మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2027 హజ్ విధానం విడుదల: యాత్రికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన ఇండియన్ హజ్ కమిటీ
హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, హజ్ సువిధ యాప్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
प्रविष्टि तिथि:
22 JUN 2026 7:20PM by PIB Hyderabad
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేడు 2027 సంవత్సరానికి సంబంధించిన హజ్ విధానాన్ని ప్రకటించింది. కేంద్ర మైనారిటీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈ నూతన విధానాన్ని విడుదల చేశారు. దీంతో పాటు హజ్ యాత్ర-2027కు వెళ్లాలనుకునే యాత్రికుల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తున్నట్లు ఇండియన్ హజ్ కమిటీ ప్రకటించింది. ఈ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుంది.
హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియను ప్రభుత్వం మరింత సరళతరం, సులభతరం చేసింది. యాత్రికులు హజ్ కమిటీ అధికారిక వేదిక ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. హజ్ సువిధ యాప్ ద్వారా కూడా ఎక్కడి నుంచైనా సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ ఏడాది కూడా హజ్ కమిటీ.. ప్రైవేటు రంగాల మధ్య సీట్ల పంపిణీ కోటా యథాతథంగా 70:30 నిష్పత్తిలోనే కొనసాగే అవకాశం ఉంది. ఈ నిష్పత్తి ప్రకారం
హజ్ కమిటీ కోటా: 1,22,518 సీట్లు కాగా ప్రైవేటు రంగం కోటా: 52,507 సీట్లు. గతేడాది భారతీయ యాత్రికుల మొత్తం కోటా 1,75,025 గా ఉంది. ఈసారి భారతీయ యాత్రికుల కోసం హజ్ కోటాను మరింత పెంచేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని కేంద్రమంత్రి తెలిపారు.
18 జూన్ 2026న కేంద్రమంత్రి అధ్యక్షతన జరిగిన హజ్ సమీక్షా సమావేశంలో హజ్-2026 నిర్వహణను సమీక్షించారు. ఆ సమావేశంలోనే హజ్-2027కు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేశారు. సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్దేశించిన సమయపాలనను పాటించడానికి, యాత్రికులకు ముందస్తుగా మెరుగైన ఏర్పాట్లు చేయడానికి వీలుగా ఈసారి విధానాన్ని చాలా ముందుగానే ప్రకటించి, దరఖాస్తులను కూడా వెంటనే స్వీకరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
హజ్ యాత్రను ప్రతి ఒక్కరికీ మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. హజ్-2026లో ప్రవేశపెట్టిన పలు యాత్రికుల-సానుకూల సంస్కరణలను ఈ నూతన విధానంలోనూ కొనసాగిస్తున్నారు. ఇందులో మినాలో మంచాలుగా మార్చుకునే వీలున్న సోఫాల వసతి, మక్కా, మదీనా నగరాల మధ్య హై స్పీడ్ రైలు ప్రయాణం, మక్కాలో హోటల్ తరహా వసతి సౌకర్యాలు, 20 రోజుల స్వల్పకాలిక హజ్ ప్యాకేజీ వంటివి ఉన్నాయి. ఈ అద్భుతమైన ఏర్పాట్లు, సమర్థవంతమైన నిర్వహణకు గాను సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ అందించే ప్రతిష్టాత్మక ఉత్తమ హజ్ సమన్వయం, కమ్యూనికేషన్ విభాగంలో రెండు లబ్బైతుమ్ అవార్డులను భారత హజ్ మిషన్ దక్కించుకుంది. భారత్‌కు ఈ అత్యున్నత అంతర్జాతీయ పురస్కారాలు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ నూతన విధానంలో చేసిన కీలక మార్పుల్లో భాగంగా క్షేత్రస్థాయిలో యాత్రికులకు సహాయాన్ని మరింత మెరుగుపరచడానికి గతంలో ప్రతి 150 మందికి ఒకరుగా ఉన్న స్టేట్ హజ్ ఇన్‌స్పెక్టర్ (అధికారిక పర్యవేక్షకుడు) నిష్పత్తిని ఈసారి ప్రతి 135 మందికి ఒకరుగా మార్చారు. అలాగే పెరుగుతున్న వెయిటింగ్ లిస్టు సమస్యను పారదర్శకంగా పరిష్కరించేందుకు హజ్-2026 తుది వెయిటింగ్ లిస్టులోని తొలి 20 శాతం మంది దరఖాస్తుదారులకు ఈ ఏడాది ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గతేడాది మంచి స్పందన లభించిన స్వల్పకాలిక హజ్ ప్యాకేజీని ఈసారి కూడా కొనసాగిస్తూ.. తూర్పు ప్రాంత ప్రయాణికుల నుంచి వస్తున్న భారీ డిమాండ్ దృష్ట్యా కోల్‌కతాను అదనపు ప్రయాణ కేంద్రంగా చేర్చారు.
యాత్రికుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని వైద్య పరీక్షల నిబంధనలను సౌదీ అరేబియా మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చారు. ఇందులో భాగంగా తీవ్రమైన, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి యాత్రకు వెళ్లేందుకు అనుమతించకూడదని నిర్ణయించి తనిఖీలను మరింత కఠినతరం చేశారు.
హజ్ యాత్రికుల సమగ్ర నిర్వహణను మరింత బలోపేతం చేయడం కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ సరికొత్తగా కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా యాత్రికుల దరఖాస్తులు, డాక్యుమెంట్ల పరిశీలనను ఏఐ సహాయంతో వేగవంతం చేయడం, వివిధ ప్రయాణ కేంద్రాల నుంచి విమానాల కేటాయింపు ప్రక్రియను డిమాండుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయడం, యాత్రికుల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన పరిష్కారాలు చూపేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. సాంకేతికతతో కూడిన హజ్ యాత్రను అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈ సరికొత్త ఏఐ సేవలను విడతలవారీగా అమలు చేయనున్నారు.
ఈ సాంకేతిక ప్రయత్నాల్లో అత్యంత కీలకమైనది హజ్ యాత్రికుల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న సంభాషణాత్మక కృత్రిమ మేధ సహాయక వ్యవస్థ. ఇది హిందీ, ఉర్దూతో పాటు ప్రధాన ప్రాంతీయ భాషల్లో 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. యాత్రికులు తమ సొంత భాషలోనే సాధారణ వాయిస్ లేదా మెసెజ్ ద్వారా ప్రశ్నలు అడిగి మార్గదర్శకత్వం పొందవచ్చు. దరఖాస్తును నింపడం, సమర్పించడం దగ్గరి నుంచి చెల్లింపులు, విమానాలు, వసతి, లగేజీ వివరాలు పొందడం, ఫిర్యాదులు నమోదు చేయడం, అత్యవసర సహాయం పొందడం వంటి ప్రతి దశలోనూ ఇది యాత్రికులకు తోడ్పడుతుంది. దీనివల్ల దరఖాస్తులలో తప్పులు, తిరస్కరణలు తగ్గుతాయి. మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది. మొదటిసారి వెళ్లేవారికి, వృద్ధులకు ఖచ్చితమైన సమాచారం సులభంగా అందుతుంది. దీనిని సౌదీ అరేబియాకు చెందిన నుసుక్ వేదికతో కూడా అనుసంధానించనున్నారు. తద్వారా భారత్, సౌదీ దేశాల హజ్ సేవా వ్యవస్థలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ యాత్రికులకు ప్రయాణమంతటా ఒకే రకమైన, ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి.
అర్హులైన యాత్రికులందరూ నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కేంద్రమంత్రి కోరారు. దరఖాస్తుల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, సంబంధిత సంస్థలన్నింటినీ ఆయన ఆదేశించారు. ప్రతి భారతీయ యాత్రికుడికి సురక్షితమైన, సౌకర్యవంతమైన, పారదర్శకమైన, గౌరవప్రదమైన హజ్‌ను అందించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2276895)
आगंतुक पटल : 20