పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ నిశిత పర్యవేక్షణ: ఇథనాల్ మిశ్రణ కార్యక్రమానికి శాస్త్రీయ ధ్రువీకరణ


సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే వాదనలు... పాత చిత్రాలతో దుష్ప్రచారం

प्रविष्टि तिथि: 23 JUN 2026 7:57PM by PIB Hyderabad

   ఇథనాల్ మిశ్రమ పెట్రోలు (ఈబీపీ)పై సామాజిక మాధ్యమాల్లో నిరాధార, తప్పుదోవ పట్టించే ప్రచారం సాగుతుండటాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించింది. ప్రజలను గందరగోళానికి గురిచేసి, అపోహలు సృష్టించడమే లక్ష్యంగా ఇవి సాగుతున్నట్లు భావిస్తోంది. ఇథనాల్-మిశ్రమ ఇంధనంపై అనవసర ఆందోళన సృష్టి ధ్యేయంగా వీక్షకులను ఆకర్షించేలా పాత చిత్రాలు, వీడియోలను పునఃప్రచారంలోకి తెస్తున్నట్లు ప్రభుత్వం పసిగట్టింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిశిత, నిరంతర పర్యవేక్షణ ద్వారా ఇథనాల్ మిశ్రణ కార్యక్రమానికి శాస్త్రీయ ధ్రువీకరణ లభించిందని కేంద్ర పెట్రోలియం-సహజ వాయువుల మంత్రిత్వశాఖ పునరుద్ఘాటించింది.

ముడి చమురు దిగుమతుల తగ్గింపు, ఇంధన భద్రత పెంపు, పర్యావరణ సుస్థిరతకు ప్రోత్సాహం లక్ష్యాలుగా 2003లో ఇథనాల్ మిశ్రణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సాంకేతిక సన్నద్ధత, భాగస్వాములతో సంప్రదింపులు ప్రాతిపదికగా ఇది దశలవారీగా అమలవుతోంది. ఫలితంగా 2023 నుంచి 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోలు (ఇ20) వాడకాన్ని ప్రవేశపెట్టింది.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ), ఆటోమొబైల్ తయారీదారులు, ఇంధన తనిఖీ సంస్థలు, ఇతర భాగస్వాములతో సంప్రదింపుల ద్వారా ఇథనాల్ మిశ్రణ కార్యక్రమం అమలును ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.

‘ఇ20’ పెట్రోలు వినియోగాన్ని ప్రవేశపెట్టిన నాటినుంచి దానివల్ల వాహన ఇంజిన్ల వైఫల్యం లేదా వాహనాలు అర్థాంతరంగా ఆగిపోవడం వంటి విస్తృత సమస్యలపై ఫిర్యాదులేవీ రాలేదని పేర్కొంది.

తేమను పీల్చుకునే ఇథనాల్ స్వభావానికి సంబంధించి ప్రస్తుతం ఒక వాదన ప్రచారంలోకి వచ్చింది. ఇథనాల్ మిశ్రమ పెట్రోలు లేదా మరేదైనా ఇంధనం విషయంలోనైనా వాహన  ట్యాంకులోకి నీరు ప్రవేశించడం మంచిది కాదనే వాస్తవం అందరికీ తెలిసిందే. అంతేగాక ఆధునిక వాహనాల ఇంధన ట్యాంకులలోకి నీరు, తేమ నిరోధానికి తగిన లక్షణాలతో తయారీ సంస్థలు రక్షణ చర్యలు చేపడుతున్నాయి.

అంతేకాకుండా కొందరు వ్యక్తులు చెరకు రసాన్ని నేరుగా పెట్రోల్‌లో కలుపుతున్నట్లు తప్పుదోవ పట్టించే చిత్రాలతో సామాజిక మాధ్యమాల్లో మీడియాలో వీడియోలను సృష్టించి ప్రచారంలోకి తెస్తున్నట్లు ప్రభుత్వం గమనించింది. అది కచ్చితంగా తప్పుదోవ పట్టించే, నిరాధార దుష్ప్రచారమేనని నిర్ణయానికి వచ్చింది. ఇంధన మిశ్రమానికి వాడే ఇథనాల్  సుస్థిర పారిశ్రామిక ప్రక్రియల ద్వారా ఉత్పత్తి అవుతుంది. దీన్ని పెట్రోలుతో కలిపే ముందు కఠిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షిస్తారు.

ఇథనాల్‌ను చెరకు రసం, మొలాసిస్, నూకలు, మొక్కజొన్న వంటి వివిధ రకాల ముడి పదార్థాలతో తయారు చేస్తారు. అయినప్పటికీ, అంతిమ ఉత్పత్తి లక్షణాలు ముడి పదార్థాల లక్షణాలకు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇది కిణ్వణం సహా అనేక రకాల ప్రక్రియలతో తయారవుతుంది. ఈ ప్రక్రియ ముడి పదార్థాలలోని చక్కెరల కిణ్వ ప్రక్రియకు దారితీస్తుంది.

ఇలాంటి వీడియోలతో దుష్ప్రచారం ద్వారా ఈ అంశాన్ని సంచలనాత్మకం చేస్తూ, వాటి వీక్షణలను పెంచుకోవడానికే కొందరు ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతోంది.

భారత్‌లో ఇథనాల్ మిశ్రణం కఠిన ఇంధన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సాగుతుంది. దీంతోపాటు వాహనాల్లో వినియోగానికి ముందు క్షుణ్ణంగా తనిఖీ కూడా చేస్తారు. విస్తృతమైన సాంకేతిక అంచనాలు, వాహన తయారీదారులు, ఇతర భాగస్వాములతో సంప్రదించిన తర్వాత మాత్రమే అధిక స్థాయి మిశ్రణ ప్రక్రియను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

అయితే, ఇటీవల ఒక వాహన ఇంధన ట్యాంకు వద్ద చీమలు కనిపించే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. దీనిపై స్పందించిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్‌) ఒక వాస్తవాన్ని వివరించింది. పెట్రోలులో కలపడానికి వాడే ఇంధన స్థాయి ఇథనాల్‌ను కిణ్వ, స్వేదన (డిస్టిలేషన్) ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేస్తారు. తద్వారా మిగిలిపోయిన చక్కెర అంతిమ ఉత్పత్తి నుంచి తొలగిపోతుందని తెలిపింది. అలాగే, ఇంధన స్థాయి ఇథనాల్‌లో కీటకాలను నిరోధించే ‘డీనాచురెంట్స్‌’ ఉంటాయి. కాబట్టి, వాహన ట్యాంకుల మూతచుట్టూ చీమలు లేదా ఇతర కీటకాలు చేరేలా ఆకర్షించే పదార్థమేదీ ‘ఇ20’ మిశ్రమ పెట్రోలులో ఉండదు. కాబట్టి, ‘ఇ20’ ఇంధనానికి, చీమలు చేరడానికి మధ్య సంబంధం ఉందనే వాదనకు శాస్త్రీయ ఆధారం లేదా రుజువులేమీ లేవు.

అదేవిధంగా ‘ఇ20’ ఇంధన వాడకం వాహన బీమా చెల్లుబాటును ప్రభావితం చేస్తుందనే అనేక వాదనల్లో వాస్తవం లేదని సంబంధిత భాగస్వామ్య సంస్థలు కూడా స్పష్టం చేశాయి.

ఇథనాల్ మిశ్రణం ప్రపంచవ్యాప్తంగా ఆమోదిత విధానం. అమెరికా, బ్రెజిల్, జపాన్‌ సహా అనేక దేశాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. బ్రెజిల్ దీర్ఘకాలం నుంచీ అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమాన్ని అనుమతిస్తోంది. ఇందులో భాగంగా ‘ఇ27’ ప్రామాణిక పెట్రోల్ మిశ్రమాన్ని వినియోగంలోకి తెచ్చింది.

ముడి చమురు దిగుమతులను తగ్గింపు ద్వారా ₹1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదాలో ఇథనాల్ మిశ్రణ కార్యక్రమం దేశానికి తోడ్పడిందని గమనించాలి. ఈ కార్యక్రమం ద్వారా ఇథనాల్ ఉత్పాదనకు వాడే వ్యవసాయ ముడి పదార్థాలకు నిరంతర డిమాండ్‌ కూడా ఏర్పడి, రైతులకు అదనపు ఆదాయంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తోంది.

దేశ ఇంధన భద్రతకు భరోసాతోపాటు కర్బన ఉద్గారాల తగ్గింపు సహా కాలుష్య రహిత రవాణా వైపు దేశం ప్రస్థానాన్ని వేగిరపరచడంలో ఇథనాల్ మిశ్రణం కీలక పాత్ర పోషిస్తుంది. శాస్త్రీయ ఆధారాలు, భాగస్వాముల నిరంతర తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని సురక్షిత, పారదర్శక, వినియోగదారు హిత పద్ధతిలో అమలు చేయడంపై ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2277344) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam