హోం మంత్రిత్వ శాఖ
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతికి గుర్తుగా కోల్‌కతాలో కార్యక్రమం... ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
పశ్చిమ బెంగాల్‌లో జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతికి
ఆయన 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులకు శంకుస్థాపన చేయడమనేది
ఒక కట్టడం పనుల ఆరంభం మాత్రమే కాదు... ఇది ‘సోనార్ బంగ్లా’ నిర్మాణ సంకల్పానికి శ్రీకారం చుట్టడం కూడా
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని సార్వత్రిక సెలవుదినంగా ప్రకటించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అభినందనలు
రాజ్యాంగ 370వ అధికరణాన్ని రద్దు చేసి, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సంకల్పమైన ‘‘ఏక్ విధాన్, ఏక్ ప్రధాన్, ఏక్ నిషాన్’’ను
నెరవేర్చారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... ఇవాళ జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉంది
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి ఒక గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు
భారత్ భద్రత విషయంలో పరిశోధనకు అంకితమయ్యే సంస్థను కూడా
‘శ్యామా ప్రసాద్ ఇనిస్టిట్యూట్’ పేరిట నెలకొల్పుతాం
మా పార్టీ రూపంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నాటిన విత్తనం ఒక మర్రి చెట్టులా ఎదిగింది...
ఆధునిక భారత్‌ను, దాని సాంస్కృతిక వారసత్వంలో వేళ్లూనుకొనే విధంగా నిర్మించాలని ఆయన కన్న కలను
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో నెరవేరుస్తున్నాం
స్వతంత్ర భారతదేశ విధానాలు ఈ దేశపు మట్టి సువాసనల్ని వెదజల్లాలని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నమ్మారు... ఈ దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దూసుకుపోతున్నాం
నేరగాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చేసిన వాగ్దానానికి అనుగుణంగా,
‘మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ (అమెండ్‌మెంట్) బిల్లు-2026ను పశ్చిమ బెంగాల్లో ఆమోదించారు...
మహిళల భద్రతకు ‘దుర్గా సురక్షా స్క్వాడ్’ను ఏర్పాటు చేశారు
పశ్చిమ బెంగాల్లో చొరబాటుదారులను గుర్తించి, బహిష్కరించే ప్రక్రియ మొదలైంది...
మేం భారత్‌ను మరింత భద్రంగా ఉంచడానికి ప్రతి ఒక్క చొరబాటుదారునూ జల్లెడ పట్టి తరిమేస్తాం
ఇది సాంస్కృతిక జాతీయవాదం... ‘అఖండ భారత్’ సంకల్పం కావచ్చు, లేదా ‘వికాస్ భీ, విరాసత్ భీ’ దృష్టికోణం కావచ్చు...
ఈ జాతీయవాద ఆదర్శాలు అన్నింటికీ ఒకే మూలం... అదే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ
పశ్చిమ బెంగాల్లో అవినీతిపై దర్యాప్తునకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు...
ఆ కమిటీ నివేదిక ఇవ్వగానే, పేదల దగ్గర దోచిన ప్రతి పైసానూ వసూలు చేస్తాం
प्रविष्टि तिथि:
06 JUL 2026 9:33PM by PIB Hyderabad
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతికి గుర్తుగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా పంపించిన ఒక సందేశాన్ని, ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారత్‌లో కాశ్మీర్ విలీనం కావడం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. నెహ్రూ-లియాకత్ ఒప్పందాన్ని డాక్టర్ ముఖర్జీ వ్యతిరేకిస్తూ, కేంద్ర తొలి మంత్రి మండలి నుంచి వైదొలిగారని శ్రీ షా గుర్తు చేశారు. భారత్ విధానాలు ఈ దేశ నాగరికత, ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేవిగా ఉండాలని డాక్టర్ ముఖర్జీ గట్టిగా నమ్మారని శ్రీ షా చెప్పారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం 63 సంవత్సరాలకు ఆయన 125వ జయంతిని పురస్కరించుకొని 125 అడుగుల ఎత్తుతో ఘనమైన ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులకు కోల్‌కతాలో శంకుస్థాపనను చేపట్టినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం.. డాక్టర్ ముఖర్జీ ఏర్పాటు చేసిన, ఆయన ఆదర్శాలను మార్గదర్శకంగా భావిస్తున్న ప్రభుత్వం బెంగాల్లో కొలువుదీరిందని, ఆయన వారసత్వానికి రాష్ట్రంలో సముచితంగా దక్కాల్సిన గౌరవాన్ని కట్టబెడుతున్నారని శ్రీ షా అన్నారు. ఈ కార్యక్రమం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం ఒక్కటే కాదని, ఇది సోనార్ బంగ్లా సంకల్పాన్ని నెరవేర్చే పనులకు శంకుస్థాపన చేయడంతో సమానమని శ్రీ షా వర్ణించారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వైభవోపేత విగ్రహంతో పాటు, భారతదేశ భద్రతపై పరిశోధనలకు అంకితమై పనిచేసే ఒక సంస్థను కూడా శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇనిస్టిట్యూట్ పేరిట ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం మంత్రి తెలిపారు.
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహర్షి అరవిందులు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, రాజా రామ్మోహన్ రాయ్ కలలుగన్న ఒక పునరుత్తేజిత బెంగాల్ దార్శనికతను సాకారం చేసే పనులు ఈ రోజు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని మొదలయ్యాయని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని సెలవుదినంగా ప్రకటించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయనను గౌరవించిందని శ్రీ షా అన్నారు. భారతీయ భాషలను ప్రోత్సహించే విషయంలో డాక్టర్ ముఖర్జీ దృష్టికోణాన్ని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం త్వరలో నెరవేరుస్తుందన్న నమ్మకం తనకు ఉందని శ్రీ షా అన్నారు.
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితంలో నిజంగానే అనేక పార్శ్వాలు ఉన్నాయని శ్రీ అమిత్ షా అన్నారు. డాక్టర్ ముఖర్జీ తన ఆదర్శాలకు కార్యరూపాన్ని ఇవ్వడానికి జీవితాంతం సకల ప్రయత్నాలనూ చేశారని ఆయన చెప్పారు. డాక్టర్ ముఖర్జీ భారతీయ జన సంఘ్‌ను స్థాపించి దేశంలో జాతీయవాద శక్తులన్నింటినీ ఒక చోటుకు చేర్చడానికి ఒక విత్తనాన్ని నాటారని, సాంస్కృతిక జాతీయవాదానికి పునాదిని వేశారని శ్రీ షా వివరించారు. డాక్టర్ ముఖర్జీ నాటిన విత్తనం ఇవాళ ఒక పెద్ద మర్రి చెట్టుగా ఎదిగి దేశమంతటికీ విస్తరిస్తోందని శ్రీ షా వర్ణించారు.
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన సంస్థ దేశ భౌగోళిక ప్రాంతంలో దాదాపు మూడింట రెండు వంతుల ప్రాంతాన్ని పాలిస్తుందని, దేశ జనాభాలో మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువ మంది జనాభాను డాక్టర్ ముఖర్జీ స్థాపించిన సంస్థ విధానాలకు అనుగుణంగా పాలిస్తోందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. భారతీయ జన సంఘ్‌ను ఏర్పాటు చేసిన సమయంలో డాక్టర్ ముఖర్జీ ప్రభుత్వాలను మార్చినంత మాత్రాననే భారత్ విధి మారదని సంకల్పం చెప్పుకొన్నారని శ్రీ షా అన్నారు. స్వతంత్ర భారతదేశం అనుసరించే విధానాలు దేశ సొంత నేల పరిమళాల నుంచి, నాగరికత నుంచి పుట్టుకురావాలని, పశ్చిమ దేశాల ప్రభావానికి లోను కాకూడదని డాక్టర్ ముఖర్జీ నమ్మారన్నారు. ఈ రోజు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆత్మ ఎక్కడ ఉన్నప్పటికీ, తన దార్శనికతకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పురోగమిస్తున్న భారత్‌ను తప్పక ఆశీర్వదిస్తూనే ఉంటుందని శ్రీ షా అన్నారు. దేశ ఘన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షిస్తూ, అభివృద్ధి సాధనలో సంప్రదాయాలను మేళవిస్తూ ఒక ఆధునిక భారత్‌ను నిర్మించే దిశగా ఎలా ముందుకు సాగాలో డాక్టర్ ముఖర్జీ మార్గదర్శనం చేశారని ఆయన అన్నారు. ఈ మార్గదర్శక సూత్రాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అలవరుచుకున్నారని, భారత్ అభివృద్ధి పునాదులను పటిష్ట పరిచారని శ్రీ షా తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం 2047 కల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సాధించడంతో పాటు, ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా భారత్ ఘన సాంస్కృతిక వారసత్వ పతాక రెపరెపలాడుతూ ఉండేలా చూడడం కూడా అని శ్రీ షా అన్నారు.
దేశం కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగం చేశారని శ్రీ అమిత్ షా అన్నారు. ‘‘ఏక్ విధాన్, ఏక్ ప్రధాన్, ఏక్ నిషాన్’’ అని ఎలుగెత్తి చాటుతూ, కాశ్మీర్లోని ఒక జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో డాక్టర్ ముఖర్జీ చనిపోయారని, అయితే ఆయన మరణంపై అప్పటి ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదని శ్రీ అమిత్ షా అన్నారు. కాశ్మీర్ నుంచి 370వ అధికరణాన్ని తొలగించి డాక్టర్ ముఖర్జీ సంకల్పాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెరవేర్చారని శ్రీ షా చెప్పారు. ఇవాళ, కాశ్మీర్ భారతదేశంలో ఒక అంతర్భాగం అయిందని శ్రీ షా గుర్తు చేశారు.
నెహ్రూ-లియాకత్ ఒప్పంద ప్రతిని చదివిన తరువాత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దానిలో భారత్‌లో ఉండిపోయిన ముస్లిముల సమస్యలకు పరిష్కారం చోటుచేసుకున్నప్పటికీ పాకిస్తాన్లోనూ, తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లోనూ ఉండిపోయిన హిందువుల పరిరక్షణ, వారి సంక్షేమాలకు సంబంధించిన ప్రస్తావనలు లేవని గ్రహించారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఆ ఒప్పందం పూర్తిగా ఏకపక్షమైందని డాక్టర్ ముఖర్జీ నమ్మారని, ఈ కారణంగానే కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేశారని అన్నారు. ప్రస్తుతం డాక్టర్ ముఖర్జీ స్థాపించిన పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం.. వేధింపుల పాలయిన హిందువులకు పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి పౌరసత్వ (సవరణ) చట్టం.. ‘సీఏఏ’కు చట్టరూపాన్నిచ్చిందని శ్రీ షా వివరించారు. 370వ అధికరణాన్ని రద్దు చేశారని, హిందూ శరణార్థులకు పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను పూర్తి చేశారని, దేశ ప్రజలకు పూర్తి భద్రతను అందించడానికి భారత గడ్డ మీద ప్రతి చొరబాటుదారునూ ప్రభుత్వం గుర్తించి తరిమేస్తుందనీ కేంద్ర హోం మంత్రి చెప్పారు.
వందేమాతరం గేయాన్ని కూర్చి 150 సంవత్సరాలు కావడంతో పాటు అదే సంవత్సరంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కూడా రావడం యాదృచ్ఛికమని, ఇది విధికి సంబంధించిన ఒక ముఖ్య పరిణామానికి సూచిక అని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. వందే మాతరం గేయాన్ని పూర్తి స్థాయిలో పాడడం ఇప్పుడే మొదలైందని, కొత్త తరం వాళ్లు ఇప్పుడు సగర్వంగా భారత మాత అన్ని స్వరూపాలకీ వందనం చేస్తారని ఆయన చెప్పారు.
అది సాంస్కృతిక జాతీయవాదం కావచ్చు, అఖండ భారత్ సంకల్పం కావచ్చు, లేదా అభివృద్ధితో పాటు వారసత్వాన్ని కూడా ముందుకు తీసుకు పోవడం కావచ్చు.. ఈ జాతీయవాద ఆదర్శాలన్నింటికీ ఉమ్మడి మూలం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ భావజాలమేనని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. డాక్టర్ ముఖర్జీ తన ఆలోచనలను ధైర్యసాహసాలతో, సరళంగా వెల్లడి చేసేవారని శ్రీ షా అన్నారు. డాక్టర్ ముఖర్జీ ఆలోచనల్లో ఎంతటి శక్తి ఉండేదంటే.. ఇవాళ ఆయన ఆలోచనల స్రవంతి పూర్తి దేశం ఎదుటా దేదీప్యమానంగా నిలిచి కోటి సూర్య ప్రభ మాదిరి యావత్తు ప్రపంచంలో తన వెలుగులను విరజిమ్ముతోందని శ్రీ షా అన్నారు.
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సంవత్సరంలో ఒక మార్పును బెంగాల్ ప్రజలు తీసుకు వచ్చారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన చాలా తక్కువ కాలంలోనే అనేక వాగ్దానాలను నెరవేర్చిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి నాయకత్వంలో, అన్నపూర్ణ పథకాన్ని అమల్లోకి తెచ్చారన్నారు. ఉజ్వల 3.0 ను ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలకు, విద్యార్థినులకు ఉచిత బస్సు ప్రయాణం క్షేత్ర స్థాయిలో సాకారం అయిందన్నారు. లఖ్‌పతి దీదీ మిషన్ శ్రీకారం చుట్టుకుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా పేదలకు రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్సను కూడా క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్నారని వివరించారు. ఉత్తర బెంగాల్లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం మొదలైందన్నారు. కంచె ఏర్పాటు కోసం భూమిని బీఎస్ఎఫ్‌కు అప్పగించే పనులు పూర్తి అయ్యాయన్నారు. అవినీతి కేసులను దర్యాప్తు చేయడానికి జస్టిస్ బ్రిజేంద్ర నాథ్ సారథ్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారని శ్రీ షా అన్నారు.
కమిటీ నివేదికను సమర్పించిన వెంటనే బెంగాల్లో అవినీతికి పాల్పడిన వారు ప్రతి ఒక్క పైసానూ వెనుకకు ఇచ్చివేయడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. దీని కోసం బెంగాల్ పేద ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. మహిళలపై అత్యాచారాల కేసులను దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని కూడా వేశారని ఆయన తెలిపారు. ఇంతకు ముందు, దీర్ఘకాలం పాటు పెండింగు పడ్డ అవినీతి కేసులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిని ఇచ్చే వారు కాదని, అయితే ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం అలాంటి కేసుల్లో అనుమతిని ఇచ్చిందని శ్రీ షా తెలిపారు. ‘ఒకే విధమైన పౌర నియమావళి (యూనిఫామ్ సివిల్ కోడ్) బిల్లు-2026’ను అమలు చేయడానికి కూడా ఒక కమిటీని వేశారని తెలిపారు. ‘పశ్చిమ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ (అమెండ్‌మెంట్) బిల్లు-2026’ను ఆమోదించారన్నారు. ‘మేం గూండాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీని ఇచ్చాం. ఈ బిల్లు ఆ దిశగా తీసుకున్న మొదటి నిర్ణయం’ అని శ్రీ షా చెప్పారు.
రాష్ట్రంలో చొరబాటుదారులను గుర్తించి బహిష్కరించే ప్రక్రియ మొదలైందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా వెల్లడించారు. తల్లులు, అక్కచెల్లెళ్ల రక్షణకు ‘దుర్గా సురక్షా స్క్వాడ్’ను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన సొంత రాష్ట్రంలో ఒక భవ్యమైన స్మారకాన్ని నిర్మిస్తూ భావి తరాల వారికి స్ఫూర్తిని అందించే పనిని ముఖ్యమంత్రి శ్రీ శుభేందు అధికారి చేశారని శ్రీ షా అన్నారు. జాతీయవాద ఆలోచనా విధానం కలిగిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, సంస్థ ఆలోచనావిధానాన్ని ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం వచ్చినప్పుడు, స్వార్థ ప్రయోజనాలతో పాటు వంశవాద రాజకీయాలకు అతీతంగా నడుచుకునే ప్రభుత్వం వచ్చినప్పుడు.. ఇలాంటి సందర్భాల్లోనే ఈ విధమైన పనులు సాధ్యమవుతాయని శ్రీ షా అన్నారు. ‘పశ్చిమ బెంగాల్ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మా ఎన్నికల వాగ్దాన పత్రంలో చెప్పిన వాటిని శరవేగంగా చేసి చూపించే పనిని శ్రీ సువేందు గారు మొదలుపెట్టార’ని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఇవాళ, పూర్తి దేశం ఎంతో ఆశతో బెంగాల్‌కేసి చూస్తోందని శ్రీ షా అన్నారు. బెంగాల్ అనేక సంవత్సరాల పాటు ధార్మిక, సైద్ధాంతిక, సాహిత్య, జాతీయవాద రంగాల్లో పూర్తి దేశానికి నాయకత్వాన్ని అదించిందని ఆయన అన్నారు. బెంగాల్‌కు చెందిన ఈ భావనను దీర్ఘ కాలం పాటు సాగిన ప్రతిపక్ష పాలనలో అణగదొక్కారని శ్రీ షా అన్నారు. ఏమైనా, విత్తనంతో పాటు మొక్క కూడా బలంగా ఉంటే, వాటికి అవకాశం చిక్కితే అవి మళ్లీ పెద్ద మర్రి వృక్షంగా ఎదగగలుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి శ్రీ సువేందు గారి సారథ్యంలో ‘సోనార్ బంగ్లా’ నిర్మాణానికి ఇది ఆరంభం మాత్రమే కాదని, మనం దీనిని క్షేత్రస్థాయిలో సాకారం చేయడంలో కూడా విజయం సాధించగలుగుతామని శ్రీ షా అన్నారు.
బెంగాల్‌నూ, కాశ్మీరునూ, అస్సామునూ రక్షించిన వ్యక్తికి ఒక స్మారకాన్ని నిర్మించాలనే ఆలోచన ఎవ్వరికీ ఇంతవరకూ రాలేదని కేంద్ర హోం మంత్రి అన్నారు. శ్రీ శుభేందు అధికారి ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్నీ అయిదు సంవత్సరాల లోపల నెరవేర్చడంతో పాటు ‘సోనార్ బంగ్లా’ నిర్మాణానికి పునాదిని కూడా వేస్తుందని ఆయన చెప్పారు.
***
(रिलीज़ आईडी: 2282207)
आगंतुक पटल : 11