MIFF banner

ఎంఐఎఫ్ఎఫ్-2026 లో ప్రేక్షకులను ఆకట్టుకున్న క్లాసిక్ డాక్యుమెంటరీలు


ఎంఐఎఫ్ఎఫ్‌లో ప్రత్యేక ఆకర్షణగా గాంధీ, బేగం అక్తర్, పండిట్ రవి శంకర్ చారిత్రక డాక్యుమెంటరీలు

ముంబయి, 19 జూన్ 2026: నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్‌డీసీ, ఎన్ఎఫ్ఏఐ) పునరుద్ధరించిన అయిదు క్లాసిక్ డాక్యుమెంటరీలను 19వ ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్-2026)లో ప్రదర్శించారు. "ఎన్ఎఫ్ఏఐ ప్రజెంట్స్ - రీస్టోర్డ్ క్లాసిక్స్" ప్రత్యేక పోటీయేతర విభాగంలో వీటిని ప్రదర్శించారు. ఎంపికైన ఈ చిత్రాలు భారతదేశ సినిమా వారసత్వాన్ని పరిరక్షించేందుకు, పునరుద్ధరించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ (ఎన్ఎఫ్‌హెచ్ఎం) ద్వారా పునరుద్ధరించినవి.

 

బుధవారం సాయంత్రం ప్రదర్శితమైన ఈ ప్రత్యేక చిత్రాల్లో ఆనాటి ఫిల్మ్ డివిజన్ నిర్మించిన అయిదు కీలక డాక్యుమెంటరీలున్నాయి. భారతదేశ సంస్కృతి, కళలు, సామాజిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ చిత్రాలు.. ప్రేక్షకులకు దేశ చరిత్రను, నాటి కీలక ఘట్టాలను, ప్రముఖ వ్యక్తులను మరోసారి స్మరించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించాయి.

 

మహాత్మాగాంధీ, బేగం అక్తర్, పండిట్ రవి శంకర్‌ వంటి ప్రముఖ వ్యక్తులకు సంబంధించినవి మూడు డాక్యుమెంటరీలు కాగా, మిగతా రెండూ- కలకత్తా నగరాన్నీ, భారత్‌లోని గిరిజన తెగ సంస్కృతినీ కళ్లకు కట్టినట్లుగా అద్భుతంగా ఆవిష్కరించాయి.

మహాత్మ: లైఫ్ ఆఫ్ గాంధీ 1869-1948 (పార్ట్ -I)

విఠల్‌భాయ్ కె. ఝావేరి దర్శకత్వంలో 1968లో ఆంగ్లంలో ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. మహాత్మాగాంధీ జీవితాన్ని, ఆయన కృషిని సమగ్రంగా ఆవిష్కరించేందుకు అరుదైన పాత రికార్డులను వినియోగించారు. మహాత్మాగాంధీ జీవిత విశేషాలు, ఆయన సాధించిన విజయాలకు సంబంధించి కీలక చారిత్రక రికార్డుగా ఈ చిత్రం నిలుస్తుంది.

బేగం అక్తర్

ఎన్.కె. ఇస్సార్ దర్శకత్వంలో ఫిల్మ్ విభాగం 1971లో నిర్మించిన ఈ ఆంగ్ల డాక్యుమెంటరీ.. మల్లిక-ఇ-గజల్ గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయని బేగం అక్తర్ జీవితాన్నీ, కళా వైభవాన్నీ వైవిధ్యంగా ఆవిష్కరించింది. కుటుంబ నేపథ్యానికి చెందిన దృశ్యాలు, రంగస్థల ప్రదర్శనలు, ప్రసిద్ధ గజల్, ఠుమ్రీ కళాకారిణిగా ఆమె ప్రతిభను అద్భుతంగా చూపించారు.

 

రవి శంకర్

ప్రమోద్ పాటి దర్శకత్వంలో 1970లో నిర్మించిన ఈ బయోపిక్ డాక్యుమెంటరీ.. ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవి శంకర్ జీవితాన్నీ, సృజనాత్మక ప్రయాణాన్నీ ఆవిష్కరించింది. ఇంటర్వ్యూలు, సంగీత ప్రదర్శనలకు సంబంధించిన దృశ్యాల ద్వారా సంప్రదాయ సంగీతకారుడిగా, స్వరకర్తగా, భారతీయ సంగీత సాంస్కృతిక రాయబారిగా ఆయనకు సంబంధించిన వివిధ కోణాలను ఈ చిత్రం ప్రదర్శించింది.

 

పోట్రైట్ ఆఫ్ ఎ సిటీ

చిదానంద దాస్ గుప్త దర్శకత్వంలో 1961లో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ.. నాటి కలకత్తాలోని దృశ్యాలను అద్భుతంగా ఆవిష్కరించింది. పరిశ్రమలు, వార్తా పత్రికల కార్యాలయాలు, నదులు, గుర్రపు పందేల మైదానాలు వంటి దృశ్యాలతో పాటు నేపథ్య సంగీతం, సహజమైన శబ్దాలు, అక్కడక్కడా వినిపించే సంభాషణల కలయికతో కోలాహలంగా ఉండే నగర జీవన శైలిని, విశేషాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

 

అవర్ ఒరిజినల్ ఇన్‌హాబిటాంట్స్

జగత్ మురారీ దర్శకత్వంలో 1953లో ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. ఈ ఆంగ్ల డాక్యుమెంటరీ భారత్ లోని విభిన్న గిరిజన తెగలను పరిచయం చేస్తుంది. 12 నిమిషాల్లోనే...172 గిరిజన సమూహాల్లోని ముఖ్యమైన తెగల ప్రత్యేకమైన సాంస్కృతిక పద్ధతులను, సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలు, వారి సంగీత, నృత్య సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది.

 

ఈ డాక్యుమెంటరీల ప్రదర్శన సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దుమ్ ప్రసంగించారు. భవిష్యత్ తరాల కోసం సినిమాలను పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేశారు. సినిమాలను పరిరక్షించటం ద్వారా మాత్రమే చలనచిత్ర చరిత్రను నూతన ప్రేక్షకులకు, రాబోయే తరాలకు అందుబాటులో ఉంచవచ్చన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో ప్రముఖ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పునరుద్ధరించిన క్లాసిక్ చిత్రాలకు ప్రత్యేక విభాగాన్ని కేటాయిస్తున్నారని చెప్పారు.

 

ఎంఐఎఫ్ఎఫ్-2026లో ఈ చిత్రాల ప్రదర్శన.. ప్రపంచంలోనే డాక్యుమెంటరీలు, వాస్తవిక చిత్రాల సంపన్న నిధి ఫిల్మ్స్ డివిజన్ ఆర్కైవ్స్ శాశ్వత ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ ద్వారా అత్యాధునిక సాంకేతికతతో చేపట్టిన పునరుద్ధరణ ద్వారా ఈ సినిమాల అసలైన శైలి దెబ్బతినకుండా, నేటి తరం ప్రేక్షకుల కోసం సరికొత్త రూపంలో రూపుదిద్దుకున్నాయి.

 

భారతదేశ ఆడియో-విజువల్ వారసత్వాన్ని సంరక్షించేందుకు, దాన్ని భావితరాలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్ఎఫ్‌డీసీ- ఎన్ఎఫ్ఏఐ కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ ప్రదర్శనలు మరోసారి నిరూపించాయి. సమకాలీన డాక్యుమెంటరీ నిర్మాణాన్ని ప్రోత్సహించటంతో పాటు భారతదేశ గొప్ప చలనచిత్ర వారసత్వాన్ని కాపాడటంలో ఎంఐఎఫ్ఎఫ్-2026 పోషిస్తున్న కీలక పాత్రను ఈ ప్రదర్శనలు మరింత బలోపేతం చేశాయి.

ఎంఐఎఫ్ఎఫ్‌లో జరిగే రోజువారీ కార్యక్రమాలు, నాణ్యత గల ఫొటోలు, పత్రికా ప్రకటనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Click here

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2275330   |   Visitor Counter: 7