష్టంగా, అధునాతనంగా, నిరంతరాయంగా కొనసాగిస్తాం. భారత్-ఆస్ట్రేలియా సముద్ర భద్రతా సహకార రోడ్‌మ్యాప్ ద్వారా ఈ సముద్ర సహకారాన్ని మేం మరింత బలోపేతం చేస్తాం.
పరిశ్రమల అనుసంధానం, భాగస్వామ్యాల పెంపుదల, సరఫరా వ్యవస్థలో స్థిరత్వాన్ని బలోపేతం చేయటం ద్వారా ఇరుదేశాల రక్షణ పరిశ్రమలకున్న ఎదుగుదల సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటాం. మన రక్షణ ఆవిష్కరణల వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తాం. అధునాతన రక్షణ విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో కలిసి పనిచేసేందుకు అవసరమైన ఒప్పందాలను కుదుర్చుకుంటాం.
ఘర్షణల నివారణలో, సహాయక, పునరావాస చర్యలను తీసుకోవటంలో, శాశ్వత శాంతి స్థాపనలో మహిళల క్రియాశీలక భాగస్వామ్యాన్ని, నాయకత్వాన్ని పెంపొందించేందుకు మేం కృషి చేస్తాం. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో లింగ సమానత్వాన్ని కాపాడేందుకు, మహిళలు, శాంతి, భద్రత అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు మా నిబద్ధతను తెలియజేస్తున్నాం.
ప్రాంతీయ ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ద్వైపాక్షికంగా, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. క్లిష్టమైన ఖనిజాలు, స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతలతో సహా... మరింత వైవిధ్యభరితమైన, స్థిరమైన సరఫరా వ్యవస్థలను, కీలకమైన మౌలిక సదుపాయాలను, అనుసంధానాన్ని మేం అభివృద్ధి చేస్తాం.
సురక్షితమైన, స్థిరమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడి దార్శనికతకు అనుగుణంగా సాంకేతిక వ్యవస్థను రూపొందించేందుకు మనం కలిసి పనిచేస్తాం. ఆస్ట్రేలియా-ఇండియా పార్టనర్‌షిప్ ఆన్ సైబర్, క్రిటికల్ టెక్నాలజీస్ అండ్ సప్లై చెయిన్స్ ద్వారా సైబర్ భద్రత, కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సహకారం, సమాచార మార్పిడి వ్యవస్థల సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు మనం కలిసికట్టుగా కృషి చేస్తాం. వ్యూహాత్మక సాంకేతికతలపై సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాం.
మా ప్రాంతంలోని ఉగ్రవాద ముప్పు, ఉగ్రవాద సంస్థలు, వాటికి సంబంధించిన వ్యక్తుల సమాచారాన్ని పంచుకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం. హింసాత్మక తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలను అన్వేషిస్తాం. ఆ రంగాలు:
a. నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు.
b. ఉగ్రవాదానికి ఆర్థిక సహకారం అందుతున్న తీరు
c. కీలక మౌలిక సదుపాయాలు, రద్దీ ప్రదేశాలు
d. సముద్రయాన రంగం
e. ఆన్‌లైన్ ద్వారా తీవ్రవాద భావజాలానికి గురవటం.
అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, స్మగ్లింగ్ నివారణపై పరస్పర సహకారానికి వీలుగా 2023లో కుదుర్చుకున్న వలసలు, రవాణా భాగస్వామ్య ఒప్పందం ప్రకారం సహకారాన్ని కొనసాగిస్తాం. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను అణచివేయటానికి కూడా సహకారాన్ని కొనసాగిస్తాం.
అణ్వాయుధాలు లేని ప్రశాంతమైన ప్రపంచాన్ని మేం కాంక్షిస్తున్నాం. ఇందుకోసం అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించటానికి పక్షపాతం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణంగా, ధ్రువీకరించదగిన రీతిలో అణ్వాయుధ నిర్మూలనకు కట్టుబడి ఉంటామని మేం స్పష్టం చేస్తున్నాం.
ఇండో-పసిఫిక్ మహాసముద్రాల ప్రత్యేక కార్యక్రమం (ఐపీఓఐ) ద్వారా ఇతర భాగస్వాములతో సహకారాన్ని కొనసాగించేందుకు, త్రైపాక్షిక సహకార వ్యవస్థలతో కలిసి పనిచేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. స్వేచ్ఛా, స్థిరమైన, శాంతియుతమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణ లక్ష్యం కోసం సామర్థ్యాలను, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవటానికి అమెరికా, జపాన్ దేశాలతో సహకారాన్ని మేం మరింత విస్తరిస్తాం.
ప్రాంతీయ శాంతి, భద్రత, సుసంపన్నత, స్థిరత్వం పట్ల ఉమ్మడి నిబద్ధతను గుర్తిస్తూ... వేగవంతమైన, సమన్వయంతో కూడిన, స్థిరమైన విపత్తు ప్రతిస్పందన కోసం మానవతా సహాయం, విపత్తు ఉపశమనం (హెచ్ఏడీఆర్) రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. దీని కోసం పలు మార్గాల ద్వారా మేం సహకారాన్ని పెంపొందించుకుంటాం.
a. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటం, నిపుణుల మధ్య చర్చలు.
b. పెద్దఎత్తున ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు పౌరులకు అందించే క్వాడ్ ఇండో-పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్ సహా ఉమ్మడి హెచ్ఏడీఆర్ విన్యాసాలు.
ఇతర దేశాల్లో ప్రాంతీయ, ప్రపంచవ్యాప్త తరలింపు చర్యలకు మద్దతివ్వటంతో పాటు విపత్తులు, సంక్షోభాల సమయంలో అత్యవసర ప్రణాళికలను పంచుకోవటం, ఉమ్మడిగా స్పందించటం, సమన్వయం కోసం అవకాశాలను అన్వేషించేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి మద్దతుగా ఈ ప్రతిష్ఠాత్మక కార్యాచరణను అమలు చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
***
(रिलीज़ आईडी: 2282857)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam