మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
“భారత్ ఇన్నొవేట్స్-2026”కు సంయుక్త ప్రారంభోత్సవం సహా భారత్-ఫ్రాన్స్ ‘డీప్ టెక్ అలయన్స్’ను బలోపేతం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
నైస్ నగరంలో ‘భారత్ ఇన్నొవేట్స్’ తొలి కార్యక్రమానికి శ్రీకారంతో భారత్-ఫ్రాన్స్ సాంకేతిక సంబంధాలు మరింత బలోపేతం
प्रविष्टि तिथि:
14 JUN 2026 7:00PM by PIB Hyderabad
ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలోగల విశాల ఎగ్జిబిషన్ కేంద్రం (పాలైస్ డెస్ ఎక్స్‌పొజిషన్స్)లో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ‘భారత్ ఇన్నొవేట్స్-2026 తొలి కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించారు.
భారతీయ ‘డీప్-టెక్’ ఆవిష్కర్తలు, ప్రపంచ భాగస్వాముల మధ్య ఆవిష్కరణాధారిత భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ అత్యంత ప్రభావశీల కార్యక్రమం ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది.
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరికీ స్వాగతం పలికారు. అలాగే, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు శ్రీ అజిత్ ధోబాల్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రవిజ్ఞాన సలహాదారు డాక్టర్ అజయ్ కుమార్ సూద్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ- ఆవిష్కరణలు, సాంకేతికతలలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా పురోగమించడాన్ని విశదీకరించారు. “భారత్ విస్తృత స్థాయిలో, వేగంగా ఆవిష్కరణలను కొనసాగిస్తోంది. జాతీయ సుస్థిర భవిష్యత్తు కోసం మాత్రమేగాక యావత్ ప్రపంచం ప్రగతి భారత్ ఆవిష్కరణల లక్ష్యం. భారత్ నైజంలోనే ఆవిష్కరణ మూలాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆవిష్కరణల నూతనాధ్యాయాన్ని సృష్టించే దిశగా ‘భారత్ ఇన్నొవేట్స్’ ద్వారా భారత్ ప్రపంచ దేశాలను ఆహ్వానిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.
శక్తిమంతమైన భారత్ ఆవిష్కరణావరణ వ్యవస్థను ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ తన ప్రసంగంలో కొనియాడారు. ఈ మేరకు “భారత్ వెలుపల తొలిసారి ‘భారత్ ఇన్నొవేట్స్-2026’ కార్యక్రమానికి నైస్ నగరం నేడు ఆతిథ్యమివ్వడం మన రెండు దేశాలను ఏకం చేసే పటిష్ట బంధానికి శక్తిమంతమైన నిదర్శనమన్నది నాగ ప్రగాఢ విశ్వాసం. దీర్ఘకాలిక సాంకేతిక, శాస్త్రీయ, పారిశ్రామిక భాగస్వామ్యమే ఈ బంధానికి పునాది. ఇటీవలి కాలంలో ఈ బంధం అద్భుతంగా పరిణామం చెందింది. మన రెండు దేశాలు తమతమ శాస్త్రీయ-వ్యవస్థాపక-పారిశ్రామిక బలాల ద్వారా మరింత పురోగమించాల్సి ఉన్నదని ఈ రూపాంతరీకరణ స్పష్టం చేస్తోంది” అని పేర్కొన్నారు.
‘భారత్ ఇన్నొవేట్స్’ ప్రారంభోత్సవం తర్వాత నాయకులిద్దరూ ‘ఇన్నోవేషన్ పెవిలియన్’ను సందర్శించారు. కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం, ఆధునిక తయారీ, రవాణా, అంతరిక్ష విజ్ఞానం సహా వివిధ రంగాల్లో భారత ఆవిష్కర్తలు-ప్రసిద్ధ ఉన్నత విద్యాసంస్థలు రూపొందించిన 120 రకాల అత్యాధునిక సాంకేతికతలు, విప్లవాత్మక ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులు, పరిశ్రమలు, సంస్థలు, ఆవిష్కర్తలతో భాగస్వామ్యాలకు సౌలభ్య కల్పనతోపాటు భారత డీప్‌టెక్ ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ప్రదర్శన ‘భారత్ ఇన్నొవేట్స్’ లక్ష్యం. శాస్త్ర-సాంకేతిక, ఆవిష్కరణ, విద్య, వ్యవస్థాపన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ఇది మరింత పెంచుతుదని, ప్రపంచ ఆవిష్కరణల నెట్‌వర్క్‌లలో భారత ఏకీకరణ కృషిని బలోపేతం చేస్తుందని అంచనా.
మూడు రోజులపాటు (జూన్ 14–16 తేదీలలో) కొనసాగే ‘భారత్ ఇన్నొవేట్స్-2026’లో భాగంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 11 ఉన్నత స్థాయి బృంద గోష్ఠులు, రంగాల వారీ మాస్టర్‌క్లాసులు, ప్రత్యేకంగా రూపొందించిన ‘బి2బి’ మ్యాచ్‌మేకింగ్’ సమావేశాలు, 50కి పైగా అంకుర సంస్థలు పాల్గొనే ‘ఇన్వెస్టర్ పిచ్ సెషన్లు’ సహా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, కార్పొరేట్లు, విశ్వవిద్యాలయాలు, ఇంక్యుబేటర్లు, విధాన రూపకర్తలతో ప్రత్యేక నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, ఇంధన, ఆధునిక తయారీ, అంతరిక్ష-రక్షణ-వాతావరణ మార్పు సాంకేతికతలు వంటి రంగాల్లోగల అవకాశాలపై చర్చించడం కోసం ప్రపంచ ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులను ఈ కార్యక్రమం ఒక వేదిగా ఉపయోగపడుతుంది.
సహకారం, ప్రతిభ, పరిణామాత్మక సాంకేతికతల సహిత భవిష్యత్ ప్రస్థానానికి సిద్ధంకాగల ఆవిష్కరణావరణ వ్యవస్థ రూపకల్పనపై భారత్-ఫ్రాన్స్ సమష్టి నిబద్ధతను ‘భారత్ ఇన్నొవేట్స్’ తొలి కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.
ఈ కార్యక్రమంతోపాటు ఇందులో పాల్గొనే అంకుర సంస్థల గురించి మరింత సమాచారం కోసం www.bharatinnovates.inను సందర్శించండి.
***
(रिलीज़ आईडी: 2272866)
आगंतुक पटल : 7