రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారతదేశ తదుపరి తరం రక్షణ సామర్థ్యాలను ప్రదర్శించిన డీఆర్‌డీఓ

प्रविष्टि तिथि: 13 JUN 2026 7:06AM by PIB Hyderabad

శత్రువుల నుంచి పొంచి ఉన్న వివిధ రకాల ముప్పుల నేపథ్యంలో దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే పలు కీలక సాంకేతికతలను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ- డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) విజయవంతంగా పరీక్షించింది. సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, మధ్యస్థ శ్రేణి నౌకానిరోధక క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన బహుళ-అంచెల రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ వరుసగా మూడు క్షిపణి ప్రయోగ పరీక్షలను (ఫ్లైట్ టెస్టులు) 2026 జూన్ 10, 11 తేదీలలో నిర్వహించారు. 

 

బహుళ-అంచెల బాలిస్టిక్ క్షిపణి రక్షణ (బీఎండీ) సామర్థ్యాన్ని డీఆర్‌డీఓ విజయవంతంగా ప్రదర్శించింది. శత్రు క్షిపణులను అడ్డుకునే క్షిపణులు(ఇంటర్‌సెప్టర్లు) తమ నిర్దేశిత లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించాయి. వర్ధమాన క్షిపణి ముప్పులను తిప్పికొట్టేలా సరికొత్త సాంకేతికతలతో ఈ వ్యవస్థలను రూపకల్పన, అభివృద్ధి చేశారు. 

 

ఈ పరీక్షల ద్వారా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ఐసీబీఎం) సైతం అడ్డుకోగల బీఎండీ సామర్థ్యం ఉన్న ప్రపంచ మేటి దేశాల సరసన భారత్ నిలిచింది. ఇందులో భాగంగా నావికాదళానికి చెందిన మధ్యస్థ శ్రేణి‌ నౌకానిరోధక వ్యవస్థకు సంబంధించిన (ఎన్ఏఎస్ఎం-ఎంఆర్) తొలి క్షిపణి ప్రయోగ పరీక్షను కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగ పరీక్షలను డీఆర్‌డీఓ, రక్షణ దళాలకు చెందిన ఉన్నతాధికారులు స్వయంగా వీక్షించారు.

ఈ కీలక సాంకేతికతలను విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీఓకు అభినందనలు తెలిపారు.

 

ఈ ప్రయోగాలను నిశితంగా పర్యవేక్షించిన రక్షణ పరిశోధన- అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్‌డీఓ ఛైర్మన్ శ్రీ రాజేష్ కుమార్ సింగ్.. డీఆర్‌డీఓ, దేశీయ రక్షణ పరిశ్రమల ఉమ్మడి కృషిని అభినందించారు.

****


(रिलीज़ आईडी: 2272456) आगंतुक पटल : 35
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Malayalam