ప్రధాన మంత్రి కార్యాలయం
ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రే యుద్ధ నౌకలను నావికాదళంలోకి ప్రవేశపెట్టిన ప్రధాని
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణమైన ఈ మూడు యుద్ధనౌకలు.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల
శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో నౌకాదళంలోకి ప్రవేశం
ఈ రోజు అనగా జూన్ 21ను 'ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం'గా కూడా పరిగణిస్తారు. సరిగ్గా ఇదే రోజున భారతదేశపు అత్యంత అధునాతన హైడ్రోగ్రఫీ నౌక 'ఐఎన్ఎస్ సంశోధక్'ను మనం నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం నిజంగా ఒక అద్భుతం: ప్రధానమంత్రి
ఏ దేశపు సముద్రయాన సామర్థ్యం బలంగా ఉంటుందో ఆ దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం కూడా అంతే బలంగా ఉంటుంది: ప్రధానమంత్రి
భారత్ ఈ వాస్తవాన్ని బాగా అర్థం చేసుకుంది.. అందుకే దేశం ఆ దిశగా సిద్ధమవుతోంది: ప్రధానమంత్రి
ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి నేటి వరకు సాగిన ప్రయాణం కేవలం కొత్త యుద్ధనౌకల తయారీ ప్రయాణం మాత్రమే కాదు.. ఇది భారతదేశపు ఎదుగుతున్న స్వయంసమృద్ధి ప్రయాణం: ప్రధానమంత్రి
ఈ రోజు ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలు ఆ ప్రయాణానికి మరింత కొత్త వేగాన్ని అందిస్తున్నాయి: ప్రధానమంత్రి
నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక సరికొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించింది: ప్రధానమంత్రి
దేశీయంగా నౌకల నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది: ప్రధానమంత్రి
నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతులు, ఎంఆర్ఓ రంగాలను ఒక పెద్ద జాతీయ మిషన్‌లో భాగంగా పరిగణిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం: ప్రధానమంత్రి
భారత్ ఎల్లప్పుడూ సముద్రాన్ని పరస్పర సహకారానికి ఒక మాధ్యమంగానే భావించింది. అయితే శాంతిని కాపాడటానికి సైనికశక్తి కూడా అంతే అవసరమని భారత్‌కు బాగా తెలుసు: ప్రధానమంత్రి
దేశ శ్రేయస్సును కాపాడుకునేందుకు భద్రత ఎంత అవసరమో దేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి స్వయంసమృద్ధి అంతకంటే ముఖ్యం: ప్రధానమంత్రి
నేడు ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలు సరిగ్గా ఇదే స్ఫూర్తికి ప్రతీకలుగా భారత నావికాదళంలో చేరాయి: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
21 JUN 2026 12:50PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించిన మూడు యుద్ధనౌకలను అధికారికంగా నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. వీటిలో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ 'ఐఎన్ఎస్ దూనగిరి', పెద్ద సర్వే నౌక 'ఐఎన్ఎస్ సంశోధక్’, జలాంతర్గామి నిరోధక నౌక 'ఐఎన్ఎస్ అగ్రే'లు ఉన్నాయి. ఈ నౌకల చేరిక భారత కార్యాచరణ సామర్థ్యాలను గణనీయంగా పెంచడమే కాకుండా సముద్రాలపై నిఘాను బలోపేతం చేస్తుంది. అలాగే భౌగోళిక రాజకీయ ముప్పుల నుంచి మన తీరప్రాంత జలాలకు రక్షణను మరింత పటిష్ఠం చేస్తుంది. ఈ మూడు నౌకలను భారత నావికాదళానికి చెందిన 'వార్‌షిప్ డిజైన్ బ్యూరో' రూపొందించగా కోల్‌కతాలోని 'గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్' (జీఆర్ఎస్ఈ) సంస్థ నిర్మించింది. వీటి నిర్మాణంలో 200కు పైగా ఎంఎస్ఎంఈలతో కూడిన భారతీయ పరిశ్రమలు విస్తృతంగా భాగస్వామ్యమయ్యాయి. 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం లేదా పరికరాలను కలిగి ఉన్న ఈ నౌకలు 'ఆత్మనిర్భరత' పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.
ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్న 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' రోజునే రావడం విశేషమన్నారు. భారత మేధో, సాంస్కృతిక, జాతీయ పునరుజ్జీవనాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా శతాబ్దాలుగా సముద్ర మార్గాల ద్వారా భారత్‌ను ప్రపంచంతో అనుసంధానించిన చారిత్రక బెంగాల్ గడ్డను సందర్శించే అవకాశం రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. "ఈ వేడుక ఆత్మనిర్భర్ భారత్, సురక్షిత భారత్, వికసిత్ భారత్ వైపు సాగుతున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జూన్ 21ని అంతర్జాతీయంగా 'ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం'గా కూడా పరిగణిస్తారని గుర్తు చేసిన ఆయన.. సరిగ్గా ఇదే రోజున, భారతదేశపు అత్యంత అధునాతన హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక 'ఐఎన్ఎస్ సంశోధక్'ను నావికాదళంలోకి ప్రవేశపెట్టడం ఒక గొప్ప అద్భుతంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా భారత నావికాదళం, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికులు, దేశ ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత్‌లో పెరుగుతున్న సాంకేతిక, సముద్ర రక్షణ సామర్థ్యాలకు అద్దం పడుతోందని అన్నారు. ఆధునిక ప్రపంచంలో సముద్ర శక్తికి ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా చెబుతూ.. "బలమైన సముద్ర రక్షణ సామర్థ్యాలు లేకుండా ఏ దేశమూ ఒక ప్రధానశక్తిగా ఎదగలేదు. అభివృద్ధి, భద్రత, శ్రేయస్సు అనేవి సముద్రాలతో ముడిపడి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. అలాగే ప్రపంచవ్యాప్త డేటా నెట్‌వర్క్‌లు కూడా సముద్రాల అడుగున నుంచే పనిచేస్తాయి" అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీలకమైన ఖనిజాలు, లోతైన సముద్ర వనరులు, ఇంధన వనరులు కూడా ఎక్కువగా సముద్రాలతోనే అనుసంధానమవుతాయని ఆయన అన్నారు. అందువల్ల ఒక దేశపు ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం అనేది నేరుగా ఆ దేశ సముద్ర రంగానికి ఉన్న బలంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
భారత్ ఈ వాస్తవాన్ని పూర్తిగా అర్థం చేసుకుందని, అందుకు అనుగుణంగానే సిద్ధమవుతోందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. "ఈ మూడు నావికాదళ నౌకలను రంగంలోకి దించడం అనేది దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలకు, నైపుణ్యాలకు నిలువెత్తు నిదర్శనం" అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో 'ఐఎన్ఎస్ విక్రాంత్'ను నావికాదళంలోకి చేర్చిన సందర్భాన్ని గుర్తుచేసిన ఆయన.. అది భారత సముద్ర రక్షణ ప్రయాణంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని, ఎదుగుతున్న భారత నావికా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిందని ఆయన అన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి నేడు ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకల ప్రవేశం వరకు సాగిన ప్రయాణం కేవలం కొత్త యుద్ధనౌకల కథ మాత్రమే కాదని, ఇది భారతదేశపు పెరుగుతున్న స్వయంసమృద్ధికి ప్రతిబింబమని ఆయన స్పష్టం చేశారు. "ఈ మూడు నౌకలు స్వదేశీ డిజైన్, తయారీ, ఆవిష్కరణల పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధతకు ప్రతీకలు. పూర్తిగా రూపకల్పనతో సహా, దేశంలోనే నిర్మించిన ఈ నౌకలు.. భారతీయ పరిశ్రమల నైపుణ్యాలను, దేశంలోని ఇంజనీర్ల నైపుణ్యాన్ని, భారతీయ కార్మికుల కష్టాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
రక్షణ రంగంలో భారత్ కేవలం ఒక కొనుగోలుదారుగా మాత్రమే మిగిలిపోవాలని అనుకోవట్లేదని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. "ఒక దేశ సైనిక శక్తిని అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడటాన్ని బట్టి కాకుండా అది ఎంతవరకు స్వయంసమృద్ధి సాధించిందనే దాని ఆధారంగా కొలుస్తారు. భారత్ ఒక ఉత్పత్తిదారుగా, తయారీదారుగా మారాలని ఆకాంక్షిస్తోంది. ఎందుకంటే ఏ దేశాలైతే వస్తువులను సొంతంగా తయారు చేసుకుంటాయో అవే అంతర్జాతీయ వేదికపై కీలకమైన నిర్ణయాత్మక శక్తులుగా ఎదుగుతాయి" అని ఆయన అన్నారు. ఇటీవలి విజయాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... గత కొన్ని సంవత్సరాలుగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 40కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములను భారత నావికాదళంలోకి చేర్చినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. దాదాపు ప్రతి కొన్ని వారాలకు ఒకసారి నావికాదళం ఒక కొత్త సామర్థ్యాన్ని సంతరించుకుంటోందని.. ప్రస్తుతం మరో 45 పెద్ద నావికాదళ నౌకలు, ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదని ఇవి భారత పారిశ్రామిక సామర్థ్యానికి, భవిష్యత్తు శక్తికి స్పష్టమైన సంకేతాలని ఆయన చెప్పారు.
సముద్రయాన రంగంలో ఉన్న భారీ ఉపాధి అవకాశాల సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ నరేంద్ర మోదీ.. "ప్రభుత్వం సముద్రయాన రంగాన్ని ఏదో ఒక విడిగా ఉన్న పరిశ్రమగా చూడటం లేదు. దీనిని వికసిత్ భారత్‌కు అవసరమైన ఉపాధి, ఆర్థిక వృద్ధికి ఒక ప్రధాన ఇంజిన్‌గా భావిస్తోంది. ఒక ఆధునిక నౌక తయారీకి పెద్ద మొత్తంలో ఉక్కు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, వేలాది విడిభాగాలు అవసరమవుతాయి. ఇది విస్తృతమైన పారిశ్రామిక సరఫరా వ్యవస్థ అంతటా సరికొత్త అవకాశాలను సృష్టిస్తుంది" అని అన్నారు. నావికాదళంలోకి ప్రవేశపెట్టిన ఈ మూడు యుద్ధనౌకల గురించి మాట్లాడిన ఆయన.. వీటి నిర్మాణంలో 200కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా భారీగా ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించిందని ఆయన పేర్కొన్నారు.
సముద్రయాన రంగ అభివృద్ధిలో భారత్ తదుపరి దశలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించడం కోసం ప్రభుత్వం నౌకా నిర్మాణ రంగంలో ఒక సరికొత్త దార్శనికతను అవలంబించిందని… ఇటీవలి సంవత్సరాల్లో పలు విధానపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. "షిప్పింగ్ రంగం కోసం ప్రకటించిన రూ. 70,000 కోట్ల ప్రోత్సాహక ప్యాకేజీ కేవలం ఒక ఆర్థికపరమైన చర్య మాత్రమే కాదు. ఇది భారత సముద్రయాన రంగ భవిష్యత్తు, పారిశ్రామిక విస్తరణ కోసం చేసిన ఒక పెట్టుబడి. 'సాగర్మాల' వంటి కార్యక్రమాలు ఈ సమగ్ర దార్శనికతకు ప్రతిబింబాలు. ఇవి రవాణా ఖర్చులను తగ్గించడానికి, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి, తీరప్రాంతాలలో సరికొత్త అవకాశాలను సృష్టించడానికి ఎంతగానో సహాయపడుతున్నాయి" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
రక్షణ రంగంలో భారత్ సాధించిన అద్భుతమైన మార్పు గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ సామగ్రిని దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచేదని.. దీనివల్ల దేశానికి వ్యూహాత్మక, రక్షణ పరమైన సవాళ్లు ఎదురయ్యేవని ఆయన గుర్తుచేశారు. 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున విధానపరమైన సంస్కరణలు చేపట్టడం, రక్షణ రంగ ఉత్పాదకతలో 'స్వయంసమృద్ధి'పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా ఈ పరిస్థితిని మార్చడానికి ఒక బలమైన సంకల్పంతో కృషి జరిగిందని ఆయన చెప్పారు. "ఈ నిరంతర ప్రయత్నాలు రక్షణ రంగ డిజైన్, ఉత్పాదకత, ఎగుమతుల్లో సరికొత్త అవకాశాల ద్వారాలను తెరిచాయి. 2014లో భారతదేశపు మొత్తం రక్షణ రంగ ఉత్పత్తి సుమారు రూ. 40,000 కోట్లుగా ఉండగా నేడు అది దాదాపు రూ. 1.8 లక్షల కోట్లకు చేరుకుంది. ఒక బలమైన, స్వయంసమృద్ధి గల, అంతర్జాతీయంగా పోటీ పడగల రక్షణ పరిశ్రమను నిర్మించే దిశగా మనం సాధించిన అద్భుతమైన పురోగతికి ఇది నిదర్శనం" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్పష్టమైన విధానాలు, సరైన దిశ, జాతీయ అభివృద్ధి పట్ల భాగస్వాములందరికీ సామూహిక నిబద్ధత ఉన్నప్పుడు ఎంతటి విప్లవాత్మక మార్పు సాధ్యమవుతుందో గత పన్నెండేళ్లలో సాధించిన ఈ ప్రగతి నిరూపిస్తోందని ఆయన అన్నారు.
భారతదేశపు సుసంపన్న సముద్రయాన వారసత్వాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశ సముద్రయాన చరిత్ర గురించి చర్చ వచ్చినప్పుడల్లా పశ్చిమ బెంగాల్ పేరు సహజంగానే గుర్తొస్తుందని అన్నారు. ప్రపంచంతో భారత్‌కు ఉన్న సముద్ర మార్గాల అనుసంధానంలో బెంగాల్ చారిత్రకంగా కీలక పాత్ర పోషించిందని ఆయన అభిప్రాయపడ్డారు. హుగ్లీ నది జలాలు మారుతున్న చరిత్ర పుటలకు, వాణిజ్య వృద్ధికి, సరికొత్త అభివృద్ధి ప్రయాణాలకు సాక్ష్యంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. ఈ నౌకాశ్రయానికి బెంగాల్ ముద్దుబిడ్డ, భారతదేశపు మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రి అయిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టడం ఈ వేడుకకు ఉన్న ప్రాముఖ్యతను మరింత పెంచిందని ఆయన అన్నారు. "రాబోయే సంవత్సరాల్లో పశ్చిమ బెంగాల్ భారతదేశపు 'సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ’, సముద్ర రంగ ఉత్పాదకత, రవాణా, తీరప్రాంత అభివృద్ధికి ఒక ప్రధాన కేంద్రంగా మారబోతోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్ ఎల్లప్పుడూ సముద్రాలను పరస్పర సహకారానికి, అనుసంధానానికి ఒక మాధ్యమంగానే భావిస్తూ వచ్చిందని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. "దేశ శ్రేయస్సును కాపాడుకోవడానికి భద్రత ఎంత ఆవశ్యకమో.. భవిష్యత్తును నిర్మించుకోవడానికి స్వయంసమృద్ధి అంతే అవసరం. ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలు సరిగ్గా ఇదే ఆదర్శాలకు నిలువెత్తు రూపాలు. తన సామర్థ్యాలపై నిరంతరం అవగాహన పెంచుకుంటూ తన శక్తులపై పూర్తి నమ్మకంతో ఇరవై ఒకటో శతాబ్దంలో సరికొత్త శక్తి, బలమైన ఆశయంతో ముందుకు సాగాలనే ఒక దేశ దృఢ సంకల్పానికి ఇవి ప్రతీకలు" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ... ఈ అద్భుతమైన విజయాల సాధనలో భాగస్వాములైన భారత నావికాదళ సిబ్బందికి, శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, కార్మికులకు, దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు సముద్రయాన, రక్షణ రంగాలు.. దేశ భద్రతను, శ్రేయస్సును, అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠను నిరంతరం బలోపేతం చేస్తూనే ఉంటాయనే గట్టి నమ్మకాన్ని శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
"భారతదేశ సముద్రయాన భద్రతలో ఒక అద్భుతమైన ఘట్టం! కోల్‌కతాలో జరిగిన ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకల త్రివిధ ప్రవేశ మహోత్సవంలో మాట్లాడాను.”
"ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ"
"నేడు జూన్ 21ని 'ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం'గా కూడా పరిగణిస్తారు. సరిగ్గా ఇదే రోజున మనం భారతదేశపు అత్యంత అధునాతన హైడ్రోగ్రఫీ నౌక 'ఐఎన్ఎస్ సంశోధక్'ను నావికాదళంలోకి ప్రవేశపెట్టడం గొప్ప విషయం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ"
"ఏ దేశానికైతే సముద్ర రక్షణ సామర్థ్యం బలంగా ఉంటుందో ఆ దేశపు ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం కూడా అంతే బలంగా ఉంటుంది. భారతదేశం ఈ వాస్తవాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుంది.
అందుకే భారత్ దీని కోసం తనను తాను సిద్ధం చేసుకుంటోంది: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ"
"ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి నేటి వరకు సాగిన ప్రయాణం కేవలం కొత్త యుద్ధనౌకల తయారీ ప్రయాణం మాత్రమే కాదు. ఇది భారతదేశపు పెరుగుతున్న ఆత్మనిర్భరతకు నిదర్శనంగా సాగిన ప్రయాణం. నేడు నావికాదళంలో చేరిన ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలు ఆ ప్రయాణానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ"
"భారతదేశం నౌకా నిర్మాణ రంగంలో ఒక సరికొత్త దార్శనికతతో ముందుకు సాగుతున్నది. ఇందుకోసం ఇటీవలి సంవత్సరాలలో అనేక విధానపరమైన సంస్కరణలను చేపట్టాం. దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం నౌకానిర్మాణం, నౌకల మరమ్మతులు, ‘ఎంఆర్ఓ’లను ఒక పెద్ద జాతీయ మిషన్‌గా పరిగణిస్తున్నాం: ప్రధాని"
“భారత్ ఎల్లప్పుడూ సముద్రాన్ని పరస్పర సహకారానికి ఒక మాధ్యమంగానే భావిస్తూ వచ్చింది. కానీ శాంతిని కాపాడటానికి సామర్థ్యం ఎంతో అవసరమనే విషయం కూడా భారత్‌కు బాగా తెలుసు. దేశ శ్రేయస్సును రక్షించుకోవడానికి భద్రత ఎంత ఆవశ్యకమో.. భవిష్యత్తును నిర్మించుకోవడానికి స్వయంసమృద్ధి అంతకంటే అనివార్యం. నేడు నావికాదళంలో చేరిన ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలు సరిగ్గా ఇదే భావనకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి."
***
(रिलीज़ आईडी: 2276414)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam