హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈ నెల 26న ఎన్‌సీఓఆర్‌డీ 10వ ఉన్నత స్థాయి సమావేశం
‘‘మత్తు మందుల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్ (2026-2029)’’తో పాటు
‘ఎన్‌సీబీ వార్షిక నివేదిక- 2025’ను ఆవిష్కరించనున్న కేంద్ర హోం మంత్రి
మత్తు మందుల జాడ ఉండని భారత్‌ను ఆవిష్కరించాలన్న ప్రధానమంత్రి శ్రీ మోదీ దార్శనికతను సాకారం చేయడానికి
మార్గసూచీలా పని చేయనున్న విజన్ డాక్యుమెంటు
రూ.6,000 కోట్ల విలువైన 2,09,500 కేజీల మాదకద్రవ్యాల ధ్వంసానికి మార్గాన్ని సుగమం చేసే
‘ఆన్‌లైన్ డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్’ మొదలుపెట్టనున్న శ్రీ అమిత్ షా
జమ్మూ, గువాహాటీలలో ఎన్‌సీబీ జోనల్ కార్యాలయాలను ప్రారంభించనున్న శ్రీ అమిత్ షా
మాదక ద్రవ్యాల భూతంపై పోరాటానికి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రయత్నాలపై
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మూల్యాంకనంతో పాటు సమీక్ష
प्रविष्टि तिथि:
24 JUN 2026 2:33PM by PIB Hyderabad
నార్కో-కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్‌సీఓఆర్‌డీ) 10వ ఉన్నత స్థాయి సమావేశాన్ని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 2026 జూన్ 26న నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు (ఎన్‌సీబీ) నిర్వహిస్తున్న ఈ సమావేశం మత్తు పదార్థాల జాడ లేని భారత్‌ను ఆవిష్కరించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేయాలన్న ప్రభుత్వం ప్రయత్నాల్ని పటిష్టపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ సమావేశం హైబ్రిడ్ మోడ్‌లో 44 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కీలక ఆసక్తిదారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్టం అమలు సంస్థలకు చెందిన 108 మంది ప్రతినిధులను ఒక చోటుకు తీసుకు రానుంది.
ఈ సందర్భంగా ‘‘మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ (2026-2029)ని కేంద్ర హోం మంత్రి ఆవిష్కరిస్తారు. సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మాదక ద్రవ్యాల నేర నియంత్రణ సంస్థలు, ఇతర ఆసక్తిదారులతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంటు డ్రగ్స్ సమస్యను ఎదుర్కోవడానికి డిమాండును, సరఫరాను, నష్టాలను తగ్గించడానికి ఉమ్మడి మార్గసూచీని అందిస్తుంది. ఈ మార్గసూచీలో నెట్‌వర్క్ ప్రధాన నియంత్రణ విధానమే కాకుండా ఈ విధానాన్ని అమలుపరచబోతున్న మూడు సంవత్సరాల్లో సింథటిక్ డ్రగ్స్, డార్క్‌నెట్ ఆధారిత దొంగరవాణా వంటి సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి ఆ సవాళ్లను పరిష్కరించడం, యువతను డ్రగ్స్ వలలో చిక్కుకోకుండా చూడడం, మత్తుమందుల సేవనానికి అలవాటు పడిన యువతకు చికిత్స, పునరావాస కేంద్రాల లభ్యతను పెంచడం వంటి చర్యలు కలిసి ఉన్నాయి. వీటిని అన్నింటినీ సమన్వయ పూర్వకంగా, నిరంతర ప్రాతిపదికన అమలు చేస్తారు. ఈ డాక్యుమెంటు ఆసక్తిదారులందరికీ బాధ్యతలను, నిర్దిష్ట కాల రేఖలను, లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశిస్తుంది. అంతేకాక నియంత్రణ, డిమాండు తగ్గింపు, పునరావాసం, ప్రజాచైతన్యం, సామర్థ్యాల పెంపు, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం.. వీటిని ఏకీకరిస్తుంది. దేశంలో డ్రగ్స్ర్ సమస్యను ఎదుర్కోవడానికి విధానాన్ని రూపొందించే, ఆ విధానాన్ని అమలుపరిచే, సంస్థాగత దృఢత్వాన్ని తీసుకువచ్చే పనిలో మార్గదర్శక ప్రాథమిక ప్రణాళికను ఈ విజన్ డాక్యుమెంటు అందించనుంది.
ఈ సందర్భంగా ఎన్‌సీబీ వార్షిక నివేదిక- 2025ను కూడా శ్రీ అమిత్ షా ఆవిష్కరిస్తారు. జమ్మూ, గువాహాటీలలో కొత్తగా నిర్మించిన ఎన్‌సీబీ జోనల్ కార్యాలయాలను మంత్రి ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాలను ధ్వంసం చేయడానికి చేపట్టిన విశిష్ట కార్యక్రమమే ‘డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్’. ఈ పదిహేను రోజుల లోపల దేశంలోని వివిధ కేంద్ర, రాష్ట్ర నేర నియంత్రణ సంస్థలు చట్ట నిబంధనలకు అనుగుణంగా దాదాపు 2,09,500 కేజీల మాదకద్రవ్యాలను
ధ్వంసం చేయనున్నాయి. ఈ మాదక ద్రవ్యాల విలువ రూ.6,000 కోట్లు.
మాదక ద్రవ్యాల సమస్యను ఎదుర్కోవడానికి సంబంధిత ఆసక్తిదారులు చేపడుతున్న ఉమ్మడి ప్రయత్నాల విస్తృత సమీక్షతో పాటు మూల్యాంకనానికి ఒక వేదికను ఈ సమావేశం అందించనుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో మాదక ద్రవ్యాలపై ప్రభావవంత నియంత్రణ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రాలు, విభాగాలు, ఏజెన్సీలకు ఓ కొత్త ఉత్సాహం, నిబద్ధత లభించనున్నాయి. దేశంలో మాదక ద్రవ్యాల ముప్పుతో ప్రభావవంతంగా పోరాడటానికి ‘సంపూర్ణ ప్రభుత్వ’ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఉన్నత స్థాయి సమావేశం స్పష్టం చేయడమే కాకుండా, వచ్చే మూడు సంవత్సరాల్లో దేశమంతటా మత్తు పదార్థాల అక్రమ రవాణాను, దుర్వినియోగాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనుంది.
మాదక పదార్థాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్ పాలసీ’ని మరింత ఎక్కువ ప్రభావవంతంగా, శక్తిమంతంగా తీర్చిదిద్దే దిశగా ఇది ఒక ముఖ్య సమావేశంగా మారుతుందని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2277682)
आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam