గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన “రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం”

‘అభివృద్ధి చెందిన గ్రామాలు – అభివృద్ధి చెందిన భారత్’ కోసం ఉమ్మడి రోడ్‌మ్యాప్ రూపకల్పన

· తొలిసారిగా ఒకే వేదికను పంచుకున్న 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు

· గ్రామాలు కేవలం లబ్ధిదారులు మాత్రమే కాదు... అభివృద్ధి చోదకాలు

· అభివృద్ధి చెందిన గ్రామాలతోనే అభివృద్ధి చెందిన భారత్ సాధ్యం

· జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ‘వికసిత్ భారత్ – వీబీ-గ్రామ్-జీ’ అమలు

· సకాలంలో రాష్ట్రాలకు నిధుల విడుదల, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ అభివృద్ధికి కీలకం

· పారదర్శకత, మెరుగైన సేవల పంపిణీని నిర్ధారించడానికి అన్ని రాష్ట్రాలూ ఏఐ, సాంకేతికతను వినియోగించుకోవాలి

· అర్హత గల ఏ కుటుంబాన్నీ విస్మరించకుండా అర్హులందరికీ గృహవసతి

· “ఇది అందరి భాగస్వామ్యానికి సమయం, రాజకీయాలకు కాదు”: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

· గ్రామీణ మహిళల కోసం ‘లఖ్‌పతి దీదీ డాష్‌బోర్డ్’, ‘షీ లీప్స్’ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

प्रविष्टि तिथि: 29 JUN 2026 5:30PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్‌లో ‘గ్రామోదయ సే రాష్ట్రోదయ’ పేరుతో జరుగుతున్న రెండు రోజుల రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం రెండో రోజున... కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో కీలక గ్రామీణాభివృద్ధి పథకాల అమలు, పురోగతిని సమీక్షించడంతో పాటు... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శనంలో ‘అభివృద్ధి చెందిన గ్రామాలు - అభివృద్ధి చెందిన భారత్’ దార్శనికత సాకారం కోసం వ్యూహాలనూ రూపొందించారు. ఈ సందర్భంగా శ్రీ చౌహాన్ మాట్లాడుతూ... గ్రామాలు కేవలం మట్టి, పొలాలు, కూడళ్ల సమూహాలు మాత్రమే కాదని, అవి భారత్ బలానికి, చైతన్యానికి, దేశపు స్ఫూర్తికి ప్రతీకలని అన్నారు. గ్రామాలు సుసంపన్నంగా, స్వయం సమృద్ధితో, సంపూర్ణంగా అభివృద్ధి చెందినప్పుడే సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన భారత్ కల సాకారం అవుతుందన్నారు. గ్రామీణ భారత్ పురోగతితోనే జాతీయ పురోగతీ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రుల చరిత్రాత్మక సమావేశం

గ్రామీణాభివృద్ధి భవిష్యత్తుపై ప్రత్యేకంగా చర్చించడానికి తొలిసారిగా ఒకే వేదికపై 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణాభివృద్ధి మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు, విధాన రూపకర్తలు  సమావేశమయ్యారు. ఈ సమ్మేళనానికి ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య, ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ శర్మ, వివిధ రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ఉన్నతస్థాయి ప్రతినిధులూ హాజరయ్యారు. ఈ సమావేశం సహకార సమాఖ్యవాద స్ఫూర్తిని ప్రతిబింబించింది. ఇక్కడ వీరంతా రాజకీయంగా ఉన్న విభేదాలను పక్కనపెట్టి... దేశవ్యాప్తంగా గ్రామీణ సమాజాల ప్రయోజనం కోసం అభివృద్ధిని వేగవంతం చేయడం, పరిపాలనను మెరుగుపరచడం, కేంద్ర-రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు.

అభివృద్ధి చెందిన భారత్ కోసం అభివృద్ధి చెందిన గ్రామాల దార్శనికత

భారత అభివృద్ధి ప్రస్థానంలో గ్రామాల కీలక పాత్రను స్పష్టం చేస్తూ... గ్రామాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి, ఉపాధి ఆధారితంగా మారి, నాణ్యమైన మౌలిక సదుపాయాలు-అవసరమైన ప్రజా సేవలను పొందినప్పుడే అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం సాకారమవుతుందని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు. గ్రామాలను దేశానికి ఆత్మ, బలం, చైతన్యంగా అభివర్ణిస్తూ... దేశ సమగ్ర అభివృద్ధికి గ్రామీణాభివృద్ధి పునాది వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామాలపై పెట్టే పెట్టుబడి అంతిమంగా భారత దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి, సామాజిక పురోగతికి, జాతీయ శ్రేయస్సుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

జూలై 1 నుంచి కొత్త ఉపాధి పథకం అమలు

ప్రస్తుతం అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) స్థానంలో 'వికసిత్ భారత్ – వీబీ-గ్రామ్-జీ' పథకాన్ని జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమం అమలు కోసం రూ.95,682 కోట్లకు మధ్యంతర ఆమోదం ఇప్పటికే మంజూరైందని ఆయన సదస్సుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన అన్ని విధానపరమైన లాంఛనాలను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని కోరిన శ్రీ చౌహాన్... సకాలంలో సమ్మతిని నిర్ధారించడం వల్ల ఈ పథకం సజావుగా అమలు కావడంతో పాటు దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలకు దాని ప్రయోజనాలు నిరంతరాయంగా అందేలా చూడవచ్చని అన్నారు.

లఖ్‌పతి దీదీ మిషన్‌కు తాజా ఊపు

ఈ సమ్మేళనంలో ‘లఖ్‌పతి దీదీ డాష్‌బోర్డ్’ను ప్రారంభించడంతో పాటు, స్వయం సహాయక బృందాలతో అనుబంధం ఉన్న మహిళల కోసం ‘షీ లీప్స్’ (సెల్ఫ్ హెల్ప్ ఆంత్రప్రెన్యూర్ - లైవ్‌లిహుడ్స్ అండ్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ ఫర్ ప్రాస్పెరిటీ అండ్ సస్టెయినెబిలిటీ) అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌నూ కేంద్ర మంత్రి ప్రారంభించారు. లఖ్‌పతి దీదీలను తయారుచేసే లక్ష్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడు కోట్ల నుంచి ఆరు కోట్ల మంది మహిళలకు విస్తరించారని శ్రీ చౌహాన్ తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని సాధించడానికి, రాబోయే అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల విలువైన బ్యాంకు అనుసంధానం కోసం ఒక రోడ్‌మ్యాప్‌నూ సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, నూతన పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటును ప్రోత్సహిస్తుందని, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తుందని, తద్వారా లక్షలాది మంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా, గ్రామీణ శ్రేయస్సు కోసం క్రియాశీల భాగస్వాములుగా మారేందుకు ఇది వీలు కల్పిస్తుందని కేంద్ర మంత్రి వివరించారు.

మెరుగైన అమలుపై ప్రధాన దృష్టి

గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల మెరుగైన అమలు కోసం పలు ప్రాధాన్యాలను శ్రీ చౌహాన్ వివరించారు. ప్రాజెక్టులు, చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడానికి రాష్ట్రాలు తమ ఆర్థిక వాటాను సకాలంలో విడుదల చేయాలని ఆయన కోరారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఖాళీ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాల్సిన అవసరాన్నీ ఆయన స్పష్టం చేశారు. దీర్ఘకాలిక ఖాళీలు పథకాల అమలు సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తరచూ జరిగే అధికారుల బదిలీలతో పథకాల కొనసాగింపు, జవాబుదారీతనంపైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. అందువల్ల కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు సాధారణంగా కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు ఒకే పోస్టింగ్‌లో కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాల గురించి అర్హులైన లబ్ధిదారులకు పూర్తి సమాచారం అందించడంలో విస్తృత ప్రజావగాహన ప్రచారాల ప్రాముఖ్యతనూ శ్రీ చౌహాన్ ప్రధానంగా ప్రస్తావించారు. జవాబుదారీతనం ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ... అన్ని కార్యక్రమాల్లో పారదర్శకత, సామర్థ్యం, సేవల పంపిణీని మెరుగుపరచడానికి బలమైన సామాజిక ఆడిట్‌లు, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థల వినియోగాన్ని పెంచాలని శ్రీ చౌహాన్ పిలుపునిచ్చారు.

గృహనిర్మాణం, రహదారులు, నైపుణ్యాభివృద్ధి పథకాలపై సమీక్ష

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనల పురోగతిని సమీక్షిస్తూ... పలు రాష్ట్రాలు ఈ విషయంగా ప్రశంసనీయమైన పనితీరును కనబరిచాయన్నారు. మరికొన్ని రాష్ట్రాలు అమలును వేగవంతం చేసి, ప్రస్తుత లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భూమిలేని అర్హులైన లబ్ధిదారులకు గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద భూమిని అందించడం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని గృహ నిర్మాణ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రాథమిక సౌకర్యాలతో కూడిన శాశ్వత గృహం అందేలా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అర్హులైన లబ్ధిదారులెవరూ ఈ హక్కుకు దూరం కాకూడదని శ్రీ చౌహాన్ వ్యాఖ్యానించారు.

ఉత్తమ పద్ధతులను పంచుకుంటూ, సంస్కరణలను చేపట్టాలని విజ్ఞప్తి

జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు చేపట్టిన మల్టీ-ఛానల్ మార్కెటింగ్ నమూనాలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, గృహ జీవనోపాధి రుణ పథకాల వంటి విజయవంతమైన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ... ఈ ఉత్తమ పద్ధతులను నమోదు చేసి అన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని, తద్వారా విజయవంతమైన ఆవిష్కరణలను దేశవ్యాప్తంగా అనుసరించవచ్చని శ్రీ చౌహాన్ తెలిపారు. అనేక పథకాలను, పరిపాలనా విధానాలను మెరుగుపరచడానికి ఇంకా గణనీయ అవకాశం ఉందని ఆయన అంగీకరించారు. రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఉంటుందని హామీ ఇస్తూ... ప్రస్తుత నియమాలు, విధానాల వల్ల ఏవైనా ఆచరణాత్మక ఇబ్బందులు ఎదురయినప్పుడు, అవసరమైన చోట తగిన సవరణలు ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రివర్గం, ఆర్థిక మంత్రిత్వ శాఖతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతుందని ఆయన పేర్కొన్నారు.

నీటి కొరత, వర్షపాతంపై అప్రమత్తం

ఈ సంవత్సరం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి... 14 ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధం కావాలని కోరారు. జల సంరక్షణ నిర్మాణాలను బలోపేతం చేయాలని, అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో అదనపు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు తగిన సన్నాహాలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. జీవనోపాధి, వ్యవసాయ కార్యకలాపాలను పరిరక్షించేటప్పుడు తక్కువ వర్షపాతం కారణంగా ఉత్పన్నమయ్యే ఏవైనా సవాళ్లకు సమర్థంగా స్పందించడానికి ఈ ముందస్తు ప్రణాళికలు ప్రభుత్వాలకు వీలు కల్పిస్తాయని తెలిపారు.

భాగస్వామ్యం ద్వారా పరివర్తన సందేశం

ఇది విభేదాలకు సమయం కాదని... భాగస్వామ్యానికి, సమష్టి చర్యలకు సమయమని శ్రీ చౌహాన్ అన్నారు. కేంద్రం విధాన రూపకల్పనపై దృష్టి పెట్టాలని, రాష్ట్రాలు సమర్థమైన అమలును నిర్ధారించాలని, పంచాయతీలు క్షేత్రస్థాయిలో నాయకత్వం వహించాలని, పౌరులు అభివృద్ధి ప్రక్రియలో చురుకైన భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి సహకార నమూనా మాత్రమే గ్రామీణ భారత్ భవిష్యత్తును మార్చగలదని, దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజల జీవన నాణ్యతను, ఆర్థిక అవకాశాలనూ ప్రాథమికంగా మెరుగుపరచగలదని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.

యువతను, ఆవిష్కరణలను ప్రోత్సహించడం

వీబీ-గ్రామ్-జీ పథకం కింద నిర్వహించిన లోగో రూపకల్పన, క్విజ్, డిజిటల్ కంటెంట్ పోటీల విజేతలను సన్మానించడంతో ఈ సమ్మేళనం ముగిసింది. శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా విజేతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. గ్రామీణాభివృద్ధిలో కొత్త ఆలోచనలు, వినూత్న నమూనాలు, అభివృద్ధి చెందుతున్న విధానాలపై దృష్టి సారించిన అనేక ప్రచురణలను ఈ కార్యక్రమంలో భాగంగా విడుదల చేశారు. గ్రామీణాభివృద్ధి రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, యువ ప్రతిభను గుర్తించడం, సరికొత్త ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది స్పష్టం చేసింది.

 

***


(रिलीज़ आईडी: 2279191) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam