ప్రధాన మంత్రి కార్యాలయం
ఇంధన భద్రతపై భారత్-ఆస్ట్రేలియా సంయుక్త ప్రకటన
प्रविष्टि तिथि:
09 JUL 2026 11:02AM by PIB Hyderabad
భారత్, ఆస్ట్రేలియాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. స్వేచ్ఛా, బహిరంగ, సమృద్ధి ప్రధాన ఇండో-పసిఫిక్ ప్రాంతం విషయంలో ఈ రెండు దేశాలూ ఒకే దృష్టికోణాన్ని కలిగి ఉన్నాయి.
మధ్య ప్రాచ్య ప్రాంతంలోని ప్రస్తుత స్థితి, మన ప్రాంతంపై అది ప్రసరించే ప్రభావాల విషయంలో.. మరీ ముఖ్యంగా ఇంధనం, వనరులు, ఇతర ముఖ్య సరకుల సరఫరా వ్యవస్థలతో పాటు ధరలపై దీర్ఘ కాలం పాటు పడే ప్రభావాల పట్ల భారత్, ఆస్ట్రేలియా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంతరాయం నడుమ.. బహిరంగ మార్కెట్లు, నియమాలపై ఆధారపడి వాణిజ్య నిర్వహణ పట్ల మనం మన ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ఈ సూత్రాలే మన సౌభాగ్యానికి, ఆర్థిక భద్రతకి మూలాధారాలుగా నిలుస్తున్నాయి.
సుస్థిర, విశ్వసనీయ ఇంధన సరఫరాలకు నమ్మదగిన ప్రయివేటు రంగ భాగస్వామ్యాలు, వ్యూహాత్మక పెట్టుబడులు కీలక పాత్రను పోషిస్తున్నాయని భారత్, ఆస్ట్రేలియా గుర్తిస్తున్నాయి. దీనికి సమాంతరంగా, ప్రయివేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందాన్ని (ఈసీటీఏ) కుదుర్చుకోవడంతో పాటు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని (సీఈసీఏ) కూడా కుదుర్చుకోవడానికీ రెండు దేశాలూ కట్టుబడి ఉన్నాయి. అలాగే ఇతర సముచిత ద్వైపాక్షిక ప్రాథమిక ప్రణాళికలను ఖరారు చేసుకొని ఇంధన వాణిజ్య, పెట్టుబడుల సంబంధిత సహకారాన్ని ముందుకు తీసుకుపోవాలన్న నిబద్ధతను ఉభయ పక్షాలూ వ్యక్తం చేశాయి. ఇంధన రంగంలో సామర్థ్యాలను పెంచుకుంటూ, జ్ఞానాన్ని పంచుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సి ఉందన్న సంగతిని కూడా భారత్, ఆస్ట్రేలియా ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాయి.
ద్రవీకృత సహజ వాయువు ముఖ్య సరఫరాదారు దేశంగా ఆస్ట్రేలియా పోషిస్తున్న పాత్రతో పాటు, ద్రవరూప ఇంధనాలు, ఇతర డౌన్‌స్ట్రీమ్ ఉత్పాదనల కీలక సరఫరాదారు దేశంగా భారత్ పోసిస్తున్న పాత్రను కూడా ఉభయ పక్షాలు గుర్తించాయి. ఇంధన ఉత్పాదనల నిరంతర సరఫరాను భారత్ ఆస్ట్రేలియా సమర్ధించడమే కాకుండా తమ రెండు దేశాల మధ్యా ఇంధన వాణిజ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నాయి. ఇంధన వేల్యూ చైన్లో పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాలను ప్రోత్సహించాల్సి ఉందని భారత్, ఆస్ట్రేలియా మరో సారి స్పష్టం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా-భారత్ పరమాణు సహకార ఒప్పందం (2015)లో ప్రస్తావించినట్లుగా కేవలం శాంతియుత ఉద్దేశాల కోసం, అలాగే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) నిర్దేశించిన భద్రత విధానాలను అనుసరిస్తూ ఆస్ట్రేలియాకు చెందిన యురేనియంను భారత్‌కు ఎగుమతి చేయడానికి అవసరమైన పాలనాసంబంధమైన ఏర్పాట్లను భారత్, ఆస్ట్రేలియా ఖరారు చేసుకున్నాయి.
ప్రాంతీయ సహకారాన్ని విస్తరించుకోవడం, ఇంధన వినియోగంలో మార్పు దిశగా వేగంగా పురోగమించడం, ఇంధనంతో పాటు ద్రవరూప ఇంధనం కోసం బహిరంగ వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహించడం సహా ఇంధన సరఫరా వ్యవస్థ సుదృఢత్వాన్ని మరింత పటిష్ఠపరచడానికి కలిసి పనిచేయడానికి భారత్, ఆస్ట్రేలియా కట్టుబడి ఉన్నాయి. సంబంధిత ఇంధన వ్యవస్థల్లో విద్యుదీకరణ ప్రక్రియకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని విస్తరించడం రాబోయే కాలంలో ఇంధన భద్రత పరంగా కీలకం కాగలదని ఇరు దేశాలూ గుర్తించాయి.
సుదృఢ వాణిజ్యం, మార్కెట్లు... ఈ రెండు విషయాల్లో ఉమ్మడి నిబద్ధతను భారత్, ఆస్ట్రేలియా గుర్తిస్తున్నాయి. ఇది ఇంధన రంగానికీ వర్తిస్తుంది. పసిఫిక్ ఐలాండ్ దేశాల పరంగా చూసినప్పుడు ఇంధన వనరుల భద్రతకు సంబంధించి నిర్దిష్ట బలహీనతలపైనా, ఆయా దేశాల సుదృఢత్వానికి, ఆర్థిక సమృద్ధికి ఇంధన వనరుల సరఫరా ఎంత ముఖ్యమో అన్న సంగతిపైనా ఇరు దేశాలకూ అవగాహన ఉంది.
ఈ నేపథ్యంలో ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవడానికి కలిసి పనిచేయాలనే తమ నిబద్ధతను భారత్, ఆస్ట్రేలియా పునరుద్ఘాటిస్తున్నాయి. బొగ్గు, డీజిలు, ఇతర ద్రవరూప ఇంధనాలతో పాటు సహజ వాయువు వంటి ఇంధన సంబంధిత ఉత్పాదనలకు సుస్థిర, సురక్షిత, విశ్వసనీయ సరఫరా వ్యవస్థను సంరక్షించుకోవడం ఈ విషయంలో భాగంగా ఉంది. దీనికి తోడు, ఇంధన వినియోగంలో మార్పు దిశగా పయనించడాన్ని వేగవంతం చేయాలని, తక్కువ కర్బనాన్ని కలిగి ఉండే ఇంధనాల విషయంలో సహకరించుకోవడాన్ని పెంపొందించాలన్న తమ నిబద్ధతను రెండు దేశాలూ పునరుద్ఘాటించాయి. ఈ సందర్భంగానే గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయెన్స్ (జీబీఏ) కార్యక్రమాన్ని భారత్ తీసుకువచ్చిందని ఆస్ట్రేలియా గమనించింది.
ప్రజల భద్రతని, సౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ ఇంధన వనరుల సరఫరా వ్యవస్థలను తెరిచి ఉంచే దిశగా సహకారాన్ని అందించాలంటూ ప్రాంతీయ భాగస్వామ్య దేశాలకు భారత్, ఆస్ట్రేలియా పిలుపునిచ్చాయి.
***
(रिलीज़ आईडी: 2282760)
आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam