వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పీఎంజీకేఏవై కింద మరింత నాణ్యమైన బియ్యం పంపిణీకి ప్రభుత్వ ఆమోదం... 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం
ముడిబియ్యంలో 10 శాతానికి, ఉప్పుడు బియ్యంలో 5 శాతానికి నూక పరిమితి తగ్గింపు... 2027 - 28 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ నుంచి దశలవారీగా అమలు
తాజా సంస్కరణలతో ఆహార నాణ్యత, నిర్వహణ సామర్థ్యంలో మెరుగుదల.. పారదర్శకత బలోపేతం
ఏటా దాదాపు రూ. 2,161 కోట్ల ఆదా
प्रविष्टि तिथि:
02 JUL 2026 3:33PM by PIB Hyderabad
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)తోపాటు ఇతర సంక్షేమ పథకాల కింద పంపిణీ చేసే బియ్యం నాణ్యతను మరింత మెరుగుపరచడం కోసం... ఒక చరిత్రాత్మక సంస్కరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.
ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేసే బియ్యం నాణ్యత ప్రమాణాలను ప్రభుత్వం సవరించడం దాదాపుగా గత మూడు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి. లబ్ధిదారులకు ప్రస్తుతం అందుతున్న రేషన్ కోటాలో ఎలాంటి మార్పులు చేయకుండానే... బియ్యంలో నూకల శాతం గణనీయంగా తగ్గేలా, అత్యంత నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆమోదించిన విధానం కింద:
- పీఎంజీకేఏవై కింద పంపిణీ చేసే ముడి బియ్యంలో నూకల శాతం 10 శాతం వరకు ఉండవచ్చు. ఇంతకు ముందున్న 25 శాతం పరిమితి స్థానంలో ఇది అమలవుతుంది.
- ఉప్పుడు బియ్యంలో 5 శాతం వరకు నూక బియ్యం ఉండవచ్చు. ఇంతకు ముందున్న 16 శాతం పరిమితి స్థానంలో ఇది అమలవుతుంది.
మెరుగైన నాణ్యత కలిగిన బియ్యం సేకరణ ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుంది. ఈ విధానాన్ని బియ్యం సేకరించే అన్ని రాష్ట్రాల్లో... 2027-28 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ నాటికి దశలవారీగా పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తారు.
పీఎంజీకేఏవైతోపాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఈ మెరుగైన నాణ్యమైన బియ్యం పంపిణీని కూడా దశలవారీగా చేపట్టనున్నారు. దీనివల్ల అన్ని రాష్ట్రాల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సవరించిన కొత్త ప్రమాణాల ప్రకారం పంపిణీ ప్రక్రియ సజావుగా సాగడానికి వీలవుతుంది.
లబ్ధిదారులకు మరింత నాణ్యమైన బియ్యం
ఆహార భద్రతను కల్పించడమే కాకుండా పీఎంజీకేఏవై, ఇతర సంక్షేమ పథకాల పరిధిలోని 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు నాణ్యమైన ఆహార ధాన్యాలను అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోంది. లబ్ధిదారులు తమకు వచ్చే రేషన్ కోటాలో ఎలాంటి కోత లేకుండానే.. గింజల నాణ్యత మెరుగ్గా ఉండే, చూడడానికి బాగుండే, వినియోగదారులకు ఆమోదయోగ్యమైన నాణ్యమైన బియ్యాన్ని పొందనున్నారు.
నూకల సద్వినియోగం
సవరించిన నిబంధనల ప్రకారం.. మిల్లింగ్ సమయంలో వచ్చే నూకలను వేరు చేసి, ఇతర ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవచ్చు. దీనివల్ల పీఎంజీకేఏవై లబ్ధిదారులకు నాణ్యమైన తినదగిన బియ్యం అందుతుంది.
ఆర్థిక, నిర్వహణ ప్రయోజనాలు
ఈ సంస్కరణ వల్ల రవాణా, నిల్వ, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మిల్లుల్లో వేరు చేసిన నూకలను నేరుగా ఆయా మిల్లుల ఆవరణ నుంచే వేలం వేస్తారు. నూకలను నిల్వ చేయడానికి హెచ్‌డీపీఈ సంచులను ఉపయోగించడం వల్ల గోనె సంచుల అవసరం కూడా తగ్గుతుంది. దీనివల్ల రవాణా, నిల్వ, ప్యాకేజింగ్ ఖర్చులు తగ్గి.. ఏడాదికి దాదాపు రూ. 2,161 కోట్లు ఆదా అవుతాయని అంచనా. అంతేకాకుండా నూకల విక్రయం ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇది ఆహార సబ్సిడీ భారాన్ని మరింత తగ్గించడానికి దోహదపడుతుంది.
ప్రయోగాత్మక అమలు
హర్యానా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి పలు రాష్ట్రాల్లో ఇప్పటికే చేపట్టిన ప్రయోగాత్మక అమలు ద్వారా ఈ ప్రతిపాదన విజయవంతంగా నిరూపితమైంది. మెరుగైన నాణ్యత గల బియ్యాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యమేనని ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు నిరూపించింది. కేంద్ర కేబినెట్ ఆమోదం నేపథ్యంలో.. ఈ ప్రయోగాత్మక దశలో ఉత్పత్తి చేసిన మెరుగైన నాణ్యత గల బియ్యాన్ని పీఎంజీకేఏవై, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులకు కూడా సరఫరా చేయనున్నారు.
మెరుగైన పారదర్శకత
ఈ సంస్కరణల్లో భాగంగా బియ్యం బస్తాలకు క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మిల్లుల నుంచి రేషన్ దుకాణాల వరకు సరఫరా వ్యవస్థలోని ప్రతి దశలోనూ పారదర్శకంగా పర్యవేక్షణకు వీలవుతుంది. ఫలితంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతోపాటు.. సరుకు నిల్వల నిర్వహణ సులువవుతుంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టే అవకాశాలకు అడ్డుకట్ట పడుతుంది.
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఆహార భద్రతను అందించింది. మెరుగైన నాణ్యతతో కూడిన ఆహార భద్రతను సాధించడమే తదుపరి లక్ష్యం. ఈ చరిత్రాత్మక నిర్ణయం వల్ల పేద కుటుంబాలు ఆత్మగౌరవంతో, అత్యంత నాణ్యమైన బియ్యాన్ని పొందేందుకు వీలవుతుంది. అలాగే ఆహార ధాన్యాల నిర్వహణలో సమర్థత, పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడతాయి.
ముఖ్యాంశాలు
- దాదాపు 30 ఏళ్లలో అనుమతించదగిన నూకల శాతంలో మొదటిసారిగా తగ్గింపు.
- ముడి బియ్యంలో 10 శాతం వరకు, ఉప్పుడు బియ్యంలో 5 శాతం వరకు నూకలకు పరిమితి.
- 80 కోట్లకు పైగా పీఎంజీకేఏవై లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం.
- మిగిలిన నూకలను పారిశ్రామిక అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవడం.
- ప్రజా పంపిణీ పథకంలో పారదర్శకతను పెంపొందించడం కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత పర్యవేక్షణ.
***
(रिलीज़ आईडी: 2280568)
आगंतुक पटल : 5