ప్రధాన మంత్రి కార్యాలయం
వివిధ రంగాలపై ఎల్‌నినో ప్రభావం, సన్నద్ధత చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ప్రధానమంత్రి కార్యాలయం
హాజరైన వ్యవసాయం, విద్యుత్, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక వ్యవహారాలు, వినియోగదారుల వ్యవహారాలు, తదితర శాఖల కార్యదర్శులు
ఎల్‌నినో వల్ల కలగబోయే సంభావ్య ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టిన సన్నద్ధత కార్యకలాపాలపై సమగ్రమైన అంచనా వేసిన ప్రధానమంత్రి కార్యాలయం
మారుతున్న పరిస్థితులను నిరంతరం నిశితంగా గమనిస్తూ వ్యవసాయం, ఆర్థిక కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసేందుకు సూక్ష్మ, స్థానిక స్థాయి వ్యూహాలతో కలిసి పనిచేయాలని మంత్రిత్వ శాఖలను ఆదేశించిన పీఎంఓ
వ్యవసాయ ఉత్పాదకాలు, నిత్యావసర ఆహార వస్తువులు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రిత్వ శాఖలకు తెలిపిన పీఎంఓ
प्रविष्टि तिथि:
07 JUL 2026 8:59PM by PIB Hyderabad
ఖరీఫ్ సీజన్ పురోగతి, ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలపై ఎల్‌నినో వల్ల కలగబోయే సంభావ్య ప్రభావం నేపథ్యంలో తీసుకున్న సన్నద్ధత చర్యలను అంచనా వేయడానికి, సమీక్షించడానికి 2026 జూలై 7న సేవాతీర్థ్‌లో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీ.కే. మిశ్రా అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వ్యవసాయం, విద్యుత్, సహకారం, తాగునీరు- పారిశుద్ధ్యం, ఆరోగ్య- కుటుంబ సంక్షేమం, ఆర్థిక వ్యవహారాలు, పశుసంవర్ధక శాఖ, గ్రామీణాభివృద్ధి, భూ విజ్ఞాన శాస్త్రం, వ్యవసాయ పరిశోధన, విద్య, భారత వాతావరణ శాఖ (ఐఎండీ), సమాచార- ప్రసార శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆర్థిక సేవలు, ఎరువులు - కేంద్ర జల సంఘంతో సహా పదిహేనుకు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు జూన్ నెలతో పాటు జూలై 7వ తేదీ వరకు ఉన్న మొత్తం వర్షపాత పరిస్థితిని వివరించారు. దేశంలో రుతుపవనాల విస్తరణ, ఎల్‌నినో వల్ల కలగబోయే సంభావ్య ప్రభావంపై వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ తాజా సమాచారాన్ని అందించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో రుతుపవనాల రాక దాదాపు 10 రోజులు ఆలస్యమైంది. అయితే 07.07.2026 నాటికి కురిసిన వర్షపాతంతో దేశవ్యాప్త మొత్తం వర్షపాత లోటు -12 శాతానికి తగ్గింది. జూలై మొదటి వారంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూలై, ఆగస్టు నెలల్లో బలహీనమైన లేదా సాధారణ ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉంది. జూన్-సెప్టెంబర్ రుతుపవనాల సీజన్ మొత్తంలో లభించే వర్షపాతంలో 30 శాతానికి పైగా కేవలం జూలై నెలలోనే కురుస్తుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఎల్‌నినో సంవత్సరం అయినంత మాత్రాన ఆ ఏడాది వర్షపాతం తప్పనిసరిగా సాధారణం కంటే తక్కువగా ఉంటుందని భావించలేమని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్ సమయంలో ఎల్‌నినో వల్ల కలగబోయే సంభావ్య ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న సన్నద్ధత చర్యలపై వ్యవసాయ శాఖ కార్యదర్శి ఒక సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షపాతం, జలాశయాలలో నీటి నిల్వలు, పంటల సాగు, ఉత్పాదకాల అందుబాటు, మార్కెట్ పోకడలు, కొత్తగా తలెత్తే తెగుళ్లు, వ్యాధుల పరిస్థితులను పర్యవేక్షించడానికి సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం, అత్యవసర స్పందనను సులభతరం చేయడం కోసం 'క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్' రాష్ట్రాలతో కలిసి వారపు సమావేశాలను నిర్వహిస్తోంది. ముప్పు పొంచి ఉన్న 262 జిల్లాల కోసం 'జిల్లా వ్యవసాయ అత్యవసర ప్రణాళికలను' అప్‌డేట్ చేశారు. జిల్లాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే) కోసం 'భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి' (ఐకార్) ‘భారతీయ వ్యవసాయంలో ఎల్‌నినో నష్టాల నిర్వహణ’పై ప్రామాణిక నిర్వహణ విధానాలను (ఎస్ఓపీ) జారీ చేసింది. వాతావరణ మార్పులను తట్టుకునే రకాలు, సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా వర్షపాత లోటు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి స్థిరంగా కొనసాగుతోందని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాలలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పరిధిని విస్తరించడం కోసం అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. నిర్ణీత కాలపరిమితిలోగా గరిష్ఠంగా అర్హులకు ఈ సౌకర్యాలు అందేలా చూడాలని వ్యవసాయ, ఆర్థిక సేవలు, సహకార శాఖలకు సూచించారు. పశుసంవర్ధక, మిల్క్ డెయిరింగ్ శాఖను జాతీయ, స్థానిక స్థాయిలలో ఎండుగడ్డి, పచ్చిగడ్డి, పశుగ్రాసం లభ్యతను అంచనా వేయాల్సిందిగా ఆదేశించారు.
జిల్లాల వారీగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతానికి పరిస్థితి స్థిరంగా ఉందని తాగునీరు- పారిశుద్ధ్య శాఖ తెలిపింది. ముప్పు పొంచి ఉన్న జిల్లాల్లో సూక్ష్మ స్థాయి ప్రణాళికలు, పర్యవేక్షణను ఈ శాఖ నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేశారు. జలవనరుల శాఖ దేశంలోని భూగర్భ జలాలు, జలాశయాల తాజా స్థితిని వివరించింది. ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్ అంతటా నిరంతర నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.
వడగాల్పులపై అవసరమైన సూచనలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సిద్ధం చేసింది. వడగాల్పులు, అధిక తేమ, డెంగ్యూ వ్యాప్తి వంటి పరిస్థితులను ఈ శాఖ పర్యవేక్షిస్తోంది. హెచ్చరికలు, మార్గదర్శకాలను క్షేత్ర స్థాయి వరకు సమర్థవంతంగా చేరవేసేలా చూడాలని ఆదేశించారు.
బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాల రిటైల్ ధరల స్థితి, తగినంత బఫర్ నిల్వల లభ్యతను వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరించింది. రబీ సీజన్‌కు సరిపడా ఎరువుల లభ్యత, ప్రారంభ నిల్వలు ఉండే అవకాశం ఉందని ఎరువుల శాఖ నివేదించింది. నిత్యావసర వస్తువులు, ఎరువుల విషయంలో జాతీయ, స్థానిక స్థాయి లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఇరు శాఖలకు అధికారులు సూచించారు.
'వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవిక మిషన్' కింద జూలై 1 నుంచి ప్రారంభమైన పనులను గ్రామీణాభివృద్ధి శాఖ వివరించింది. దీని ద్వారా ఇప్పటివరకు 1 కోటి పనిదినాలు కల్పించారు. వాతావరణ మార్పులను తట్టుకునే విత్తన రకాల ఉపయోగాన్ని పెంచటానికి సంబంధించిన వివరాలను వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ పంచుకుంది. విద్యుత్ ఉత్పత్తి, లభ్యత విషయంలో తాజా పరిస్థితిని విద్యుత్ శాఖ వివరించింది.
మొత్తం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైనప్పుడు నివారణ చర్యలు చేపట్టేందుకు వీలుగా రుతుపవనాల ప్రభావం లేదా ఆలస్యమైన రుతుపవనాల వల్ల ముప్పు పొంచి ఉన్న జిల్లాలపై పడే ప్రభావాన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.
పశుగ్రాస అభివృద్ధి ప్రణాళికలతో పాటు తగినంత మేత లభ్యతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాలతో కలిసి క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. ముప్పు పొంచి ఉన్న జిల్లాల్లో తాగునీరు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ముప్పు పొంచి ఉన్న జిల్లాల్లోని జలాశయాల నీటి మట్టాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్న నీటిని అత్యంత మెరుగ్గా, ఆలోచనతో వినియోగించడాన్ని ప్రోత్సహించేలా తగిన ఆదేశాలు జారీ చేశారు.
సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేలా చూసేందుకు మంత్రిత్వ శాఖలన్నీ పరస్పరం సన్నిహిత సమన్వయంతో, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2282390)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam