ఆయుష్
యోగా పార్క్ పోర్టల్: బహిరంగ ప్రదేశాలను సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చటం
ప్రజల ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణకు కేంద్రంగా మారనున్న యోగా పార్కులు
प्रविष्टि तिथि:
16 JUN 2026 2:29PM by PIB Hyderabad
భారత్‌లోని సామాజిక స్థలాలు, పట్టణ ప్రాంతాలు, పార్కులు ప్రజలను ఒకచోటికి చేర్చటమే కాక, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రోజురోజుకూ పట్టణాల్లో జీవన విధానం వేగవంతం అవుతున్న తరుణంలో శారీరక, మానసిక ఆరోగ్య కేంద్రాలుగా ఈ బహిరంగ ప్రదేశాల ప్రాధాన్యత పెరుగుతోంది. వీటి సామర్థ్యాన్ని గుర్తించిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న పార్కులను సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చేందుకు యోగా పార్క్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీనిద్వారా యోగా, ధ్యానం, ఆరోగ్యకరమైన జీవనం ప్రజల దైనందిన జీవితంలో భాగం కానున్నాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 కోసం మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో 25 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యోగా పార్క్ పోర్టల్‌ను కేంద్ర ఆయుష్ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ ప్రారంభించారు. తిరిగి ప్రారంభించిన యోగా సంఘం పోర్టల్‌తో పాటుగా దీన్ని ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగాను విస్తరించేందుకు, దేశవ్యాప్తంగా స్థిరమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను రూపొందించటానికి మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రధాన కార్యక్రమాల్లో ఒకటిగా ఈ వేదిక నిలిచింది.
యోగా పార్క్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. పార్కులను కేవలం వినోద స్థలాలుగా కాకుండా, సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దటం. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికే ఉన్న పార్కులను యోగా పార్కులుగా అభివృద్ధి చేయటంలో పంచాయతీ రాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర సంస్థలు భాగస్వాములు కావచ్చు. ఈ యోగా పార్కులు యోగా సాధన, ధ్యానం, ఆరోగ్య సంరక్షణ చర్యలు, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరిస్తూ… ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా, భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే శాశ్వత సామాజిక ఆస్తులుగా యోగా పార్కులు ఉపయోగపడతాయని శ్రీ ప్రతాప్ జాదవ్ స్పష్టం చేశారు. యోగాను రోజువారీ జీవితంలో భాగం చేయాలని, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, నివాస సముదాయాల్లో ప్రజలకు సులభంగా ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా చూడాలన్న మంత్రిత్వ శాఖ విస్తృత నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.
భౌతిక అభివృద్ధిపై దృష్టి సారించే సంప్రదాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులా కాక ఆరోగ్యం, పర్యావరణ స్థిరత్వం, సామాజిక భాగస్వామ్యాలతో యోగా పార్క్ ఉంటుంది. ప్రస్తుతమున్న ప్రభుత్వ పార్కులను యోగా సాధన, ధ్యానం, సామాజిక ఆరోగ్య కార్యకలాపాలకు అనుకూలంగా ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దుతారు. అన్ని వయసుల వారు రోజూ పాల్గొనేలా ప్రోత్సహించటానికి ప్రత్యేక యోగా వేదికలు, ధ్యాన కేంద్రాలు, పచ్చిక మైదానాలు, అవగాహన సదుపాయాలు, సమూహాలుగా యోగా చేసుకునేందుకు వీలుగా ఖాళీ స్థలాలాను అభివృద్ధి చేస్తారు.
అందరి భాగస్వామ్యంతో నమూనా ద్వారా అమలు చేయటం ఈ కార్యక్రమం విశిష్టత. అనువైన పార్కులను గుర్తించి, నిర్వహించటంలో స్థానిక అధికారులు, సామాజిక సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవగాహన కార్యక్రమాలకు, క్రమం తప్పని యోగా తరగతులకు యోగా సంస్థలు మద్దతిస్తాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా భాగస్వామ్యాన్ని కూడా ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. స్థానిక సమాజాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి కంపెనీలు సహకారం అందించవచ్చు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా ఏర్పాటు చేసే యోగా పార్కులు, రోజువారీ యోగా సాధన, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం అందుబాటులో ఉండే స్థలాలను అందించటం ద్వారా ప్రజారోగ్యానికి శాశ్వత వారసత్వాన్ని సృష్టించగలవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇందులో పాల్గొనే కంపెనీలు సామాజిక సంక్షేమానికి చేసిన కృషికి తగిన గుర్తింపును పొందవచ్చు. ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించటంలో ప్రైవేట్ రంగం పాత్రను మరింత బలోపేతం చేస్తుంది.
మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా భాగస్వామ్యం కోసం రూపొందించిన డిజిటల్ వ్యవస్థే యోగా పార్క్ పోర్టల్. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు అవసరమైన మార్గదర్శకాలు, కాన్సెప్ట్ నోట్స్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, ఇతర వనరులను ఈ వేదిక అందిస్తుంది. ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు, కమ్యూనిటీ సంస్థలు, కార్పొరేట్ భాగస్వాములను ఈ పోర్టల్ పరిధిలోకి తీసుకురావటం ద్వారా ఆరోగ్యం, సంరక్షణే లక్ష్యంగా సమన్వయ జాతీయ ఉద్యమాన్ని రూపొందించాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
ఈ కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 ఇతివృతం "వృద్దాప్యంలో ఆరోగ్య సంరక్షణకు యోగా"కి అనుగుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి సమస్యలు, మానసిక ఒత్తిడి, వయసురీత్యా ఆరోగ్య సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో క్రమం తప్పకుండా శారీరక శ్రమ, మానసిక ప్రశాంతత, సామాజిక సంబంధాలను పెంపొందించటంలో ఇలాంటి బహిరంగ ఆరోగ్య సంక్షేమ స్థలాలు కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లలు, యువత, ఉద్యోగ నిపుణులు, వయోవృద్ధులు, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగా సాధన చేయటం ద్వారా ప్రయోజనం పొందేలా, అందరికీ అందుబాటులో ఉండే వాతావరణాన్ని కల్పించేందుకే ఈ యోగా పార్కులు.
యోగా పార్క్.. కేవలం ఏటా జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవానికే పరిమితం కాకుండా సుదీర్ఘకాలం నిలిచిపోయే వారసత్వాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సామూహిక యోగా ప్రదర్శనలు, బహిరంగ కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఆరోగ్య కేంద్రాలు సంవత్సరం పొడవునా పౌరులకు సేవలు అందించగల శాశ్వత వనరుగా మారతాయి. ఈ విధంగా, ఈ కార్యక్రమం కేవలం ఒకరోజు జరిగే ఈవెంట్‌లాగా కాకుండా, ప్రజల జీవితాల్లో నిరంతర ఆరోగ్య అలవాటుగా మారేలా మార్పును తీసుకొస్తుంది.
దశాబ్ద కాలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య ఉద్యమాల్లో ఒకటిగా మారింది. ఈ వేగాన్ని యోగా పార్క్ పోర్టల్ మరింత ముందుకు తీసుకెళ్తూ అవగాహన కల్పించటమే కాక మౌలిక సదుపాయాల కల్పనగా, ప్రజల భాగస్వామ్యాన్ని సమాజానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే విధంగా మారుస్తోంది. భారత్‌లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరిన్ని పార్కులను ఈ కార్యక్రమంలో భాగం చేయటం ద్వారా ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సామరస్యం, సంపూర్ణ సంక్షేమం పట్ల భారతదేశ నిబద్ధతకు యోగా పార్క్ శాశ్వత చిహ్నంగా మారనుంది.

***
(रिलीज़ आईडी: 2273761)
आगंतुक पटल : 19