వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి స్మార్ట్ వేర్ హౌసింగ్ సిస్టమ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి
డిపో దర్పణ్ కార్యక్రమ పరిధిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సీడబ్ల్యూసీ, ఎఫ్‌సీఐ గోదాములకు సత్కారం
प्रविष्टि तिथि:
17 JUN 2026 2:28PM by PIB Hyderabad
ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి స్మార్ట్ వేర్ హౌసింగ్ సిస్టమ్‌ను ఆహారం, ప్రజాపంపిణీ విభాగం (డీఎఫ్‌పీడీ) 2026 జూన్ 18న ప్రారంభించనుంది. న్యూఢిల్లీలోని భారత్‌మండపంలో ఉన్న లీడర్స్ లాంజ్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి స్మార్ట్ వేర్ హౌసింగ్ సిస్టమ్‌ను ప్రారంభిస్తారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రులు శ్రీమతి నిముబెన్ జయంతీ భాయ్ బంభానియా, శ్రీ బీఎల్ వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ), ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గోదాములకు పురస్కారాలందిస్తారు. వీటిని డిపో దర్పణ్ అంచనా నియమాలకు అనుగుణంగా ఎంపిక చేశారు.
ఆధునికమైన, సాంకేతిక పరిజ్ఞాన ఆధారమైన, సమర్థమైన ప్రజా గిడ్డంగుల మౌలిక వసతులతో భారత ఆహార భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ ప్రారంభం తెలియజేస్తుంది. గోదాము నిర్వహణ పద్ధతులను బలోపేతం చేసే, ఆహార ధాన్యాల నిల్వ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంపొందించే సమీకృత సాంకేతిక పరిష్కారంగా స్మార్ట్ వేర్ హౌసింగ్ సిస్టమ్‌ను పరిచయం చేస్తున్నారు.
గిడ్డంగి కార్యకలాపాలను మెరుగుపరచడానికీ, పాలనా యంత్రాంగాలను బలోపేతం చేయడానికీ ఈ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆటోమేషన్, అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతికతలను పొందుపరుస్తారు. ప్రతిపాదిత వ్యవస్థ ద్వారా గేట్, వే బ్రిడ్జ్ కార్యకలాపాల ఆటోమేషన్, డిజిటల్ యాక్సెస్ నిర్వహణ, గోదాములలోని వాతావరణ పరిస్థితులపై నిరంతర నిఘా, నిల్వలపై స్పష్టత పెరుగుతుంది. అలాగే సమీకృత డ్యాష్‌బోర్డుల ద్వారా కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఆహార ధాన్యాల సరఫరా వ్యవస్థ అంతటా డిజిటల్ పరివర్తన తీసుకురావడం, ఆధునికీకరించడంపై దృష్టి సారిస్తూ.. ఈ విభాగం చేపట్టిన విస్తృత సంస్కరణల అజెండాలో భాగంగా ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ఇటీవల కాలంలో సేకరణ, నిల్వ, పంపిణీ వ్యవస్థల్లో పారదర్శకత, నిర్వహణ సామర్థ్యం, సేవా పంపిణీని మెరుగుపరచడానికి వివిధ కార్యక్రమాలను చేపట్టారు.
మౌలిక సదుపాయాలు, కార్యకలాపాలు, భద్రత, పారిశుద్ధ్యం, సేవా సంసిద్ధతలో నిరంతర మెరుగుదలను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన నిర్మాణాత్మక అంచనా, పనితీరు-పర్యవేక్షణ విధానమైన డిపో దర్పణ్ పరిధిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన గిడ్డంగులను కూడా ఈ కార్యక్రమం గుర్తిస్తుంది.
ఆహార ధాన్యాల సమర్థ నిర్వహణకు తోడ్పాటు అందించేలా, దీర్ఘకాలిక ఆహార భద్రతా లక్ష్యాలను బలోపేతం చేసేలా ఒక ఆధునిక గిడ్డంగుల వ్యవస్థను సృష్టించేందుకు ఈ స్మార్ట్ వేర్‌హౌసింగ్ కార్యక్రమం సహకరిస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా, ఇండియా ఏఐ మిషన్, పీఎం గతిశక్తి, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది.
***
(रिलीज़ आईडी: 2274080)
आगंतुक पटल : 12