ఆయుష్
కోల్‌కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలకు నాయకత్వం వహించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ ఇతివృత్తంతో ఐడీవై వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ సన్నద్ధత
‘యోగా సంగమం’ వేదికలో 6 లక్షలకు పైగా సంస్థల నమోదు: భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భాగస్వామ్యం
ప్రపంచవ్యాప్తంగా 2,500 ప్రాంతాల్లో యోగా వేడుకలు: రంగంలోకి దిగిన 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు
प्रविष्टि तिथि:
20 JUN 2026 4:20PM by PIB Hyderabad
భారత్ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునేందుకు సర్వసన్నద్ధమైంది. ఈ జాతీయ స్థాయి ప్రధాన వేడుక జూన్ 21న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా చారిత్రాత్మక రెడ్ రోడ్ వేదికగా జరగనుంది. ఆరోగ్యం, సంక్షేమం కోసం యోగాను ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మార్చే ప్రయత్నాలలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయంగా ఈ వేడుకలకు నాయకత్వం వహిస్తూ దేశ ప్రజలతో కలిసి 'కామన్ యోగా ప్రోటోకాల్‌ను అభ్యసించనున్నారు.
రెడ్ రోడ్‌లో జరిగే ఈ జాతీయ స్థాయి వేడుక ఉదయం 5:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది యోగాభిమానులు ప్రత్యక్షంగా పాల్గొననుండగా.. దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది పౌరులు వర్చువల్ పద్ధతిలో భాగస్వాములు కానున్నారు. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించడంలో యోగాకు పెరుగుతున్న పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది.
ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ఇతివృత్తం “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా”... ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతను తెలియజేస్తుంది. శారీరక శక్తిని, మానసిక దృఢత్వాన్ని, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించే ఒక నివారణ ఆరోగ్య సంరక్షణ విధానంగా యోగా సహకారాన్ని ఇది స్పష్టం చేస్తుంది.
ప్రధాన వేడుకలకు ముందే ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన యోగా సంగమం వేదిక భారీ మైలురాయిని అధిగమించింది. ఇందులో వివిధ సంస్థల నమోదు సంఖ్య 6 లక్షల మార్కును దాటి, నిరంతరం క్రమంగా పెరుగుతోంది. ఈ అద్భుతమైన స్పందన యోగాను ఒక నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చడంలో వివిధ సంస్థలు, సంఘాలు, పౌరులకు ఉన్న ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026లో ఈసారి విశేషమైన ప్రపంచవ్యాప్త భాగస్వామ్యం కనిపిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) సమన్వయ ప్రయత్నాల ద్వారా విదేశాల్లో ఉన్న 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 ప్రాంతాల్లో యోగా వేడుకలను నిర్వహిస్తున్నాయి. భారతదేశ పురాతన జ్ఞానంలో వేళ్లు ఊనుకున్న యోగా.. సమగ్ర సంక్షేమం కోసం ఎలా ఒక అంతర్జాతీయ ఉద్యమంగా ఎదిగిందో ఇది నిరూపిస్తోంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలకు సాంస్కృతిక కోణాన్ని అందిస్తూ.. భారతీయ పురావస్తు శాఖ సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రదేశాల్లో ప్రత్యేక యోగా వేడుకలను నిర్వహిస్తోంది. ఇది దేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, చారిత్రాత్మక కట్టడాలను, యోగా సంప్రదాయాలను ఒకే తాటిపైకి తెస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, ఒడిశాలోని కోణార్క్, కర్ణాటకలోని హంపి, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్ట్రలోని ముంబై, బీహార్‌లోని నలంద, గుజరాత్‌లోని అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని సార్నాథ్, లడఖ్‌లోని లేహ్, తెలంగాణలోని హైదరాబాద్,
అస్సాంలోని సిల్చార్ సహ 12 ప్రధాన ప్రముఖ ప్రాంతాలలో అతిపెద్ద వేడుకలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమం దేశ నాగరికత వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు, దేశ సాంస్కృతిక గుర్తింపులో యోగా ఒక అంతర్భాగమనే విషయాన్ని తెలియజేస్తుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026లో వర్చువల్ పద్ధతిలో పాల్గొనే పౌరులందరూ కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్ సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కలిసి యోగా సాధన చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. తమ యోగా క్షణాలను చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా దేశమంతా కలిసికట్టుగా జరుపుకుంటున్న ఈ యోగా సంబరాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని కోరింది.
జూన్ 21న ఉదయం 5:00 గంటల నుంచి కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో జరిగే ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఈ వేదిక వద్దకు వచ్చే వారు ఆయుష్ ఆహార్ (ఆరోగ్యకరమైన ఆహారం) కూడా అనుభవించవచ్చు. ఇది సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సు సందేశాన్ని ప్రచారం చేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ యోగాను తమ రోజువారీ జీవన విధానంగా మార్చుకునేలా స్పూర్తినివ్వడమే ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా” అనే సందేశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడమే దీని లక్ష్యం.
***
(रिलीज़ आईडी: 2275785)
आगंतुक पटल : 15