హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షాతో ‘జనాభా మార్పులపై ఉన్నత స్థాయి అధ్యయన కమిటీ’ సమావేశం
క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అధ్యయనం దిశగా వివిధ రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటన సహా ఇతర నిర్ణయాలపై మంత్రి సమాచారం
జనాభా మార్పులపై అభిప్రాయ సేకరణ కోసం ఇతర కేంద్ర మంత్రిత్వశాఖలతో సంప్రదింపులకు కమిటీ సంసిద్ధత
రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల పర్యటన పరస్పర సంప్రదింపులతో అర్థవంతంగా సాగేలా ముందస్తు సమాచార సమీకరణపై సమగ్ర ప్రశ్నావళి రూపొందించినట్లు వెల్లడి
ఉన్నత స్థాయి కమిటీ వ్యూహాన్ని ప్రశంసిస్తూ- సాధ్యమైనంత సాయం అందించాలని తమ శాఖ కార్యదర్శికి శ్రీ అమిత్ షా ఆదేశం
వీలైనంత త్వరగా సిఫారసులతో నివేదిక అందజేయాలని ఉన్నత స్థాయికి కమిటీకి హోం మంత్రి సూచన
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 15న “జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కార్యక్రమం” ప్రకటించిన నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
అక్రమ వలసలు.. ఇతర అసాధారణ కారణాలతో తలెత్తే జనాభా మార్పులపై అధ్యయనం సహా పరిణామాలపై చర్యలకు తగిన సిఫారసులతో నివేదిక సమర్పణకు ఆదేశం
प्रविष्टि तिथि:
01 JUL 2026 3:17PM by PIB Hyderabad
దేశంలో జనాభా మార్పులపై అధ్యయనం కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇవాళ న్యూఢిల్లీలోని హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాసంలో ఆయనతో లాంఛనప్రాయంగా సమావేశమైంది.
తమకు అప్పగించిన బాధ్యతల మేరకు క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అధ్యయనం దిశగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటన సహా ఇతర నిర్ణయాలపై కమిటీ ఈ సందర్భంగా మంత్రికి సమాచారమిచ్చింది. అలాగే, జనాభా మార్పులపై అభిప్రాయ సేకరణ కోసం ఇతర కేంద్ర మంత్రిత్వశాఖలతో సంప్రదింపులు చేపట్టేందుకు సంసిద్ధత తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పర్యటన పరస్పర సంప్రదింపులతో అర్థవంతంగా సాగేలా ముందస్తు సమాచార సమీకరణకు నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇందుకోసం ఒక సమగ్ర ప్రశ్నావళిని కూడా రూపొందించామని తెలిపింది.
ఈ సమాచారంపై శ్రీ అమిత్ షా స్పందిస్తూ- ఉన్నత స్థాయి కమిటీ వ్యూహాన్ని ప్రశంసించారు. దీనికి అనుగుణంగా కమిటీ దైనందిన కార్యకలాపాలకు వీలైనంత మేర సహాయసహకారాలు అందించాలని తమ శాఖ కార్యదర్శిని ఆయన ఆదేశించారు. కమిటీ కూడా తన నిర్ణయాల మేరకు వేగంగా అధ్యయనం పూర్తిచేసి, సాధ్యమైనంత త్వరగా తగిన సిఫారసులతో నివేదిక అందజేయాలని మంత్రి సూచించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 15న “జనాభా మార్పులపై అత్యున్నత స్థాయి కార్యక్రమం” ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలోకి అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాలతో తలెత్తే జనాభా మార్పులపై అధ్యయనం సహా తత్సంబంధ పరిణామాలపై చర్యలకు తగిన సిఫారసులతో నివేదిక సమర్పణకు ఆదేశించింది.
ఈ కమిటీకి జస్టిస్ (రిటైర్డ్) ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ అధ్యక్షత వహిస్తుండగా జనగణన విభాగం కమిషనర్ సహా శ్రీ దుర్గాశంకర్ మిశ్రా (రిటైర్డ్ ఐఏఎస్), శ్రీ బాలాజీ శ్రీవాస్తవ (రిటైర్డ్ ఐపీఎస్), డాక్టర్ షమికా రవి (పీఎంఈఏసీ సభ్యురాలు) తదితర ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
భారత్‌లోకి అక్రమ వలసలతోపాటు ఇతరత్రా అసాధారణ కారణాల వల్ల వివిధ ప్రాంతాలలో జనాభాపరంగా చోటుచేసుకుంటున్న మార్పులపై ఈ ఉన్నత స్థాయి కమిటీ కూలంకషంగా, శాస్త్రీయంగా అధ్యయనం నిర్వహిస్తుంది. అనంతరం కారణాలు-పర్యవసానాలను సమగ్రంగా విశ్లేషించి తదనుగుణ విధాన, చట్టబద్ధ, పాలనపరమైన చర్యలపై సిఫారసులతో ఒక నివేదికను సమర్పిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2279955)
आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
हिन्दी
,
Punjabi
,
Urdu
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam